Jump to content

ఫ్రొమ్ సిపొయ్ టు సుబేదార్

వికీపీడియా నుండి
ఫ్రొమ్ సిపొయ్ టు సుబేదార్: బీయింగ్ ద లైఫ్ అన్డ్ ఎడ్వెంచర్స్ ఒఫ్ సుబేదార్ సీతా రామ్, ఎ నెయ్టివ్ ఒఫిసర్ ఒఫ్ ద బెంగాల్ ఆర్మీ, రిటెన్ అన్డ్ రిలెయ్టెడ్ బై హిమ్‌సెల్ఫ్
మొదటి సంచిక ముఖపత్రం
రచయిత(లు)సీతారాం పాండే(య్)
మూల శీర్షికFrom Sepoy to Subedar: Being the Life and Adventures of Subedar Sita Ram, a Native Officer of the Bengal Army, Written and Related by Himself
Working titleFrom Sepoy to Subedar
అనువాదకులుజేమ్స్ థొమస్ నొర్‌గెయ్ట్
దేశంభారతదేశం
భాషఆంగ్లం
విషయంస్వానుభవ చరిత్ర
Set in19వ శతాబ్దం
ప్రచురణ కర్తవిక్టోర్య ప్రెస్ లహోర్
ప్రచురించిన తేది
1873
మీడియా రకంముద్రణ

ఫ్రొమ్ సిపొయ్ టు సుబేదార్: బీయింగ్ ద లైఫ్ అన్డ్ ఎడ్వెంచర్స్ ఒఫ్ సుబేదార్ సీతా రామ్, ఎ నెయ్టివ్ ఒఫిసర్ ఒఫ్ ద బెంగాల్ ఆర్మీ, రిటెన్ అన్డ్ రిలెయ్టెడ్ బై హిమ్‌సెల్ఫ్ (From Sepoy to Subedar: Being the Life and Adventures of Subedar Sita Ram, a Native Officer of the Bengal Army, Written and Related by Himself, అర్థం: సిపాయి నుండి సుబేదారు దాకా: బంగలా సైన్యంలోని దేశీ అధికారి సుబేదారు సీతారాం స్వయంగా ఏకరవు పెట్టి వ్రాసిన తన జీవితమూ, సాహసాలూ) అనే పుస్తకం, నాటి స్వాతంత్ర్యపూర్వ భారతదేశంలోని సీతారాం పాండేయ్ అనే పేరు గల, ఒక సిపాయి తన వృత్తి అనుభవాలను ఏకరవు పెడుతూ అవధీ భాషలో వ్రాసిన స్వానుభవ చరిత్రకు ఆంగ్లేయులు చేసిన ఆంగ్ల అనువాదంగా చెప్పబడుతున్న రచన. ఈ రచన నాటి సామాజిక పరిస్థితులూ, ఆచారవ్యవహారాల గురించి ఒక అంచనాని ఇస్తుంది.

నాటి సామాజిక స్థితిగతులను తెలియజెప్పే ఈ పుస్తకం, స్వాతంత్ర్యపూర్వ భారతాన్ని ఒక దేశీ సిపాయి కోణం నుండి వివరించే ఒకేఒక్క రచన. సీతారాం ఈ పుస్తకాన్ని హిందీ మాండలికం ఐన అవధీలో వ్రాయగా, అది ఆంగ్లేయులచే ఆంగ్లంలోనికి అనువదించబడినది. అవధీ ప్రతి నేడు అలభ్యముగా ఉన్నది.

మూలరచన అలభ్యముగా ఉన్నందున, ఇది నిజంగా ఒక సిపాయి స్వానుభవ చరిత్రా, లేక నకిలీ స్వానుభవ చరిత్రా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే హిందూ సాంప్రదాయాలూ, నాటి సామాజిక స్థితిగతులూ వర్ణించబడ్డ విధానాన్ని పరిశీలిస్తే, అది ఒక విదేశీయుడికి కుదిరే పని కాదని చాలామంది అభిప్రాయం.

నేపథ్యం

[మార్చు]

మొదటి సంచికకు ముందు వ్రాయబడినట్లుగా చెబుతున్న ప్రతుల ఉనికిని నిర్ధారించేందుకు కూడా తగిన సాక్ష్యాలు లేనందున్న, ఈ పుస్తక నేపథ్యాన్ని రచన ముందుమాటల నుండే తెలుసుకోవాల్సి వస్తోంది.

పుస్తక నేపథ్యాన్ని గురించిన విశేషాలు నొర్‌గెయ్ట్ ముందుమాటలలో కంటే, 1873 నాటి ఉర్దూ అనువాదంలోని ముందుమాటలోనే వివరంగా ఉంది. ఐతే అక్కడి విశేషాలు కూడా కొంత అసంబద్ధంగానే ఉన్నాయి.[1] ఉర్దూ సంచిక ప్రకారం పదవీ విరమణ తరువాత సీతారాం తన పింఛను విషయమై ఒకనాడు ఒక సైనిక శిబిరానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ సైన్యాధికారిగా ఉన్న లెఫ్టినెన్ట్ కల్నల్ జెయ్మ్స్ థోమస్ నొర్‌గెయ్ట్‌తో మాటలు కలిసాయి. సీతారాం తన పాత రోజులు గుర్తు చేసుకుంటుండగా, నొర్‌గెయ్ట్‌కు వాటిపై ఆసక్తి పెరిగింది. సమయభావం వలన వారు బయలుదేరవలసి రాగా, ఈ విశేషాలు మరింత తెలుకోవాలనే ఆసక్తిని నొర్‌గెయ్ట్ వెలిబుచ్చాడు. అప్పుడు సీతారాం తాను ఒక రోజునమ్చ వ్రాసుకున్నాననీ, తుది మెరుగులు దిద్ది పంపిస్తాననీ చెప్పాడు. చెప్పినట్లుగానే అవధీలో ఉన్న తన రోజునమ్చనీ తరువాత తన కొడుకు చేత నొర్‌గెయ్ట్‌కు అందజేసాడు. ఇది 1861లో జరిగింది. ఈ రోజునమ్చనే నొర్‌గెయ్ట్ ఆంగ్లంలోకి అనువదించాడు.

సారాంశం

[మార్చు]

పదిహేను ప్రకరణాలుగా విభజించబడ్డ ఈ రచన సీతారాం బాల్యం నుండి మొదలవుతుంది. అమేఠీలో అతని కుటుంబం, విద్యాభ్యాసం గురించి వివరిస్తాడు. అతని మేనమామ సైన్యంలో ఉండేవాడు. అతను సీతారాంకీ, ఊళ్ళో జనానికీ అక్కడి జీవితం గురించి చెప్పే కథలు విని సీతారాంకి సైనిక వృత్తిపై ఆసక్తి పెరుగుతుంది.

తరువాత సైన్యంలో చేరడానికి వారు చేసిన యాత్రా, దారి మధ్యల్లో ఠగ్గులూ, దారి దొంగలతో పోరాటాలూ, అతనికి వైద్య పరిక్షలూ ఇతరాత్రా వివరాలు కనిపిస్తాయి. ఇంకా ముందుకెళ్ళేకొద్దీ సిపాయిగా అతను తీసుకున్న శిక్షణా, అతను పాల్గొన్న యుద్ధాలూ, యుద్ధభూమిలో అతని అనుభవాలతో పాటు, అతని పెళ్ళి సంగతుల వివరాలుంటాయి.

వాటితో పాటు అతను చేసుకున్న గాంధర్వ వివాహం, అతని రెండో భార్యతో అతని అనుబంధం గురించి కూడా వ్రాసాడు. వీటితో పాటు యుద్ధంలో భాగంగా రెండుసార్లు అతను వర్ణహీనుడై ఎదుర్కొన్న ఇబ్బందులూ, పిండారీలతో పోరాటాలూ, అఫ్ఘానిస్తాన్‌లో బానిసగా బతికిన అనుభవాలు కూడా పొందుపరచబడ్డాయి.

అతని సేవలు ముగిసిపోతున్నాయి అనగా అతను సుబేదారుగా పదోన్నతి పొందుతాడు. ఇక్కడ తరువాతి తరాల్లో ఆంగ్లేయ ఆధికారులకూ, దేశీ సైనికులకూ మధ్య పెరిగిన అంతరాల గురించి వాపోతూ, సిపాయిల తిరుగుబాటును విమర్శిస్తాడు. చివరికి తిరుగుబాటును అణచివేసే క్రమంలో తిరుగుబాటుదారుడు ఐన తన కొడుకును పోగొట్టుకున్న క్రమాన్ని కూడా వివరించాడు. చివర్లో తనకు తగినంత ఆస్తీ, మంచి కొడుకూ, ఊర్లో గౌరవం ఉన్నాయనీ, విరమణ తరువాతి జీవితం సంతృప్తిగా గడుస్తోందనీ చెప్పి ముగిస్తాడు.

రచయితలు

[మార్చు]

సీతారాం ఉనికి అన్నది నేటికీ నిర్ధారణ కాలేదు. ఈ రచన ముందుమాటలనూ, రచనలోని సంగతులూ మాత్రమే మనకి అతని గురించి ఉనైన సమాచారం. ఈ పుస్తకం ప్రకారం సీతారాం పాండేయ్ నాటి అవధ సామ్రాజ్యంలోని తిలోయ్ ప్రాంతంలో, అనగా ఆధునిక ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ జిల్లాలో ఉన్న తిలోయిలోని, ఒక బ్రాహ్మణ జమీందారీ కుటుంబంలో 1797లో పుట్టాడు. ఇతనికి హిందుస్తానీ, ఫార్సీ భాషలపై మంచి పట్టు ఉండేది. ఆంగ్లేయ సైన్యంలో పనిచేస్తున్న అతని మేనమామను చూసి, సైనిక వృత్తిపై ఆసక్తి పెంచుకుని, 17 ఏళ్ళ వయసులో, అనగా 1812లో, సైన్యంలో చేరాడు. సిపాయిగా మొదలై చివరికి సుబేదారుగా, 66 ఏళ్ళ వయసులో, 1861లో పదవీ విరమణ చేసాడు. ఈ రచన 1812–1860 మధ్యకాలంలో నడుస్తుంది.

అనువాదకుడు జెయ్మ్స్ థొమస్ నొర్‌గెయ్ట్ 1873లో భారతదేశంలో లెఫ్టినెన్ట్ కల్నల్‌గా ఉన్నాడు. 1880లో మెయ్జర్-జనరల్‌గా పదవీ విరమణ చేసాడు. 28 అగస్టు 1894న ఇతను కాలం చేసాడు. ఇతని కూతురు పేరు ఎచ్.ఎమ్.సి నొర్‌గెయ్ట్. 1912 నాటికి ఈమె ఇంగ్లన్డ్‌లోని కొర్న్‌వల్ కౌన్టిలోని ఫొయ్ నగరంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది‌.[1]

డగ్లస్ క్రెయ్వెన్ ఫిలొట్ (28 జూన్ 1860–11 సెప్టెంబర్ 1930) భారతదేశంలో పుట్టగా, బడి నుండి మొదలు, ఇంగ్లన్డులో చదువుకున్నారు. భారతదేశంలోనూ, ఆ తరువాత పర్షియాలోనూ సైనికాధికారిగా సేవలందించారు. ఈయన హిందుస్తానీ, ఫార్సీ భాషలలో పండితుడు. ఈ భాషలలో చాలా రచనలు చేసాడు.

మెయ్జర్-జనరల్ జెయ్మ్స్ డొయ్రన్ లన్ట్ (1917–2001) బ్రిటిష్ సైనికాధికారీ, సైనిక చరిత్రాకారుడూ. ఆగస్టు 1973లో ఇతను పదివీ విరమణ చేసారు. ఈయనకు 1940లో మ్యుర్యల్ బిర్ట్‌తో పెళ్ళైంది. వీరికి ఒక కొడుకూ, ఒక కూతురూ.

పుస్తక నిర్మాణం

[మార్చు]

మొదటి సంచిక పేరు (From Sepoy to Subadar). నొర్‌గెయ్ట్ ముందుమాటతో పుస్తకం మొదలవుతుంది. తరువాత అవధీ ప్రతిని నొర్‌గెయ్ట్‌కు పంపినప్పుడు సీతారాం వ్రాసిన ముందుమాటకి అనువాద రూపం ఉంటుంది. ఆ తరువాత కథ మొదలవుతుంది. కథ మొదలయ్యేముందు సీతారాం రకరకాల హైందవ దేవుళ్ళను స్తుతించాడనీ, వాటిని తాను వదిలివేస్తున్నాననీ నొర్‌గెయ్ట్ వ్రాసాడు.

కథ చాప్టర్లుగా (Chapter) విభజించబడింది. చాప్టర్ క్రమసంఖ్య రోమను అంకెలతో తెలియజేయబడింది. చాప్టర్లకు ప్రత్యేకించి పేరు అంటూ లేదు. ఇలా మొత్తం పదిహేను చాప్టర్లు ఉన్నాయి.

అనువాదంతో పాటు, భారతీయులు కానివారికి అర్థం కాకుండా పోయే అవకాశమున్న అనువదించబడని హిందుస్తానీ పదాలకూ, హైందవ ఆచారాలకూ అనువాదకుడు ఫుట్‌నోట్లలో వివరణలు ఇచ్చాడు.

మూడో సంచికలో మొదటి రెండు సంచికలకూ నొర్‌గెయ్ట్ వ్రాసిన ముందుమాటలతో పాటు, ఫిలొట్ అతని ముందుమాటను చేర్చాడు. ఆపైన నొర్‌గెయ్ట్ ఫుట్‌నోట్లతో పాటు, అవసరమనుకున్న చోట అదనంగా ఫుట్‌నోట్లు చేర్చాడు. నొర్‌గెయ్ట్ వ్రాసిన పుట్‌నోట్లను Tr (Translatorకు పొట్టి పదం. ఆంగ్లంలో అనువాదకుడు అనే అర్థం గల పదం ఇది) అనే అక్షరాలతో సూచించి, తాను అదనంగా చేర్చిన వాటిని Ed (Editorకు పొట్టి పదం. ఆంగ్లంలో సంపాదకుడు అనే అర్థం గల పదం ఇది) అనే అక్షరాలతో సూచించాడు.

నాలుగో సంచికలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మొదటిది పుస్తకం పేరును (From Sepoy to Subedar)గా మార్చడం. తరువాత చాలా బొమ్మలు చేర్చారు. వీటిని ఫ్రెంక్ విల్సన్ గీసారు. ఈ పుస్తకాన్ని సంపాదకుడు "జవాన్లు" అందరికీ అంకితమిచ్చాడు. 15 చాప్టర్లకీ పేర్లు పెట్టబడ్డాయి. అనుగుణంగా ఒక విషయసూచిక చేర్చబడింది. అనువాదకుడి మొదటి సంచిక ముందుమాటనీ, సీతారాం ముందుమాటనీ ప్రచూరించగా, ఫిలొట్ ముందుమాటను ప్రచూరించలేదు. దాని స్థానే లన్ట్ వ్రాసిన సంపాదకుని మాట ఒకటి ఉంది. దానితో పాటు ఉపకారస్మృతీ, సంపాదకుని ఉపోద్ఘాతాలు చేరాయి. 15వ చాప్టర్ తరువాత చివరలో ఒక పదపట్టికా, ఒక అనుక్రమణికా చేర్చబడ్డాయి.

సంచికలూ, అనువాదాలూ

[మార్చు]

సీతారాం పాండేయ్ తన రచనను, తన పదవీ విరమణ సమయానికి, అంటే 1861 నాటికి ముగించినట్లు చెప్పబడుతోంది. నాడు పంజాబ్ సైన్యంలో సేవలందిస్తున్న ఆంగ్లేయ సైన్యాధికారి జేమ్స్ థొమస్ నొర్‌గేట్ వినతి మేరకు వీటిని వ్రాసిన సీతారాం, పూర్తయిన రచనను తన కొడుకు ద్వారా ఆయనకు అందించాడు. ప్రస్తుతం ఈ అవధీ ప్రతి అలభ్యంగా ఉన్నది.

ఈ పుస్తకాన్ని ఒక భారతీయ అనువాదకుడి సహాయంతో నొర్‌గేట్ ఆంగ్లంలోకి అనువదించి, ఒక నియతకాలిక భారతీయ పత్రికలో అచ్చువేయించినట్లు ఆయన తన తదుపరి సంచికల్లో చెప్పుకున్నారు. ఈ ప్రతి దొరక్కపోగా, ఆ పత్రిక ఏమిటన్నదీ తెలియరాలేదు. ఈ ప్రతిని ఆంగ్లేయ పత్రిక "ద టైమ్స్" (The Times) 1863లో ప్రస్తావించినట్లు నొర్‌గేట్ చెప్పుకున్నారు. ఐతే అలాంటి ఆధారాలేవీ దొరకలేదు.[1]

తదుపరి సంచిక 1873లో లాహోర్‌లో ముద్రితమైంది. లభ్యముగా ఉన్న ప్రతులలో ఇదే మొదటిది. నొర్‌గేట్ తరువాతి సంచికకు సంపాదకత్వం వహించిన ఫిలొట్ దీన్నే మొదటి సంచికగా గుర్తించాడు. ఇదే సంవత్సరంలో ఈ సంచికకు ఉర్దూ అనువాదం కూడా వచ్చింది.[1]

రెండో సంచిక 1880లో వచ్చింది. దీని ముందుమాటలో నొర్‌గేట్, సీతారాం చనిపోయినట్లు ఉన్నాడని పేర్కొన్నాడు.

నాడు ప్రభుత్వాధికారులుగా, సైనికులుగా ఉద్యోగం రావాలంటే ఉర్దూ పరిక్షల్లో ఉత్తీర్ణులవ్వాల్సి ఉండేది. పరిక్షకు వాడే ఉర్దూ పుస్తకం బాగ్-ఒ-బహార్. ఐతే ఇది ప్రభుత్వోద్యోగులకు ఉపయోగపడే పుస్తకం కాదనీ, దీన్ని మార్చాలనే ప్రతిపాదన ఎప్పటినుండో ఉంది. దీనికై నాటి లెఫ్టినెన్ట్ కల్నల్ డగ్లస్ క్రెవెన్ ఫిలొట్ 1910లో ఖ్వాబ్-ఓ-ఖయాల్ అనే పుస్తకాన్ని వ్రాసాడు. ఈ పుస్తకంలో రెండు భాగాలు ఉండగా, మొదటి భాగం నొర్‌గెయ్ట్ పుస్తకానికి ఉర్దూ అనువాదం. స్వాతంత్ర్యం వరకూ ఇదే కొనసాగింది.

1911లో ఫిలొట్ సంపాదకత్వంలో నొర్‌గెయ్ట్ పుస్తకానికి మూడో సంచిక వచ్చింది. ఇదే కాక ఖ్వాబ్-ఓ-ఖయాల్ని (ख़्वाब-ओ-ख़याल) కూడా మళ్ళీ ఆంగ్లంలోకి విజన్స్ ఒఫ్ ద పాస్ట్ (Visions of the past) అనే పేరుతో ఈయన అనువదించాడు.

1940ల్లో ఈ ఖ్వాబ్-ఓ-ఖయాల్కి దేవనాగరీ లిప్యంతరీకరణ సంచిక విడుదలైంది. దీని రచయిత ఎవరన్నది తెలియరాలేదు.

1970లో జేమ్స్.డి.లన్ట్ సంపాదకత్వంలో నొర్గెయ్ట్ అనువాదానికి నాలుగో సంచిక వచ్చింది.

2013లో ఆనంద భట్టాచార్య సంపాదకత్వంలో ఐదో సంచిక వచ్చింది.

జాబితా

[మార్చు]
  • సీతారాం పాండే (1861) అముద్రిత అవధీ ప్రతి. అలభ్యం
  • జేమ్స్ థొమస్ నొర్‌గెయ్ట్
    • 1863 ఆంగ్ల అనువాదం. అలభ్య సంచిక
    • 1873 "ఫ్రొం సిపొయ్ టు సుబేదార్: బీయింగ్ ద లైఫ్ అన్డ్ ఎడ్వెంచర్స్ ఒఫ్ సుబేదార్ సీతా రామ్, ఎ నెయ్టివ్ ఒఫిసర్ ఒఫ్ ద బెంగాల్ ఆర్మీ, రిటెన్ అన్డ్ రిలెయ్టెడ్ బై హిమ్‌సెల్ఫ్" (From Sepoy to Subadar: Being the Life and Adventures of Subedar Sita Ram, a Native Officer of the Bengal Army, Written and Related by Himself) మొదటి సంచిక. ముద్రణ: అజిజుద్దిన్, విక్టోర్య ప్రెస్; లహోర్.
    • 1880- రెండో సంచిక. డబ్యు బొల్ ప్రిన్టర్ లహోర్.
  • సరిశ్తాదారు ముంశీ అబ్దుల్ గఫ్ఫార్ (1873) తవారీఖ్-ఇ యాదగార్-ఇ సూబదార్ విక్టోర్య ప్రెస్: లహోర్. మొదటి ఉర్దూ అనువాదం
  • డగ్లస్ క్రెయ్వన్ ఫిలొట్ (1910) "ఖ్వాబ్-ఓ-ఖయాల్" (ख़्वाब-ओ-ख़याल) మొదటి భాగం. రెండవ ఉర్దూ అనువాదం. కలకత్తా: బాప్టిస్ట్ మిషన్ ప్రెస్
    • మొదటి సంచిక- 1910
    • రెండో సంచిక- 1914
    • పునర్ముద్రణలు- 1914, 1921, 1923, 1931, 1940 and 1943.
    • ఆంగ్ల అనువాదం- విజన్స్ ఒఫ్ ద పాస్ట్ (Visions of the past)
      • మొదటి సంచిక- 1910
      • రెండో సంచిక- 1914
  • డగ్లస్ క్రెయ్వన్ ఫిలొట్ (1910) ఫ్రొం సిపొయ్ టు సుబేదార్ మూడో సంచిక.
  • అనామకులు (1940) "ఖ్వాబ్-ఓ-ఖయాల్" దేవనాగరీ లిప్యంతరీకరణ.
  • జెయ్మ్స్ లన్ట్ (1970) ఫ్రొం సిపొయ్ టు సుబేదార్ నాలుగో సంచిక. రౌట్‌లెజ్ & కెగన్ పొల్‌.
  • ఆనంద భట్టాచార్య (2013) ఫ్రొం సిపొయ్ టు సుబేదార్ ఐదో సంచిక, కునాల్ బుక్స్.

విశ్లేషణ

[మార్చు]

ఒక దేశీ సిపాయి కోణం నుండి ఆంగ్లేయ భారతాన్ని పరిచయం చేసిన ఏకైక రచన[2][3] ఐనందున, ఈ పుస్తకం ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. నాటి జనజీవనం, ఆచారాలూ, ఆంగ్లేయుల పట్ల వారి అభిప్రాయాలూ ఈ పుస్తకంలో కనిపిస్తాయి.

రచన వాస్తవికత

[మార్చు]

ఈ రచన యొక్క మూలప్రతి ఐన అవధీ ప్రతి అలభ్యం అవ్వడమే[2] కాక, అది అముద్రిత రచన కూడా. అందువలన ఈ రచన వాస్తవికత వివాదాస్పదమైనది. నొర్‌గేట్ ఆయన ఆంగ్ల అనువాదంలో ప్రస్తావించడం కాక, ఈ అవధీ ప్రతిని చూసినట్లుగా పేర్కొన్న ఇంకొక వ్యక్తి, ప్రముఖ భారతీయ దౌత్యవేత్త ఐన, గిరిజ శంకర భాజపేయి.[2][3] భాజపేయి కుటుంబం తిలోయి ఊర్లో భూస్వాములు. 1915లో శంకర భాజపేయి, నాడు నిర్వహణాధికారిగా పనిచేసిన ఆంగ్లేయుడు, జాన్ అబ్రహం గ్రయెర్‌సన్‌తో, తన తాతగారి దగ్గర ఈ అవధీ ప్రతి ఉండేదనీ, తను చదివాననీ చెప్పారు. భాజపేయి నాన్నగారిని అడగగా, ఆయన తన తండ్రి దగ్గర ఇలాంటి రచన ఏదీ ఉన్నట్లు తనకు తెలియదని పేర్కొన్నారు. ఈ విషయమై నాలుగో సంచిక సంపాదకుడైన లన్ట్, భాజపేయి కొడుకును సంప్రదించగా, అతను అగస్టు 22, 1968 తేది గల ఒక ఉత్తరంలో తన తండ్రి దగ్గర అలాంటి పుస్తకమేదీ ఉన్నట్లు తాను ఎరగననీ, తన తండ్రి కూడా ఆ పుస్తకం గురించి ఏనాడూ ప్రస్తావించలేదనీ ఆయన పేర్కొన్నట్లు లన్ట్ తన సంచిక ముందుమాటలో వ్రాసారు.

ఇది నకిలీ స్వానుభవ చరిత్ర అనే వారి వాదనలు ఇవి:

  • అవధీ ప్రతి కానీ నొర్‌గేట్ మొదటి సంచిక గానీ ఇప్పటి వరకూ దొరకలేదు.[4][2][3]
  • సీతారాం ఆంగ్లేయుల గురించి వెలువరించే అభిప్రాయాలు సరిగ్గా వారు వినాలనుకున్నట్లే ఉంటాయి.[4] ఐతే నొర్‌గేట్ తన ముందుమాటలో, పదవీ విరమణ చేసిన దేశీ సైనికాధికారులు పింఛను లబ్దిదారులైనందున, ఆంగ్లేయ ప్రభుత్వ ఆగ్రహానికి గురైతే తమ పింఛను పోతుందని, చాలా జాగ్రత్తగా మసులుకునేవారని పేర్కొన్నారు.
  • సీతారాం ప్రస్తావన ఉన్నవి కానీ, అతను పేర్కొన్న సహచరుల ప్రస్తావన కానీ ఏ సైనిక రికార్డుల్లోనూ కనబడదు. అతను సేవలందించిన దళాలు ఏవన్నది కూడా తెలియరాలేదు.[4]
  • అతని సేవాకాలంగా చెప్పబడుతున్న సమయంలో జరిగిన అన్ని ముఖ్య యుద్ధాల్లోనూ సీతారాం పాల్గొన్నాడు.[4]

సానుకూల వాదనలు

[మార్చు]

ఈ రచన నిజమైనదేనని అభిప్రాయపడ్డవారు నాటి స్వాతంత్ర్యపూర్వ భారతదేశంలో ఇన్డ్యన్ సివిల్ సర్విస్‌లో సేవలందించిన ఇద్దరు అధికారులు—పెట్రిక్ కెడెల్, ఫిలిప్ మెయ్సన్‌లు. కెడెల్ ఈ పుస్తకాన్ని సమీక్షిస్తూ 1959లో జర్నల్ ఒఫ్ ద ససైటి ఫర్ ఆర్మి హిస్టొరికల్ రిసర్చ్‌కు (Journal of the society for army historical research) వ్రాసిన వ్యాసాల్లో నాటి భారతదేశంలో నిర్వాహక పదవిలో సేవలందించిన గ్రయర్‌సన్‌కు, జి.ఎస్ భాజపేయికీ మధ్య సంభాషణను ఉటంకించి, ఈ సంభాషణ ఆ పుస్తకం నకిలీ కాదని నిరూపిస్తోందని అభిప్రాయపడ్డారు.[5] మెయ్సన్ తన పుస్తకం "ఎ మెటర్ ఒఫ్ ఒనర్"‌లో ఈ స్వానుభవ చరిత్ర గురించి వ్రాస్తూ దీనిలో ఇచ్చిన ఏడాదులకీ, ఆ సంఘటనలు జరిగిన ఏడాదులకీ పొసగడం లేదనీ, ఇలాంటి మరుపుయే ఇది నిజంగా ఒక సిపాయి వ్రాసిన రచన అనే నమ్మకం ఆయనకి కలిగిస్తోందనీ పేర్కొన్నాడు. దీన్ని మరింత వివరిస్తూ, తమ కింద పనిచేసి పదవీ విరమణ చేసిన సిపాయిలు తమను కలవడానికి వచ్చినప్పుడు నాటి విశేషాలను గుర్తుచేసుకునేటప్పుడు సీతారాం లాగే తమ దళపు సంఖ్యల వంటి వివరాలు మరిచిపోయేవారనీ, కానీ తమ పై అధికారుల పేర్లు గుర్తుపెట్టుకునేవారనీ పేర్కొన్నాడు. అలాగే నొర్‌గెయ్ట్ ఈ రచన నకిలీతనాన్ని కప్పిపుచ్చేందుకే కావాలని కొన్ని తప్పు ఏడాదులను చేర్చారనే ఆరోపణను కూడా ఈయన కొట్టిపారేసాడు.[6]

దీని వాస్తవికతకు మద్దతు ఇచ్చిన ఇంకో వ్యక్తి చరిత్రాకారుడు విల్యం డెల్రింపల్. ఈయన తన చరిత్ర పుస్తకం "ద లాస్ట్ ముఘల్" (The Last Mughal)లో ఈ రచనను ప్రస్తావించినప్పుడు ఇది సీతారాం నిజంగానే వ్రాసాడా లేదా అనేదానిపై పండితులకు అనుమానాలు ఉన్నాయనీ, ఐతే ఈ రచనలోని భావాలు భారతీయుల ఆలోచనలతో సరిపోతున్నాయనీ, కనుక సీతారాం తాను వ్రాయకుండా, ఎవరో ఆంగ్లేయ గుప్త రచయిత చేత రాయించి ఉంటాడని వాదించాడు.[7]

ఆంగ్లేయ సైనిక చరిత్రాకారుడు డెయ్విడ్ సౌల్ తన థీసిస్‌లో ఈ రచనను ప్రస్తావిస్తూ ఒక దేశీ బంగలా సిపాయి మాత్రమే ఇంత సుసంపన్నంగా, కచ్చితంగా విషయాలను ఏకరవు పెట్టగలడు అనీ, కనుక ఈ స్వానుభవ చరిత్ర నకిలీ కాదు అన్న కెడెల్ నిర్ధారణతో తాను ఏకీభవిస్తున్నాననీ పేర్కొన్నాడు.[8]

ప్రతికూల వాదనలు

[మార్చు]

దక్షిణాసియా భాషల అధ్యయన నిపుణుడైన వొల్టర్.ఎన్.హకలా ఈ రచనను విశ్లేషిస్తూ, నొర్‌గెయ్ట్ ఇది ఒక స్వానుభవ చరిత్ర అని జనాల్ని నమ్మించడానికి వివిధ రచనా పద్ధతులు వాడాడని వాదించాడు.[9]

చరిత్రకారిణి ఎలిసన్ సఫది తన వ్యాసంలో ఈ పుస్తకం వాస్తవికత గురించి తన వ్యాసంలో చర్చించింది. కెడెల్, మెయ్సన్‌ల నిర్ధారణల వెనుక వారి భావాలూ, నమ్మకాలే తప్ప ఆధారాలు లేవనీ, వారి చర్చల్లో కూడా ఒకపక్క ఈ రచన నకిలీదని అనుమానాలు రేకెత్తించే అంశాలు ప్రస్తావిస్తూనే, నిర్ధారణలో మాత్రం ఇది వాస్తవికం అని తేల్చుతున్నారని ఆవిడ అభిప్రాయపడింది. ఈమె తన వ్యాసంలో తమ వాదనలకు మద్దతుగా కెడెల్, మెయ్సన్‌లతో పాటు ఇతర పరిశోధకులు ఉటంకించిన అంశాలను పేర్కొంటూ, ఒక్కొక్క అంశంపై చర్చించి, వాటిని ఖండించింది. ఆపైన నొర్‌గెయ్ట్ దేవనాగరీ లిపిలో వ్రాసిన ప్రతిని అనువదించినట్లు పేర్కొన్నాడు. ఆ క్రమంలో అనువాదం సరైన అర్థాన్ని ఇవ్వలేదనుకున్న కొన్ని పదాలను రోమను లిపిలోకి అంతరీకరించాడు. ఈ లిప్యంతరీకరణలో మహాప్రాణాలను చూపిన విధానం ప్రామాణికంగా లేదనీ, మహాప్రాణాలు ఉండవలసిన చోట అవి లేనట్లుగా అంతరీకరించడంతో పాటు, అవి లేని చోట వాటిని నొర్‌గెయ్ట్ చేర్చాడనీ ఆవిడ ఉదాహరణలతో పేర్కొని, దీన్ని బట్టి ఇవి నొర్‌గెయ్ట్ భారతీయల నుండి నేర్చుకున్న కొదహన్ని హిందుస్తానీ పదాలు అయ్యుండాలి కానీ, అనువాదంలో ఉన్నవి కాదని అభిప్రాయపడింది. చివరకు ఈ విషయాన్ని తేల్చుతూ, ఈ రచన అసలా, నకిలీయా అని తేల్చడం సాధ్యం కాదనీ, అందుచేత దీన్ని చరిత్రను తెలుసుకునే ఒక మూలంగా పరిగణించరాదని పేర్కొంది.[1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Safadi, Alison (2010). "From Sepoy to Subadar / Khvab-o-Khayal and Douglas Craven Phillott". The Annual of Urdu Studies (25). Department of Languages and Cultures of Asia, UW-Madison. Retrieved 3 February 2023.
  2. 2.0 2.1 2.2 2.3 Mukerjee, Amit (29 October 2015). "book excerptise". book excerptise. Retrieved 2 February 2023.
  3. 3.0 3.1 3.2 Mishra, Shashank Shekhar (20 October 2020). "Sitaram Pandey: The Fascinating Memoirs of a British Indian Sepoy". Peepul tree. stories. Retrieved 2 February 2023.
  4. 4.0 4.1 4.2 4.3 "The Grateful Native: British Empire propaganda in the internet age". Preorg!. 24 August 2014. Retrieved 2 February 2023.
  5. Cadell, Patrick (June 1959). "The Autobiography of An Indian Soldier (Continued)". Journal of the Society for Army Historical Research. 37 (150): 49–56. JSTOR 44222326. Retrieved 17 May 2023 – via jstor.
  6. Mason, Philip (27 June 1974). "The Old Subadar". A Matter of Honour. London: Holt, Rinehart and winston. pp. 207–217. ISBN 0-03-012911-7. Retrieved 18 May 2023.
  7. Dalrymple, William (2006). The last Mughal (paperback ed.). Bloomsbury (published 2009). ISBN 9781408800928. OCLC 1026875128.
  8. David, Julian Saul Markham (February 2001). "Recruitment". The Bengal Army and the outbreak of the Indian Mutiny (Thesis). University of Glasgow. Retrieved 18 May 2023.
  9. Hakala, Walter (5 February 2015). "From Sepoy to Film Star: Indian interpreters of an Afghan mythic space". Modern Asian Studies. 50 (5). Cambridge University Press: 1501–1546. doi:10.1017/S0026749X14000067. JSTOR 44157760. Retrieved 17 May 2023.

మరింత సమాచారం కోసం

[మార్చు]

సానుకూల వాదనలు

[మార్చు]

పెట్రిక్ కెడెల్ విశ్లేషణ వ్యాసాలు

[మార్చు]
  • Cadell, Patrick (March 1959). "The Autobiography of An Indian Soldier". Journal of the Society for Army Historical Research. 37 (149): 3–11. JSTOR 44226914.
  • Cadell, Patrick (June 1959). "The Autobiography of An Indian Soldier (Continued)". Journal of the Society for Army Historical Research. 37 (150): 49–56. JSTOR 44222326.

ప్రతికూల వాదనలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]

ఆంగ్లం

[మార్చు]

ఉర్దూ

[మార్చు]