Jump to content

గండికోట

అక్షాంశ రేఖాంశాలు: 14°48′48″N 78°17′5″E / 14.81333°N 78.28472°E / 14.81333; 78.28472
వికీపీడియా నుండి
(గండి కోట నుండి దారిమార్పు చెందింది)
గండికోట
మాధవరాయ దేవాలయం, గండికోట
మాధవరాయ దేవాలయం, గండికోట
పటం
గండికోట is located in ఆంధ్రప్రదేశ్
గండికోట
గండికోట
అక్షాంశ రేఖాంశాలు: 14°48′48″N 78°17′5″E / 14.81333°N 78.28472°E / 14.81333; 78.28472
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్
మండలంజమ్మలమడుగు
విస్తీర్ణం42.78 కి.మీ2 (16.52 చ. మై)
జనాభా
 (2011)[1]
1,118
 • జనసాంద్రత26/కి.మీ2 (68/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు573
 • స్త్రీలు545
 • లింగ నిష్పత్తి951
 • నివాసాలు278
ప్రాంతపు కోడ్+91 ( 08560 Edit this on Wikidata )
పిన్‌కోడ్516434
2011 జనగణన కోడ్593142

గండికోట వైఎస్‌ఆర్ జిల్లా, జమ్మలమడుగు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుండి పడమర దిశగా 14 కి. మీ. దూరంలో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉంది. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి. ఈ గ్రామంలో గల చారిత్రక కోట శిథిలాలు ప్రముఖ పర్యాటక ఆకర్షణ.

చరిత్ర

[మార్చు]
గండికోట వద్ద పెన్నానది
గండికోట

గండికోట ఒక ప్రముఖమైన గిరిదుర్గము, దీని చరిత్ర 13వ శతాబ్దం రెండవ అర్థభాగంలో మొదలవుతుంది. గండికోట కైఫియత్ లో పశ్చిమ కళ్యాణి చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వరచే మలికినాడు సీమకు సంరక్షకునిగా నియమించబడిన కాకరాజు సా. శ. 1044 శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (సా.శ. 1123 జనవరి 9) నాడు చిన్న మట్టికోటను కట్టించెను అని పేర్కొనబడింది.[3] ఐతే ఇది నిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలూ లేవు. త్రిపురాంతకం వద్ద గల సా.శ.1212 (సా.శ. 1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయకుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని భావిస్తున్నారు. ఉప్పరపల్లె దగ్గర గల శా.1236కు (సా.శ. 1314) చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రుడు జుట్టయలెంక గొంక రెడ్డిని గండికోటని పాలించడానికి నియమించాడని తెలుస్తోంది. గండికోట విజయనగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలం (ప్రాంతం) లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగములో గండికోటను పెమ్మసాని కమ్మ నాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు పాలించారు.[4] విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైనపుడు, పదిహేడవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా పెమ్మసాని కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగం చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు. కమ్మ నాయకులు గండికోటను మూడు వందలయేళ్ళకు పైగా పరిపాలించారు.

వీరి పాలనలో గ్రామాలని మూడు విధాలుగా విభజించారు. బండారువాడ, అమర, మాన్య విభాగాలుగా విభజించారు. ఇందులో బండారువాడ గ్రామాలు చక్రవర్తుల ఆధీనంలో ఉండేవి. మాన్య గ్రామాలు దేవాలయాల, బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. అమర గ్రామాలు అమరులైన కోట అధ్యక్షుల ఆధీనంలో ఉండేవి. అందమైన లోయలు, ఎటు చూసినా అబ్బురపరిచే కమనీయ దృశ్యాలే ఇక్కడ కన్పిస్తాయి. ఎంతో ఘన చరిత్ర ఈ కోట సొంతం. ఎందరో రాజులు, రాజవంశాల పరాక్రమానికి, నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దం. ఈ కోటను సందర్శిస్తే ఆనాటి రాజుల పౌరుషాలు, యుద్ధాలు, నాటి రాజుల పరిపాలన గుర్తుకు వస్తుంది. దీని పరిసర ప్రాంతాల్లో 21 దేవాలయాలున్నాయి. పడమర, ఉత్తర దిక్కుల్లో పెన్నానది ప్రవహిస్తోంది. కోట నుంచి చూస్తే దాదాపు 300 అడుగుల లోతులో 250 అడుగుల వెడల్పుతో పెన్నానది కన్పిస్తుండడం విశేషం. ఇక్కడున్న జుమ్మామసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది. మసీదు ప్రాకారం చుట్టూ లోపల 64 గదులు, బయట 32 గదులుండి ఎంతో ఆకర్షిస్తాయి.

ఎలాంటి నేరాలకైనా కృూరమైన శిక్షలు ఉండేవి. చిన్న దొంగతనానికి కాలు, చేయి తొలగించేవారు. రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చెక్కిన కర్రతో చంపేసేవారు. పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేసేవారు.

తాళ్ళపాక అన్నమయ్య ఆహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరాడు. అ యాత్రలో అప్పుడు వున్న గండికోట చెన్నకేశవాలయం దర్శించి చెన్నకేశుడిని "చీరలియ్యగదవోయి చెన్నకేశవా! చూడు చేరడేసి కన్నుల వో చెన్నకేశవా" అని స్తుతించాడు.[5]

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

గండకోట శిథిలాలు

[మార్చు]
గండికోట ప్రాకారంలోని కొంత భాగం
గండికోటలోని మాధవరాయ ఆలయం. ప్రస్తుతం ఇది శిథిలమైపోయింది
రంగనాథాలయం

వృత్తాకారంలో ఉండే కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోను, దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పుతో బాట ఉంది.కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిథిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. మీర్ జుమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మీనార్లు ముఖ్యమైన కట్టడాలు. ఇంతే గాక జైలు, రంగ్ మహల్ ఉన్నాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు, ఇంకా చాలా చెరువులు, బావులున్నాయి.

గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండేవి. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి.

రంగనాథాలయం: ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (సా.శ.1557) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోట లోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని సా.శ.పదహైదవ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు.

మాధవరాయ ఆలయం: ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన సా.శ.పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తోస్తుంది. ఆలయనిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీతుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని సా.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో (దాదాపుగా 1501-1525 మధ్యకాలంలో) నిర్మించినట్లు చెప్పవచ్చు.

జనగణన

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 278 ఇళ్లతో, 1118 జనాభాతో 4278 హెక్టార్లలో విస్తరించి ఉంది.[6]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. బాలబడి, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాలలు గూడెంచెరువులో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, పాలీటెక్నిక్‌, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జమ్మలమడుగు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, కడప లోనూ ఉన్నాయి. మేనేజిమెంటు కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ప్రొద్దుటూరు లోనూ ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]
జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది.

భూమి వినియోగం

[మార్చు]

గండికోటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 1460 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1261 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 1340 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 6 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 69 హెక్టార్లు
  • బంజరు భూమి: 6 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 133 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 197 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 12 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

గండికోటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 12 హెక్టార్లు

ప్రధాన ఉత్పత్తులు

[మార్చు]

కంది, సీతాఫలం, పసుపు, (నిమ్మ తోటలు) )

చిత్ర మాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, p. 242, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015
  2. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  3. "గండికోట". Kadapa.info. Archived from the original on 2015-01-28. Retrieved 2019-08-15.
  4. "Tidings of the king: a translation and ethnohistorical analysis of the Rayavachakamu by Phillip B. Wagoner". Honolulu: University of Hawaii Press. 1993. pp. 138–139. ISBN 0-8248-1495-9. Archived from the original on 2011-06-05. Retrieved 2019-08-15.
  5. "గండికోట చెన్నకేశవుని స్తుతించిన చెన్నకేశవ". kadapa.info. Archived from the original on 2019-08-15. Retrieved 2019-08-15.
  6. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గండికోట&oldid=4267424" నుండి వెలికితీశారు