కన్ఫ్యూషియస్ మతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాచెంగ్ హాల్, క్యుఫు లోని కన్ఫ్యూషియస్ దేవాలయం
కన్ఫ్యూసియనిజం టెంపుల్

కన్ఫ్యూసియనిజం. రెండు వేల సంవత్సరాలకు పైగా చైనీయులను ప్రభావితం చేస్తున్న ఒక మతం, ఒక జీవన విధానం, ఒక ఆలోచనా సరళి. కన్ఫూసియ నిజం ఒక వ్యవస్థీకృత మతంగా కంటే ఒక జీవన విధానంగా, ఒక నైతిక ప్రవర్తన నియమావళిగా చైనా జాతిని తీర్చిదిద్దింది. ఈ మతం వ్యవస్థాపకుడు కన్ఫ్యూషియస్. ఇది లాటిన్ భాషలో ఉచ్చారణ. చైనీస్ భాషలో ఈ పదాన్ని ‘కంగ్‌ ఫూ జా’ అని పలకాలి. ఈ పదాలకు అర్థం పరమ గురువు కంగ్‌ (Grand Master Kung) అని. ఆయన జీవించినది క్రీ. పూ. 551 నుంచి 479 వరకు. కాని ఎందరు పాలకులు మారినప్పటికీ నాటికీ నేటికీ కన్ఫ్యూసియస్‌ సిద్ధాంతాలకు విలువ తగ్గలేదు. వ్యక్తి వికాసం మొదలు ఆదర్శ విశ్వసమాజ నిర్మాణం వరకు వివిధాంశాలపై కన్ఫ్యూసియస్‌ చెప్పిన సూక్తులు అలాంటివి. క్రీ. పూ. 210 సంవత్సరంలోనే కన్ఫ్యూసియస్‌ నైతిక సూత్రాలకు అప్పటి పాలకులు శాసన రూపం ఇచ్చారు. కమ్యూనిస్టు వ్యవస్థలో సైతం వ్యక్తి జీవితానికి గానీ, సమాజ వ్యవహారాలకు గానీ సంబంధించి ఆయన సూచించిన నీతి నియమాలకు భంగం కలగలేదు.

కన్ఫ్యూషియస్ మతం అనబడునది అతని పర్యటనల, అనుభవముల, ప్రాచీన జ్ఞానాన్ని ప్రచారం చేయడం ద్వారా ఏర్పడినది, లౌడ్జును అసలు విమతస్తుడు (irreligious) అంటారు. వీరికి అసలు మతమే లేదని చెబుతారు. ఏది ఏమైనా అతని పేరుతో ఒక మతం ఉంది. ఒక తత్వం ఉంది. అతడు ఒక గొప్ప ఆలోచనాపరుడు. ఇతడి మతం చైనీయుల తత్వానికి ఒక వ్యాఖ్యానం.

కన్ఫ్యూషియన్ జీవితం

[మార్చు]
కన్ఫ్యూషియస్

కన్ఫ్యూషియన్ ని చైనా భాషలో కూంగ్‌పూడ్జ్ అంటారు. ఇతడు క్రీ.పూ. 6 వ శతాబ్దానికి చెందినవాడు. క్రీ.పూ. 551 కి, 478 కి మధ్య నివసించాడని కొందరు, అతడు క్రీ.పూ 511 లో జన్మించి 469 లో మరణించాడని మరికొందరు అంటారు. ఈ శతాబ్దంలో మహా మహులైన బుద్ధుడు, జైన మహావీరుడు, లవుడ్జులు జన్మించారు. ఇతడేమీ గొప్ప పరిశోధకుడు కాదు. బుద్ధుడు లాగ సంప్రదాయ వ్యతిరేకి కాదు. తనను తాను "నూతన విషయాల ఆవిష్కర్త, సృష్టి కర్త గా కాక, కేవలం యథాస్థితిని కొనసాగించే వానిగ, ప్రాచీనతను విశ్వసించే వానిగ, ప్రేమించేవానిగ" దర్శించాడు. కేవలం ప్రాచీన జ్ఞానాన్ని ప్రచారం చేయటమే తన లక్ష్యమన్నాడు. అతడేవైనా సంస్కరణలు ప్రవేశపెడితే, అవన్నీ మనుషులను ప్రాచీన విషయాల విధానాల వైపు మళ్ళీంచటమే. అతడి బోధలన్నీ, అతడు చనిపోయిన తరువాత, అతడి అనుచరులు తమ స్మృతుల నుంచి ఏరి కూర్చారు. ఏది ఏమైనా ఆ కూర్పు నుంచి ఒక నిష్పష్టమైన తత్వం వచ్చింది.

అతని జీవితాన్ని గురించి అంతగా తెలియదు. అతను బాగా చదువుకొన్నవాడై ఉండాలి. ఎందుకంటే, అతడు ఇరవై ఒకటవ యేటనే చదువు చెప్పడం మొదలుపెట్టాడు. ముప్ఫై వ యేట రాజధానీ నగరాన్ని దర్శించి అక్కడ దేవాలయాలను, పూజలను, బలులను చూశాడు. సంప్రదాయానికి, విశ్వాసాలకు సంబంధించిన సాహిత్యాన్ని పోగు చేశాడు. ఏభైయ్యవ యేట నగర న్యాయాధిపతి అయ్యాడు. అతడిదైన పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది ఇతర నగరాలకు ఆదర్శమైంది. దీనితో సంతసించిన రాజు అతనిని న్యాయ శాఖా మంత్రిని చేశాడు. చట్టం మూలపడింది. కారణం అతని విధానాలలో నేరస్తులే లేకుండా పోయారు. ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి అతడి విధానాలు అధ్యయనం చేశారు. ఈ విధంగా అతడి ఖ్యాతి విస్తరించింది. కాని అసూయాపరులు రాజుకు చాడీలు చెప్పి అతడిని విముఖుని చేశారు. దీనితో విసిగిన కన్ఫ్యూషియస్ ఇతరులకు తన సేవలనందిస్తానన్నాడు. ఎవరూ ముందుకు రాలేదు. చివరి దశలో తను సంపాదించిన వ్రాతలను సంస్కరించాడు. 73 వ యేట మరణించాడు.

అతడిపై ప్రభావం

[మార్చు]

చైనా సామాజిక వ్యవస్థ కుటుంబ వ్యవస్థ, వ్యక్తికాదు. అందుకని అతని తత్వంపై కుటుంబ వ్యవస్థ ప్రభావం అధికంగా ఉంది. అసలు ఈ కుటుంబ వ్యవస్థ ప్రభావం చైనా లోని ఏ తత్వానికయినా సామాన్యమే ఆ తరువాత అతని ఆస్థాన జీవితం, గ్రామీణ జీవితం ప్రతీకాత్మ రేఖాచిత్రాలు (యాంగ్, ప్రారంభించటం, ఇన్ పూర్తిచేయడానికి ప్రతీకలు). ప్రతీకాత్మక చిత్ర వ్రాతలు డౌ తత్వాలు ఇతనిని బాగా ప్రభావితం చేశాయి. లౌడ్జు కన్ఫ్యూషియన్ కు తేడా లౌడ్జు కుటుంబ వ్యవస్థను విస్మరించాడు. అలాగే ఆస్థాన జీవితాలను అతడు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ రెండు కన్ఫ్యూషియస్ కు కేంద్రకాలు. సర్వ జీవవాద ఆచారాలు, సర్వాంగ సుందరమైన చే వ్రాత, షడ్భుజ నక్షత్ర చిత్రాల దృష్టాంతాలతో శాస్త్రీయంగా జోస్యం చెప్పడం, సంగీతం, పద్యాల యెడ అతనికున్న మమత, ఖనన-దహన సంస్కారాలు, స్మృతి చిహ్నాల సంప్రదాయాలు అతనిని ఎంతగానో ప్రభావితం చేసాయి. ఈ నేపథ్యంలో అతడు ప్రకృతిని జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకున్నాడు.

తత్వం - మతాలు

[మార్చు]

ప్రాథమికంగా లౌడ్జు, కన్ఫ్యూషియస్ తత్వాలకు భేదం లేదు. రెండూ "డౌ" - అంటే ప్రకృతిని అంగీకరిస్తాయి. యాంగ్, ఇన్ లను ప్రారంభం పరిపూర్ణులుగా ఇద్దరూ అంగీకరిస్తారు. ప్రకృతి ప్రక్రియల చక్రీయతను మనిషి సహజత్వాన్ని, ప్రతి మనిషి తన డౌ తత్వం ప్రకారం జీవించడంలో మంచితనాన్ని - ఇద్దరూ అంగీకరించారు. మతం విషయంలో కూడా వారి మధ్య సారూప్యత ఉంది. ఆ యత్న క్రియను, స్వయాంచాలక కార్యాన్ని జీవిత సకారాత్మకతను అంగీకరించారు. అయితే వీరిద్దరి మధ్య నైతిక, సామాజిక, రాజకీయ రంగాలలో తేడాలున్నాయి. లౌడ్జు తత్వాన్ని ఒక చెట్టు వ్రేళ్ళు కాండంగాను, కన్ఫ్యూషియస్ తత్వాన్ని దాని నుంచి వచ్చిన శాఖగాను, అర్థం చేసుకుంటే వారి మధ్య తేడా అవగతమవుతుంది. లౌడ్జు తత్వానికి కన్ఫ్యూషియస్ తత్వం పరిపూరకం.

కన్ఫ్యూషియస్ నాటి సమాజంలోని ఆచార వ్యవహారాలను పరిశీలించి వాటికి సాధారణీకరణం చేయటం ద్వారా నీతి తత్వాన్ని రూపొందించాడు. అలాగే అతనికి మానవ స్వభావం మీద ఒక సామాన్య సిద్ధాంతం ఉంది. ఇది లౌడ్జుకు పరిపూరకం. ఈ రెండు సిద్ధాంతాలను పరిశీలిస్తే, అవి మొత్తం తత్వ చరిత్రలోనే ప్రగాఢమైనవని, పరిపూర్ణమైనవని తేలుతుంది. ఆదర్శ మానవుని గురించి ఇతడు చెప్పిన లక్షణాలను పరిశీలిస్తె అతడి తత్వాన్ని మనం పరిశీలించినట్లే.

ఆదర్శ మానవుని కొన్నిసార్లు ఋషి అని పిలుస్తారు. ఇతడినే జ్ఞాని అంటారు. అయితే ఈ జ్ఞాని స్థాయికి ఏ మనిషి ఎదగలేడు. అయితేనేం అతడు ఆదర్శంగా ఉంటాడు. అతడిని ఆదర్శంగా ఉంచుకొని ప్రతి మానవుడు ఎదగ ప్రయత్నించవచ్చు. ఈ ఆదర్శ మానవునికి నాలుగు శీల లక్షణాలున్నాయి. అవి "యి", "జెన్" "లి" "చిహ్"

యి(Yi)

[మార్చు]

"యి" అనేది ఆయా వస్తువులలో తమ స్వభావానుసారం ప్రవర్తించే విధానం. ఇది అత్యంత ఉత్తమ విధానం. ఎందుకంటే ప్రకృతి, మానవ ప్రకృతి మంచివి కదా. లౌడ్జు, కన్ఫ్యూషియస్ ల ప్రకారం "యి" అర్థం చేసుకోనివాడు జ్ఞానికాదు. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి వస్తువుకు స్వావలంబమైన, స్వయం పూరకమైన ప్రకృతి ఇవ్వబడింది. దీనిని మెరుగు పరచాలనుకోవడం వెర్రితనం. ఈ విషయం తెలియని వారికి ప్రపంచం ఎలా అర్థమవుతుంది? ఎలా జ్ఞాని అవుతాడు?

మానవ ప్రకృతి అవశ్యం సామాజికం కనుక, సామాజిక జీవులుగా ప్రవర్తించటం మానవులకు మంచి మార్గం. అలాంటప్పుడు, ఆ మంచి మార్గం ఏది? ప్రతి ఒక్కడు తన మానాన తను నడుచు కుంటూ, కనుగొనే సామాజిక ప్రవర్తనా సూత్రాలు ఏమిటి? ఆ సూత్రాలు రెండు (1) పరస్పరతా సూత్రం (2) ఆకృతి మతా సూత్రం

పరస్పరతా సూత్రం

[మార్చు]

ఈ సూత్రం విశ్వవ్యాప్తం. ఎందుకంటే విశ్వంలో ప్రతి పనికి ఆరంభం (yang), పూర్తి కావడము (Yin) లు ఉంటాయి. అస్తిత్వం లోకి రావడం కనుక, అస్తిత్వంలోనికి రావటం మంచిది. అస్తిత్వంలో నుంచి కాలం తీరిన తరువాత వెళ్ళడం సహజం కనుక అస్తిత్వంలో నుంచి వెళ్లటం మంచిది. ఈ పరస్పరతా ప్రవర్తనను నిరోధించటం వెర్రితనం.

ఈ పరస్పరతా సూత్రం ప్రకృతి అంతటా, ప్రతి వ్యక్తి ప్రకృతిలో మాత్రమే కాక, సామాజిక మానవ ప్రకృతిలో గూడ పనిచేస్తుంది. తీసుకొన్నవాడు ఇవ్వడం ద్వారా ప్రతిస్పందిస్తాడు. ఈ విధంగా సామాజిక పరస్పర చర్య ప్రారంభమవుతుంది. నాగరికత మనమీద పనిచేయకపోతే, కొడితే కొడతాం తిడితే తిడతాం. ఈ సూత్రం మానసికంగా అందరికీ వర్తిస్తుంది. దీని నుంచి క్రైస్తవుల స్వర్ణ న్యాయం నీకు యితరులు ఏమి చేయాలని నీవు కోరుకొంటావో నీవు వారికి అదే చేయి . ఉద్భవించింది. కన్ఫ్యూషియస్ సూత్రాల్ని నియమంగా మారిస్తే ఇలా ఉంటుంది. ఇతరులు నీ మంచి కోరనిదేదీ, నీవు వారినుంచి కోరకు . ఆ వ్యక్తి స్థానంలో నీవు ఉన్నప్పుడు, నిన్ను ఎలా చూడాలని కోరుకొంటావో, నీవు ఆ వ్యక్తిని అలా చూడు ఇదంతా సామాజిక పరస్పరతా విధానమే.

సామాజిక జీవులందరికీ పరస్పరతా సూత్రం ఆవశ్యం అని ప్రతిపాదించడం ద్వారా ఇతడు లౌడ్జు కంటే ఒక మెట్టు పైకి వెళ్లాడు. లౌడ్జుకు సంఘం అంటే పడదు. సంఘంలో నివసిస్తే మనిషి మీద మనిషి ఒత్తిడి తప్పకుండ పడుతుంది. ఆ మేరకు అతడి ప్రవర్తన కృత్రిమ మవుతుంది. అందుకని లౌడ్జు ఎవరికి వారిని ఎవరి ప్రవృత్తుల కనుగుణంగా వారిని ఇతరులకు దూరంగా ఉండమన్నాడు. పెద్ద పెద్ద కుటుంబాలలో, గోత్రాలలో, తెగలలో, జాతులలో, జీవించడం లోని ఆవశ్యకతను, సహజత్వాన్ని, దానితో పాటు ఒకరి మీద ఒకరిని రుద్దడాన్ని సహజమని గుర్తించారు. ఇతర సహజ, ఆవశ్యక సూత్రాలెంత సహజాలో అంతే సహజమైంది ఈ మానవ ప్రకృతి పరస్పరతా సూత్రం గూడ.

వేరు వేరు జనాలకు, తండ్రి దయకోసం పోటీ పడే అసూయాగ్రస్తులైన అన్నదమ్ములకు, రాజులకు - ప్రజలకు మధ్య సంబంధాలకు గూడ ఈ పరస్పరతా సూత్రం వర్తిస్తుందా? శిష్యులు ఇలాంటి ప్రశ్నలడిగినప్పుడు ఈ సూత్రాన్నే పెంచి అన్ని రకాల సంబంధాలకు అనుప్రయుక్తం చేసినట్లు తెలుస్తుంది.

అకృత్రిమతా సూత్రం

[మార్చు]

సమాజానికి సంబంధించిన రెండవ సూత్రం ఇది. కొంతమంది దీనిని జ్ఞాని ఐదవ శీల లక్షణం అన్నారు. పరస్పరతా సూత్రాన్ని అనుసరించి, ఇతరులతో నీ సంబంధాలలో నీవు కాపట్యంతో ప్రవర్తిస్తే, అతడూ నీ యెడల అలాగే ప్రవర్తిస్తాడు. అతడు నీ యెడల కృత్రిమంగా కాపట్యంతో ప్రవర్తించడం నీకు సమ్మతం కాదు కనుక, నీవు ఇతరుల యెడ నిష్కాపట్యంతో ప్రవర్తించాలి. నీవు నిష్కాపట్యాన్ని నటిస్తే, అటువంటి నటనే నీకు ఎదురవుతుంది. మోసం మోసాన్ని, అపనమ్మకం అపనమ్మకాన్ని, భయం భయాన్ని తిరిగి ఇస్తాయి. ఈ పరిస్థితి ఏ మాత్రం మంచిది కాదని నీవు తెలుసుకుంటావు కనుక నిష్కాపట్యంగ ఉండడం "యి"లో భాగం ఇతరులతో "యి"ని అనుసరించడమే మంచిది.

జెన్

[మార్చు]

జెన్ అంటే హితేచ్ఛ (good will) అంటే "యి" ప్రకారం నడుచుకోవడం. "యి" ప్రకారం నడుచుకోవడం మంచిది కదా అంటే ఎవరి స్వభావం ప్రకారం వారు నడుచుకొంటుంటే (అలా నడుచుకోవటం వారికి శ్రేయస్కరం కదా!) వారి నడకతో జోక్యం చేసుకోకుండ ఉండటం, అంటే ఆ వ్యక్తిని మనం యథా తధంగా అంగీకరించడం.

హితేచ్ఛ రెండు విధాలుగా ఉంటుంది. (1) అంతర్దృష్టి (2) అనుకంప

అంతర్దృష్టి

[మార్చు]

ఇతరుల తోడి సన్నిహిత సంబంధాలతో వ్యవహరించేటప్పుడు అవతల వారిని ఎలా చూడాలి అనేది తెలియాలంటే అంతర్దృష్టి కావాలి. బిడ్డ సహజంగా ఎదగాలని కోరినతల్లి, అతడికి ఏది మంచిదో అలా ప్రవర్తించాలని కోరిన తల్లి. అతడి స్థానంలో తనను ఊహించుకోవలసిన అవసరం ఉంది. కదా. అలా ఊహించుకొన్నప్పుడు పొందే అనుభూతే అంతర్దృష్టి.

అనుకంప

[మార్చు]

అంతర్దృష్టి అవసరమే. కాని అంత మాత్రమే చాలదు. కొన్ని విధాల తాను ప్రవర్తిస్తే దానికి ప్రతిస్పందనగా ఇతరులు ఎలా ప్రవర్తిస్తారో తెలిస్తేచాలదు. తనకు హితేచ్చ ఉంటే, ఇతరులలో మంచి తనాన్ని మంచి ప్రవర్తనను ఎదిగేట్టు చేయాలి. అనుకంప అంటే ఇతరుల అనుభూతులను పంచుకోవటం. అంతర్దృష్టి, హితేఛ్ఛలు ఇతరులతో జెన్ కు అంటే హితేచ్చకు హామీనిస్తాయి.

దీనిని కొంతమంది "కర్మకాండ"గా అనువదించారు. ఇది సరికాదు. అంతర్గత ఉద్దేశ్యాలను సమర్థవంతంగా ఇతరులు అపార్థం చేసుకోకుండా ఉంటే ఉచిత పద్ధతిలో వ్యక్తీకరించటం "లి". ఇందులో ఇమిడి ఉన్న ప్రాథమిక సూత్రం ఏమిటంటే అంతర్గత స్వభావానికీ, బాహ్య ప్రవర్తనకు సహ సంబంధం ఉంటుంది. మోసగాడు ఈ రెండింటికీ సంబంధం లేకుండా ప్రవర్తిస్తాడు. మంచి ఉద్దేశాలుంటే సరిపోదు. వాటిని సరైన పద్ధతిలో వ్యక్తం చేయాలి. ఇలా వ్యక్తం చెయ్యడంలో ఒక ప్రవర్తన మరొక ప్రవర్తన కంటే సమర్థవంతమైనదని కన్ఫ్యూషియస్ చరిత్రను, ఆచారాలను, ఆస్థానాలను, సమజాన్ని అధ్యయనం చేసి నిర్ధారణ చేశాడు. గౌరవభావాన్ని వ్యక్తం చేసే అచారం, నమస్కరించడం, తలవంచటం, సాష్టాంగం చేయటం, చేయి, చేయి కలిపి ఊపడం, శాల్యూట్ చేయటం లాంటి విధానాలనే ఉపయోగిస్తారు. అవి మంచి విధానాలు. ఎందుకంటే అవి అతని ఉద్దేశాన్ని సరిగా అభివ్యక్తం చేస్తున్నాయి. అందుకని సత్ప్రవర్తన "యి"ని అర్థం చేసుకోవడంలో జెన్ ను మాత్రమే కాక "లి"ని గూడ కలుపుకోవాలి.

దురదృష్ట వశాత్తు ఒక ప్రవర్తనా రూపాన్ని ఆచారం తీర్చిదిద్దిన తరువాత, దానిని మోసగాళ్ళు మోసం చేయటానికి ఉపయోగించవచ్చు. మనలో దొంగ నమస్కారాలు చేసేవాళ్ళు ఎంతమందిలేరు? అలాంటి దొంగ నమస్కారాలు చూసిన తరువాత, మనం అసలు నమస్కారాన్నే అనుమానించే స్థితికి వస్తాము. అలాగే పిల్లలకు, తల్లి దండ్రులు కొన్ని ఆచారాలను, పిల్లలకు అర్థం చేసుకొనే స్థితికి ఎదగక ముందే నేర్పుతారు. అవి వారికి అర్థరహితాలుగా కనిపిస్తాయి. చెవులు ఎందుకు కుట్టించుకున్నామో పిల్లలకు (పెద్దలకు కూడాననుకోండి!) తెలియదు.అర్థం తెలియకుండా ప్రవర్తనా కృతులను నేర్చుకోవడం సహజం కాదు. అందువలన లౌడ్జుతో పాటు కన్ఫ్యూషియస్ గూడ కృతిమమును పరిహసించాలంటాడు.

చిహ్

[మార్చు]

చిహ్ అంటే జ్ఞానం, సుఖంగా ఉండటం చేతకానంత వరకు ఎవడూ జ్ఞానికాదు.విశ్వాస భూమికపై జీవించడం జ్ఞాని లక్షణం. విశ్వాస భూమికపై జీవించటం అంటే వస్తువుల యథాతథ స్థితిని అంగీకరించటం. అంటే జ్ఞాని మిగతా మూడు లక్షణాలైన "ఉఇ", "జెన్" "లీ" లను అంగీకరించడం. జ్ఞానం అంటే విజ్ఞాన సర్వస్వాలలోని జ్ఞానం కాదు. ఎవరి స్పభావానుసారం వారిని ప్రవర్తించడానికి అనుమతించడం వారికి మంచిదనీ, తన మీద ఆధారపడేవారి, తను ఆధారపడినవారి స్వభావాల మధ్య తేడాలు ఉంటాయని, ఆ తేడాలు గుర్తించి గౌరవించాలని వారితో సామరస్య పూర్వక జీవనానికి ఇది ఆవశ్యకమని గుర్తించాలి. "చెహ్"ను సాధించాలంటే "యి"ని తెలుసుకోవాలి. ఇతరులయెడ హితేచ్చను కలిగి ఉండే వరకు, కలిగి ఉన్నానని తెలిసే వరకు, విశ్వాసంతో జీవించలేకపోయినట్లైతే అతడు జెన్ ను జీర్ణించుకొనేవరకు "చిహ్"ను సాధించలేడు. అలాగే "లీ"ని తెలుసుకొని, ఆచరించేవరకు చిహ్ ను సాధించలేడు. కేవలం "యి"ని తెలుసుకొని, జెన్ ను కలిగి ఉండి, లీని తెలుసుకొని ఆచరిస్తే సరిపోదు. "చిహ్" అనేది ఆదర్శం, క్రమంగా సాధించదగింది. దీనిని గూడ కలుపుకోవాలి.

ఇతరములు

[మార్చు]

కన్ఫ్యూషియస్ అతి ప్రాకృతిక విషయాలను చర్చించలేదు. ప్రేతాత్మల యెడ మన విధులేమిటని అతనిని అడిగినప్పుడు, "మనం సజీవులైన మానవుల యెడల మన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చనప్పుడు వాటి సంగతి ఎందుకు?" అన్నారు. మరణాన్ని గురించి ప్రశ్నించినప్పుడు, "జీవితం అర్థం కానప్పుడు మరణం ఎలా అర్థ మవుతుంది.?" అన్నారు. పితర పూజకు ప్రత్యేక విధాలున్నాయన్నారు. అయితే పితరులకు (మరణానంతరం) ఆ భౌతిక రూపంలో ఉనికి ఉంటుందా అని ప్రశ్నిస్తే అతడేమీ సమాధానం చెప్పలేదు.

సమాజంలో ఐదు విధాలైన సంబంధాలు ఉంటాయి. అవి: 1. భార్య, భర్త మధ్య, 2. తండ్రి, పిల్లల మధ్య, 3. అన్న, తమ్ముల మధ్యగానీ పెద్దలు, పిన్నల మధ్యగానీ, 4. పాలకుడు, పాలితుల మధ్య, 5. స్నేహితుల మధ్యగానీ వ్యక్తికి వ్యక్తికి మధ్య గాని సంబంధాలు. డావోయిజం వ్యవస్థాపకుడు లాప్‌ జాకు కన్ఫ్యూసియస్‌ శిష్యుడు. కన్ఫ్యూసియస్‌ చెప్పిన మరి నాలుగు సూత్రాలు ఇవీ: 1. వ్యక్తి సమాజం పట్ల తనకు ఉన్న బాధ్యతలను విధేయంగా నిర్వర్తించడం. (చైనీస్‌ భాషలో ఇది ‘యా’). 2. తనకు ఇతరులు ఏవి చేయకూడదని అనుకొంటాడో వాటిని తాను ఇతరులకు చేయకుండా ఉండటం. (చైనీస్‌ భాషలో ఇది ‘ష్యూ’. ఒరులేవని యొనరించిన తనకు అప్రియం అవుతాయో అవి తాను ఇతరులకు ఒనరించకుండా ఉండటం పరమ ధర్మమనే మహా భారత సూక్తి ఇదే.) 3. ఆదర్శ పురుషుడుగా జీవించడం. 4. కుటుంబంలోని వారు పరస్పరం గౌరవం కలిగి ప్రవర్తించడం. ఇన్ని ఉన్నతమైన భావనలు, సిద్ధాంతాలు ఉండి, నైతిక జీవనాన్ని ప్రబోధించినందు వల్లనే వ్యవస్థీకృతం కాకపోయినప్పటికీ చైనాలోనే గాక, మరికొన్ని ఇతర దేశాలలో సైతం కన్ఫ్యూసియన్లమని చెప్పేవారి సంఖ్య 21వ శతాబ్దిలో సైతం గణనీయంగా ఉంది. భారతదేశంలో గౌతమ బుద్ధుడు కొత్త తాత్త్విక సిద్ధాంతాలను ప్రవచించిన కాలం, చైనాలో కన్ఫ్యూసియస్‌ నైతిక బోధలు చేసిన కాలం కాస్త అటూ ఇటూగా ఒకటే కావడం ఒక చారిత్రక విశేషం.

యివి కూడా చూడండి

[మార్చు]