కడుపులో పుండు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీర్ణాశయంలోని పుండు.

మన శరీరం మీద పుండ్లు (Ulcers) పడినట్లు, కడుపులో కూడా పలుచోట్ల పుండ్లు పడే అవకాశం ఉంది. జీర్ణాశయంలో, అన్నవాహికలో, చిన్నపేగులో, పెద్దపేగులో మన జీర్ణ వ్యవస్థ అంతటా కూడా పుండ్లు రావచ్చును. వీటన్నింటిని కలిపి కడుపులో పుండ్లుగా పరిగణించవచ్చు. వీటిలో జీర్ణాశయంలో ఉత్పత్తి అయే జీర్ణరసంలోని ఉదజహరికామ్లం, పెప్సిన్ లచే శ్లేష్మపుపొర జీర్ణమగుట వలన కలిగే పండ్లు జీర్ణవ్రణములు (పెప్టిక్ అల్సర్స్). మన జీర్ణ వ్యవస్థ అంతటా కూడా లోపల రక్షణగా సున్నితమైన శ్లేష్మపుపొర (Mucous membrane) ఉంటుంది. రకరకాల కారణాల వల్ల ఈ శ్లేష్మపుపొర దెబ్బతింటే పుండ్లు పడతాయి.

వ్యాధి లక్షణాలు[మార్చు]

  • కడుపు నొప్పి: ఈ నొప్పి వివిధ సమయాలలో వస్తుంది. దీనిని బట్టి జీర్ణవ్యవస్థలో పుండు ఎక్కడ ఉందో ఒక అంచనాకు రావచ్చును. ఆహారం తీసుకొంటున్నప్పుడే నొప్పి వస్తుంటే అన్నవాహికలోను, ఆహారం తీసుకున్న వెంటనే వస్తుంటే పుండు జీర్ణకోశంలోను, మధ్యరాత్రి వస్తే చిన్నప్రేవులలో తొలిభాగమైన ప్రథమాంత్రంలో (డుయోడినమ్ లో) పుండు ఉందని అనుమానించవచ్చును.
  • రక్తస్రావం: పుండు నుండి రక్తం చాలా ఎక్కువగా పోవచ్చు. మలం నల్లగా రావడం, రక్తపు వాంతులు కావచ్చు. కొన్నిసార్లు పైకి ఏమీ కనబడకుండానే రక్తం నెమ్మదిగా పోయి తీవ్రమైన రక్తహీనతలోనికి వెళ్ళవచ్చును.
  • పేగులకు రంధ్రాలు: వీటి మూలంగా పేగులలోని పదార్ధాలు బయటికి వచ్చి ప్రమాదమైన పరిస్థితి కలుగుతుంది. కొందరికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయవలసి వస్తుంది.
  • పేగు సన్నబడటం: కొన్ని పుండ్లు ఉన్న ప్రదేశంలో మానిపోయిన తర్వాత అక్కడ పేగు సన్నబడి ఆహారానికి అడ్డం పడుతుంది.

కారణాలు[మార్చు]

  • జీర్ణాశయ ఆమ్లాలు: జీర్ణకోశంలోని గాఢమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం , పెప్సిన్ లచే శ్లేష్మపుపొర జీర్ణమగుట అన్నవాహిక, జీర్ణాశయం, చిన్నపేగులలో పుండ్లు పడటానికి ముఖ్యమైన కారణం. వీటిని జీర్ణవ్రణములు (పెప్టిక్ అల్సర్లు) అంటారు.
  • హెలికోబాక్టర్ పైలోరీ: చాలా మందిలో కడుపులో పుండ్లు రావడానికి ఈ బాక్టీరియా ముఖ్యమైన కారణం. కలుషితమైన ఆహారం, నీరు వంటి వాటి ద్వారా మన శరీరంలో చేరి, జీర్ణవ్యవస్థలో విషపదార్ధాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమౌతాయి. డుయోడినంలోని పుండ్లకు మనదేశంలో 70 శాతం మందిలో ఇదే ప్రధాన కారణమని గుర్తించారు.
  • నొప్పి నివారిణి మందులు: కీళ్ళనొప్పుల వంటి దీర్ఘ కాలిక సమస్యలు ఉన్నవారు ఇబూప్రోఫెన్ వంటి మందులు వాడతారు. వీరిలో అల్సర్ లు రావడానికి ఒక ముఖ్యమైన కారణం.
  • గుండె రక్షణ మందులు: గుండె జబ్బుల నివారణ కోసం ఇప్పుడు ఎక్కువమంది తక్కువ మోతాదులో ఆస్పిరిన్ లేదా అమైనో సాలిసైలిక్ ఆమ్లం వంటి మందులు వాడుతున్నారు. వీని మూలంగా అల్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ.
  • పొగత్రాగడం: పొగత్రాగడం వల్ల జీర్ణాశయంలో గాఢ ఆమ్లం నుండి గోడలకు రక్షణగా ఉండే బైకార్బనేట్ తగ్గిపోయి అల్సర్స్ వస్తాయి.
  • మద్యపానం: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకొనే వారిలో వస్తాయి.
  • అమీబా: పెద్దపేగులో పుండ్లకు ఇది మన దేశంలో ఒక ముఖ్యమైన కారణం.
  • జీర్ణమండలములో కలిగే కర్కటవ్రణాలు (పుట్టకురుపులు / కాన్సర్స్) వలన పుళ్ళు కలుగగలవు. ఇవి ప్రమాదకరమైన పుళ్ళు.

వ్యాధి నిర్ధారణ[మార్చు]

  • అంత్రదర్శిని (ఎండోస్కోపీ) పరీక్ష: ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఇది చాలా సులువైన పద్ధతి. ఈ పరీక్షతో వైద్యులు కడుపులో పుండ్లను ప్రత్యక్షముగా చూడగలుగుతారు. కణపరీక్షలకు, హెలికోబాక్టర్ పైలొరై పరీక్షకు చిన్న తునుకలు గ్రహించగలుగుతారు.
    అంతర్దర్శినితో కడుపులో పుండు (జీర్ణవ్రణం)
  • బేరియమ్ మీల్ ఎక్స్ రే: ఎండోస్కోపీ ప్రాచుర్యం పొందక మునుపు ఇవి ఎక్కువగా ఉపయోగించేవారు. ఈ దినములలో ఈ పరీక్ష అరుదయిపోయింది.
  • బయాప్సీ లేదా ముక్క పరీక్ష: కొన్ని రకాల దీర్ఘకాలిక పుండులలో ఇవి చాలా అవసరం. కాన్సర్, హెలికోబాక్టర్, అమీబా మొదలైన వాటిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

నివారణ[మార్చు]

  • శుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవటం. పరిశుభ్రత విషయంలో శ్రద్ధ చాలా అవసరం.
  • నొప్పులు తగ్గించేందుకు క్రోసిన్ లేదా పారాసిటమాల్ వంటివి వాడుకోవటం మంచిది. వీటితో పుండ్లు వచ్చే అవకాశం తక్కువ.
  • నిత్యం విటమిన్ సి ఉండే పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
  • రోజూ సకాలంలో, సమతులాహారం తీసుకోవటం చాలా అవసరం.

చికిత్స[మార్చు]

డాక్టర్ నీ సంప్రదించండి

మూలాలు[మార్చు]

  • డా.డి.నాగేశ్వరరెడ్డి ఈనాడు ఏప్రిల్ 29, 2008 తేదీన సుఖీభవలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.