Jump to content

కోళ్లూరు గనులు

వికీపీడియా నుండి
కో-ఇ-నూర్ వజ్రానికి ప్రతి రూపం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాన ఉన్న కోళ్లూరులో వజ్రాల గనులున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాలు ఇచ్చట లభించాయి. ఆంధ్రదేశానికి రత్నగర్భ అను పేరు కోళ్లూరు గనుల వల్ల సార్థకమయ్యింది. ప్రఖ్యాత వజ్ర వ్యాపారి జాన్ బాప్టిస్ట్ టావర్నియర్ కోళ్లూరు, పరిటాల గనులు సందర్శించాడు.[1][2] ఈ ప్రాంత నదీ గర్భంలో రంగురాళ్ళవేట ఇప్పటికీ కొనసాగుతోంది.[3][4][5].

వజ్ర సంపద

[మార్చు]

తెనుగుసీమ మొత్తము భారత దేశములో వజ్రాలగని యని ప్రఖ్యాతి పొందెను. గోలకొండరత్నాలు అని యూరోపునందంతటను మారుమ్రోగిపోయెను. కాని నిజముగా గోలకొండ పట్టణం చుట్టును ఎక్కడా రత్నాలు లేకుండెను. గోలకొండ నుండి దక్షిణముగా అయిదు దినాలు ప్రయాణము చేసినచో కృష్ణా తీరములో రావులకొండ అనేతావున వజ్రాలగని యుండెనని ఆ కాలమందు సంచారము చేసిన టావర్నియర్ అనే తెల్లవాడు వ్రాసినాడు. అప్పు డందు 60,000 మంది గనిలో పనిచేయుచుండిరనియు వ్రాసినారు. కృష్ణాతీరములో కొల్లూరు అనేతావున రత్నాలగని సా.శ. 1534 లో కనిపెట్టిరి. అక్కడనే కోహినూరు వజ్రం దొరికెను. ఈ కొల్లూరు ప్రఖ్యాతి ఎక్కువై ఒక శతాబ్దములోనే అచ్చటి గనులు మూతబడెను. అప్పటి వైభవమును తర్వాత శైథిల్యమును గూర్చి జనులలో ఒక చిత్రమగు కథ బయలుదేరెను. 'కొల్లూరు పట్నము వలె వెలిగిపోయింది.' అని సామెతగా అనెదరు. దానిపై పుట్టిన కథ యేమనగా :-

కొల్లూరు పట్టణంలో ఒకదేవుడు వెలిసెను. ప్రతి జనుడు ధాన్యమును తన మూత్రములో తడిపి ఆ దేవతా విగ్రహముపై వేసిన అవన్నీ రత్నాలై రవ్వ లవుచుండెనట. అందరును ఆ క్రియను చేయుచు మేడలు కట్టిరి. ఆ పట్టణంలో ఒక పేద బాప డుండెను. అందరివలె నీవును చేసి సుఖపడరాదా అని అతనిభార్య తొందరపెట్టుచుండెను. ఏమైననుకాని నేనా తుచ్చపుపని చేసి అపచారము చేయనని అ శిష్టు డనుచుండెను. ఒకనాటి మధ్యరాత్రి మరొక వృద్ధ బ్రాహ్మణు డా పేదబాపని కుటుంబ సహితముగా పట్టణం బయటకు పిలుచుకొని పోయి అదిగో కొల్లూరుపట్టణ వైభవము చూడు అని ధగద్ధగితముగా మండుచుండే పట్టణాన్ని వారికి చూపి మాయమయ్యెనట. అది కొల్లూరు పట్టణం వలె వెలిగినది అనేకథ. ఆ కథ నిజముగా ఈ వజ్రాలగనికి సంబంధించినదని పైననే కనబడుచున్నది.

సురవరం ప్రతాపరెడ్డి[1]

గోలకొండ సంస్థానంలో పనిచేసిన పారశీకుడు మీర్ జుంలా పరిటాల-కొల్లూరు గనులనుండి చాల వజ్రాలు వెలికి దీయించి సుల్తాను పరం చేశాడు. వజ్రవ్యాపారులు టావర్నియర్, విలియం మెథోల్డ్ మున్నగు వారు కొల్లూరు గనులు సందర్శించి అచటి ప్రాభవం గురించి వివరంగా వ్రాశారు. క్రీ. శ. 1618లో 60,000 మంది పనివారు బండ్లకొద్దీ వజ్రాలు వెలికి తీసేవారని వ్రాయబడింది[6].

కొల్లూరు గనులలో దొరికిన విశ్వ విఖ్యాత వజ్రాలు:

  • కోహినూరు వజ్రం - (186 ct) - బ్రిటీష్ క్రౌన్ జ్యూవెల్స్
  • మహా మొగల్ డైమండ్ - (787 ct) - నాదిర్ షా ఢిల్లీని ఓడించిన పిదప కనబడలేదు.
  • పిట్ లేక రీజంట్ వజ్రం - (410 ct) - అపోలో గ్యాలరీ, లూవర్ మ్యూజియం, పారిస్
  • ఆర్లాఫ్ వజ్రం - (300 ct) - డైమండ్ ట్రెజరీ, క్రెమ్లిన్, మాస్కో
  • నిజాం వజ్రం - (440 ct) - నిజామ్ ట్రెజరీ, హైదరాబాదు
  • హోప్ వజ్రం - (67 ct) - స్మిత్సోనియన్ సంస్థ, వాషింగ్టన్
  • గోల్కొండ వజ్రం (135 ct) - డంకింగ్స్ జ్యూవెలర్స్, మెల్బోర్న్, ఆస్ట్రేలియా
  • కోళ్లూరు వజ్రం - (63 ct) - టేవర్నియర్ కొన్నాడు, ప్రస్తుతం వున్న ప్రదేశం తెలియదు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 సురవరం ప్రతాపరెడ్డి (1949). "Wikisource link to 6 వ ప్రకరణము". Wikisource link to ఆంధ్రుల సాంఘిక చరిత్ర. వికీసోర్స్. 
  2. Jean-Baptiste Tavernier (1889). Valentine Ball (ed.). Travels in India. Vol. 1. Macmillan. p. 172.
  3. "LARGE AND FAMOUS DIAMONDS". Archived from the original on 2008-05-17. Retrieved 2009-02-16.
  4. India Before Europe, C.E.B. Asher and C. Talbot, Cambridge University Press, 2006, ISBN 0521809045, p. 40
  5. A History of India, Hermann Kulke and Dietmar Rothermund, Edition: 3, Routledge, 1998, p. 160; ISBN 0415154820
  6. Deccan Heritage, H. K. Gupta, A. Parasher and D. Balasubramanian, Indian National Science Academy, 2000, p. 144, Orient Blackswan, ISBN 8173712859