కొంపెల్లి భ్రమరాంబ
కొంపెల్లి భ్రమరాంబ కూచిపూడి నాట్యకారిణి, ఉపాధ్యాయురాలు. ఆమె భరత నాట్యం, కూచిపుడిలతో పాటు జనపదమైన జానపద నృత్యంతో రాణిస్తూ విద్యార్థులకు తన విద్యనందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ విద్యర్థులకు విద్యను అందుస్తూనే విద్యతో పాటు వికాసం అందించాలనే తలంపుతో "శ్రీకృష్ణ సంగీత నృత్య పాఠశాల" ను స్థాపించి విద్యార్థులకు నాట్యకళను నేర్పిస్తున్నారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె వరంగల్ జిల్లాలోని శ్రీకృష్ణ కాలనీలో ఆంజనేయశాస్త్రి, కమలాదేవి దంపతులకు రెండవ సంతానంగా 1959లో జన్మించారు. ఆమె తొమ్మిదో తరగతి వరకు సుశీలాదేవి పాఠశాలలో చదివి పదో తరగతిని శ్రీకృష్ణ కళాశాలలో పూర్తి చేశారు. ఆంధ్ర బాలిక జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనంతరం నగరంలోని సీకేఎం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో హన్మకొండలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో బీఈడీని పూర్తి చేశారు. 1984లో జనగామలోని ప్రభుత్వ సెంట్రల్ ప్రైమరీ స్కూల్ లో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయినిగా వృత్తిలో చేరారు. పదోన్నతిపై స్కూల్ అసిస్టెంట్‌పై 2003లో ములుగు మండలం మైలారం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చేరారు. అనంతరం 2016 ఫిబ్రవరిలో పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ పొందారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్య సేవలందించి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా పేరుగాంచారు. హైదరాబాద్‌లో ఉపాధ్యాయ శిక్షణను పొంది ఉపాధ్యాయులకు శిక్షణను అందించి 2007లో బెస్ట్ రిసోర్స్ పర్సన్‌గా ఆర్‌వీఎం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.[1]
నాట్యకారిణిగా
[మార్చు]ఆమె తన తొమ్మిదేళ్ళ వయసులో వెంపటి కోదండరామశాస్త్రి నిర్వహిస్తున్న నృత్య కళాశాలలో చేరి శిక్షణ పొందారు. ఈ కళాశాల వారి ఇంటి ప్రక్కనే ఉండేది. తరువాత ఆమె వెంపటి కోదండరామశాస్త్రి, వెంపటి నాగేశ్వరి లవద్ద మెళుకువలు నేర్చుకొని హైదరాబాదు లోని ఉమా రామారావు వద్ద భరతనాట్యం శిక్షణ పొందారు. భరతనాట్యం, కూచిపుడిలతో పాటు జనపదమైన జానపదంలో సైతం రాణిస్తూ వేలాది మంది విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. తొలిసారిగా 1980లో హన్మకొండ బి.ఇ.ది కళాశాలలో నటరాజు స్తుతి అనే గీతాలాపనతో నృత్య ప్రదర్శననిచ్చారు. 1982లో విద్యార్థులకు నృత్య శిక్షణను యివ్వాలనే తలంపుతో వరంగల్ చౌరస్తాలో శ్రీకృష్ణ నృత్య పాఠశాలను ప్రారంభించారు. వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. 2013లో సినీ సంగీత దర్శకుడు రఘవేందర్‌తో కలిసి శ్రీలలిత నృత్య పాఠశాలను హన్మకొండలోని మర్కాజీ పాఠశాలలో ఏర్పాటు చేశారు. 1982 నుంచి నేటి వరకు తన విద్యార్థుల చేత 2500 ప్రదర్శనలు అందించి అంతర్జాతీయ స్థాయిలో ఓరుగల్లు కీర్తిప్రతిష్టలను పెంచారు.[2] 1993లో జ్వాలముఖి ఆట, తాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక ప్రశంసలను పొందారు. ఢిల్లీలో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు భ్రమరాంబ నృత్య ప్రతిభను ప్రదర్శించి ప్రత్యేకతను చాటుకున్నారు.[1]
నటనలో రాణింపు
[మార్చు]సాంప్రదాయ నృత్యాలతో నిత్యం రాణిస్తూ వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది తన ప్రత్యేకతను చాటుకుంటున్న భ్రమరాంబ నటనకే మణిహారంగా నిలుస్తున్నారు. 1984లో జాతీయ స్థాయిలో చిలుకలూరిపేటలో నిర్వహించిన నృత్య పోటీల్లో రగడ రామ్మోహన్‌రావు కళా నిలయం చేత 'నాట్య విజ్ఞాన్' పురస్కారాన్ని అందుకున్నారు. 1986లో రాజమండ్రిలో నృత్య పోటీలు నిర్వహించగా కళాదర్బార్ సాంస్కతిక సంస్థ నాట్య మయూరి బిరుదును అందించారు. విజయవాడలోని సుందరయ్య కళాభవన్‌లో 2003లో ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్య పోటీల్లో ఉత్తమ నాట్యాచారునిగా 2015లో హైదరాబాద్ శ్రీనివాస్ చేత ఉగాది రత్న పురస్కార్, 2016లో ఆదిలాబాద్‌లోని నృత్యమాల నాట్య కళా వెల్ఫేర్ సొసైటీ వారిచే నృత్యశ్రీ పురస్కారంతో ప్రత్యేక సన్మానం అందుకున్నారు.