కూట సాహిత్యం
కూట సాహిత్యం అంటే పాఠకులను మోసగించేందుకు గానూ తప్పుడు మౌలిక వివరాలు ఇవ్వబడ్డ రచనలు. ఇవి ముఖ్యంగా రెండు రకాలు. మొదటి రకంలో ఒక రచనను ఎవరైనా ఒక పెద్ద రచయిత వ్రాసినట్లుగానో, లేక ఒక కల్పిత వ్యక్తిని దాని రచయితగానో చెప్పగా, రెండో రకంలో కొన్ని కల్పిత కథలను రచయిత తన సొంత అనుభవాలుగా సమాజాన్ని నమ్మింపజూడటం జరుగుతుంటుంది.
ప్రముఖ ప్రవాసాంధ్ర తెలుగు రచయిత వేలూరి వేంకటేశ్వర రావు ఈమాటలో గ్రంథచౌర్యంపై వ్రాసిన వ్యాసంలో కూట సృష్టిని గ్రంథచౌర్యంలో ఒక రకంగా పరిగణించాడు.[1]
వివిధ ఉదాహరణలు
[మార్చు]కూట సాహిత్యంలో ఒక రచనకు కర్తగా, అసలు రచయిత పేరు బదులు, తమ పేరిట ఉన్న రచనలకు అప్పటికే ఒక విలువా, ప్రత్యేక పాఠక బృందాలను సంపాదించుకున్న పేరొందిన రచయితల పేరు వాడుకోవడం జరుగుతుంటుంది. ఇందుకుగానూ ఆ కూట సృష్టికర్త తన రచననూ ఆ పెద్ద రచయిత శైలిలో వ్రాయడమో, లేదా పెద్ద రచయిత ఎక్కువగా వాడే కాగితం, సిరాలతో, ఆ రచయిత చేతివ్రాతను తలపించేలా చేవ్రాలు వ్రాయడమో చేస్తుంటాడు. చేతిరచనల్లో వాడే కాగితం, సిరాల దగ్గరి నుండి, దస్తూరి వరకూ అన్నీ సరిపోలేలా చేయడం కష్టం కనుక ఈ దారిని ఎక్కువ మంది ఎంచుకోరు. ఇలాగే మరొక రకం కూట సాహిత్యంలో మరుగున పడ్డ చారిత్రాక రచయితల శైలిని అనుకరించి, వాళ్ళు వ్రాసిన పుస్తకంగా కూడా రచనను విడుదల చెయ్యొచ్చు.
పాశ్చాత్య సాహిత్యం
[మార్చు]ప్రాచీన కాలంలో కూడా కూట రచనలు ఉన్నాయి. ప్రాచీన కూట రచయితల్లో ముఖ్యుడు గ్రీకు జ్యోతిష్కుడు ఒనొమక్రిటొస్ (సుమారు క్రీ.పూ 530–480). ఇతను మరొక ప్రాచీన గ్రీకు కవి ముసెయోస్ కాలజ్ఞాన వాక్యాలను మార్చి వ్రాసేసి, అవి ముసెయోస్ వ్రాసిన అసలైన వాక్యాలుగానే చూపించేవాడు.[2]
3వ శతాబ్దిలో సెప్టిమ్యస్ అనే ఒకడు, ట్రొయ్ సంగ్రామ కథలో ఒక పాత్ర ఐన డిక్టిస్ తన సొంత యుద్ద అనుభవాలను గ్రీకు భాషలో వ్రాసిన ప్రతి దొరికిందని చెబుతూ, దాని లాటిన్ అనువాదంగా ఒకదాన్ని వ్రాసాడు. పుస్తకపు ముందుమాటలో నియరో చక్రవర్తి కాలంలో వచ్చిన ఒక భూకంపం వలన డిక్టిసు సమాధిలో ఉన్న ఈ డైరీ బయటపడిందనీ, అలా దొరికిన ఆ డైరీ నాటి క్రేటె[గమనిక 1] గవర్నరు రుటిల్యస్ రుఫస్‌కు అందజేయగా, క్రీ.శ 66–67లో నియరో చక్రవర్తి గ్రీకు పర్యటనకు వచ్చినప్పుడు అతను దాన్ని చక్రవర్తికి బహుకరించాడనీ పేర్కొన్నాడు. చరిత్రాకారులు మిర్యం గ్రిఫిన్ ప్రకారం, ఆరోజుల్లో ఇలాంటి ఆసక్తికరమైన పుకార్లు పుట్టించడం మామూలు విషయమే.[3]
మరొక చారిత్రాక ప్రాముఖ్యత గల కూట రచనలు నకిలీ డైయనిస్యస్[గమనిక 2]గ్రీకు భాషలో చేసినవి. 5–6 శతాబ్దానివి ఐన ఈయన రచనలు క్రైస్తవ మత సాహిత్యానికి చెందినవి. చాలా కాలం వరకు బయటపడకుండా ఉన్న ఈ కపటమును మొదటిసారి, రచనలు వ్రాసిన 500 ఏళ్ళ తరువాత, అనుమానించినది ఫ్రెన్చ్ తత్వవేత్త ఎబలార్డ్. ఆ తరువాత కూడా పునరుజ్జీవనం వరకు, అంటే ఇంకొక 500 ఏళ్ళ వరకూ, ఈ రచనలకీ, రచయితగా చెప్పబడ్డ వ్యక్తికీ ఏ సంబంధం లేదన్న విషయం కచ్చితంగా రూఢీ అవ్వలేదు. మధ్యన ఉన్న ఈ వెయ్యేళ్ళలో క్రైస్తవ భక్తిశాస్త్రాన్ని ఈ రచనలు చాలా ప్రభావితం చేసాయి.[4]
ఆంగ్లేయ కవి థొమస్ చెటర్‌టన్ (1752–1770) ఇంకా పూర్తిగా ఎదగక మునుపే మధ్యయుగ సాహిత్యాన్ని తలపించే అద్భుతమైన కూట సాహిత్యాన్ని వ్రాయడం మొదలుపెట్టాడు. అతని మరణం తరువాత ఈ రచనలు అతనికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టినప్పటికీ, బ్రతికి ఉన్నప్పుడు అతని సంపాదనకు ఉపయోగపడలేదు. దీనితో అతను కడు పేదరికంలో, అర్ధాకలితో, డబ్బులులేక 17 ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు.
ద ఇంగ్లిష్ మర్క్యురి అనే ఒక పత్రిక ప్రతిని 1794లో కనుగొన్నప్పుడు, అది మొట్టమొదటి ఆంగ్ల పత్రిక అవుతుందని అనుకున్నారు. 1588లో ఆంగ్లేయ సైన్యానికీ స్పెయ్న్ నావికాదళానికా మధ్య జరిగిన ఒక యుద్ధం తాలుకు వార్తలు దీనిలో ఉన్నాయి. తరువాత అది 18వ శతాబ్దంలో ఆంగ్ల రాజకీయ నాయకుడు ఫిలిప్ యొర్క్ తన మిత్రులతో కలిసి సరదాగా వ్రాసిన ప్రతి అని తెలిసింది.[5]
19వ శతాబ్దపు ఫ్రెన్చ్ రచయిత చార్ల్స్ నొడ్యెర్, కూట సాహిత్యాన్ని ఒక సృజనాత్మక ప్రక్రియగా భావించాడు. ఇతని ప్రభావంతో ఆ శతాబ్దంలో చాలా మంది రచయితలు కూట రచనలు చేసారు. వారిలో ముఖ్యులు ఫ్రెన్చ్ రచయితలైన ప్రొస్పర్ మెరిమె, ప్యెర్ లుయిస్‌లు.
ద ప్రోటకొల్స్ ఒఫ్ ఎల్డర్స్ ఒఫ్ జియొన్ అనేది ఒక యూదు వ్యతిరేక కూట పత్రం. ఇది 1903–4 ప్రాంతంలో రష్యాలో మొదటిసారి ముద్రితమైంది. ఇందులో యూదులు ప్రపంచాన్ని వశపరుచుకుని, మాధ్యమాలూ, ఆర్థిక సంస్థలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునీ, ప్రస్తుతం ఉన్న సామాజిక వర్గీకరణ వ్యవస్థను తోసిపడేయడం ద్వారా క్రైస్తవాన్ని అణచివేయాలనే కుట్రకు యూదు మతపెద్దలు వ్రాసుకున్న ప్రణాళికలా ఈ పత్రం ఉంటుంది. దీని కూటత్వాన్ని ఆంగ్లేయ విలేకరి ఫిలిప్ గ్రెయ్వ్స్ 1921లో బయటపెట్టాడు. అతను ఈ పత్రానికి ఆధారం మొరిస జొలి అనే ఫ్రెన్చ్ రచయిత వ్రాసిన డ్యలొగ్ ఒజ్ అఁఫెర్ అఁట్ర్ మష్యవెల్ ఎ మొఁటెస్క్యొ ఉ ల పొలిటిక డ మష్యవెల్ ఒ ఖిఖ స్యెక్ల (Dialogue aux enfers entre Machiavel et Montesquieu ou la politique de Machiavel au XIXe siècle, అర్థం: నరకంలో మష్యవెల్, మొఁటెస్క్యొల మధ్య సంభాషణ)[గమనిక 3] అనే ఒక రాజకీయ పరిహాస రచన అని నిరూపించాడు. ఈ రచనలో యూదుల పట్ల వ్యతిరేకత లేదు. కానీ ప్రోటకొల్స్లో మూల రచనలోని విషయాలకు, యూదుల కుట్రలు వంటివి అద్ది, ఈ కూట రచనను తయారు చేసారు. గ్రెయ్వ్స్ తరువాత కూడా చాలా మంది చాలా భాషల్లో ఈ విషయాన్ని బయట పెట్టారు కానీ, యూదు వ్యతిరేకుల్లో ఈ రచనకున్న ప్రాముఖ్యత తగ్గలేదు. దీన్ని వారు యూదుల ద్వేషపూరిత స్వభావానికి ఆధారంగా చూసేవారు.[6]
డబ్బులకు ఆశపడి వ్రాసిన కూట సాహిత్యానికి ముఖ్యమైన ఉదాహరణ, 20వ శతాబ్దంలో వ్రాయబడ్డ హిట్లర్ డైరీస్ (Hitler Diaries). కొన్రాట్ కుయౌ అనే ఒక జర్మనీ వ్యక్తి దీని రచయిత. ఇతను వీటిని హిట్లర్ స్వయంగా వ్రాసుకున్న డైరీలుగా ప్రచారం చేసాడు. ష్టెర్న్ అనే ఒక జర్మన్ వారపత్రిక, దాని ప్రాథమిక పరిశీలనలో ఈ రచన కూటాన్ని గుర్తించలేకపోవడంతో, అది మేలు సాహిత్యమని నమ్మి, పెద్ద మొత్తానికి వీటిని కొనుగోలు చేసింది. కానీ తరువాత రచనలో వివిధ తప్పులు బయటపడడంతో, పునఃపరిశీలించి, ఇవి దొంగ రచనలని తేల్చింది. ఈ విషయమై కుయౌకు కారాగార శిక్ష పడింది.[7]
భారతీయ సాహిత్యం
[మార్చు]తెలుగు సాహిత్యం
[మార్చు]1855లో పరవస్తు చిన్నయసూరి వ్రాసిన బాలవ్యాకరణంపై గ్రంథచౌర్యం అనే నింద వేయడానికి, శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి అనే ఆయన హరికారికలు అనే వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాసి, ఆ గ్రంథం ప్రాచీన గ్రంథం అనీ, చిన్నయసూరి ఆ గ్రంథం నుండే తన గ్రంథంలోకి వ్యాకరణ సూత్రాలను దించాడనీ ఆరోపించాడు.[1][8][9]
సంబంధిత విషయాలు
[మార్చు]నకిలీ స్వానుభవ చరిత్ర
[మార్చు]కొన్ని రచనలకు రచయితలు తమ వ్యక్తిగత వివరాల విషయంలో అబద్దమాడకున్ననూ, ఇతర వివరాలను ఏ స్థాయిలో కల్పించి చెబుతారంటే, వాటిని కూట రచనలగానే లెక్కేయాల్సి ఉంటుంది. ఈ రచనల ప్రచారానికై ఎవరో ఒక ప్రముఖుడి పేరు వాడుకోడానికి బదులు, వారు వ్రాసిన అంశంపై వారికి లేని యొక లోతు ఉన్నట్లు నమ్మింపజూస్తారు. ఈ రకపు రచనల్లో ముఖ్యమైనవి నకిలీ స్వానుభవ చరిత్రలు. ఈ కాలంలో ఇలాంటి రచనల్లో రచయిత తాను చాలా కష్టాలనూ, బాధలనూ తట్టుకుని, గెలిచినట్లు కట్టుకథలు కల్పించి పాఠకులను నమ్మింపజూస్తాడు. ఇందుకు ఒక ఉదాహరణ గొ ఆస్క్ ఎలిస్ (Go ask Alice, అర్థం: వెళ్ళి ఎలిస్‌ను అడగండి) పేరిత ఒక అనామక రచయిత 1971లో వ్రాసిన పుస్తకం. ఈ పుస్తకం మాదకద్రవ్యాలకు బానిసైన ఒక వ్యక్తి డైరీ ఆధారంగా వ్రాసినట్లుగా చెప్పబడగా, తదుపరి విచారణలో ఇదంతా బూటకం అని తేలింది. ఇలాంటి రచనలకు ఇటీవలి కాలపు ఉదాహరణ, 2003లో అమెరికా రచయిత జెయ్మ్స్ ఫ్రె వ్రాసిన, అ మిల్యన్ లిటౢ పీసెస్ (A million little pieces, అర్థం: పదిలక్షల చిన్న ముక్కలు). ఇందులో ఫ్రెయ్ తాను మాదకద్రవ్యాల వ్యసనాన్ని వదిలించుకోవడానికి ఆశ్రయణ కేంద్రంలో చికిత్స పొందినట్లు పేర్కొనగా, అదంతా కల్పితమని తేలింది.[10]
ఇక సాహిత్యంలోని మోసాల్లో ఇంకో రకంలో రచయిత తన జీవిత విశేషాలూ, వ్యక్తిగత వివరాల పేరిట కట్టుకథలు అల్లుతాడు. అస ఆర్ల్ కార్టర్ అనే అమెరికా రచయిత ఫొరెస్ట్ కార్టర్ అనే పేరు మీద రచనలు చేసేవాడు. ఇతను తన తల్లిదండ్రుల్లో ఒకరు చెరకీలు[గమనిక 4] అనీ, తను చెరకీ సమాజంలో ఆ సంస్కృతి మధ్యలో పెరిగాననీ పేర్కొనగా, నిజానికి అతను ఎలబెమకు చెందిన తెల్లవాడు.[11] మరో ఇద్దరు అమెరికా రచయితలు నస్దిజ్, మార్గ్రట్ సెల్ట్సర్‌లు కూడా తమ రచనలకు పాఠకాదరణ పెంచుకునేందుకు తాము ఆదిమ అమెరికా వాసులమని తప్పుడు ప్రచారం చేసుకున్నారు.[12][13] డెని సెన్ట్యాగొ అనే ఇంకో అమెరికా రచయిత, తాను తూర్పు లొస్ ఎన్జలస్‌లో ఉంటున్న లటీనో[గమనిక 5] కుర్రాణ్ణి అని చెప్పుకున్నాడు. కానీ, డెన్యల్ లూయిస్ జెయ్మ్స్ అసలు పేరుగా గల అతను, డెబ్బై ఏళ్ళుపై పడ్డ, మధ్య పడమటి యు.ఎస్‌కు చెందిన వ్యక్తి.[14]
భారతీయ సిపాయి స్వానుభవాలుగా చెప్పబడుతున్న ఫ్రొమ్ సిపొయ్ టు సుబేదార్ అనే రచన అసలా లేక నకలా అనేదానిపై పండితులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
కూట సాహిత్యం కానిది
[మార్చు]కొన్నిసార్లు ఒక రచన కాల్పనికమా లేక కూటమా అన్నది స్పష్టంగా తెలిసిరాదు. కొందరు రచయితలు తమ కాల్పనిక రచనలో ఒక పాత్రగా చారిత్రాక వ్యక్తుల్ని వాడుకుంటారు. కానీ అది కేవలం కాల్పనిక సాహిత్యమని ఆ రచన వెలువడ్డ నాటి సమకాలిక సమాజాలకు తెలుసు. ఐతే ఒక్కోసారి తరువాతి తరాల వారికి ఈ విషయం తెలియక, ఆ రచనను చరిత్ర అని పొరబడుతుంటారు. మళ్ళీ నిపుణుల పరిశోధన వలన రచన యొక్క కాల్పనిక స్వభావం వెలుగులోకి వస్తుంటుంది. ఈ సందర్భంలో ఏ విధమైన మోసమూ ఉండదు. కేవలం కొన్ని పొరపాట్లు జరగడం వలనే ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి సందర్భాలు అరుదుగానే తలెత్తుతాయి.
మధ్యప్రాచ్యంలోని విస్డం లిటరిచర్[గమనిక 6] (Wisdom literature, అర్థం: జ్ఞాన సాహిత్యం)లో ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు హీబ్రూ బైబిల్‌లో ఇక్లీస్యెస్టీస్ పుస్తకమూ, సొంగ్ ఒఫ్ సొలమన్ కవితా. ఈ రెంటిలోనూ వాటి రచయితల గురించి ఏ సమాచారమూ ఉండదు. కానీ రచన రాజా సొలమన్ కోణాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుంది. ఇవి సొలమన్ వ్రాసినట్లుగా పాఠకులు అనుకోవాలనే ఉద్దేశం అసలు రచయితకి లేకపోయి ఉండవచ్చు. కానీ కాలక్రమంలో ఆ తేడా పోయి, సొలమన్‌యే వీటిని వ్రాసాడని తరువాతి తరాలు అనుకోవడం జరిగింది. సొలమన్ మరణించిన చాలా శతాబ్దాలకు గానీ ఈ రచనల ప్రస్తావనలు ఇతర రచయితల వ్రాతల్లో కనబడవు. కనుక వీటికీ, సొలమన్‌కూ సంబంధం లేదన్నది ఆధునిక పండితుల అభిప్రాయం. కానీ వీటిని సొలమన్ కోణంలో నుండి చెప్పడం వెనుక రచయితకు పాఠకులని మోసగించాలనే ఉద్దేశం ఉందా అనే విషయంలో స్పష్టత లేనందున్న, చాలా మంది నిపుణులు వీటిని కూట సాహిత్యంగా పరిగణించడానికి ఒప్పుకోరు.
కూట సాహిత్యమని ఆరోపణలున్న రచనలు
[మార్చు]కూటమైనవా, మేలయినవా అన్న విషయం తేలని రచనలు కూడా కొన్ని ఉన్నాయి. బైబిల్‌లోని కొత్త నిబంధనలో ఎపిసల్‌లలో[గమనిక 7]వాటిని వ్రాసినట్లుగా పేర్కొనబడ్డ రచయితలు వాటిలో కొన్నిటిని వ్రాసే అవకాశం లేదని విశ్లేషించడమైనది. ఐతే అసలు రచయిత పేరు తరాలు మారే కొద్దీ క్రమంగా మరుగున పడిపోవడమే, ఈ పుకారుకు కారణం అని కొందరి అభిప్రాయం. ఉదాహరణకు క్రైస్తవ పండితుడు రిచర్డ్ బకం రెండవ పీటరు ఎపిసల్ గురించి చెబుతూ "పీటరు రచయిత అన్న సంగతి పాఠకులు దాన్ని కాల్పనిక ఊహగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో వ్రాసింది" అన్నాడు. ఈ అభిప్రాయానికి వ్యతిరేకత కూడా ఉంది. కొత్త నిబంధన సాహితీ విమర్శలో పండితుడైన బార్ట్ ఏర్మన్ ప్రకారం, ఒక మతసంబంధ విషయాలను నిర్దేశించే పత్రాన్ని వ్రాసింది పేర్కొనబడ్డ రచయిత కాకుంటే దానికి మతకర్మలలో ప్రాధాన్యత ఉండదు, కనుక రచయిత ఉద్దేశం ఈ ఎపిసల్స్‌ను ఒక ప్రముఖుడికి ఆపాదించి ప్రజలను మభ్యపెట్టడమే అయ్యి ఉండాలి.[15]
ఇవి కూడా చూడండి
[మార్చు]- స్వానుభవ చరిత్ర – ఒక వ్యక్తి తన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన జ్ఞాపకాలను పాఠకులతో పంచుకునేందుకు చేసే రచన
- జీవిత చరిత్ర
గమనికలు
[మార్చు]- ↑ గ్రీసులో ఒక దీవి
- ↑ అసలైన డైయనిస్యస్ క్రైస్తవ మతాన్ని పుచ్చుకుని, తరువాత సంతు స్థాయిని అందుకున్న ఒక గ్రీకు వ్యక్తి. ఈ నకిలీ డైయనిస్యస్ తను వ్రాసిన వాటిని అసలు డైనిస్యస్‌కు ఆపాదించాడు.
- ↑ మష్యవెల్ (ఫ్రెన్చ్)/మెక్యవెలి (ఆంగ్లం)/మ్మక్యవెల్లి (ఇటలియన్) 16వ శతాబ్దపు ఇటాల్యన్ రాజకీయవేత్త. మొఁటెస్క్యొ 18వ శతాబ్దపు ఫ్రెన్చ్ రాజకీయ తత్వవేత్త
- ↑ అమెరికా ఖండంలో తెల్లవారు రాకమునుపు నుంచి ఉంటున్న ఆదిమ అమెరికా వాసుల్లో ఒక జాతి పేరు చెరకీ
- ↑ లటీనో అంటే లాటిన్ అమెరికా వాడు లేక లాటిన్ అమెరికా వాసుల సంతతికి చెందినవాడు. అమెరికా ఖండాల్లో లాటిను భాషచే ప్రభావితమైన సంస్కృతి గల ప్రాంతాలను లాటిను అమెరికాగా పిలుస్తారు
- ↑ మధ్యప్రాచ్యంలో తత్వం, జీవనవిధానాలపై బోధనలు చేసే పవిత్ర పుస్తకాలు
- ↑ ఎపిసల్ అంటే ఉత్తరం. కొత్త నిబంధనలో మత సంబంధ విషయాలు గురించి కొందరు భక్తుల మధ్య జరిగిన ఉత్తరాలన్నీ కలిపి ఎపిసల్స్ అనే విభాగంగా ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 వేలూరి, వేంకటేశ్వర రావు (మే 2008). "గ్రంథచౌర్యం గురించి …". ఈమాట. Retrieved November 3, 2023.
- ↑ B. Ehrman, Writing in the Name of God--Why the Bible's Authors Are Not Who We Think They Are, HarperOne (2011)ISBN 0062012614, pp. 39-40
- ↑ Nero: The end of a Dynasty, Miriam T. Griffin, 1984. Chapter 9. ISBN 0415214645
- ↑ Sarah Coakley (Editor), Charles M. Stang (Editor), Re-thinking Dionysius the Areopagite, Wiley-Blackwell (2009), ISBN 978-1405180894
- ↑ Penny Magazine of the Society for the Diffusion of Useful Knowledge, Volume 9, January 18, 1840, pp. 17-19
- ↑ Graves, Philip (1921). The Truth about the Protocols: A Literary Forgery. The Times of London.
- ↑ Hamilton, Charles (1991). The Hitler Diaries. Lexington: The University Press of Kentucky. ISBN 978-0-8131-1739-3.
- ↑ మధునాపంతుల, సత్యనారాయణ శాస్త్రి (1950). "పరవస్తు చిన్నయసూరి". ఆంధ్ర రచయితలు. Vol. ప్రథమ భాగము. రాజమహేంద్రవరము: అద్దేపల్లి అండ్ కొ. pp. 6–8.
- ↑ కందుకూరి, వీరేశలింగం (జనవరి 1950). "శిష్టు కృష్ణమూర్తికవి". ఆంధ్రకవుల చరిత్రము. Vol. మూడవ భాగము. రాజమహేంద్రవరము: హితకారిణీ సమాజము. pp. 321–22.
- ↑ "A Million Little Lies". The Smoking Gun. July 23, 2010.
- ↑ Randall, Dave (September 1, 2002). "The tall tale of Little Tree and the Cherokee who was really a Klansman". The Independent.
- ↑ William McGowan, Gray Lady Down: What the Decline and Fall of the New York Times Means, pp. 160-161, Encounter books, 2010, ISBN 978-1594034862
- ↑ Menand, Louis (2018). "Literary Hoaxes and the Ethics of Authorship". The New Yorker. Condé Nast.
- ↑ Folkart, Burt A. "OBITUARIES : Daniel James : Writer Who Masqueraded as a Latino."Los Angeles Times. Los Angeles Times, 21 May 1988. Web. 24 Apr. 2012. <http://articles.latimes.com/1988-05-21/news/mn-2879_1_daniel-james>
- ↑ Ehrman, Bart (2012). Forgery and Counterforgery: The Use of Literary Deceit in Early Christian Polemics. Oxford University Press. p. 141–145. ISBN 9780199928033.