కోట వేంకట లక్ష్మీనరసింహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోట వేంకట లక్ష్మీనరసింహం కడిమిళ్ళ వరప్రసాద్తో కలిసి కడిమిళ్ళ కోట కవులు అనే పేరుతో జంటగా అవధానాలు చేశాడు.[1]

విశేషాలు[మార్చు]

ఇతడు 1955, ఫిబ్రవరి 1వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని గొల్లల కోడేరు గ్రామంలో జన్మించాడు. సీతామహాలక్ష్మి, సీతారామాంజనేయులు ఇతని తల్లిదండ్రులు. ఇతడు ప్రాథమిక విద్యను జల్లికాకినాడ గ్రామంలోను, సెకండరీ విద్యను కేశవరం గ్రామంలోను, భాషాప్రవీణ భీమవరంలోని ప్రాచ్య సంస్కృత కళాశాలలోను చదివాడు. 1976లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి పి.ఓ.ఎల్. పట్టాను పొందాడు. అత్తిలి గోపాలకృష్ణమాచార్యులు, భారతం శ్రీమన్నారాయణ ఇతని విద్యాగురువులు. కడిమిళ్ళ వరప్రసాద్ ఇతని అవధాన గురువు.

అవధానాలు[మార్చు]

ఇతడు సుమారు 300 అష్టావధానాలు, 3 శతావధానాలు, ఒక సహస్రావధానం చేశాడు. అందులో ఒక సహస్రావధానం, ఒక శతావధానం కడీమిళ్ళ వరప్రసాద్‌తో జంటగా నిర్వహించాడు. ఇతని అవధానాలలో సమస్య, వర్ణన, దత్తపది, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, ఆశువు, పురాణం, అప్రస్తుత ప్రసంగం మొదలైన అంశాలు ఉన్నాయి. ఇతడు కొవ్వూరు, ఆకివీడు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరు, తణుకు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గుడివాడ, హైదరాబాదు, కలకత్తా మొదలైన చోట్ల విజయవంతంగా అవధానాలు నిర్వహించాడు.

అవధానాలలో పూరణలు[మార్చు]

  • సమస్య: పాలను వీడగా వలయు పండితులందఱు వృద్ధిపొందగన్

పూరణ:

హేలగ సత్కవిత్వము వచించెడి వేళల కోపమేల, భా
షాలలితాంగి కర్చనలు సల్పెడు వేళల తాపమేల శ
బ్దాలను పూలు జేసి రసవత్కృతి చెప్పెడు వేళ కోపతా
పాలను వీడగా వలయు పండితులందఱు వృద్ధిపొందగన్

  • దత్తపది: పూరి - వడ -దోసె - సాంబారు అనే పదాలతో పార్వతీ పరమేశ్వర వర్ణనము

పూరణ:

 చేర రమ్మని ప్రేమ సంపూరితముగ
శివుడు పిలువడచేసి దోసెగల మధ్య
తపము మెచ్చిన భవుడు అర్థమ్మునిచ్చె
సిరుల మనకిడు సాంబా!రుచి ప్రదీప్తి

  • వర్ణన: వేంకటేశ్వర వైభవం

పూరణ:

తిరునామమ్మట దివ్యభూషలట విస్తీర్ణమ్ముగా పైడిచే
ఇరవౌ గోపురమంట, రత్నకలనాహేలాప్రభాసంపదన్
శిరమందొక్క కిరీటమంట, ఇక తేజీలంట, నీ కేమయా
సిరి నీగుండెలలోన నిల్వ కరవా! శ్రీవేంకటేశ ప్రభూ!

బిరుదులు[మార్చు]

  • అవధాన రాజహంస
  • అవధాన చూడామణి
  • అవధాన కళాతపస్వి
  • సహస్రావధాన భాస్కర మొదలైనవి.

మూలాలు[మార్చు]

  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 652–656.