కద్రి గోపాల్‌నాథ్
కద్రి గోపాల్‌నాథ్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | సజీపమూద, బంత్వాల్ తాలూకా, దక్షిణ కన్నడ జిల్లా, కర్ణాటక, భారతదేశం | 1949 డిసెంబరు 6
మరణం | 2019 అక్టోబరు 11 మంగళూరు, కర్ణాటక, భారతదేశం | (వయసు 69)
సంగీత శైలి | భారతీయ శాస్త్రీయ సంగీతం, సినిమా సంగీతం, జాజ్ సంగీతం |
వృత్తి | శాక్సోఫోన్ కళాకారుడు |
వాయిద్యాలు | శాక్సోఫోన్ |
క్రియాశీల కాలం | 1957-2019 |
సంబంధిత చర్యలు | రుద్రేష్ మహంతప్ప |
కద్రి గోపాల్‌నాథ్ (1949 –2019) ఒక భారతీయ శాక్సోఫోన్ వాద్య కళాకారుడు. కర్ణాటక సంగీతంలో శాక్సోఫోన్ వాద్యకారుల్లో ఇతడు అగ్రగామి.
ప్రారంభ జీవితం
[మార్చు]ఇతడు తనియప్ప, గంగమ్మ దంపతులకు 1949, డిసెంబరు 6వ తేదీన దక్షిణ కన్నడ జిల్లా, బంత్వాల్ తాలూకా, సజీవమూడ గ్రామంలో జన్మించాడు.[1] ఇతని తండ్రి తనియప్ప ఒక నాదస్వర విద్వాంసుడు. ఇతడు తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ఇతడు ఒకసారి మైసూరు ప్యాలెస్‌లో బ్యాండు సెట్‌లో శాక్సోఫోన్ వాయించడం చూశాడు. ఆ వాద్యంలోని వైవిధ్యానికి ఇతడు సమ్మోహితుడై ఎలాగైనా ఆ వాద్యంపై పట్టు సాధించాలని నిర్ణయించుకున్నాడు.[2] ఈ పాశ్చాత్య వాద్యంలో నైపుణ్యం సాధించడానికి ఇతడికి 20 సంవత్సరాలు పట్టింది. తుదకు ఇతడు "శాక్సోఫోన్ చక్రవర్తి"గా పేరు గడించాడు.
వృత్తి
[మార్చు]ఇతడు మంగళూరు కళానికేతన్‌కు చెందిన ఎన్.గోపాలకృష్ణ అయ్యర్ వద్ద శాక్సోఫోన్‌పై కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నాడు. 1978లో ఇతడు ఆకాశవాణి మంగళూరు కేంద్రం ద్వారా తన తొలి కచేరీని చేశాడు.[1] మద్రాసులో మృదంగ విద్వాంసుడు టి.వి.గోపాలకృష్ణన్ ఇతడికి సంగీత శిక్షణను ఇచ్చాడు.
ఇతడు శాక్సోఫోన్ వాద్యాన్ని కర్ణాటక సంగీతానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశాడు. ఇతడు ఈ వాద్యంపై విజయవంతంగా చేసిన మార్పులు చేర్పులను చూసి సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ ఇతడిని కర్ణాటక సంగీతంలో నిజమైన మేధావిగా ప్రశంసించాడు.
ఇతడు మొదటి ప్రత్యక్ష కచేరీ చెంబై మెమోరియల్ ట్రస్టుకోసం చేశాడు. 1980లో బొంబాయిలో జరిగిన జాజ్ ఫెస్టివల్ ఇతడి జీవితంలో మలుపు తిప్పింది. అక్కడ ఇతని కచేరీని విన్న కాలిఫోర్నియాకు చెందిన జాజ్ కళాకారుడు జాన్ హాండీ తనతో కలిసి ప్రదర్శన ఇమ్మని కోరాడు. హాండీ జాజ్ పద్ధతిలో, గోపాల్‌నాథ్ కర్ణాటకశైలిలో కలిసి చేసిన ఆ ప్రదర్శన ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నది.[2] తరువాత ఇతడు ప్రేగ్‌లో జరిగిన జాజ్ ఫెస్టివల్, బెర్లిన్ జాజ్ ఫెస్టివల్, మెక్సికోలో ఇంటర్నేషనల్ సెర్వాంటినో ఫెస్టివల్, పారిస్‌లో మ్యూజిక్ హాల్ ఫెస్టివల్, లండన్‌లో బి.బి.సి ప్రొమెనేడ్ కాన్సర్ట్ మొదలైన సంగీతోత్సవాలలో పాల్గొన్నాడు.
ఇతడు అనేక కేసెట్లు, సిడిలు, మ్యూజిక్ ఆల్బంలు తీసుకువచ్చాడు. జాజ్ కళాకారుడు జేమ్స్ న్యూటన్‌తో కలిసి "సదరన్ బ్రదర్స్" అనే ఆల్బమ్ రికార్డు చేశాడు.
సినిమా దర్శకుడు కైలాసం బాలచందర్ ఇతడి సేవలను తన తమిళ సినిమా డ్యూయెట్‌లో ఉపయోగించుకున్నాడు. ఆ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని అన్ని పాటలలోను శాక్సోఫోన్ వాద్యాన్ని కళ్యాణ వసంతరాగంలో ఇతడు ఉపయోగించాడు.
2005లో ఇతడు అమెరికన్ శాక్సోఫోన్ కళాకారుడు రుద్రేష్ మహంతప్పతో కలిసి కిన్‌స్మెన్ అనే ఆల్బంను తయారు చేశాడు.
ఇతడు పేరుమోసిన గురువుగా అనేక మందికి శాక్సోఫోన్ వాద్యాన్ని నేర్పించాడు.
మరణం
[మార్చు]ఇతడు 2019, అక్టోబర్ 11న మంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు.[3] ఇతనికి భార్య సరోజిని, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో చివరివాడు మణికాంత్ కద్రి సంగీత దర్శకుడు.
అవార్డులు, బిరుదులు
[మార్చు]2003లో ఇతనికి కేంద్ర సంగీత నాటక అకాడమీ కర్ణాటక సంగీతం - వాద్యం (శాక్సోఫోన్) విభాగంలో అవార్డు లభించింది.
ఇతడు కంచి కామకోటి పీఠం, శృంగేరీ శారదా పీఠం, అహోబిల మఠం, పిళ్ళయార్ పత్తి దేవాలయలకు ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు. 2004లో ఇతనికి పద్మశ్రీ పురస్కారం లభించింది.[4]
ఇతడు 1994లో లండన్‌లో జరిగిన బి.బి.సి. ప్రొమెనేడ్ కాన్సర్ట్‌లో పాల్గొనడానికి ఆహ్వానించ బడిన మొట్టమొదటి కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతనికి శాక్సోఫోన్ చక్రవర్తి, శాక్సోఫోన్ సామ్రాట్, గానకళాశ్రీ, నాదోపాసన బ్రహ్మ, సునాద ప్రకాశిక, నాద కళారత్న, నాద కళానిధి, సంగీత వాద్యరత్న, కర్ణాటక కళాశ్రీ మొదలైన బిరుదులు ఉన్నాయి. 1998లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" కళైమామణి పురస్కారాన్ని ప్రకటించింది.
2004లో బెంగళూరు విశ్వవిద్యాలయం ఇతనికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 2013లో ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై వారు సంగీత కళాశిఖామణి బిరుదును ఇచ్చారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Noted saxophone exponent Kadri Gopalnath passes away". 11 October 2019 – via www.thehindu.com.
- ↑ 2.0 2.1 Ramani, V. v (2019-01-17). "How the saxophone took to swaras". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-19.
- ↑ "Saxophone wizard Kadri Gopalnath dies at 69". Deccan Herald. 11 October 2019.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 21 July 2015.
బయటి లింకులు
[మార్చు]- Official Site Archived 2021-02-10 at the Wayback Machine
- NY Times review of a concert
- Interview in Times of India Archived 2012-09-27 at the Wayback Machine
- Songs from musicindiaonline.com
- CS1 Indian English-language sources (en-in)
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1949 జననాలు
- 2019 మరణాలు
- కర్ణాటక వాద్య కళాకారులు
- పద్మశ్రీ పురస్కారం పొందిన కర్ణాటక వ్యక్తులు
- తుళు ప్రజలు
- సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు