కుమారి కమల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుమారి కమల
జననం (1934-06-16) 1934 జూన్ 16 (వయసు 89)
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుబేబి కమల
వృత్తిభరతనాట్య కళాకారిణి, నటి
జీవిత భాగస్వామి

కుమారి కమల భరతనాట్య కళాకారిణి, చలనచిత్ర నటి. ఈమె 100కు పైగా తమిళ, కన్నడ, తెలుగు, హిందీ సినిమాలలో నటించింది.

ఆరంభ జీవితం, వృత్తి

[మార్చు]

ఈమె తమిళనాడులోని మయూరం గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో 1934, జూన్ 16వ తేదీన జన్మించింది.[1] ఈమె సోదరీమణులు రాధ, వాసంతిలు కూడా నాట్యకళాకారిణులే. ఈమె బాల్యంలో లచ్చు మహరాజ్ వద్ద బొంబాయిలో కథక్ నృత్యాన్ని నేర్చుకుంది. హిందుస్తానీ సంగీతాన్ని శంకర్ రావు వ్యాస్ వద్ద అభ్యసించింది. తమిళ సినిమా దర్శకుడు ఎ.ఎన్.కళ్యాణసుందరం అయ్యర్ ఈమెను తన నాలుగవ యేట ఒక నృత్యప్రదర్శనలో చూసి తన సినిమాలు 'వలిబర్ సంఘం' (1938), 'రామనామ మహిమై' (1939)లలో చిన్న పాత్రలలో నటించడానికి అవకాశం ఇచ్చాడు.[2] ఈమె నృత్యాన్ని చూసిన ఇతర నిర్మాతలు ఈమెకు జైలర్ (1938), కిస్మత్ (1943), రామరాజ్య (1943) సినిమాలలో అవకాశం ఇచ్చారు. భరతనాట్యం నేర్పించడానికి ఈమె అమ్మ ఈమెను మద్రాసుకు తీసుకువెళ్ళింది. అక్కడ తన సోదరీమణులతో పాటు కట్టుమన్నార్‌కోయిల్ ముత్తుకుమార పిళ్ళై, వళువూర్ బి. రామయ్య పిళ్ళై వద్ద వళువూర్ బాణీలో భరతనాట్యం నేర్చుకుంది. 1944లో ఈమె జగతల ప్రతాపన్ సినిమాతో తమిళ సినిమా రంగంలోనికి అడుగుపెట్టింది. ఆ చిత్రంలో నాగిని నృత్యం చేసింది. తరువాత 1945లో విడుదలైన శ్రీవల్లి సినిమాలో ద్విపాత్రాభినయం చేసింది. మీరా చిత్రంలో కృష్ణ పాత్రను ధరించింది. "నమ్‌ ఇరువర్" చిత్రంలో దేశభక్తి గీతాలకు ఈమె చేసిన భరతనాట్యం తమిళ సినిమాపై ప్రభావాన్ని చూపింది.[2]

1953లో రాణీ ఎలిజబెత్ II పట్టాభిషేకమహోత్సవంలో నాట్యప్రదర్శన చేయడానికి ఈమెకు ఆహ్వానం అందింది.[3] ఈమె తన సోదరీమణులతో కలిసి డ్వైట్ ఐసెన్‌హోవర్, ఎలిజబెత్ II, చౌ ఎన్ లై, మార్షల్ టిటో, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారి సమక్షంలో నృత్యం చేసింది.[4] జపాన్, మలేసియా, ఐరోపా దేశాలలో తన సోదరీమణులతో కలిసి పర్యటించింది. 1970లో భారత ప్రభుత్వం ఈమెను మూడవ అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించింది.[5] 1970లలో ఈమె నాట్య గురువుగా భరతనాట్యంలో శిక్షణనివ్వడం ఆరంభించింది. కాల్గేట్ యూనివర్శిటీలో రెండు పర్యాయాలు నాట్యంలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. 1980లో ఈమె న్యూయార్క్ నగరంలో స్థిరపడి అక్కడ "శ్రీ భరత కమలాలయ"[5] పేరుతో ఒక నృత్య పాఠశాలను ఆరంభించి అనేక మందికి శిక్షణను ఇచ్చింది. [6] 2010లో అమెరికాలోని ది నేషనల్ ఎండోమెంట్ ఫర్ ద ఆర్ట్స్ నుండి "నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్" లభించింది.[7]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్‌ను వివాహం చేసుకుంది. కానీ 1960లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. తరువాత ఈమె టి.వి.లక్ష్మీనారాయణన్‌ను ద్వితీయ వివాహం చేసుకుంది. అతడు 1983లో మరణించాడు. ఈమెకు రెండవ భర్తద్వారా జయానంద్ నారాయణన్ అనే కుమారుడు కలిగాడు. అతడు అమెరికా దేశపు ఆర్మీలో ఆఫీసర్‌గా పనిచేశాడు. [6]

అవార్డులు

[మార్చు]

[8]

 • 1967 - కళైమామణి
 • 1968 - సంగీత నాటక అకాడమీ అవార్డు
 • 1970 - పద్మభూషణ్ పురస్కారం[9]
 • 1975 - కోల్గేట్ యూనివర్సిటీ నుండి బ్రంటా ప్రొఫెసర్‌షిప్
 • 1989 - శృతి ఫౌండేషన్ వారి ఇ.కృష్ణ అయ్యర్ పతకం
 • 1993 - క్లీవ్‌లాండ్ త్యాగరాజ ఆరాధన సంస్థ నుండి సంగీత రత్నాకర
 • 2002 - మద్రాసు సంగీత అకాడమీ వారి ప్లాటినమ్‌ జూబిలీ అవార్డు
 • 2010 - నేషనల్ హెరిటేహ్ ఫెలోషిప్
 • 2012 - సెయింట్ లూయిస్ ఇండియన్ డాన్స్ ఫెస్టివల్‌లో సూర్య జీవిత సాఫల్య పురస్కారం

చిత్ర సమాహారం

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. Menon, Indira (1999). The Madras quartet: women in Karnatak music. Roli Books. p. 55. ISBN 81-7436-078-6.
 2. 2.0 2.1 Guy, Randor (7 January 2002). "She danced her way to stardom". The Hindu. Archived from the original on 24 March 2002. Retrieved 25 July 2011.
 3. Cour, Aparna; Ajīta Kaura (1976). Directory of Indian women today. India International Publications. p. 28.
 4. Minai. "All About Kamala's Sister Rhadha - The Other Dancer in Bhakta Kuchela!". Cinema Nritya. Retrieved 28 April 2021.
 5. 5.0 5.1 Kumar, Ranee (14 July 2006). "The danseuse from 'Kismet'". The Hindu. Archived from the original on 7 July 2007. Retrieved 26 July 2011.
 6. 6.0 6.1 "'Kumari' Kamala Bharatanatyam Dancer". Kutcher Buzz.com. Retrieved 26 July 2011.
 7. "Kamala Lakshmi Narayanan: Bharatanatyam Indian dancer". www.arts.gov. National Endowment for the Arts. n.d. Retrieved 30 January 2021.
 8. "Interview: Kamala Lakshman, Bharatanatyam dancer & Guru". Narthaki. August 2000. Retrieved 26 July 2011.
 9. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved July 21, 2015.

బయటి లింకులు

[మార్చు]