Jump to content

గలగల పారుతున్న గోదారిలా (పాట)

వికీపీడియా నుండి
"గలగల పారుతున్న గోదారిలా" పాట ఉన్న చిత్రం గౌరి (1974) ప్రకటన పత్రం

గలగల పారుతున్న గోదారిలా అనే పాట గౌరి (1974 సినిమా) లోనిది. ఈ చిత్రంలో కృష్ణ, జమున నటించారు. దాశరథి సాహిత్యం సమకూర్చిన ఈ పాటకు, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం దీన్ని పాడారు.

నేపథ్యం

[మార్చు]

జీవితం ఎలా సాగాలో, సస్యశ్యామలంగా ఉండే పల్లెసీమల్లో నిత్యం కనిపించే దృశ్యాలతో పోలుస్తూ కవి ప్రథమార్ధంలో వివరించారు. పల్లెలే దేశాభివృద్ధికి పట్టుగొమ్మలని, సత్యం, ధర్మం, న్యాయం, సేవలే జీవిత పరమార్థాలని ద్వితీయార్ధం‌లో వివరించారు.

పాటలోని సాహిత్యం

[మార్చు]

లా లా ల లా హే హే ఎ హె హే

గల గల పారుతున్న గోదారిలా
రెప రెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లని గాలిలా
ఆ పచ్చని పైరులా
ఈ జీవితం సాగనీ హాయిగా హే
గల గల పారుతున్న గోదారిలా

అందాల పందిరి వేసే ఈ తోటలూ
ఆ నింగి అంచులు చేరే ఆ బాటలూ
నాగలి పట్టే రైతులు
కడవలు మోసే కన్నెలు
బంగరు పంటలు సీమలు చూడరా హే
||గల గల||

దేశానికాయువు పోసే ఈ పల్లెలూ
చల్లంగ ఉండిన నాడే సౌభాగ్యమూ
సత్యం ధర్మం నిలుపుటే
న్యాయం కోసం పోరుటే
పేదల సేవలు చేయుటే జీవితం హే
||గల గల||

విశేషాలు

[మార్చు]

హొసె ఫెలిస్యనొ (José Feliciano) అనే స్పెనిష్ గాయకుడి "లిజన్ టు ద పోరింగ్ రెయ్న్" (Listen to the pouring rain) అనే 1962 నాటి ప్రేమగీతం ఆధారంగా, "బాంబే టు గోవా" అనే 1972 హిందీ చిత్రంలో, "లిజన్ టు ద పోరింగ్ రెయ్న్" అనే పాట కూర్చబడింది. ఆర్.డి.బర్మన్ సంగీత దర్శకుడిగా ఉన్న ఈ చిత్రంలో, పాట సాహిత్యం రాజేంద్ర క్రిషణ్ వ్రాయగా, ఉషా ఉతుప్ పాడారు. 1973లో "రాణీ ఔర్ జానీ" అనే హిందీ చిత్రానికి సంగీత దర్శకుడైన చెళ్ళపిళ్ళ సత్యం, "లిజన్ టు ద పోరింగ్ రెయ్న్" బాణీని ఆ చిత్రంలో హసరత్ జైపురి వ్రాసి, కిశోర్ కుమార్ పాడిన "మేరే దిల్ ఝూం ఝూం తూ గాయే జా" అనే పాటకు వాడుకున్నారు. తరువాత "గౌరి" చిత్రానికి స్వరాలు అందించిన సత్యం, ఈ బాణీని మరొకసారి ఈ పాటకు వాడారు.[1] ఈ చిత్రంలో "బాలూ"గారిని కిశోర్ కుమార్ గొంతును అనుకరిస్తూ పాడమని కోరగా, వారు తదనుగుణంగా ఆలపించారు.

"గౌరి" చిత్రం పరాజయం పాలైనప్పటికీ, ఈ పాట బహుళ ప్రజాదరణ పొందింది.[2]

దేశాభివృద్ధిని కాంక్షించే ఈ గీతాన్ని కొద్దిగా మార్చి, 2006లో విడుదలైన పోకిరి చిత్రంలో పొందుపరచారు. అయితే పోకిరి చిత్రంలో ఈ గీతం ప్రేయసి తన కోసం పడుతున్న బాధలో ప్రేమికుడికి హాయి ఉన్నదనే భావంతో కూర్చారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. HanumanReddy (3 July 2017). "Story behind the classic song from Gowri (1974)!". Cinemacinemacinema. Retrieved 25 January 2023.
  2. "Super Star Krishna: కథను మార్చకపోతే ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పిన కృష్ణ.. 32 ఏళ్ల తర్వాత మహేశ్ కూడా..!". ABN ఆంధ్రజ్యోతి. 15 December 2022. ప్రత్యేకం. Retrieved 25 January 2023.

వెలుపలి లంకెలు

[మార్చు]