Jump to content

ఘట్టమనేని కృష్ణ

వికీపీడియా నుండి
ఘట్టమనేని కృష్ణ
ఘట్టమనేని కృష్ణ
జననం
ఘట్టమనేని కృష్ణ

(1943-05-31)1943 మే 31
గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెం
మరణం2022 నవంబరు 15(2022-11-15) (వయసు 79)
హైదరాబాద్
మరణ కారణంకార్డియాక్ అరెస్ట్
ఇతర పేర్లుసూపర్ స్టార్
విద్యాసంస్థసి.ఆర్.రెడ్డి కళాశాల
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటుడు, దర్శకుడు, నిర్మాత, స్టూడియో అధినేత
రాజకీయ పార్టీకాంగ్రెస్
జీవిత భాగస్వామిఇందిర ( మ. 2022 సెప్టెంబరు 28 ),
విజయ నిర్మల ( మ. 2019 జూన్ 27 )
పిల్లలురమేష్ బాబు ( మ. 2022 జనవరి 8 )
పద్మజ
మంజుల ఘట్టమనేని
మహేష్ బాబు
ప్రియదర్శిని
తల్లిదండ్రులు
  • ఘట్టమనేని వీర రాఘవయ్య చౌదరి (తండ్రి)
  • నాగరత్నమ్మ (తల్లి)

ఘట్టమనేని కృష్ణ (1943 మే 31 - 2022 నవంబరు 15) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి, సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పాడు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశాడు.

కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జాన్రాలు పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశాడు. ఇందుకోసం మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తిచేసేవాడు.

తాను బి.ఎ. చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, దొరికిన ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించాడు. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. అతను అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30 వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలివచ్చారు. కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఉత్తమ నటునిగా నంది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది. అతనికి ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి. 1984 నుంచి కాంగ్రెస్ సమర్థకుడిగా వ్యవహరించిన కృష్ణ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాలు చేశాడు. 1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలుపొందాడు.

కృష్ణ కుటుంబం నుంచి కుమారులు మహేష్ బాబు, రమేష్ బాబు, కుమార్తె మంజుల, చిన్న అల్లుడు సుధీర్ బాబు సినిమా రంగంలోకి వచ్చారు. తోటి నటి అయిన విజయనిర్మలను 1969లో ప్రేమించి రెండవ పెళ్ళి చేసుకున్నాడు. కుమారుడు మహేష్ బాబు పలు విజయాలు అందుకుని ప్రేక్షకుల నుంచి సూపర్ స్టార్ అన్న తండ్రి బిరుదు పొందాడు. విజయ నిర్మల అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళా దర్శకులిగా నిలిచింది. 2010 దశకంలో కృష్ణ నటన నుంచి, రాజకీయాల నుంచి విరమించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

కృష్ణ 1943 మే 31న గుంటూరు జిల్లా, తెనాలి మండలములో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు.[1] అతనిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా, సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా కుదించాడు. చిన్నతనం నుంచి అతనికి ఎన్.టి.రామారావు అభిమాన నటుడు, పాతాళ భైరవి అభిమాన చిత్రం.[2] కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు. అతనికి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు.[3] అతని తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీరును చేయాలన్న కోరిక ఉండేది. అందుకోసం ఇంటర్మీడియట్‌లో ఎం.పి.సి. సీటు కోసం ప్రయత్నించి, గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎం.పి.సి. గ్రూపుతో ఇంటర్ చేరాడు. అక్కడ మూడు నెలలే చదివి, ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలకు మారాడు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తిచేసి తర్వాత బీఎస్సీ చదివాడు. సి.ఆర్.రెడ్డి కళాశాలలో కృష్ణ, తర్వాతి కాలంలో సినిమాల్లో నటునిగా ఎదిగిన మురళీమోహన్ క్లాస్‌మేట్లు, మంచి స్నేహితులు.[2] కృష్ణ డిగ్రీ చదువుతూండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలన్న అభిలాష పెంపొందించుకున్నాడు.[3] డిగ్రీ పూర్తిచేశాకా ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించినా కృష్ణకు సీటు రాలేదు. దాంతో కృష్ణ విద్యార్థి జీవితం ముగిసింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం అయింది.[4] 1965 అక్టోబర్ 13 నాటికి పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టాడు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి, ప్రస్తుతం సినిమా నిర్మాణం చేస్తున్నాడు. చిన్న కొడుకు మహేష్ బాబు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటునిగా స్థిరపడ్డాడు. కృష్ణ కుటుంబం నుంచి కుమార్తె మంజుల నటన, నిర్మాణం, దర్శకత్వం చేస్తుంది.[5] చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా పేరుతెచ్చుకుంటున్నాడు.[6] మరో అల్లుడు గల్లా జయదేవ్ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.[7]

1967లో బాపు-రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణ కథానాయకుడిగా, విజయనిర్మల కథానాయకిగా నటించింది.[నోట్స్ 1] తర్వాత సర్కార్ ఎక్స్‌ప్రెస్ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ విజయనిర్మలను ప్రేమిస్తున్నానని పెళ్ళిచేసుకుంటానని చెప్పాడు. పరస్పర అంగీకారంతో మరో రెండేళ్ళకు 1969లో తిరుపతిలో పెళ్ళిచేసుకున్నారు.[8] అప్పటికే వివాహితులైన కృష్ణకు, విజయనిర్మలకూ ఇది రెండవ పెళ్ళి. తోటి నటిగానూ, దర్శకురాలిగానూ విజయనిర్మల సినీ రంగంలో రాణించింది. వీటిలో పలు సినిమాల్లో కృష్ణ కథానాయకుడిగా చేశాడు. రెండవ పెళ్ళి కృష్ణ మొదటి భార్య పిల్లలు, విజయనిర్మల కుమారుడు నరేష్‌లపై ప్రభావం చూపింది. సామాజికంగా వారిని హేళన చేయడం వంటి అంశాలు తర్వాత కాలంలో గుర్తుచేసుకున్నారు. అయితే మొదటి భార్య ఇందిర విజయనిర్మలను కుటుంబ సభ్యురాలిగా స్వీకరించడమే కాక ఆమెను ఆదరించింది. ఇందిర పిల్లలైన మహేష్, ప్రియదర్శిని తరచు విజయనిర్మల ఇంటికి వచ్చేవారని, స్వంత కొడుకు నరేష్‌కీ వాళ్ళకీ ఏనాడూ భేదం చూడలేదని విజయనిర్మల చెప్తారు. కృష్ణ-ఇందిరల కుమార్తె మంజుల పెళ్ళి సమయంలో కూడా ఇందిర తనకు అభిమానంగా బాధ్యతలు అప్పగించిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకుంటుంది.[8]

సినిమాల్లో కృష్ణ 90వ దశకం వరకూ విపరీతమైన బిజీ ఉండేది. కొన్ని సంవత్సరాల పాటు మూడు షిఫ్టులు పనిచేసేవాడు. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే కాక మూడవ షిఫ్ట్ రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఉండేది. చివరికి నిద్రపోతున్న సమయంలో కాస్ట్యూమ్స్ వేసుకుని పడుకుంటే నిద్రిస్తున్న సన్నివేశాలు చిత్రీకరించుకున్న సందర్భాలు ఉన్నాయి.[9] విపరీతమైన ఈ బిజీ వల్ల కుటుంబంతోనూ, ప్రధానంగా పిల్లలతోనూ సమయాన్ని గడపలేకపోయేవాడు.[10]

సినీ ప్రస్థానం

[మార్చు]

సినిమా ప్రయత్నాలు

[మార్చు]

డిగ్రీ పూర్తై, ఇంజనీరింగ్ సీటు రాకపోవడంతో అప్పటికే సినిమాల్లో హీరో కావాలని ఆశిస్తున్న తండ్రి అనుమతి తీసుకుని సినిమా ప్రయత్నాలు చేశాడు. కృష్ణ ఇష్టాన్ని అనుసరించి అతని తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వారికి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మద్రాసు పంపాడు.[2] అప్పటి తెలుగు సినీ రంగానికి కేంద్రమైన మద్రాసులో తన స్వంత ప్రాంతమైన తెనాలి పట్టణానికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి వంటివారిని కలిసి తన ఉద్దేశాన్ని చెప్పాడు. అప్పటికి కృష్ణ వయసు రీత్యా చిన్నవాడు కావడంతో, కొంతకాలం ఆగి మద్రాసుకు తిరిగిరమ్మని వారు సలహా ఇచ్చారు.[3] దాంతో కృష్ణ నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించాడు. మద్రాసులోనే "చేసిన పాపం కాశీకి వెళ్ళనా?" నాటకంలో శోభన్ బాబుతో కలిసి నటించాడు.[11] తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వంలో ప్రజానాట్యమండలి వారు విజయవాడ జింఖానా మైదానంలో ప్రదర్శించిన ఛైర్మన్ నాటకంలో ఛైర్మన్ కుమారుడి పాత్ర పోషించాడు.[12][3] తిరిగి మద్రాసు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించగా ఎల్వీ ప్రసాద్ తీస్తున్న కొడుకులు కోడళ్ళు అన్న సినిమాలో ఒక పాత్రకు ఎంపికచేశారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మద్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన ప్రాక్టీసు చేయమని స్నేహితులు సలహా ఇస్తే వేషాల కోసం కష్టాలు పడడం ఏమిటి? అదృష్టం ఉంటే వేషాలే వెతుక్కుంటూ వస్తాయని కొట్టిపారేసేవాడు. సినిమా ప్రయత్నాలు చేస్తున్న దశలోనూ ఇబ్బందులేమీ పడలేదు. ఎప్పుడు డబ్బు అవసరమైన ఇంటికి ఉత్తరం రాస్తే, కృష్ణ తల్లి కావాల్సినంత డబ్బు పంపేది. రోజూ సెకండ్ షో సినిమాలు చూస్తూ, పగలు సినిమాల్లో వేషాల కోసం తెలిసినవారిని కలుస్తూ ప్రయత్నాలు చేశాడు.[13] కొంగర జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు (1962) సినిమాలో చిన్న పాత్ర పోషించాడు. కులగోత్రాలు (1962), పరువు ప్రతిష్ఠ (1963), మురళీకృష్ణ (1964) సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. కాదలిక్క నేరమిల్లై అన్న తమిళ సినిమా కోసం దర్శక నిర్మాత సి.వి.శ్రీధర్ కొత్త నటులను వెతుకుతూ కృష్ణను కథానాయకుడిగా ఎంపిక చేశాడు. అయితే కృష్ణకు తమిళం రాకపోవడంతో అవకాశం పోయింది. దీనితో కృష్ణ తెనాలి తిరిగి వెళ్ళిపోయాడు.[3]

తొలి అవకాశాలు, విజయం (1964-1967)

[మార్చు]
కృష్ణ కెరీర్‌ని మలుపుతిప్పిన గూఢచారి 116

1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న తేనె మనసులు కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలు పంపించాడు. పలు వడపోతల తర్వాత మద్రాసు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆదుర్తి కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకడిగా ఎంపికచేశాడు.[నోట్స్ 2][14] సంభాషణలు చెప్పడం, డ్యాన్స్ చేయడం వంటి పలు అంశాల్లో శిక్షణనిచ్చారు. దీనితో పాటు తర్వాత ఆదుర్తి తీయబోయే మరో సినిమాలో కూడా నటించేలా కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. కొత్త నటులుగా కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి నటించిన తేనె మనసులు సినిమాకి కలర్‌లో చిత్రీకరించిన తొలి తెలుగు సాంఘిక చిత్రంగా కూడా ప్రత్యేకత ఉంది. ఈ సినిమా సాగుతుండగానే రషెస్ చూసిన పంపిణీదారులు కృష్ణ నటన బాగాలేదని తొలగించెయ్యమని ఒత్తిడి తెచ్చినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు.[15] 1965 మార్చి 31న విడుదలై విజయం సాధించింది. ఆరు నెలల తర్వాత ఆదుర్తి సుబ్బారావు ప్రారంభించిన కన్నెమనసులు సినిమాలో ముందస్తు ఒప్పందం ప్రకారం తేనె మనసులోని హీరో హీరోయిన్లతో పాటు కృష్ణ నటించాడు.[3]

హీరోగా రెండో సినిమా అయిన కన్నెమనుసుల్లో నటిస్తున్న సమయంలోనే నిర్మిస్తున్న గూఢచారి 116 సినిమాలో హీరోగా కృష్ణకు నిర్మాత డూండీ అవకాశం ఇచ్చాడు. తేనెమనసులు సినిమాలో స్కూటర్‌తో కారును ఛేజ్ చేస్తూ, స్కూటర్‌ను వదిలేసి కారు మీదికి జంప్ చేసే సన్నివేశం చూసి, డూప్ లేకుండా కృష్ణ ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న డూండీ తన జేమ్స్‌బాండ్ చిత్రానికి హీరోగా ఎంపికచేశాడు.[16] రెండు సినిమాలూ దాదాపు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకుని, రెండూ 1966లోనే విడదలయ్యాయి. కన్నెమనసులు జూలై 22న విడుదలై యావరేజిగా నిలిచింది. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుతిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్‌బాండ్ తరహా సినిమా.[నోట్స్ 3] కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. 1967లో కృష్ణ నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఇద్దరు మొనగాళ్లు అన్న జానపద చిత్రం, బాపు-రమణల తొలి చిత్రం, విజయనిర్మలతో నటించిన మొదటి సినిమా అయిన సాక్షి, తర్వాతి కాలంలో కృష్ణతో అనేక విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు వి. రామచంద్రరావుతో తొలి కాంబినేషన్ మరపురాని కథ ఉన్నాయి.[3] ఈ దశలోనే కృష్ణ వచ్చిన అవకాశాలన్నీ అంగీకరిస్తూ సినిమాలు చేశాడు. "ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నానో చూసుకునే తీరిక కూడా ఉండేది కాదు" అని కృష్ణ చెప్పుకున్నాడు.[17] గూఢచారి 116 వల్ల కృష్ణకు వచ్చిన ఇమేజీ ప్రభావం చాన్నాళ్ళు ఉంది. 2 దశాబ్దాల్లో మరో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేసిన కృష్ణకు దాదాపు అన్నీ విజయాన్ని సంపాదించిపెట్టాయి.[18]

తారాపథంలోకి (1968-1975)

[మార్చు]
మోసగాళ్ళకు మోసగాడు: తొలి తెలుగు కౌబాయ్ సినిమా. స్వంత ఇమేజ్, స్టార్‌డమ్ సాధించేందుకు స్థాపించిన నిర్మాణ సంస్థ పద్మాలయా రెండవ చిత్రంగా విడుదలై కృష్ణకు స్టార్‌డం సాధించిపెట్టిన సినిమా.

1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 1969లో రికార్డు స్థాయిలో 19 సినిమాలు విడుదలయ్యాయి. 1970లో 16 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు, 1975లో 8 సినిమాలు విడుదలయ్యాయి. ఈ దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల చొప్పున విరామం ఎరుగక సినిమాలు చేయడం ప్రారంభించాడు. సినిమా అవకాశాల మీద అవకాశాలు వస్తున్నా, విజయవంతం అవుతున్నా అప్పటివరకు నటునిగానే ఉన్నానని భావించిన కృష్ణ తనకు స్టార్‌డం తెచ్చిపెట్టే సినిమాలు తీయాలని ఆశించి 1970లో తన స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయా పిక్చర్స్ ప్రారంభించాడు.[19] కృష్ణ తమ్ముళ్ళు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులు నిర్మాతలుగా వ్యవహరిస్తూ నిర్మాణ వ్యవహారాలు పర్యవేక్షించేవారు. పద్మాలయా వారి మొదటి సినిమాగా అగ్నిపరీక్ష సినిమా నిర్మితమైంది. ఇది పెద్ద విజయం సాధించలేదు. అయితే రెండవ సినిమాగా 1971లో తీసిన మోసగాళ్ళకు మోసగాడు మాత్రం భారీ విజయాన్ని అందుకుని, సాహసిగా కృష్ణకు పేరును తెచ్చిపెట్టింది. మోసగాళ్ళకు మోసగాడు సినమా ఆంగ్లంలోకి ట్రెజర్ హంట్ పేరిట అనువాదమై, 123 దేశాల్లో విడుదలయ్యి, మంచి విజయాన్ని సాధించింది.[20] కృష్ణ ఆశించిన విధంగా అతనికి స్టార్ హోదా సాధించిపెట్టింది. 1972లో నటుడు ప్రభాకర రెడ్డిని భాగస్వామిగా తీసుకుని కుటుంబ కథాచిత్రమైన పండంటి కాపురం నిర్మించాడు. ఇదీ మంచి విజయాన్ని సాధించింది. 1974లో స్వంత బ్యానర్‌పై అల్లూరి సీతారామరాజు సినిమా తీశాడు.[3] 1973లోనే కృష్ణ, విజయనిర్మల కలిసి విజయకృష్ణా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి విజయనిర్మల దర్శకురాలిగా తొలి సినిమా మలయాళంలోనూ, మలి చిత్రం తెలుగులోనూ తీశారు. విజయనిర్మల తెలుగులో కృష్ణ, తాను ప్రధాన పాత్రలుగా తీసిన తొలి సినిమా నవలా చిత్రం మీనా - మంచి విజయాన్ని సాధించింది.[21] ఈ దశలో కృష్ణకు మంచి విజయాలు సాధించిపెట్టిన మరో జాన్రా - క్రైం సినిమాలు. 1968-1970 మధ్యకాలంలో పలు క్రైం సినిమాలు చేసినా 1970లో వచ్చిన పగ సాధిస్తా సినిమా ఈ జాన్రాలో కృష్ణ దశ మార్చింది.[22] దీని తర్వాత రెండేళ్ళలో కృష్ణ నటించిన ఎనిమిది క్రైం సినిమాలు విడుదలయ్యాయంటే దీని ప్రభావం అర్థం చేసుకోవచ్చు.[23]

సినిమాలంటే నాకు పిచ్చి ప్రేమ. నచ్చి చేసే పనే కదా..? అందుకే విసుగు రాలేదు. పైగా సినిమా సినిమాకీ వాటిపై ప్రేమపెరిగింది

-ఘట్టమనేని కృష్ణ

హాలీవుడ్‌లో ప్రఖ్యాతి చెందిన కౌబాయ్ జాన్రాను తెలుగులోకి తీసుకువస్తూ కృష్ణ స్వంత నిర్మాణంలో తీసిన మోసగాళ్ళకు మోసగాడు,[24] ప్రముఖ బ్రిటీష్ వ్యతిరేక విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తీసిన అల్లూరి సీతారామరాజు[25] సినిమాలు కృష్ణ కెరీర్‌కు మరింత సాయపడ్డాయి. భారీ బడ్జెట్‌లో తీసిన ఈ సినిమాలు నిర్మాణ దశలో ఉండగా పలు అవాంతరాలు ఎదురయ్యాయి. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని "విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు" పేరిట సినిమాగా తీస్తానని 1957లోనే ప్రకటించి, తర్వాత స్క్రిప్టును పక్కన పెట్టి ఎన్.టి.రామారావు తీయకుండా తాత్సారం చేస్తూండడంతో కృష్ణ నిర్మించాడు.[26] ఎన్.టి.రామారావు కృష్ణను ఆ సబ్జెక్టు ప్రజాదరణ పొందలేదని, తీయవద్దని వారించినా వినలేదు. అయితే ఆ అంశంపై వారిద్దరి నడుమ అభిప్రాయ భేదాలు తలెత్తాయి.[25][27] మోసగాళ్ళకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు సినిమాలను అప్పటి సినీ పరిశ్రమ లెక్కల ప్రకారం భారీ బడ్జెట్ సినిమాలకు రెట్టింపు బడ్జెట్‌తో నిర్మించాడు.[3] మోసగాళ్ళకు మోసగాడు సినిమాను థార్ ఎడారి, రాజస్థాన్ కోటలు, పాకిస్తాన్, టిబెట్ సరిహద్దులు వంటి ప్రాంతాలకు వెళ్ళి చిత్రీకరించారు. ఈ సినిమాలు నిర్మాణమవుతూండగా పలువురు పరిశ్రమ పెద్దలు ఇవి కృష్ణను, పద్మాలయా ప్రొడక్షన్స్‌ను నష్టాల్లో ముంచేస్తాయని చెప్పిన జోస్యాలు వమ్మయ్యేలా అనూహ్య విజయాలు సాధించాయి.[24][25] అల్లూరి సీతారామరాజు భారీ విజయాన్ని అందుకున్నాకా 1974లోనూ, 1975లోనూ కృష్ణ కథానాయకుడిగా విడుదలైన పలు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు సినిమాను విడుదల కాకముందే చూసిన చక్రపాణి, సినిమా చాలా బాగా వచ్చిందనీ, ఇంతటి మహోన్నతమైన పాత్రలో చూసిన ప్రేక్షకులు మిగతా పాత్రల్లో చూసి కృష్ణని అంగీకరించలేరనీ, అలా ఓ పది సినిమాల వరకూ ఫ్లాపవుతాయని చెప్పిన జోస్యం నిజమైంది.[28] అలా అల్లూరి సీతారామరాజు ప్రభంజనంలో కొట్టుకుపోయిన సినిమాల్లో విజయనిర్మల దర్శకురాలిగా కృష్ణ, విజయనిర్మల ప్రధానపాత్రల్లో తీసిన దేవదాసు సినిమా ఒకటి. కొత్త సాంకేతికత జోడించి దేవదాసు కథ మళ్ళీ తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న విజయనిర్మల నమ్మకం వమ్మయింది. అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు తన దేవదాసు సినిమా హక్కులు కొని మళ్ళీ విడుదల చేయడంతో నాగేశ్వరరావు దేవదాసు మళ్ళీ హిట్ అయి కొత్త సినిమా బాగా దెబ్బతింది.[29] అయితే కృష్ణ, విజయనిర్మల ఈ సినిమా పరాజయం పాలుకావడంతో చాలా బాధపడ్డారు.[నోట్స్ 4][30]

పౌరాణికాల్లో నందమూరి తారక రామారావు, సాంఘికాల్లో అక్కినేని నాగేశ్వరరావు, జానపదాల్లో కాంతారావు అప్పటికే సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని ఉన్న స్థితిలో సినిమాల్లో అడుగుపెట్టిన కృష్ణ 1975 నాటికల్లా అగ్ర కథానాయకునిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు.[31] ఈ దశలో అగ్రతారలైన ఎన్టీఆర్ (స్త్రీ జన్మ, నిలువు దోపిడీ, దేవుడు చేసిన మనుషులు,[నోట్స్ 5] విచిత్ర కుటుంబం), నాగేశ్వరరావు (అక్కా చెల్లెలు, మంచి కుటుంబం)లు సహా పలువురు తోటి హీరోలతో అనేక మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. కృష్ణ యాక్షన్ సినిమాల ద్వారా అగ్రపథాన్ని చేరుకుంటున్నా సమాంతరంగా ఉండమ్మా బొట్టు పెడతా, పండంటి కాపురం, గాజుల కిష్టయ్య, దేవుడు చేసిన మనుషులు, మాయదారి మల్లిగాడు లాంటి కుటుంబ కథా చిత్రాలు కూడా చేశాడు.[31] మోసగాళ్ళకు మోసగాడు ఘన విజయం సాధించడంతో పలువురు కౌబాయ్ సినిమాల నిర్మాణం చేపట్టారు. వాటిలో అధిక శాతం సినిమాల్లో హీరోగా కృష్ణే నటించాడు.[32] కృష్ణ 100వ చిత్రమైన అల్లూరి సీతారామరాజు 1974లో విడుదలైంది. హీరోగా తొలి సినిమా విడుదలైన 9 సంవత్సరాలకల్లా కృష్ణ వంద సినిమాలు పూర్తిచేసుకున్నాడు.[3]

మరిన్ని విజయాల్లోకి (1976-1989)

[మార్చు]
కృష్ణ అర్జునుడిగా నటించిన కురుక్షేత్రం సినిమా 1977 సంక్రాంతికి విడుదలైంది. మహాభారత కథాంశంతోనే వచ్చిన ఎన్టీఆర్ దానవీరశూర కర్ణ సినిమాతో పోటీపడి సంక్రాంతికి విడుదలై ఫ్లాప్ అయింది.

అల్లూరి సీతారామరాజు సినిమా అత్యంత విజయవంతమయ్యాకా 1974, 1975లో కృష్ణ చేసిన పలు సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో తాను అంతకుముందు కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యాకా మరెవ్వరూ సినిమాలు తీయడానికి ముందుకురాలేదు. కృష్ణ కెరీర్ ఒక్కసారిగా స్తబ్దుగా అయిపోయిన దశలో తన స్వంత నిర్మాణ సంస్థలో పాడిపంటలు సినిమా తీసి 1976 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటివరకూ ప్రధానంగా ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు మధ్యనే ప్రధానంగా నడిచిన సంక్రాంతి సినిమాల పోటీలోకి కృష్ణ 1976లో పాడిపంటలు సినిమాతో దిగాడు.[నోట్స్ 6] 1976 సంక్రాంతికి రామారావు వేములవాడ భీమకవి, శోభన్ బాబు పిచ్చిమారాజు సినిమాలతో పోటీగా పాడిపంటలు విడుదలై సంక్రాంతి సినిమాగా విజయాన్ని దక్కించుకుంది.[33] అలానే మందకొడిగా సాగుతున్న కృష్ణ కెరీర్ మళ్ళీ ఊపందుకునేలా చేసింది.[34] 1977 సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు కృష్ణ అర్జునుడిగా కురుక్షేత్రం సినిమా తీయడం మొదలుపెట్టాడు. అదే సమయానికి విడుదల చేసేందుకు మహా భారతం కథాంశంగా కర్ణుడు కథానాయకుడిగా నందమూరి తారక రామారావు తీసిన దాన వీర శూర కర్ణ సినిమా తీస్తూండడం వివాదానికి దారితీసింది. దానవీరశూర కర్ణ సినిమా నిర్మాణం తన జీవితాశయమని, ఇలాంటి సందర్భంలో కురుక్షేత్రం తీయడం సరికాదని రామారావు కృష్ణను పిలిచి చెప్పాడు. అయితే కురుక్షేత్రం నిర్మాత అప్పటికే పెట్టుబడి పెట్టివుండడంతో వెనక్కి తగ్గలేదు.[35] ఓ ముగ్గురు నటులను మినహాయించి కురుక్షేత్రంలో నటించేవారు ఎవరికీ దానవీరశూర కర్ణలో నటించే వీలు లేదని రామారావు పట్టుబట్టాడు.[36] కురుక్షేత్రంలో ముఖ్యపాత్రలను శోభన్ బాబు, కృష్ణంరాజు, నాగభూషణం వంటివారు పోషించారు. హాలీవుడ్‌లో ఎపిక్ సినిమాల తరహాలో భారీ సెట్టింగులు, సాంకేతిక విలువలతో అత్యంత భారీ బడ్జెట్‌లో సినిమా నిర్మాణమయింది. నిర్మాణ దశలో కృష్ణ కూడా భాగస్వామి అయ్యాడు. పౌరాణిక బ్రహ్మగా పేరుపడ్డ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం, అల్లూరి సీతారామరాజు సంభాషణల రచయిత త్రిపురనేని మహారథి రచన, సాలూరి రాజేశ్వరరావు సంగీతం చేశారు. ఇన్ని చేసినా వివిధ పాత్రల్లో ఎన్టీఆర్, శకునిగా ధూళిపాళల నటన, కొండవీటి వేంకటకవి డైలాగుల బలంతో దాన వీర శూర కర్ణ సినిమానే ఘన విజయం సాధించింది. కురుక్షేత్రం అనుకున్న రీతిలో విజయవంతం కాలేదు.[37][38] తర్వాత ఇంద్రధనుస్సు (1978), భలే కృష్ణుడు (1980), ఊరికి మొనగాడు (1981), బంగారు భూమి (1982), బెజవాడ బెబ్బులి (1983), ఇద్దరు దొంగలు (1984), అగ్నిపర్వతం (1985), తండ్రీ కొడుకుల ఛాలెంజ్ (1987), కలియుగ కృష్ణుడు (1988), రాజకీయ చదరంగం (1989) సినిమాలను సంక్రాంతి పోటీలో విడుదల చేశాడు.[33]

కృష్ణ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నటించిన సింహాసనం సినిమా ఘన విజయం సాధించింది. భారీ ఎత్తున నిర్మించిన ఈ జానపద చిత్రం తెలుగులో తొలి సినిమా స్కోప్ సినిమా.

1978-1985 మధ్యకాలం కృష్ణ కెరీర్‌లో ఉచ్ఛదశ నడిచింది. ఈ దశలో కూడా అత్యంత వేగంగా సినిమాలు పూర్తిచేశాడు. 1977 నుంచి పదేళ్ళు లెక్క వేసుకున్నా హీరోగా మరో 117 సినిమాల్లో నటించాడు. 1977 నుంచి 1989 మధ్య కాలంలో యాక్షన్ చిత్రాల దర్శకత్వంలో పెద్ద పేరు పొందిన కె.ఎస్.ఆర్.దాస్‌ కాంబినేషన్‌లోనే 20 సినిమాల్లో నటించాడు. ఆ కాలంలోనే మరో 20 పైచిలుకు సినిమాలు తన భార్య విజయనిర్మల దర్శకత్వంలో చేశాడు. యాక్షన్ హీరోగా తనకున్న ఇమేజిని కొనసాగిస్తూనే కుటుంబ కథా చిత్రాల్లోనూ నటించాడు. సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (హేమాహేమీలు,[నోట్స్ 7][36] గురు శిష్యులు) తోటి హీరోలు శోభన్‌బాబు (కృష్ణార్జునులు, ఇద్దరు దొంగలు), కృష్ణంరాజు (మనుషులు చేసిన దొంగలు, అడవి సింహాలు, విశ్వనాధ నాయకుడు) అప్పుడప్పుడే ఎదుగుతున్న రజినీకాంత్ (అన్నదమ్ముల సవాల్, రామ్ రాబర్ట్ రహీమ్), మోహన్ బాబు (ముగ్గురూ ముగ్గురే) వంటి వారందరితోనూ అనేక మల్టీస్టారర్ సినిమాలు చేయడం కొనసాగించాడు. ఎన్టీ రామారావుతో అప్పటికే విభేదాలు ఏర్పడ్డా ఇద్దరూ వాటిని పక్కన పెట్టి కృష్ణ-రామారావు మల్టీస్టారర్ కాంబినేషన్‌లో వయ్యారి భామలు వగలమారి భర్తలు సినిమాలో నటించారు.[39] కటకటాల రుద్రయ్య (1978), ఖైదీ (1983) వంటి పలు సినిమాలు అసలు కృష్ణ నటించాల్సి వచ్చినా వివిధ కారణాల వల్ల వదులుకున్నాడు.[40] కృష్ణంరాజు కెరీర్‌ను కటకటాల రుద్రయ్య, చిరంజీవి కెరీర్‌ను ఖైదీ మలుపుతిప్పే స్థాయి విజయాలు అయ్యాయి. 1982లో భవనం వెంకట్రామ్ ప్రభుత్వం హైదరాబాద్‌లో పద్మాలయా సంస్థకు స్టూడియో నిర్మించుకోవడానికి జూబ్లీహిల్స్‌లో 10 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. 1983 నవంబరు 21న ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు చేతుల మీదుగా పద్మాలయా స్టూడియోస్ ప్రారంభం కావడంతో కృష్ణ స్టూడియో యజమాని అయ్యాడు.[41]

1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్టీ రామారావు ఏడాదిలోపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం, రాజీవ్ గాంధీ సహకారంతో కాంగ్రెస్‌తో అనుబంధం ఏర్పడడంతో కృష్ణ ఈ దశలో రాజకీయ నేపథ్యంలో రాజకీయ నేపథ్యంలోని పలు సినిమాల్లో నటించాడు. ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధి, నా పిలుపే ప్రభంజనం, సాహసమే నా ఊపిరి వంటి సినిమాలతో పాటుగా,[42] మలయాళంలో విజయవంతమైన సినిమాను తెలుగు రాజకీయ వాతావరణానికి అనుగుణంగా అడాప్ట్ చేసిన ఈనాడు సినిమా సరిగ్గా 1982లో ఎన్నికలకు ముందు విడుదలై ఘన విజయాన్ని సాధించింది.[43] ఈనాడు సినిమాతో కృష్ణ 200 సినిమాల మైలురాయిని చేరుకున్నాడు.[3] సింహాసనం సినిమాను స్వంత బ్యానర్‌లో తొలిసారి తానే దర్శకత్వం చేపట్టి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. పెద్ద సెట్‌లతో సినిమాను సాంకేతికంగా ఉన్నతంగా తీశాడు. విడుదలైన మొదటి వారంలోనే రూ.కోటి 51 లక్షలకు పైగా వసూళ్ళు సాధించి సంచలనం సృష్టించింది. విశాఖపట్టణం చిత్రాలయ థియేటర్‌లో వందరోజులు, విజయవాడ రాజ్ థియేటర్‌లో 53 రోజులు వరుసగా ఒక్కరోజు కూడా విడువకుండా హౌస్ ఫుల్ అయి మరో రికార్డు సృష్టించింది.[44] సింహాసనం సినిమా ద్విభాషా చిత్రం, సింఘాసన్‌గా హిందీలో తానే నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టి జీతేంద్ర కథానాయకుడిగా విడుదల చేశాడు. అయితే ఇది ఫ్లాప్‌గా మిగిలింది.[45] ఈ దశలో సింహాసనం, అగ్నిపర్వతం, వజ్రాయుధం, ఊరికి మొనగాడు, ఈనాడు వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి. ఇవి కాక మరెన్నో సినిమాలు కమర్షియల్ విజయాన్ని సాధించి కృష్ణ సినీ జీవితంలో ఈ దశను అత్యున్నత స్థాయిగా నిలిపాయి.

తర్వాతి కెరీర్ (1990లు - 2020లు)

[మార్చు]

1989 నాటికే 274 సినిమాలు పూర్తిచేసుకున్న కృష్ణ 90వ దశకంలో తన శైలికి భిన్నంగా కేవలం 44 సినిమాలే చేయగలిగాడు. నట జీవితంలో తొలిసారి గ్యాప్ తీసుకున్నదీ ఈ సమయంలోనే. 1987లో కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబును హీరోగా పరిచయం చేశాడు. కృష్ణ పద్మాలయా పిక్చర్స్ నిర్మాణంలో రమేష్ బాబుతో తీసిన అతని మూడవ సినిమా బజారు రౌడీ పెద్ద హిట్ అయినా అవకాశాన్ని అందిపుచ్చుకోకపోవడంతో అతని కెరీర్ దెబ్బతినడమూ కృష్ణ మీద ప్రభావం చూపింది. 1990–1992 సంవత్సరాల్లో కృష్ణ కెరీర్ అపజయాలతో సాగింది. ఫలితంగా కెరీర్ ప్రారంభించిన పాతికేళ్ళకు 1992లో కేవలం ఒకే ఒక్క సినిమా (రక్తతర్పణం) విడుదలైంది. 1993లో పచ్చని సంసారం, వారసుడు సినిమాలు అనూహ్యమైన విజయాన్ని సాధించాయి.[46] 1995 మధ్యకాలంలో నెంబర్ వన్, అమ్మదొంగా సినిమాలూ విజయాన్ని సాధించాయి. 1990వ దశకం చివర్లో పద్మాలయా సంస్థ హిందీలో నిర్మించిన సూర్యవంశం సినిమా భారీ పరాజయం పాలయ్యేసరికి ఆర్థికంగానూ దెబ్బతిన్నాడు.[30] ఇక 2000 దశకంలో ఏడాదికి ఒకటి నుంచి మూడు సినిమాల వరకు నటించసాగాడు. వీటిలో కొన్ని ముఖ్యపాత్రలు కాగా, మరికొన్ని ప్రాధాన్యమున్న సహాయ పాత్రలు.[నోట్స్ 8][47]

కుటుంబ సభ్యుల సినీ రంగ ప్రవేశం, రిటైర్‌మెంట్

[మార్చు]
కృష్ణ నటవారసుడిగా తెలుగు సినిమా రంగంలోకి వచ్చిన రెండో కొడుకు మహేష్ బాబు అతని సూపర్ స్టార్ అన్న బిరుదునీ పంచుకున్నాడు.

కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా రాణించలేదు. 90ల్లో కొన్ని సినిమాల్లో హీరోగా ప్రయత్నించి, తర్వాతి దశలో సినీ నిర్మాతగా వ్యవహరించాడు. 1987–90 మధ్యకాలంలో దాదాపు తన ఏడు సినిమాల్లో బాలనటుడిగా నటించిన రెండో కొడుకు మహేష్ బాబు 1999లో రాజకుమారుడు సినిమాతో పరిచయం అయ్యాడు.[48] ఈ సినిమాలో కృష్ణ కూడా నటించాడు. కృష్ణ నటవారసుడిగా సినిమా కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు, స్థిరమైన విజయాలను అందుకుని తెలుగు సినిమా రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. మంచి విజయాలు సాధించడంతో పాటు తన నటనకు అవార్డులు కూడా అందుకున్నాడు. ఏడాదికి సగటున పది సినిమాల్లో నటిస్తూ సాగిన కృష్ణ శైలికి భిన్నంగా మహేష్ చాలా నిదానంగా, గ్యాప్ తీసుకుంటూ సినిమాలు చేస్తూంటాడు.[49] కృష్ణను వ్యవహరించినట్టే మహేష్ బాబును కూడా సినిమా వర్గాలు, అభిమానులు సూపర్ స్టార్ అని పిలవడం ప్రారంభించారు. మహేష్ బాబు కెరీర్ తొలినాళ్ళలో రాజకుమారుడు, వంశీ సినిమాల్లో ముఖ్యపాత్రలు ధరించిన కృష్ణ,[50] ఆపైన కెరీర్ ఊపందుకున్నాకా అతనితో కలిసి నటించలేదు.

1998లో సమ్మర్ ఇన్ బెత్లహేం అన్న మలయాళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణ కుమార్తె మంజుల 2002లో తానే నిర్మించి, ప్రధాన పాత్రలో కూడా నటించిన షో చిత్రానికి నిర్మాతగా జాతీయ పురస్కారాన్ని, నంది అవార్డునీ అందుకుంది.[51] మంజుల పూర్తిస్థాయిలో సినిమా హీరోయిన్‌గా కెరీర్ మలుచుకునే ప్రయత్నాలు చేసినప్పుడు తమ అభిమాన నటుడి కుమార్తె హీరోయిన్ కావడాన్ని జీర్ణించుకోలేని కృష్ణ అభిమానులు కొందరు తీవ్రమైన ఆందోళనలు చేసి ఒత్తిడి తెచ్చారు.[30] కుటుంబ గౌరవం పేరిట తనకు ఇష్టమైన కెరీర్ పక్కన పెట్టాల్సి వచ్చిందని మంజుల తర్వాతి కాలంలో బాధపడింది.[5] ప్రస్తుతం ఆమె సినిమా నిర్మాణం, నటన, దర్శకత్వం కూడా చేస్తోంది. 2012లో కృష్ణ మూడవ అల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా తొలి సినిమా చేశాడు. అతను కూడా తెలుగు సినీ రంగంలో హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు.[52]

2017 సంక్రాంతికి కృష్ణ 50 ఏళ్ళకు పైగా సాగిన సుదీర్ఘమైన తన సినిమా కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.[53] అయితే భవిష్యత్తులో తన కొడుకు మహేష్ బాబు, మనవడు గౌతం కృష్ణలతో కలిసి నటించే అవకాశం వస్తే మాత్రం బావుంటుందన్న కోర్కెనీ వెల్లడించాడు.[54]

రాజకీయ రంగం

[మార్చు]

1972లో జైఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కృష్ణ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చాడు.[55] 1980ల్లో ఎన్.టి.రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కావడంతో తెలుగు నాట కూడా సినిమా రంగంలోని గ్లామర్‌కు రాజకీయాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. 1982 డిసెంబరు 17న కృష్ణ కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం "ఈనాడు" సినిమా అప్పుడే రంగప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ప్రచారానికి అనుకూలంగా ఉంది. ఎన్నికలు మూడువారాల్లో ఉన్న స్థితిలో విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం ప్రభంజనంలో తనవంతు చిన్న పాత్ర పోషించింది.[56] 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టి ఎన్.టి.రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల అయింది. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలకు రాజకీయ కోణాన్ని ఇచ్చింది. ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాకా ఈ విభేదాలు రాజుకున్నాయి.[30] 1984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణహత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్ళాడు. అదే సమయంలో ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ, కృష్ణ కలిశారు.[57] తెలుగుదేశం పార్టీకి రామారావు మాస్ అప్పీల్ లాభిస్తోందని, అలాంటి ప్రజాకర్షణ ఉన్న కృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఉపకరిస్తాడని కాంగ్రెస్ నాయకులు భావించారు. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[30] ఆ తర్వాత కృష్ణ ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు చేశాడు.

కృష్ణ 80వ దశకంలో పలు రాజకీయ నేపథ్యంలోని సినిమాలు చేయడం వెనుక ఉన్నదీ ఇదే కారణం. సింహాసనం సినిమాలో ప్రతినాయక పాత్రల్లో ఒకటైన కైకాల సత్యనారాయణ పాత్రకు అప్పటి రామారావు శైలిలో కాషాయం కట్టించి, రామారావును వ్యంగ్యంగా అనుకరించే కొన్ని డైలాగులు చెప్పించారు.[55] ఆపైన నా పిలుపే ప్రభంజనం సినిమా పూర్తిస్థాయి విమర్శగా తీశాడు. సినిమాలో ప్రతినాయకపాత్ర అయిన కోదండరామయ్య త్రిలింగ దీవి అన్న రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటాడు. ముక్కుసూటిగా ఉండే పెద్ద అల్లుడు, జిత్తులమారి చిన్న అల్లుళ్ళ సలహాలతో కోదండరామయ్య ఇష్టారాజ్యంగా పరిపాలిస్తూంటాడు. కృష్ణ సినిమాలో డీసీపీ పాత్ర పోషించాడు. రాజకీయంగా తిరుగుబాటు రావడం క్లైమాక్స్. ఈ విధంగా కోదండరామయ్య పాత్ర రామారావును, పెద్ద అల్లుడి పాత్ర రామారావు పెద్ద అల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చిన్న అల్లుడి పాత్ర చంద్రబాబులను పోలివుంటుంది. రామారావు ప్రభుత్వ చర్యలను సినిమా వ్యంగ్యంగా విమర్శించింది. సినిమాను అడ్డుకోవడానికి రామారావు అభిమానులు థియేటర్ల యజమానులపై చేసిన దాడి డిస్ట్రిబ్యూటర్లు ఏకం కావడంతో విఫలమైంది.[58] విజయనిర్మల దర్శకురాలిగా, కృష్ణ కథానాయకుడిగా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని, రామారావు చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సాహసమే నా ఊపిరి సినిమా తీశారు.[30] ఈ సినిమాలు మంచి విజయాన్ని సాధించి చాలామంది రాష్ట్ర మంత్రులను, శాసనసభ్యులను కలవరపరిచాయి.[58] క్రమేపీ రామారావును, అతని ప్రభుత్వాన్ని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ వైపు నుంచి కృష్ణ నటించిన సినిమాల ద్వారా ప్రయత్నించారు. 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించాడు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది. ఆ ఎన్నికల్లో 31 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ప్రత్యర్థి బోళ్ళ బుల్లిరామయ్యపై కృష్ణ ఓటమి పాలయ్యాడు.[59] 1991లో తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురికావడం,[57] తాను కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇవ్వకపోవడం, ఏలూరులో ఓటమి చెందడం[55] వంటి కారణాలతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడం విరమించుకున్నాడు. 2009 ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది.[55]

వార్ధక్యం, మరణం

[మార్చు]

2022 నవంబరు 15న కార్డియాక్ అరెస్ట్ కారణంగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[60] కృష్ణ తన జీవితంలోని ఆఖరి మూడు సంవత్సరాల వ్యవధిలో రెండవ భార్య విజయనిర్మల (2019),[61] పెద్ద కొడుకు రమేష్ బాబు (2022)[62], మొదటి భార్య ఇందిరా దేవి (2022)ల[63] వరుస మరణాలు చూడవలసి వచ్చింది.[64]

ప్రాచుర్యం, పురస్కారాలు

[మార్చు]

తెలుగు సినిమా చలన చిత్ర చరిత్రలో 1980 దశకంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా కృష్ణ నిలబడ్డాడు. అంతకుముందు దశకాల్లో ఎన్.టి.రామారావు, ఆ తర్వాత చిరంజీవి మాత్రమే ఈ స్థానాన్ని సాధించినవారు. తాను ఏ ప్రజాదరణను ఆశించి సినిమా రంగంలోకి వచ్చాడో దాన్ని పూర్తిగా అనుభవించాడు.

కృష్ణ నటజీవితంలో పొందిన ప్రజాదరణకు ఒక ఉదాహరణగా 1986లో సింహాసనం సినిమా వందరోజుల సభ నిలుస్తుంది. మద్రాసులోని విజిపి గార్డెన్స్‌లో నిర్వహించిన సింహాసనం శతదినోత్సవానికి 400 బస్సుల్లో 30 వేలమంది అభిమానులు ఆంధ్రప్రదేశ్ నుంచి అభిమానులు తరలిరావడాన్ని చూసిన తమిళనాడు ప్రభుత్వాధికారులు ఆశ్చర్యపోయారు.[65][44][నోట్స్ 9] 1983 తర్వాత, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళాక, జ్యోతిచిత్ర వారు సూపర్ స్టార్ బిరుదుకు తగ్గ వ్యక్తిని ప్రజలే ఎన్నుకునేలా పోటీ పెడితే ప్రతీ ఏటా కృష్ణనే ఎన్నికయ్యేవాడు. నాలుగేళ్ళు వరుసగా కృష్ణనే ఎంపికకావడంతో ఇక పత్రిక వారు ఆ పోటీని విరమించే దశకు అభిమానులు తెచ్చారు.[47] కృష్ణకు 2500 అభిమాన సంఘాలు ఉండేవి.[19] ఊరూరా ఉన్న అభిమాన సంఘాలు వందల సంఖ్యలో ఉండేవి. కృష్ణ పుట్టినరోజును స్వచ్ఛందంగా ఘనంగా నిర్వహించి, వార్తాపత్రికల్లో సాధారణంగా ఉండే పేజీలకు రెట్టింపు సంఖ్యలో వచ్చే స్థాయికి అభినందన ప్రకటనలు ఇచ్చేవారు. కృష్ణ తన పుట్టినరోజు మే 31 నాటికి (వేసవి కావడంతో) ఊటీలో ఉండేవాడు.[నోట్స్ 10][66] అక్కడే పుట్టినరోజు జరుపుకునేవాడు. తెలుగు నాట పలు ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా అభిమానులు బస్సుల్లో తరలివచ్చేవారు. తర్వాత దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటివారి అభిమాన సంఘాలు చూపిన ధోరణుల్లో చాలావరకూ కృష్ణ అభిమానులే ప్రారంభించారు. అటువంటి కృష్ణ అభిమాన సంఘాలు, నటవారసుడిగా వచ్చిన మహేష్ బాబు అభిమాన సంఘాలు 2008లో విలీనమైపోయి సూపర్ స్టార్ మహేష్ కృష్ణ సేనగా ఏర్పడ్డాయి.[67]

కృష్ణ సుదీర్ఘ నట జీవితంలో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారాలు పెద్దగా పొందలేదు. అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి పాత్రలో చేసిన నటనకు 1974లో ఉత్తమ నటునిగా నంది పురస్కారం ఒక్కటే దీనికి మినహాయింపు. కమర్షియల్ విజయాలు మాత్రం లెక్కకు మిక్కిలి. అంతేకాక తెలుగు సినిమా రంగంలో పలు సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టడం, పలు విభిన్నమైన జాన్రాలతో ప్రయోగాలు చేయడం వంటివి తెలుగు చలన చిత్ర రంగంలో కృష్ణ స్థానాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఈ పరంగా అతని సేవలను గుర్తిస్తూ 1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం,[68] 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్,[69] 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం వంటి గౌరవాలు కృష్ణకు లభించాయి.[70] ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది.[71] 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ "నటశేఖర" బిరుదును అందుకున్నాడు. 2015లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఇతడిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది.

ప్రత్యేకతలు

[మార్చు]

కృష్ణ సినీ జీవితంలో ఎన్నో ప్రత్యేకతలు సాధించాడు. ప్రత్యేకించి తెలుగు సినీ రంగాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్ళే విషయాల్లో మొట్టమొదటి అడుగులెన్నో కృష్ణవే కావడం ఒక విశిష్టత. పలు హాలీవుడ్ తరహా జాన్రా చిత్రాలను తొలుత తెలుగు సినిమా తెరకు అతనే పరిచయం చేశాడు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ చిత్రం, హీరోగా అతను నటించిన మూడవ చిత్రం - గూఢచారి 116.[నోట్స్ 11] కృష్ణ స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయా మూవీస్ రెండో సినిమాగా నిర్మించిన మోసగాళ్ళకు మోసగాడు తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం. ఇక సాంతకేతికంగానూ పలు తొలి తెలుగు సినిమాలు కృష్ణవే. కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్.ఓ. సాంకేతికత పరిచయం చేశాడు. మొదటి ఓఆర్‌డబ్ల్యు కలర్ సాంకేతికతతో తీసిన సినిమా గూడుపుఠాణి. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం భలే దొంగలు. తెలుగులో 70 ఎంఎం సాంకేతికత ఉపయోగించిన తొలి సినిమా సింహాసనం. సింహాసనం సినిమా స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా. అల్లూరి సీతారామరాజు తెలుగులో ఫుల్‌స్కోప్ సినిమాల్లో మొదటిది. బాక్సాఫీస్ రికార్డుల పరంగా చూస్తే, మద్రాస్ నగరంలో వందరోజులు పూర్తిచేసుకున్న తొలి తెలుగు చిత్రంగా చీకటి వెలుగులు, హైదరాబాద్ నగరంలో ఏడాది పాటు ఆడిన తొలి తెలుగు సినిమాగా అల్లూరి సీతారామరాజు నిలిచిపోయాయి.[72]

కృష్ణకు సినిమాల విషయంలో చాలా మంచి జడ్జిమెంట్ ఉండేది. సినిమా వ్యాపారం మీద మంచి అవగాహన, పట్టు, అంచనా ఉన్న నిర్మాత అతను. విడుదలైన సినిమాల కలెక్షన్లైనా, సినిమా ఆడబోయే రోజులెన్ని అన్నదైనా మంచి అంచనా ఉండేది.[73] తాను నటించిన సినిమాల ఫలితం ఏమవుతుందో తెలుసుకోవడానికి విడుదలయ్యాకా విజయవాడ వచ్చి సినిమా చూసి ప్రేక్షకుల స్పందన ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేవాడు.[13] ఏ థియేటర్ కెపాసిటీ ఎంత అన్న దగ్గర నుంచి సినిమా వ్యాపారానికి సంబంధించిన లెక్కలు, అంచనాలు కృష్ణ చెప్తుంటే తోటి నటులు, సాంకేతిక నిపుణులు ఆశ్చర్యంగా వినేవారు.[74] సినిమా వ్యాపారంలో స్టూడియో అధినేత, నిర్మాత, పంపిణీదారు, ఎగ్జిబిటర్ వంటి అన్ని దశల్లోనూ కృష్ణ స్వంతంగానూ, భాగస్వామ్యంలోనూ వ్యాపారాలు చేసి అనుభవం గడించాడు.[75]

స్వయానా తనకు పెద్ద ఇమేజ్, భారీ సంఖ్యలో అభిమానుల బలం ఉన్నా కృష్ణ మొదటి నుంచీ కెరీర్ తుది వరకూ ఇతర పెద్ద హీరోలతో మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. తర్వాతి తరం హీరోలు కృష్ణంరాజు, రజనీకాంత్, మోహన్ బాబు, తాను అడుగు పెట్టేనాటికే పెద్ద హీరోలైన ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సహా పలువురు హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. వీటన్నిటికీ మించి కృష్ణ, శోభన్ బాబులు విడివిడిగా మంచి విజయాలు అందుకుంటూనే, కలిసి ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు చేశాడు.[76] అతి ఎక్కువ మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోగానూ కృష్ణకు ప్రత్యేకత ఉంది.[31] అలానే సంక్రాంతికి సినిమాలు విడుదల చేసే సంక్రాంతి పోటీ విషయంలోనూ కృష్ణ రికార్డు సృష్టించాడు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో 30 సంక్రాంతులకు కృష్ణ నటించిన సినిమాలు విడుదల అయ్యాయి.[19] 1976 నుంచి 1996 వరకు 21 సంవత్సరాల పాటు ప్రతీ ఏటా వరుసగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేశాడు.[77] సంక్రాంతి విడుదలల విషయంలో అక్కినేని నాగేశ్వరరావు (33 సంక్రాంతులు), ఎన్.టి.రామారావు (31 సంక్రాంతులు) తర్వాత మూడవ స్థానంలో నిలిచినా వరుసగా ప్రతీ ఏటా సంక్రాంతులకు సినిమాలు విడుదల కావడం (21 సంవత్సరాలు) విషయంలో కృష్ణదే రికార్డు.[78]

విమర్శలు, వివాదాలు

[మార్చు]

స్టార్‌గా తెలుగు సినిమా రంగంలో ముద్ర వేసినా కృష్ణ మంచి నటులను లెక్కించేప్పుడు జాబితాలోకి రాడు. తన ఇమేజ్ అత్యున్నత స్థాయిలో ఉన్న దశలో కూడా కృష్ణ తన నటన గురించి తానే జోక్ చేసుకునేవాడు. సాక్షి తీసిన పదిహేను సంవత్సరాల తర్వాత 1982లో బాపుతో రెండవ సినిమాగా కృష్ణావతారం తీస్తున్నప్పుడు బాపు రెండో టేక్ చేద్దామంటే - "బాపు గారు సాక్షి తర్వాత ఇన్నేళ్ళలో నేనేదో నటనలో ఇంప్రూవ్ అయ్యాననుకుని మరో టేక్ అడుగుతున్నారు, ఎన్ని టేక్స్ చేసినా నా నటన ఇంతేనని చెప్పండం"టూ నవ్వాడు.[79] సినిమాల్లో పాటలకు డ్యాన్సులు చేయడంలోనూ కృష్ణ చాలా ఇబ్బందులు పడేవాడు.[80] మొదటి సినిమా తేనెమనసులుకే ఇతర నటులతో కలిసి హీరాలాల్ మాస్టార్ వద్ద నృత్యానికి కఠోరమైన శిక్షణ తీసుకున్నా డ్యాన్సు రాలేదు కానీ మంచి క్రమశిక్షణ కలవాడని మాస్టర్ మాత్రం మెచ్చుకున్నాడు.[81] అతనితో డ్యాన్సు చేయించడానికి నృత్యదర్శకుడు హీరోయిన్‌ని కాస్త ముందు నిలబెట్టి ఆమె చేస్తున్న డ్యాన్స్ మూమెంట్లు అనుసరించమని సూచించడం వంటి ట్రిక్కులు చేయాల్సివచ్చేది.[82] నాగేశ్వరరావు వంటివారితో డాన్స్ చేసేప్పుడు డాన్స్ డైరెక్టర్‌తో నాగేశ్వరరావును కాస్త ముందు నిలబెడితే అనుసరించేస్తానని కృష్ణే స్వయంగా సూచించేవాడు. క్లిష్టమైన నృత్యాలు కథకు చాలా ముఖ్యమైనవైతే క్లోజ్ షాట్లు మాత్రం కృష్ణవి తీసుకుని, మిగతా నృత్యం డూప్‌తో చేయించేవారు.[81] ఈ డ్యాన్సుల విషయంలోనే కృష్ణ అభిమానులను ఇతర అభిమానులు బెండు అప్పారావు అంటూ ఆటపట్టించేవారు.

సుదీర్ఘ సినీ జీవితంలో సాధారణంగా పలువురితో మంచి సంబంధాలు నెరిపిన కృష్ణకు కొందరితో గట్టి వివాదాలు సాగాయి. నటుడు, రాజకీయ నాయకుడు అయిన ఎన్.టి.రామారావుతో సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ సాగిన వివాదాలు ప్రఖ్యాతం. దశాబ్దాల పాటు తెలుగు సినిమా నేపథ్య గాయకుడిగా స్టార్ హోదా కలిగిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో కృష్ణకు వివాదాలు ఏర్పడ్డాయి. మొదట్లో నేపథ్య గాయకుడిగా రామకృష్ణ ప్రభంజనం వీస్తున్నప్పుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యానికి అవకాశాలు ఇచ్చి నిలబెట్టింది కృష్ణే.[83] అయితే 1985లో బాలసుబ్రహ్మణ్యానికి రావాల్సిన పారితోషికం బకాయి విషయంలో మాట మాట రావడంతో కృష్ణ రెండు, మూడేళ్ళ పాటు బాలుతో కలిసి పనిచేయలేదు.[నోట్స్ 12][84] బాల సుబ్రహ్మణ్యాన్ని పక్కనపెట్టి 1985 నవంబరులో విడుదలైన సూర్యచంద్ర సినిమాతో ప్రారంభించి కృష్ణ రాజ్ సీతారాం అన్న గాయకుడితో ఆ మూడేళ్ళు పాడించుకున్నాడు. సూపర్ హిట్ అయిన సింహాసనం సినిమాలో కూడా కృష్ణకు రాజ్ సీతారామే పాటలు పాడాడు.[85] ఒకరితో ఒకరు కలసి పనిచేయకపోయినా కలిసినప్పుడు మిగిలిన విషయాలు సాధారణంగానే మాట్లాడుకునేవారు. 1988లో సంగీత దర్శకులు రాజ్-కోటి తాము కృష్ణ సినిమాకు సంగీతం చేస్తూ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాలని పట్టుబట్టేసరికి, వేటూరి సుందరరామమూర్తి చొరవతో కృష్ణ, బాలు మాట్లాడుకుని కలిసి పనిచేయడం ప్రారంభించారు.[83][84]

వ్యక్తిత్వం, లక్షణాలు

[మార్చు]

కృష్ణ వ్యక్తిగతంగా మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా పేరుతెచ్చుకున్నాడు. క్లుప్తంగా, ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు.[నోట్స్ 13] తన బలాలతో పాటు లోపాలపైనా, తనకున్న పరిమితులపైనా కూడా చక్కని అవగాహన ఉండేది.[31] టాప్ స్టార్‌లుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ఉన్న దశలో వారిద్దరికీ ప్రత్యేకించి కొందరు నిర్మాతలు ఉండేవారు, వారితోనే ఎక్కువ సినిమాలు చేసేవారు. ఆ దశలో కృష్ణ కొత్త నిర్మాతలకు డేట్స్ ఇచ్చి సినిమాలు చేసి వారికి పరిశ్రమలోకి రావడానికి మార్గంగా ఉండేవాడు.[75] తనతో సినిమా తీసి నిర్మాత ఆర్థికంగా నష్టపోయినప్పుడు తానే నిర్మాత వద్దకు వెళ్ళి వాళ్ళు దెబ్బతినకుండా ఉండేందుకు వెంటనే మంచి సినిమా ప్లాన్ చేయమని, అడ్వాన్స్ అక్కర్లేదని డేట్లు ఇచ్చేవాడు. విడుదలకు ముందు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే తన పారితోషికం వదులుకునేవాడు.[73][83] "హీరోగా అతను పైకి రావడానికి మంచితనం కూడా ఒక కారణం" అంటాడు సహనటుడు కైకాల సత్యనారాయణ.[36] కొత్త జాన్రాలు, సాంకేతికాంశాలు ప్రవేశపెట్టడంతో పాటు రిస్క్ తీసుకుని దెబ్బలు తినైనా ఫైట్ సీన్లు పండించడం వల్ల కృష్ణను డాషింగ్ అండ్ డేరింగ్ హీరో అని పిలిచేవారు. ఈ క్రమంలో షూటింగుల్లో బైకు మీంచి, గుర్రాల మీంచి పడిపోవడం, ప్రమాదవశాత్తు కత్తిగాట్లు పడడం, ప్రతినాయక పాత్రధారిని పైకెత్తబోయి కింద పడడం వంటివెన్నో ఎదుర్కొన్నాడు.[3] సిరిపురం మొనగాడు (1983) షూటింగ్ సమయంలో ఏకంగా ప్రాణానికే ప్రమాదం జరిగింది.[86] ఇలాంటివి ఎదురైనా సాహసించి ముందుకు సాగడమే అతని పద్ధతి.[3] సినిమా రంగం నుంచి సహాయ కార్యక్రమాల నిర్వహణ కూడా చేశాడు. 1972లో ఆంధ్రప్రదేశ్‌లో కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట కలిగించేలా సాయాన్ని అందించేందుకు కృష్ణ విరాళాల సేకరణ కార్యక్రమాలు రూపొందించాడు. అంతకుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసిన ఎన్టీ రామారావు స్ఫూర్తితో ఈ పని చేస్తున్నట్టు చెప్పుకున్నాడు. కరువు బాధితుల సహాయ నిధికి సినిమా తారల యాత్ర పేరుతో 1972 అక్టోబరు 28 నుంచి నవంబరు 2 వరకు విజయవాడ, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్‌లలో తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులను కూడగట్టి కార్యక్రమాలు నిర్వహించాడు. వచ్చిన డబ్బు సహాయ నిధికి అందించారు.[87]

ప్రతీ ఏడాది ఎండాకాలం షూటింగులన్నీ ఊటీలోనే ప్లాన్ చేసుకునేవాడు. అటుపక్కన సినిమాలకు అవసరమైన పని చేస్తూనే, దాన్ని ఒక వేసవి ఆటవిడుపుగా ఉపయోగించుకునేవాడు.[88] హీరోగా తొలి అవకాశాలు ఇచ్చి తన జీవితం మలుపు తిప్పిన ఆదుర్తి సుబ్బారావు, డూండీల పట్ల కృష్ణ ఎప్పుడూ కృతజ్ఞతతో వ్యవహరించాడు. ఆదుర్తి సుబ్బారావు మరణించినప్పుడు పాడిపంటలు సినిమా కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అవుట్‌డోర్ షూటింగ్ కోసం వెళ్ళిన కృష్ణ, అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఏ దారీ లేకపోతే ద హిందూ పత్రిక వాళ్ళు వాడే ప్రత్యేక విమానంలో వారిని అభ్యర్థించి ప్రయాణించాడు. ఆదుర్తి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆదుర్తి స్వంత బ్యానర్ రవి కళామందిర్ బ్యానర్ మీద లాభం వస్తే ఆదుర్తి కుటుంబం తీసుకునేట్టు, నష్టం వస్తే కృష్ణ భరించేట్టు తాను హీరోగా పంచాయితీ, సిరిమల్లె నవ్వింది, రక్త సంబంధం సినిమాలు చేసిపెట్టాడు. మొదటి రెండూ ఫ్లాప్ అయినా మూడో సినిమా హిట్ అయింది. ఆదుర్తి సుబ్బారావు కొడుకు సాయి భాస్కర్‌ను తన సినిమాల్లో సహాయ దర్శకుడిగా తీసుకుని, తర్వాత దర్శకుడిగా పరిచయం చేస్తూ పచ్చ తోరణం సినిమా చేశాడు. అదీ ఫ్లాప్ కావడంతో, పద్మాలయా టెలీఫిల్మ్స్ ఏర్పాటుచేసి టెలివిజన్ వ్యాపార రంగంలోకి దిగినప్పుడు సాయి భాస్కర్‌కే ఆ బాధ్యతలు అప్పగించి ఎలాగైనా ఆదుర్తి కుటుంబాన్ని సెటిల్ చేయాలని పదే పదే ప్రయత్నించాడు.[89][90] సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తనను ఆదరించిన నటుడు కొంగర జగ్గయ్య, రచయిత కొడాలి గోపాలరావు వంటి వారందరినీ తను విజయాల్లో ఉన్నప్పుడు గౌరవంగా చూసుకుని, అవకాశాలు ఇచ్చేవాడు. ఆర్థికంగా చితికిపోయిన తన తోటి కథానాయకులు, స్నేహితులకు ఆర్థికంగా బాసటగా నిలబడేవాడు.[13] అల్లూరి సీతారామరాజు దర్శకుడు వి.రామచంద్రరావు ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయిన కొన్నాళ్ళకే అనారోగ్యంతో మరణించడంతో, సినిమాను కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించి పూర్తిచేసినా ఘోస్ట్ డైరెక్టరుగానే ఉండిపోయి దర్శకుడిగా వి.రామచంద్రరావు పేరే వేశాడు.[91]

నటించిన చిత్రాలు

[మార్చు]

మరణం

[మార్చు]

కృష్ణ కార్డియాక్‌ అరెస్ట్‌తో గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ 2022 నవంబరు 15న ఆరోగ్యం విషమించడంతో మరణించాడు.[92][93][94]

నోట్స్

[మార్చు]
  1. సాక్షి సినిమాలో హీరో హీరోయిన్లుగా కృష్ణ, విజయనిర్మల పెళ్ళి జరిగే సన్నివేశం ఉంది. ఆ సన్నివేశాన్ని పులిదిండి గ్రామంలోని ఆలయంలో చిత్రీకరించారు. అదే సందర్భంలో నటుడు రాజబాబు ఇక్కడ దేవుడు మహత్యం ఎక్కువని ఆయన ఎదురుగా పెళ్ళి చేసుకుంటే నిజమవుతుందని ఆటపట్టించాడు. అయితే మరో రెండేళ్ళకు పెళ్ళి చేసుకున్న కృష్ణ, విజయనిర్మలకు ఇదొక సెంటిమెంట్ అయింది. చివరకు తిరుపతిలో పెళ్ళాడి, అదే గ్రామానికి వచ్చి దేవుడిని దర్శించుకున్నారు.
  2. తేనెమనసులు సినిమాలో కొత్త నటులుగా దరఖాస్తు పంపి, తుది దశ వడపోతల్లో అవకాశం కోల్పోయిన వారిలో తర్వాతి కాలంలో ప్రముఖ నటులుగా సినీ రంగంలో నిలిచిన కృష్ణంరాజు, జయలలిత, హేమా మాలిని వంటివారు ఉన్నారు.
  3. ప్రపంచంలోనే తొలి జేమ్స్‌బాండ్ సినిమా "డాక్టర్ నో" 1962లో విడుదలైంది. నాలుగేళ్లు తిరగకుండానే తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమాగా నిర్మాత డూండీ, ఆరుద్రతో స్క్రిప్ట్ రాయించుకుని గూఢచారి 116 తీశాడు.
  4. సినిమాల నుంచి రిటైర్ అయ్యాకా నాలుగు దశాబ్దాల తర్వాత కూడా తన సినీ జీవితంలో బాగా బాధపడ్డ సందర్భంగా తన దేవదాసు సినిమా ఫ్లాప్ కావడాన్నే గుర్తుచేసుకున్నాడు కృష్ణ.
  5. ఎన్.టి.రామారావు కెరీర్‌లో వరుస ఫ్లాప్‌లతో బ్లాక్ పీరియడ్ నడుస్తున్న దశలో కృష్ణ తమ స్వంత నిర్మాణ నిర్మాణ సంస్థ తీస్తున్న "దేవుడు చేసిన మనుషులు" సినిమా రామారావుతో మల్టీస్టారర్ చేశాడని క్యారెక్టర్ నటుడు కైకాల సత్యనారాయణ అన్నాడు.
  6. అంతకుముందు 1973లో కృష్ణ మంచివాళ్ళకు మంచివాడు, 1969లో శోభన్ బాబుతో మల్టీస్టారర్ గా నటించిన మంచి మిత్రులు సంక్రాంతికే విడుదలైనా 1976లో స్వీయ నిర్మాణంలో విడుదల చేసిన పాడిపంటలు నుంచి రెగ్యులర్ గా పూర్తిస్థాయిలో ఏటా సంక్రాంతికి సినిమాలు పోటీ పెట్టడం ప్రారంభించాడు.
  7. శోభన్ బాబు సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడని తెలుసుకుని కృష్ణ ఇంటికి వెళ్ళి మరీహేమాహేమీలు సినిమా చేద్దామని ఆఫర్ చేశాడు. శోభన్ బాబు కూడా ఈ విషయంలో చాలా సంతోషించాడు. అయితే చివరి నిమిషయంలో శోభన్ బాబు తప్పుకోవడంతో నాగేశ్వరరావు కాంబినేషన్‌లో ఆ సినిమా తీశాడు.
  8. మొహమాటం కారణంగా ఎంతోమంది కొత్తవాళ్ళకు సినిమాలు చేసి చేయూతనిచ్చాను. సంవత్సరాల పాటూ రోజుకు మూడు షిఫ్ట్ ల చొప్పున పనిచేసిన నాకు ఖాళీగా ఉండటం అంటే పరమబోర్. అదొక మెయిన్ రీజన్ కాగా మరొక రీజన్ మొహమాటం. - 2000 తర్వాత తన సినిమాల గురించి కృష్ణ
  9. సింహాసనం సినిమా వందరోజులు ఫంక్షన్‌కు తరలివచ్చిన 30 వేలమంది అభిమానుల మీదే నా పిలుపే ప్రభంజనం సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించారు.
  10. 1973లో సవేరా హోటల్లో 31వ పుట్టినరోజును కృష్ణ నిర్మాతలు అందరూ కలిసి వేడుకగా నిర్వహించడంతో కృష్ణ భారీ పుట్టినరోజు పండగల సంప్రదాయం ప్రారంభం అయింది.
  11. జేమ్స్‌బాండ్ లేక స్పై యాక్షన్ థ్రిల్లర్‌ జాన్రాలో తొలి తెలుగు సినిమా గూఢచారి 116నే అయినా దాని క్రెడిట్ మాత్రం దర్శక నిర్మాతలకు దక్కుతుంది. కృష్ణను నిర్మాత డూండీ ఈ సినిమాకు ఎంపిక చేశాడు. తర్వాతి కాలంలో విభిన్నమైన జాన్రాను తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసే కృష్ణ విజయ రహస్యానికి ఇదే పునాది అయింది.
  12. తాను పాడకపోతే కృష్ణ సినిమా విడుదల కాదన్న మాట బాలసుబ్రహ్మణ్యం అన్నాడన్న విషయమే వివాదం తెచ్చిపెట్టిందని, ఇంతకీ తాను ఆ మాట అనలేదనీ బాలసుబ్రహ్మణ్యం అన్నాడు.
  13. సినిమా రంగంలో సాధారణంగా సినిమా ఫ్లాప్ అయితే హీరోలు "బాగా లేదని అంటున్నారండీ, కానీ వచ్చే వారం పికప్ అవుతుంది" అంటూ చెప్తూంటారని, కృష్ణ మాత్రం మన సినిమా చీదేసిందని నవ్వుతూ చెప్పేవాడని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

మూలాలు

[మార్చు]
  1. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 11.
  2. 2.0 2.1 2.2 2.3 దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 12.
  3. 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 3.10 3.11 3.12 ఆచారం, షణ్ముఖాచారి. "సితార - బుర్రిపాలెం బుల్లోడు... అద్భుతాల అసాధ్యుడు - సినీ మార్గదర్శకులు - టాలీవుడ్‌". సితార. రామోజీరావు. Archived from the original on 7 December 2018. Retrieved 7 December 2018.
  4. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 16.
  5. 5.0 5.1 "సూప‌ర్ స్టార్ కృష్ణ కుమార్తె మ‌న‌సులోని ఆవేద‌నకు రూపం 'మ‌న‌సుకి న‌చ్చింది'." ఆంధ్రభూమి. 8 November 2017. Retrieved 18 December 2018.[permanent dead link]
  6. kavirayani, suresh (13 June 2018). "Using their names is like asking for dowry: Sudheer Babu". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 18 December 2018.
  7. "No-Confidence Motion: Who is Jayadev Galla?". cnbctv18.com. 20 July 2018. Retrieved 18 December 2018.
  8. 8.0 8.1 వై., సునీతా చౌదరి (4 August 2007). "Bestowed with bliss". The Hindu (in Indian English). Retrieved 17 December 2018.
  9. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 133.
  10. గుప్తా, ప్రియ. "Men who are not loyal to their wives are foolish: Mahesh Babu - Times of India". The Times of India. Retrieved 18 December 2018. He [Ramesh babu] took care of me when I [Mahesh babu] was young, as my father [Krishna] would be busy working. Even though I am not that expressive, he is actually like a father figure to me.
  11. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 13.
  12. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 14.
  13. 13.0 13.1 13.2 దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, pp. 88–91: "కృష్ణ రూమ్మేట్ వాసిరెడ్డి రామ్మోహనరావు ఇంటర్వ్యూ నుంచి"
  14. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 15.
  15. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 17.
  16. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 19.
  17. జీవిత చరిత్ర 1996, p. 15.
  18. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, pp. 23–30.
  19. 19.0 19.1 19.2 జీవిత చరిత్ర 1996, p. 22.
  20. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 34.
  21. జీవిత చరిత్ర 1996, p. 27.
  22. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 49.
  23. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, pp. 50–56.
  24. 24.0 24.1 రెంటాల, జయదేవ. "కౌబాయ్ లకు కౌబాయ్". ఇష్టపడి. Archived from the original on 9 May 2015. Retrieved 15 August 2015.
  25. 25.0 25.1 25.2 ప్రసాద్, ఎంబీఎస్. "సినీమూలం: అల్లూరి సీతారామరాజు నవల - సినిమా". greatandhra.com. Retrieved 11 January 2018.
  26. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 93.
  27. జీవిత చరిత్ర 1996, p. 35.
  28. జీవిత చరిత్ర 1996, pp. 31, 32.
  29. జీవిత చరిత్ర 1996, pp. 75.
  30. 30.0 30.1 30.2 30.3 30.4 30.5 ఘట్టమనేని, కృష్ణ; ఘట్టమనేని, విజయనిర్మల. "కృష్ణ అండ్ విజయనిర్మల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే" (Interview). Interviewed by వేమూరి రాధాకృష్ణ. Retrieved 19 December 2018.
  31. 31.0 31.1 31.2 31.3 "సితార - రికా‌ర్డుల మొన‌గాడు.. కృష్ణ - సినీ మార్గదర్శకులు - టాలీవుడ్‌". సితార. రామోజీరావు. Archived from the original on 7 December 2018. Retrieved 7 December 2018.
  32. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 37.
  33. 33.0 33.1 "సంకురాతిరి సినీ కురుక్షేత్రం!". www.andhrajyothy.com. 7 January 2017. Archived from the original on 8 December 2018. Retrieved 8 December 2018.
  34. జీవిత చరిత్ర 1996, p. 34.
  35. జీవిత చరిత్ర 1996, p. 37.
  36. 36.0 36.1 36.2 దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, pp. 128–131కృష్ణ గురించి కైకాల సత్యనారాయణ ఇంటర్వ్యూ
  37. "నలభై ఏళ్ల క్రితం ఓ సంక్రాంతి". greatandhra.com. 17 January 2017. Archived from the original on 7 December 2018. Retrieved 8 December 2018.
  38. రావి, కొండలరావు. "కథ ఒకటే... సినిమాలు రెండు!". సితార. రామోజీరావు. Archived from the original on 7 December 2018. Retrieved 8 December 2018.
  39. జీవిత చరిత్ర 1996, p. 43.
  40. జీవిత చరిత్ర 1996, p. 149.
  41. జీవిత చరిత్ర 1996, p. 58.
  42. "స్టార్ హీరోల పొలిటికల్ సినిమాలు ఎందుకు ఆడవు ?". Vankaya.com (in ఇంగ్లీష్). Retrieved 8 December 2018.
  43. "ఈనాడు (నాకు నచ్చిన సినిమా)". andhrabhoomi.net. Archived from the original on 31 డిసెంబర్ 2018. Retrieved 8 December 2018. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  44. 44.0 44.1 "మొట్టమొదటి 70ఎం.ఎం. చిత్రానికి 30 ఏళ్ళు!". samayam Telugu. 21 March 2016. Archived from the original on 8 December 2018. Retrieved 8 December 2018.
  45. India Today. Living Media India Pvt. Limited. 1987. p. 109.
  46. దేవుడులాంటి మనిషి (2వ సంపుటం) 2016, p. 479.
  47. 47.0 47.1 జీవిత చరిత్ర 1996, p. 50.
  48. "19 ఏళ్లు పూర్తి చేసుకున్న మహేష్." www.andhrajyothy.com. 30 July 2018. Archived from the original on 18 December 2018. Retrieved 18 December 2018.
  49. Reddy, Sampath (14 November 2018). "ఒకేసారి రెండు సినిమాలకు ప్లాన్". manatelangana.news/. Archived from the original on 16 నవంబరు 2018. Retrieved 10 December 2018.
  50. జీవిత చరిత్ర 1996, p. 68.
  51. కృష్ణమూర్తి, సురేష్. "The Hindu : Manjula `Shows' the way". www.thehindu.com. Retrieved 10 December 2018.
  52. "Sudhir Babu Biography". Archived from the original on 2015-09-15. Retrieved 2018-12-10.
  53. "Super Star Krishna retires from movies - Times of India". The Times of India. 17 January 2017. Retrieved 10 December 2018.
  54. అంజూరి, ప్రవల్లిక (31 March 2015). "50th Anniversary Special: Lesser Known Facts About Super Star Krishna". filmibeat.com (in ఇంగ్లీష్). Retrieved 10 December 2018.
  55. 55.0 55.1 55.2 55.3 "Special Interview with Ghattamaneni Adi Seshagiri Rao". యూట్యూబ్. సాక్షి మనసులో మాట. సాక్షి.
  56. జీవిత చరిత్ర 1996, p. 45.
  57. 57.0 57.1 జీవిత చరిత్ర 1996, p. 49.
  58. 58.0 58.1 Menon, Amarnath K. "Telugu actor Krishna's political satire on NTR rule gets TDP worried". India Today (in ఇంగ్లీష్). Retrieved 17 December 2018.
  59. "Eluru Lok Sabha Elections and Results 2014". elections.in. Archived from the original on 5 జూన్ 2014. Retrieved 20 December 2018.
  60. "Krishna: దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు.. 'సూపర్‌స్టార్‌' కృష్ణ ఇకలేరు". EENADU. Retrieved 2022-11-15.
  61. prashanth.musti. "ముగిసిన విజయనిర్మల అంత్యక్రియలు.. కృష్ణ కన్నీటి వీడ్కోలు". Asianet News Network Pvt Ltd. Retrieved 2022-11-15.
  62. "Ramesh babu:సినీనటుడు మహేష్‌బాబు సోదరుడు రమేష్‌బాబు కన్నుమూత". EENADU. Retrieved 2022-11-15.
  63. "Indira Devi, veteran Telugu actor Krishna's wife and actor Mahesh Babu's mother, passes away in Hyderabad". The Hindu. Special Correspondent. 2022-09-28. ISSN 0971-751X. Retrieved 2022-09-28.{{cite news}}: CS1 maint: others (link)
  64. K, Mamatha (2022-09-29). "తక్కువ సమయంలో ముగ్గురు ఆత్మీయులను కోల్పోయిన కృష్ణ… గుండె తరుక్కుపోతుంది !". TeluguStop Telugu. Retrieved 2022-11-15.
  65. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 127.
  66. దేవుడులాంటి మనిషి (2వ సంపుటం) 2016, p. 499.
  67. "Krishna, Mahesh Babu fans associations merge". The Hindu (in Indian English). 3 October 2008. Retrieved 10 December 2018.
  68. "Ilayaraja, Ambarish, Krishna get NTR award". @businessline (in ఇంగ్లీష్). Retrieved 10 December 2018.
  69. "A memorable occasion for actor Krishna". The Hindu (in Indian English). 30 January 2008. Retrieved 10 December 2018.
  70. "Awards for 5 persons from State". The Hindu (in Indian English). 26 January 2009.
  71. "Rare honour to Superstar". Gulte.com (in english). 8 January 2013. Retrieved 10 December 2018.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  72. జీవిత చరిత్ర 1996, p. 12.
  73. 73.0 73.1 దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 42.
  74. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 173కృష్ణ గురించి శారదని చేసిన ఇంటర్వ్యూ
  75. 75.0 75.1 దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, pp. 170, 171కృష్ణ గురించి దాసరిని చేసిన ఇంటర్వ్యూ
  76. S, Sandeep Kumar (24 January 2013). "Multi-starrer Telugu movies are back". The Hindu (in Indian English). Retrieved 10 December 2018.
  77. జీవిత చరిత్ర 1996, p. 69.
  78. దేవుడులాంటి మనిషి (2వ సంపుటం) 2016, pp. 513.
  79. జీవిత చరిత్ర 1996, p. 23.
  80. "బ‌న్నీ, చెర్రీ త‌ర‌హా డ్యాన్సుల‌కు". greatandhra.com. Archived from the original on 17 December 2018. Retrieved 17 December 2018.
  81. 81.0 81.1 దేవుడులాంటి మనిషి (2వ సంపుటం) 2016, pp. 440–444కృష్ణతో అత్యధిక సినిమాలు చేసిన డాన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంటర్వ్యూ
  82. "శివశంకర్ మాస్టర్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే". andhrajyothy.com. వేమూరి రాధాకృష్ణ. 4 February 2018. Archived from the original on 20 December 2018. Retrieved 20 December 2018. వేమూరి రాధాకృష్ణతో ఇంటర్వ్యూలో శివశంకర్ మాస్టర్
  83. 83.0 83.1 83.2 దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, pp. 106–109ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇంటర్వ్యూ
  84. 84.0 84.1 "కృష్ణతో వివాదం గురించి ఎస్పీ బాలు". telugu.filmibeat.com. 23 January 2012. Archived from the original on 19 December 2018. Retrieved 19 December 2018.
  85. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 126.
  86. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 163.
  87. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, pp. 154–157పి.సి.రెడ్డి ఇంటర్వ్యూ
  88. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, pp. 440–444కృష్ణతో అత్యధిక సినిమాలు చేసిన డాన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంటర్వ్యూ
  89. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, pp. 466–467ఆదుర్తి సుబ్బారావు కుమారుడు సాయిభాస్కర్ ఇంటర్వ్యూ (2)
  90. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 79.
  91. దేవుడులాంటి మనిషి (1వ సంపుటం) 2016, p. 117దర్శకుడు వి.రామచంద్రరావు కుమార్తె సంధ్యతో ఇంటర్వ్యూ
  92. "Krishna: దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు.. 'సూపర్‌స్టార్‌' కృష్ణ ఇకలేరు". web.archive.org. 2022-11-15. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  93. "Telugu Superstar Krishna Passed Away, Nagarjuna, Rajinikanth, NTR Among Others Pay Tributes To Legend - Moviezupp" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-11-15. Archived from the original on 2022-11-15. Retrieved 2022-11-15.
  94. Namasthe Telangana (15 November 2022). "సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇక లేరు.. విషాదంలో సినీ పరిశ్రమ". Archived from the original on 15 November 2022. Retrieved 15 November 2022.

ఆధార గ్రంథాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]