Jump to content

గుత్తా జ్వాల

వికీపీడియా నుండి
గుత్తా జ్వాల
జ్వాలా గుత్తా
వ్యక్తిగత సమాచారం
జననం (1983-09-07) 1983 సెప్టెంబరు 7 (వయసు 41)
వార్ధా, మహారాష్ట్ర, భారతదేశం
ఎత్తు1.88 మీ. (6 అ. 2 అం.)[1]
దేశం భారతదేశం
వాటంఎడమ చేయి
మిక్స్‌డ్ డబుల్స్ / మహిళల డబుల్స్
అత్యున్నత స్థానం6
ప్రస్తుత స్థానం21 (23 జూన్ 2011)
Olympic medal record
ప్రాతినిధ్యం వహించిన దేశము  భారతదేశం
మహిళల బ్యాడ్మింటన్
ప్రపంచ ఛాంపియంషిప్స్

3 కాంస్యపతకం

కామన్వెల్త్ క్రీడలు

2 రజతపతకం 1 స్వర్ణపతకం

గుత్తా జ్వాల ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి. 2010 వరకు పదమూడు సార్లు జాతీయ బాడ్మింటన్ విజేత . కేంద్ర ప్రభుత్వం 2011 ఆగస్టు 18 న జ్వాలకు అర్జున అవార్డు ప్రకటించింది.

పరివారం

[మార్చు]

జ్వాల సెప్టెంబర్ 7, 1983న మహారాష్ట్ర లోని వార్ధాలో తెలుగు తండ్రి గుత్తా క్రాంతి, చైనా తల్లి ఎలెన్‌కి జన్మించింది. తాత చెంగ్ వార్ధాలోని సేవాగ్రాం ఆశ్రమంలో మహాత్మా గాంధీ శిష్యుడు. గాంధీ ఆత్మకథ, రచనలను ఛైనా భాషలోనికి అనువదించాడు. భట్టిప్రోలు మండలం గుత్తావారిపాలెం జ్వాల పెద్దల స్వస్థలం. జ్వాల తాతయ్య గుత్తా సుబ్రహ్మణ్యం అభ్యుదయవాది, స్వాతంత్య్రయోధుడు. ఏడుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు సుబ్రహ్మణ్యం. చిన్నతనంలోనే సోదరులతో కలిసి వందేమాతరం నినాదాన్ని అందుకున్నారు. ఆగ్రహించిన నాటి బ్రిటిష్ పాలకులు ఈ కుటుంబాన్నీ, వీరి బంధుగణాన్నీ అరెస్టుచేసి జైలుకు పంపారు. ఉద్యమబాటలో వీరి ఆస్తులు కరిగిపోయాయి. సుబ్రహ్మణ్యం పెదనాన్న, పెద్దమ్మ జైల్లోనే ప్రాణాలు విడిచారు. బయటపడ్డాక అప్పులతో కాలం గడుపుతుండగానే వారు కోరుకున్న స్వేచ్ఛాభారతం సిద్ధించింది. మిగిలిన కొద్దిపాటి ఆస్తులు అమ్ముకుని ఏడుగురు అన్నదమ్ముల కుటుంబాలు వలసబాట పట్టాయి. తమిళనాడుకు వెళ్లి పుష్పగిరి గ్రామంలో వ్యవసాయం ఆరంభించి పూలతోటలు సాగుచేశారు. సుబ్రహ్మణ్యం దంపతులకు అరుగురు సంతానం. అందులో క్రాంతి ఒకరు. ఈ కుటుంబానికి మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌తో అనుబంధం ఏర్పడింది. మకాం అటు మార్చారు. గాంధీజీ బేసిక్ స్కూలును ఆరంభించారు. తర్వాత నెల్లూరు జిల్లా వాకాడు చేరారు. ఆ క్రమంలో వాకాడు, హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య, ఇంటర్మీడియెట్ చదివిన క్రాంతి మహారాష్ట్ర వెళ్లి డిగ్రీ, రసాయనశాస్త్రంలో పీజీ చేశారు. అప్పుడే సేవాగ్రామ్ వచ్చిన చైనా యువతి ఎలెన్‌తో పరిచయం ప్రేమగా మారింది. వివాహబంధం ముడిపడ్డాక ఆమెకు భారత పౌరసత్వం వచ్చింది. ఆర్‌.బీ.ఐ ఉద్యోగిగా మహారాష్ట్రలో అయిదేళ్లు పనిచేసిన క్రాంతి, 1988లో బదిలీపై హైదరాబాద్ చేరుకున్నారు.

బాల్యం

[మార్చు]

క్రాంతి, ఎలెన్ దంపతుల పెద్ద కుమార్తె జ్వాల. హైదరాబాద్ వచ్చే నాటికి ఆమెకు అయిదేళ్లు. బ్యాట్ చేతబట్టిందీ అప్పటినుంచే.

ఆటలు

[మార్చు]

చదువు, బ్యాడ్మింటన్ సాధనతో పెరిగిన జ్వాల క్రమంగా జాతీయస్థాయికి ఎదిగింది. సింగిల్స్‌తోపాటు డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ ఆడడం జ్వాల ప్రత్యేకత!. ప్రపంచ పోటీల డబుల్స్‌లో కాంస్యం గెలుచుకున్న జ్వాల, కామన్వెల్త్ పోటీల్లో అదే విభాగంలో విజేతగా నిలిచింది.

వైవాహిక జీవితం

[మార్చు]

గుత్తా జ్వాల 2005లో భారత్‌ బ్యాడ్మింటన్‌ ఆటగాడు‌ చేతన్‌ ఆనంద్‌ను వివహం చేసుకుంది, పలు కారణాలతో 2011లో అతనితో విడాకులు తీసుకుంది. హైదరాబాద్‌ మొయినాబాద్‌లో ఏప్రిల్‌ 22 2021న తమిళ నటుడు విష్ణు విశాల్‌ ను వివాహం చేసుకుంది.[2][3]

సినీ రంగ ప్రవేశం

[మార్చు]

ఈమె నితిన్ కథానాయకుడిగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో ప్రత్యేక గీతంలో నృత్యం చేసింది.[4][5]

వార్తలలో జ్వాల

[మార్చు]

2013: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్

[మార్చు]

బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో 2013 ఆగస్టు 25, ఆదివారం బంగా బీట్స్‌తో జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్ సందర్భంగా అక్కడి అభిమానులు జ్వాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ హైదరాబాదీ క్రీడాకారిణి తీవ్ర మనస్తాపం చెందింది. మ్యాచ్ ముగిశాక ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. అయితే ఈ విషయాన్ని ఐబీఎల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేయదలుచుకోలేదని స్పష్టం చేసింది. ఎవరికి వారు సభ్యత నేర్చుకోవాలని సూచించింది. ఈ వ్యవస్థలో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. ‘ప్రేక్షకులు నన్ను వ్యక్తిగతంగా దూషించారు. మేమంతా క్రీడాకారులం. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకోవాలి.

ఇలాంటి పరిస్థితి క్రికెటర్లకు వస్తే మైదానంలో వారు ఎలా ప్రవర్తిస్తారో మనం చూశాం. కానీ నేను కోర్టులో ఎలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. మ్యాచ్ తర్వాతే నా ఆవేదన తెలిపాను. ఈరోజుల్లో ఎవరికి వారు చాలా బిజీగా మారిపోతున్నాం. అందుకే మనం పిల్లలకు కనీస విలువలు, మానవత్వం గురించి చెప్పడం మర్చిపోతున్నాం. మహిళల పట్ల భారత సమాజం ఎంత సున్నితంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రపంచంలో భారత్ ఎలా దూసుకెళుతుందో మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇలాంటి పనులు మీలో సంకుచిత మనస్తత్వాన్ని తెలుపుతాయి. డాక్టర్‌గానో ఇంజినీర్ గానో కావడం ముఖ్యం కాదు. ఎవరి పిల్లలకు వారు మంచి సంస్కృతిని నేర్పితే చాలు’ అని జ్వాల పేర్కొంది[6][7][8].

2013: బాయ్ వివాదం

[మార్చు]

వివాదాస్పద బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలపై భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) జీవిత కాల నిషేధం విధించే ఆలోచనలో ఉంది. 2013 ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తమ ఫ్రాంచైజీ క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ ఆటగాళ్లను బంగా బీట్స్‌తో మ్యాచ్ ఆడనీయకుండా అడ్డుకుందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాయ్ ఈ ఘటనపై క్రమశిక్షణ కమిటీని నియమించింది. ఈనేపథ్యంలో జ్వాలపై జీవిత కాల నిషేధం లేక ఆరేళ్ల పాటు సస్పెన్షన్ విధించాలని కమిటీ సూచించినట్టు బాయ్ సీనియర్ అధికారి చెప్పారు. అసోసియేషన్ సభ్యులందరికీ ఇప్పటికే ఈ సూచనలను పంపించారు. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు[9]. అదేగాక నిషేధంపై తుది నిర్ణయం తీసుకునేంతవరకూ అంతర్జాతీయ టోర్నీలకు జ్వాలను ఎంపిక చేయకూడదని నిర్ణయించింది. దీనిపై జ్వాల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, తుది నిర్ణయం తీసుకునేంతవరకు జ్వాలను అన్ని టోర్నీల్లో ఆడించాలని బాయ్‌కు కోర్టు సూచించింది

ఈ ఉదంతం పై 2013 అక్టోబరు 11, శుక్రవారం హైదరాబాద్లో మీడియా సమావేశంలో పాల్గొన్న జ్వాల.. 'నేను ఫిక్సింగ్ చేయలేదు. డోపింగ్‌కూ పాల్పడలేదు. ఎవర్నీ హత్యా చేయలేదు. మరి నాపై జీవిత కాల నిషేధం వి ధించానుకోవడమేంటి' అని పేర్కొంది.

2014: కామన్వెల్త్ పతకం గెలుపు

[మార్చు]

అంతర్జాతీయ టోర్నీల్లో పలు పతకాలు సాధించినా... దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదని అగ్రశ్రేణి డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుతా జ్వాల వాపోయింది. ప్రస్తుతం వివాదాలు మరచి ఉబెర్ కప్‌పై దృష్టి సారించానని, రియో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా సన్నద్ధమవుతానని చెప్పింది.

ఇంతకుముందు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచినప్పటికీ... కేవలం ‘డబుల్స్’ ముద్రతో అంతగా లైమ్‌లైట్‌లోకి రాలేకపోయింది. దీనిపై బాహటంగానే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై విమర్శలు గుప్పించిన జ్వాల డబుల్స్ అంటే చిన్న చూపెందుకని మరోసారి ప్రశ్నించింది. దశాబ్దానికిపైగా నిలకడైన కెరీర్‌ను కొనసాగిస్తున్న జ్వాల దీనిపై మాట్లాడుతూ ‘నేను సాధించిన పతకాలకు నజరానాలు అడగడం లేదు. నగదు ప్రోత్సాహకాలు అక్కర్లేదు. నేనూ మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్‌ననే గుర్తింపు కావాలి. ‘సింగిల్స్’లాగే నా విజయాలను గౌరవిస్తే చాలు’ అని చెప్పింది. ఒలింపిక్స్ (లండన్)లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన తాను మేటి అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించానంది. అయినా... ఇంకా తానేం నిరూపించుకోవాలో అర్థం కావడం లేదని పేర్కొంది.

ఇలాంటి ఘనవిజయాలున్న తన స్థానాన్ని భర్తీచేసే క్రీడాకారిణి ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పరోక్షంగా బాయ్‌కు చురకలంటించింది. ‘ఎవరి మద్దతు లేకుండానే అనుకున్నవి సాధించాను. నా పతకాలను అసోసియేషన్ (బాయ్) గుర్తించకపోగా... లేని సాకుతో ఏకంగా వేటుకూ యత్నించారు. అయినా అన్నీ భరించాను. న్యాయపోరాటం చేశాను. ఏబీసీలో మళ్లీ నన్ను నేను నిరూపించుకున్నాను’ అని తెలిపింది. తన భాగస్వామి అశ్విని పొన్నప్ప కూడా రాణిస్తున్నా... ‘డబుల్స్’ నీడనే మగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. గత ఆరునెలలుగా నరకం అనుభవించానని తిరిగి ఏబీసీ పతకంతో విమర్శలకు ప్రదర్శనతోనే బదులిచ్చానని జ్వాల పేర్కొంది. మానసిక స్థైర్యంతోనే ఇది సాధ్యమైందని, తాజా పతకంతో తమ జోడి స్థైర్యం పెరిగిందని, ఇదే జోరుతో ముందడుగు వేస్తామని చెప్పింది.

మూలాలు

[మార్చు]
  1. "BWF content". Bwfcontent.tournamentsoftware.com. Archived from the original on 2011-08-12. Retrieved 2012-04-19.
  2. Sakshi (22 April 2021). "ఒక్కటైన ప్రేమ జంట..జ్వాల, విష్ణు విశాల్‌ పెళ్లి ఫోటోలు వైరల్‌". Sakshi. Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.
  3. 10TV (22 April 2021). "రెండో పెళ్లితో ఒక్కటైన గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ | Gutta Jwala Vishnu Vishal" (in telugu). Archived from the original on 22 ఏప్రిల్ 2021. Retrieved 22 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. http://www.123telugu.com/mnews/jwala-guttas-special-song-for-nithin.html
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-16. Retrieved 2013-02-05.
  6. http://timesofindia.indiatimes.com/sports/tournaments/indian-badminton-league/top-stories/Jwala-Gutta-upset-with-lewd-comments-from-fans/articleshow/22063595.cms
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-29. Retrieved 2013-08-27.
  8. http://www.mid-day.com/sports/2013/aug/260813-ibl-jwala-upset-with-lewd-comments-from-fans.htm
  9. http://www.dnaindia.com/sport/1899147/report-ibl-row-badminton-body-recommends-life-ban-on-jwala-gutta

వెలుపలి లంకెలు

[మార్చు]