కీలుగుర్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీలుగుర్రం
(1949 తెలుగు సినిమా)
Keelugurram 1949film.jpg
దర్శకత్వం మీర్జాపురం రాజా
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీదేవి,
జి.వరలక్ష్మి,
లక్ష్మీరాజ్యం,
సూర్యశ్రీ,
బాలామణి,
కనకం,
ఏ.వి.సుబ్బారావు,
రేలంగి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన తాపీ ధర్మారావు
ఛాయాగ్రహణం డి.ఎల్.నారాయణ
కళ శర్మ
నిర్మాణ సంస్థ శోభనాచల పిక్చర్స్
విడుదల తేదీ ఫిబ్రవరి 19, 1949
భాష తెలుగు

కీలుగుర్రం మీర్జాపురం రాజా దర్శకత్వంలో 1949 లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, జి. వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం ప్రధాన పాత్రల్లో నటించారు. ఘంటసాల ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. తాపీ ధర్మారావు పాటలు రాశాడు.[1] తెలుగు భాషలోంచి మొట్టమొదటగా వేరే భాషలోకి (తమిళం) లోకి తర్జుమా చేయబడిన సినిమా ఇది.[2]

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

విదర్భ దేశ మహారాజు ప్రసేనుడు. ఆయన భార్య ప్రభావతీ దేవి. ప్రసేనుడు ఒకసారి వేటకి వెళ్ళినపుడు ఒక యక్షరాక్షసి గుణసుందరి (అంజలీదేవి) ఆయన అందాన్ని చూసి మోహించి ఆయనతో ఆనందంగా గడపాలనుకుంటుంది. మాయమాటలతో తనను ప్రేమించేటట్లు చేసి రెండవ భార్యగా రాజ్యంలో అడుగుపెడుతుంది. ప్రభావతీ దేవి సాత్వికురాలు కాబట్టి రాజు తనకు సవతిని తీసుకువచ్చినా భర్త సుఖమే తన సుఖమని భావిస్తుంది. గుణసుందరి పేరుకి రాణి అయినా రాక్షస ప్రవర్తన వల్ల రాత్రివేళల్లో రాక్షసిగా ఏనుగుల్ని, గుర్రాల్ని చంపి తింటూ ఉంటుంది. కొద్ది రోజులకు ఆస్థాన జ్యోతిష్కులు రాజుకి పుత్రుడు జన్మిస్తాడనీ చక్రవర్తి కాగలడని తెలియబరుస్తారు. అప్పటిదాకా చిన్నరాణి సుందరితో సుఖంగా గడుపుతున్న రాజు ప్రభావతీ దేవికి సంతానం కలగబోతుందని తెలిసి ఆమెతో ఎక్కవ ప్రేమగా ఉంటాడు. ఇది చూసి సహించని సుందరి తన చెలికత్తె అయిన రాక్షసి సహాయంతో రాజ్యంలో జరుగుతున్న జంతు నష్టానికి రాక్షసియైన పెద్దరాణి కారణమని నిందవేస్తుంది. అది నమ్మిన రాజు, గర్భవతి అయిన పెద్ద రాణిని అడవులకు పంపించి చంపివేసి ఆనవాలుగా ఆమె కనుగుడ్లను తీసుకురమ్మని తలారులను పురమాయిస్తాడు. వారు పెద్దరాణిని అడవికి తీసుకువెళ్ళి ఆమె గుణగణాలు ఎరిగున్నవారు కావడం వలన ఆమెను చంపడానికి ఇష్టపడరు. మరో పక్క చిన్నరాణికి భయపడి ఆమెను చంపకుండా కేవలం కనుగుడ్లను పెకలించి రాజుకు అందజేస్తారు.

పెద్దరాణి అడవిలో అష్టకష్టాలు పడి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. తరువాత ఆ అడవిలోని కోయగూడెం నాయకుడు, ప్రజలు ఆమెను, ఆమె జన్మనిచ్చిన బిడ్డ (అక్కినేని నాగేశ్వరరావు) ను చేరదీస్తారు. ఆ బిడ్డకు విక్రమసేనుడు అని పేరు పెడతారు. అతను పెరిగి అన్ని విద్యలలో ప్రవీణుడౌతాడు. ఇదిలా ఉండగా అంగరాజ్యంలో రాజు ఒక చాటింపు వేయిస్తాడు. దాని ప్రకారం అంగరాజ్య రాకుమారిని చిన్నప్పడే ఎవరో మాంత్రికురాలు అపహరించిదనీ ఆమెను కాపాడగల ధీరుడికి కుమార్తె, అర్ధ రాజ్యం దక్కుతుందనీ తెలియ జేస్తారు. దీనికి ఆశపడ్డ ఇద్దరు జ్యోతిష్కులు, ఒక శిల్పి తమ బుద్ధిబలం ఉపయోగించి ఆకాశంలో ఎగరగలిగే కీలుగుర్రం తయారు చేస్తారు. రాకుమారి ఎక్కడుందో తెలుసుకోవాలని జ్యోతిష్కుడు అంజనం వేసి ఆమె మూడు సముద్రాల అవతల ఉన్న ఒక దీవిలో ఉందని తెలుసుకుంటారు. కానీ దాన్ని అధిరోహించి రాకుమారిని రక్షించడానికి మాత్రం వారికి ధైర్యం చాలదు. దాంతో వారు ముగ్గురూ ఒక ఉపాయం ఆలోచిస్తారు. ఆ కీలుగుర్రాన్ని రాజుకు చూపించి దాని గొప్పతనాన్ని ఆయనకి వివరించి దాన్ని అధిరోహించగల ధీరుడికి కానుకలు ప్రకటించమని కోరతాడు. మరోపక్క విక్రమసేనుడు తల్లి ద్వారా తన తండ్రి గురించి, తల్లికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. కీలుగుర్రాన్ని అధిరోహించి రాజు అభిమానం సంపాదించి రాజ్యానికి సేనాధిపతి అవుతాడు. ఒక పక్క రాక్షసియైన చిన్నరాణి అప్పుడప్పుడూ ఏదో జంతువును కబళిస్తూ తన సరదా తీర్చుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజు ఆ ప్రమాదం అరికట్టాల్సిన బాధ్యతను సేనాధిపతి విక్రమసేనుడుకి అప్పజెపుతాడు. విక్రముడు కీలుగుర్రం మీద తిరుగుతూ అనుక్షణం కాపలా కాస్తూ ఉండడం వల్ల చిన్నరాణి ఆటలు సాగవు.

అప్పుడు చిన్నరాణి ఉపాయంగా తనకు భరించలేని తలనొప్పిగా ఉందనీ నాటకమాడి, అందుకు ఔషధం మూడు సముద్రాల అవతల ఉన్న తన అక్క దగ్గర ఉందనీ, దాన్ని తేవడానికి విక్రమసేనుడిని పురమాయించమని రాజును కోరుతుంది. రాణి విక్రముడు తన దగ్గరకు రాగానే చంపి తినివేయమని రహస్యంగా ఉత్తరం రాసి దానిని తన అక్కకు ఇమ్మంటుంది. విక్రముడు దాన్ని తీసుకుని కీలుగుర్రమెక్కి బయలుదేరతాడు. దారిలో ఒక మాంత్రికుని చేతిలో కాళికా దేవిని బలి అవబోతున్న ఒక రాకుమారిని రక్షించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమె కోరిక మేరకు వారి రాజ్యంలో కాస్త సేదతీరుతాడు. అప్పుడు రాకుమారి గుర్రంలో ఉన్న ఉత్తరం చదివి దాన్ని మరో విధంగా మార్చివేస్తుంది. ఆ ఉత్తరం తీసుకు వచ్చిన రాకుమారుడు తాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కొడుకుతో సమానమనీ అతను అక్కడ ఉన్నన్ని రోజులు మర్యాదలకు లోటు లేకుండా చూడవలసిందని దాని సారాంశం. విక్రముడు అక్కడికి రాగానే ఆ ఉత్తరం ప్రకారమే ఆ రాక్షసి అతనికి అన్ని మర్యాదలు చేస్తుంది. ఆమె దగ్గరే తన తల్లి కనుగుడ్లు భద్రంగా ఉన్నాయనీ, వాటిని యధాస్థానంలో అమర్చి ఒక వేరుతో తాకించితే తిరిగి చూపు వస్తుందనీ తెలుసుకుంటాడు. ఆమె విక్రముణ్ణి అంతా స్వేచ్ఛగా విహరించమని చెబుతుంది గానీ తూర్పు వైపునున్న బిల ద్వారం వైపు వెళ్ళవద్దని చెబుతుంది.

విక్రముడు అటువైపుగా వెళ్ళి అక్కడ నిర్బంధించబడి ఉన్న అంగరాజ్యపు రాకుమారిని కనుగొంటాడు. ఆమె సహాయంతో ఆ యక్షరాక్షసుల అక్క చెల్లెళ్ళ ప్రాణం అక్కడికి మూడు సముద్రాల ఆవల ఉన్న మర్రిచెట్టు తొర్రలో ఉన్న భరిణెలో ఉందని తెలుసుకుని దానిని సంపాదిస్తాడు. ఆ భరిణెలో రెండు పురుగులలో పెద్ద పురుగును చంపగానే ఆ పెద్దరాక్షసి మరణిస్తుంది. విక్రముడు రాకుమారిని తీసుకుని తిరుగు ప్రయాణమౌతాడు. ఇదిలా ఉండగా కీలుగుర్రాన్ని తయారు చేసిన మిత్రత్రయం అంజనం వేసి విక్రముడు రాకుమార్తెను తీసుకువస్తున్న విషయాన్ని గమనించి విక్రముడు కిందకు దిగగానే శిల్పి రాకుమార్తెను తనకిమ్మని, ఆమెను వివాహం చేసుకుని అంగ రాజ్యానికి రాజునవుతాననీ కోరతాడు. కానీ విక్రముడు, ఆమె తన భార్యయనీ ఆమెను దానమీయలేనని చెబుతాడు. ఆ శిల్పి విక్రముణ్ణి వెన్నుపోటు పొడిచి రాకుమార్తెను తీసుకుని కీలుగుర్రంపై పారిపోతాడు. కానీ రాకుమార్తె తిరగబడటంతో ఆమెను బలవంతంగా లొంగదీసుకోవాలని చూసి ఆమె చేతిలోనే మరణిస్తాడు. ఆ రాకుమార్తె ఇద్దరు పురోహితుల సాయంతో విక్రముడు ముందు పెళ్ళాడిన మరో రాకుమారిని కలుసుకుంటుంది. ఇద్దరూ కలిసి కీలుగుర్రంపై విక్రముణ్ణి వెతుకుచూ కనుగుడ్లు ఉన్న పెట్టెను సంపాదిస్తారు కానీ ఒక కోయగూడెంలో చిక్కుకుపోతారు. మరో వైపు గాయపడిన విక్రముడిని అడవిలో ఉన్న ఓ సాధువు రక్షిస్తాడు. తరువాత విక్రముడు ఆ అడవిలో శాపవశాత్తూ తిరుగుతున్న ఓ అప్సరసను రక్షించి ఆమె సహాయంతో కీలుగుర్రాన్ని, ఇద్దరు రాకుమార్తెలను కలుసుకుంటాడు. ఆమె సహాయంతో రాజ్యానికి వెళ్ళగానే తల్లిని చిన్నరాణి చెరసాలలో వేయించి ఉరిశిక్ష వేయబోతుందన్న విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళతాడు. తన తల్లికి చూపు తెప్పించి, చిన్న రాణి మోసాన్ని రాజుకు, ప్రజలకు తెలియబరిచి ఆమెను సంహరించి పట్టాభిషిక్తుడు కావడంతో కథ ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

మరిన్ని వివరాలు[మార్చు]

మరో ప్రకటన

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి ఘంటసాల సంగీత దర్శకత్వం వహించాడు. తాపీ ధర్మారావు పాటలు రాశాడు.[5]

పాట రచయిత సంగీతం గాయకులు ఆడియో ఫైల్
కాదు సుమా కలకాదు సుమా తాపీ ధర్మారావు ఘంటసాల ఘంటసాల, వి.సరళ
కాదు సుమా కల కాదు సుమా పాట ఆడియో
తెలియ వశమా పలుకగలమా తాపీ ధర్మారావు ఘంటసాల సి.కృష్ణవేణి, ఘంటసాల
తెలియవశమా పాట ఆడియో
శోభనగిరి నిలయా దయామయా తాపీ ధర్మారావు ఘంటసాల సి.కృష్ణవేణి
ఎంత కృపామతివే భవానీ ఎంత దయామయివే తాపీ ధర్మారావు ఘంటసాల ఘంటసాల, శ్రీదేవి
ఎంతానందంబాయెనహో తాపీ ధర్మారావు ఘంటసాల
ఎవరు చేసిన కర్మ వారనుభవింపక తాపీ ధర్మారావు ఘంటసాల
చెంపవేసి నాకింపు చేసితివే తాపీ ధర్మారావు ఘంటసాల
చూచి తీరవలదానందము తాపీ ధర్మారావు ఘంటసాల

మూలాలు[మార్చు]

  1. "'కీలుగుఱ్ఱం' గగన విహారానికి డెబ్భై ఏళ్ళు". సితార. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  2. Narasimham, M. L. "Keelugurram (1949)". thehindu.com. Kasturi and Sons. Retrieved 23 July 2016.
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
  4. ఆచారం, షణ్ముఖాచారి. "తెలుగుజాతి యుగపురుషుడు తారక రామారావు". sitara.net. Retrieved 19 May 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.