కొవ్వలి లక్ష్మీనరసింహరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొవ్వలి లక్ష్మీనరసింహరావు ప్రముఖ నవలా రచయిత. ఈయన ఆ రోజుల్లోని మధ్యతరగతి స్త్రీలకు పుస్తకాలు చదవడం నేర్పిన గొప్ప రచయిత.ఆయన రాసిన నవలలు. కొవ్వలి వారి నవలలు అంటే, ఆనాడు విపరీతమైన అభిమానం ఉండేది. ఈ నవలల్లోని కథలు మామూలు కుటుంబ కథలు. మంచి వ్యావహారిక భాషలో, సహజమైన సంభాషణలతో రాసేవారు ఆయన.

జీవిత విశేషాలు

[మార్చు]

కొవ్వలి లక్ష్మీనరసింహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తణుకులో జూలై 1 1912 న జన్మించారు. తణుకులోనే విద్యాభాసం చేసిన పిదప అప్పుడు వచ్చిన సాహిత్యాన్ని మధించారు. స్త్రీల సమస్యలతో, వాడుక భాషలో చిన్న చిన్న కథలు తీసుకుని నవలారూపంలో రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే- ఆయనకి ఖ్యాతి తెచ్చింది. ఆయన వాడుక భాషలో అందరికీ అర్థం అయ్యే రీతిలో నవలా రచన చేశారు. ఆయన మొత్తం సుమారు 1000 కి పైగా నవలలు వ్రాసారు.

ఆయన రాసిన మొదటి నవల 1935లో 'పల్లె పడుచులు' అయితే వెయ్యో నవల పేరు 'మంత్రాలయ'. వేయిన్నొకటి- 'కవి భీమన్న' (1975). ఆయన రాసిన వాటిలో జానపదాలు, డిటెక్టివ్‌ కథల్లాంటివి కూడా ఉన్నాయి.

చిత్ర పరిశ్రమలో

[మార్చు]

ఆయనకు కథ అల్లడంలోనూ, మాటలు రాయడంలోనూ ఉన్న రచనా సహజత్వాన్ని నిదానంగా సినిమా రంగం ఉపయోగించుకుంది. రాజరాజేశ్వరి వారు 1941లో 'తల్లి ప్రేమ' తీసినప్పుడు కొవ్వలి వారిని ఆహ్వానించి, కథ, మాటలూ రాయించారు. కన్నాంబ, కడారు నాగభూషణంగార్లు ఈ సినిమాతో చిత్రరంగంలో నిర్మాతలయినారు. జ్యోతిసిన్హా దర్శకత్వం వహించగా, కన్నాంబ, సి.యస్‌.ఆర్‌. ముఖ్యపాత్రలు ధరించారు.

కొవ్వలి లక్ష్మీనరసింహరావు గారికి ఆత్మాభిమానం, మొహమాటం రెండూ ఎక్కువే. 'తల్లి ప్రేమ' బాగా నడిచినా, మద్రాసులోనే మళ్లీ సినిమా ప్రయత్నాలు చేయలేదు. తన ఊరు వెళ్లిపోయారు. మళ్లీ- పదేళ్లకి కొవ్వలి వారి నవలనే సినిమాగా తియ్యాలని వినోదావారు భావించి, మద్రాసు రప్పించారు. నిర్మాత డి.ఎల్‌. నారాయణగారు, వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో నిర్మించిన శాంతి చిత్రం 1952లో విడుదలైంది. 'శాంతి'లో దాదాపు అందరూ కొత్తవారే. ఈ సినిమా బాగా నడవడంతో, కొవ్వలి వారిని మద్రాసులోనే ఉండమని ప్రోత్సహించడంతో- ఆయన ఉండిపోయారు.

విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో బి.ఎస్‌.రంగా తీసిన 'మా గోపి' సినిమాకి లక్ష్మీనరసింహరావు గారు కథ, మాటలూ రాశారు. చిన్న పిల్లవాడు ప్రధాన పాత్రగా నడిచిన ఈ సినిమా బాగా నడిచింది. వెంకటేశ్‌ అనే బాలుడు ఆ ముఖ్య పాత్రని వేశాడు. జమున ముఖ్య పాత్రధారిణి. 'సిపాయి కూతురు' (1959) కొవ్వలి వారి కథే. మాటలూ ఆయనే రాశారు. 'చందమామ' సంస్థ పేరుతో డి.ఎల్‌. నారాయణ తీసిన ఈ సినిమాని చెంగయ్య డైరెక్టు చేశారు. ఈ సినిమా చూపించిన విశేషం ఏమిటంటే- సత్యనారాయణని తొలిసారిగా 'హీరో' పాత్రలో పరిచయం చేసింది. నాయిక- జమున. హెచ్‌.ఎమ్‌.రెడ్డి గారి పర్యవేక్షణలో వచ్చిన రోహిణి వారి 'బీదల ఆస్తి' (1955), 'రామాంజనేయ యుద్ధం (1958)' చిత్రాలకు కొవ్వలి రచన చేశారు. 'మహాసాధ్వి మల్లమ్మ' అనే కన్నడ చిత్రానికి తెలుగులో రచన చేసి ఇచ్చారు.

అయితే జానపద కథల్ని అల్లడంలో కొవ్వలికి మంచి ప్రతిభ ఉందని, అలాటి కథలతో చిత్రాలు తీసిన నిర్మాతలు ఆయన్ని పిలిచి, చర్చల్లో కూచోబెట్టేవారు. కొందరు రచయితలకి 'నేపథ్య రచన' చేసిన విశేషం కూడా ఉంది ఆయనకి.

మధ్య తరగతి స్త్రీలకు ఆమోదకరంగా ఉండే విధంగా రచనలు చేసి, చదివించిన వారిలో ప్రథముడు కొవ్వలి అని, రచయిత, నిర్మాత చక్రపాణి గారి మెప్పు సొందిన కొవ్వలి లక్ష్మీనరసింహరావుగారు జూన్ 8 1975 న ద్రాక్షరామంలో మరణించారు.

రాసిన నవలలో కొన్ని

[మార్చు]
 1. అనాథ శరణాలయం
 2. ఇడియట్‌
 3. ఇల్లాలు
 4. ఏకోదరులు
 5. కరోడా
 6. కవి భీమన్న
 7. కిడ్‌నాప్‌
 8. కొమ్మదానం
 9. గళ్ళచీర [1]
 10. ఘరానాతుంటరి
 11. చస్తావ్‌ పారిపో
 12. ఛాలెంజ్‌
 13. టులెట్
 14. డాక్టర్స్‌వైఫ్
 15. డార్లింగ్‌ డాలీ
 16. దైవమిచ్చినభార్య
 17. నడమంత్రపుసిరి
 18. ననీబ్
 19. నీలివార్త
 20. నీలో నేను-నాలో నీవు
 21. నీవే నా భార్య
 22. పంకజం
 23. పండుగ మామూలు
 24. పంతులమ్మ
 25. పగటి వేషం
 26. పల్లె పడుచులు
 27. పారిజాతం
 28. పైలా పచ్చీస్‌
 29. పుకార్
 30. ఫిలింస్టార్
 31. బడా చోర్‌
 32. బస్తీ బుల్లోడు
 33. బురఖారాయడు
 34. మంత్రాలయ
 35. మరదలు పెళ్లి
 36. మళ్లీపెళ్లి
 37. మారనిరూపాయి
 38. మారుతల్లి
 39. మార్కెట్‌క్వీన్
 40. మూర్‌మార్కెట్టు
 41. రంగేళి
 42. రాత్రిరాణి
 43. రైతుపడుచు
 44. రౌడీ రంగన్న
 45. లవ్‌ మేకింగ్‌
 46. వాలుజడ
 47. విడ్డూరం
 48. వెధవాడపడుచు
 49. వేగబాండ్‌ ప్రిన్స్‌
 50. వ్యభిచారిణి
 51. సవతిపోరు
 52. సవాల్‌
 53. సిపాయి కూతురు (ఇదే పేరుతో సినిమాగా తీయబడింది)
 54. సినిమాపిచ్చి
 55. సీక్రెట్‌ లవర్‌
 56. హలో సార్‌

మాటలు రాసిన సినిమాలు కొన్ని

[మార్చు]
 1. తల్లి ప్రేమ 1941
 2. శాంతి 1952,
 3. మా గోపి
 4. 'సిపాయి కూతురు' (1959),
 5. 'బీదల ఆస్తి' (1955),
 6. 'రామాంజనేయ యుద్ధం (1958)'

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]