గోల్కొండ కోటపై భారత స్వాతంత్ర్య వేడుకలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోల్కొండ కోటపై భారత స్వాతంత్ర్య వేడుకలు
గోల్కొండ కోటపై భారత స్వాతంత్ర్య వేడుకలు
2022లో గోల్కొండ కోటపై జరిగిన భారత స్వాతంత్ర్య వేడుకలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్
జరుపుకొనేవారుతెలంగాణ ప్రభుత్వం
రకంరాష్ట్ర వేడుకలు
ప్రాముఖ్యతభారత స్వాతంత్ర్య దినోత్సవం
జరుపుకొనే రోజు15 ఆగస్టు
ఉత్సవాలుజాతీయ పతాక ఆవిష్కరణ, కవాతులు, కళల ప్రదర్శన, భారత జాతీయగీతం ఆలాపన, ముఖ్యమంత్రి సందేశం
సంబంధిత పండుగభారత గణతంత్ర దినోత్సవం
ఆవృత్తివార్షికం

గోల్కొండ కోటపై భారత స్వాతంత్ర్య వేడుకలు, తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదులోని గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న వేడుకలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారిగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.

గోల్కొండ కోట ఎంపిక[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించబడేవి. ఆ వేడుకలలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ వారు మాత్రమే పాల్గొనేవారు. ఈ సందర్భంగా పోలీసుల కవాతులు, భారత సైన్య విన్యాసాలు, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు పతాకాలు అవార్డుల ప్రదానం వంటి కార్యక్రమాలు ఉండేవి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, గతంలో మాదిరిగా కాకుండా సరికొత్తగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఉద్దేశంతో ఢిల్లీలోని చారిత్రాత్మక ప్రదేశమైన ఎర్రకోటలో భారత ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుతున్నట్టుగానే, ఇకపై గోల్కొండ కోటలోనే జరపాలని హైదరాబాదులోని చారిత్రాత్మక ప్రదేశమైన గోల్కొండ కోటపై వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించాడు. అందుకనుగుణంగా అధికారులతో చర్చలు జరిపి, గోల్కొండ కోటపై వేడుకలు నిర్వహించాలని నిర్ణయించాడు.

2014, ఆగస్టు 5న సీఎం కేసీఆర్ గోల్కొండ కోటను సందర్శించాడు. కోటలోని తారామతి మజీద్‌ పైభాగంలో ఉన్న బాలా-ఈ-హిస్సార్‌ కింది భాగంలో జాతీయ పతాకావిష్కరణ చేయాలని, తారామతి మజీద్‌ ఎదురుగా ఉన్న విశాలమైన పచ్చిక బయలులో 10 నుండి 12 వేలమంది కూర్చోడానికి అనువుగా ఉంటుందని నిర్ణయించారు.[1]

నిర్వహణ ఏర్పాట్లు[మార్చు]

కోటపై 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి, వీటన్నింటినీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తోపాటు, స్థానిక పీఎస్ కు అనుసంధానం చేస్తారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు కలిసి కోట పరిధిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తారు. తాత్కాలిక సీసీ కెమెరాల పనితీరును తెలుసుకునేందుకు సీసీసీ అధికారులు ముఖ్యమంత్రి కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తారు. ఆగస్టు 14న పోలీసుశాఖ ఆధ్వర్యంలోని వివిధ కవాతు బృందాలు రిహార్సల్స్ నిర్వహిస్తాయి. సమాచారశాఖ ద్వారా లైవ్ కవరేజ్, ఎల్ఈడి స్కీృన్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మొదలైనవి కూడా ఏర్పాటుచేస్తారు. కోటలో భారీగా లైటింగుతోపాటు కోట జెండా రంగుల్లో కనిపించేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటుచేస్తారు. దీంతో కోట మొత్తం జాతీయజెండా రంగులలో మరింత శోభాయమానంగా కనిపిస్తుంది.[2]

ఆగస్టు 15 ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కోట వైపు వచ్చే వాహనాలను దారి మళ్ళిస్తారు. గోల్కొండ కోటకు వచ్చే వాహనాలకు పోలీసులు గోల్డ్‌, పింక్‌, బ్లూ, గ్రీన్‌ కలర్‌లో ఉండే నాలుగు రకాల పాసులు జారీ చేస్తారు. అన్ని రకాల పాస్‌ హోల్డర్లు తమ పాస్‌ను తమ కారుపై డిస్‌ప్లే చేయాల్సివుంటుంది. గోల్కోండ కోటలో సందర్శకుల కోసం సమాచారశాఖ ప్రత్యేక స్క్రీన్‌లను ఏర్పాటుచేస్తుంది. మంచినీటి సౌకర్యంతోపాటు అకస్మాత్తుగా వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా వాటర్‌ప్రూఫ్‌ టెంట్‌లను వేస్తారు.[3]

వేడుకలు[మార్చు]

ఆగస్టు 15వ తేదీ ఉదయం 10:30 గంటలకు గోల్కొండ కోటకు చేరుకున్న ముఖ్యమంత్రి పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తాడు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ, జాతీయ పతాకానికి గౌరవంగా నేషనల్ సెల్యూట్ ఉంటుంది. పతాకావిష్కరణ చేసే సమయంలో చుట్టుపక్కల బురుజులు, ఎత్తైన కట్టడాలపై నుండి తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించే విధంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలోని వివిధ కళారూపాలకు చెందిన వెయ్యిమందికి పైగా క‌ళాకారులతో కళారూపాల ప్ర‌ద‌ర్శ‌న కూడా ఉంటుంది.

  • 2014: 68వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా 2014 ఆగస్టు 15న ముఖ్యమంత్రి కేసీఆర్, తొలిసారిగా గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి, స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందించాడు. ఈ సందర్భంగా కామన్వెల్త్ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులను సన్మానించి వారికి నగదు పురస్కారాలను అందజేశాడు. ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ, ఆనంద్ లతోపాటు వారి కోచ్ శేఖర్ బాబును శాలువాలతో సత్కరించి ఒక్కొక్కరికి 25లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశాడు. దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని గోల్కొండ కోట వేదికగా ప్రారంభించిన కేసీఇర్, ఒక్కో జిల్లానుండి ఇద్దరు లబ్ధిదారులను ఎంపిక చేసి భూమి పట్టాలను అందించాడు.
  • 2015: కోటలోని రాణి మహల్‌ లాన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ వేదికకు ఎదురుగా 300 మంది గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు, పోలీసుల కవాతు కోసం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటుచేశారు. దాదాపు వెయ్యిమంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.[4] గోల్కొండ కోటలో 2015 వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల నిధులు విడుదల చేసింది. ఆగస్టు 15న ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి, స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందించాడు.
  • 2021: గోల్కొండ కోటపై ఆగస్టు 13న అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. గోల్కొండ కోటలోకి ప్రవేశించే ప్రతిద్వారం దగ్గర డోర్ ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు తనిఖీలు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి, స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందించాడు.
  • 2022: భారతదేశానికి స్వాతంత్ర్యం ల‌భించి 75 ఏళ్ళు పూర్త‌యిన్న సంద‌ర్భంగా భారత ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2022 ఆగస్టు 8 నుండి 22 వరకు 15రోజులపాటు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహం నిర్వహించింది. ఇందులో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, వారి పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు రూపొందించారు. పంద్రాగస్టు వేడుకలు జరిగే కోట మొత్తాన్ని త్రివర్ణ వస్త్రంతో ముస్తాబు చేశారు. ఆగస్టు 15న గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, [5] తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని అందించాడు.[6]
  • 2023: ఆగస్టు 15న గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని అందించాడు.[7][8]

మూలాలు[మార్చు]

  1. Webdunia (2014-08-05). "గోల్కొండ కోట మీద పంద్రాగస్టు.. కేసీఆర్ విజిట్..ఆగస్టు 15కు సిద్ధం!". Webdunia. Archived from the original on 2022-08-15. Retrieved 2022-08-15.
  2. Kommuru, Jyothi (2022-08-14). "స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం". www.hmtvlive.com. Archived from the original on 2022-08-15. Retrieved 2022-08-15.
  3. telugu, NT News (2022-08-14). "మువ్వన్నెల రెపరెపలు". Namasthe Telangana. Archived from the original on 2022-08-14. Retrieved 2022-08-21.
  4. "పోలీసుల ఆధీనంలో గోల్కొండ". Sakshi. 2015-08-03. Archived from the original on 2015-08-23. Retrieved 2022-08-15.
  5. "CM KCR: దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామి: సీఎం కేసీఆర్‌". EENADU. 2022-08-15. Archived from the original on 2022-08-15. Retrieved 2022-08-15.
  6. telugu, NT News (2022-08-15). "స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్‌ ప్రసంగం". Namasthe Telangana. Archived from the original on 2022-08-15. Retrieved 2022-08-15.
  7. Desk, HT Telugu (2023-08-15). "TS Independence Day: గోల్కొండ కోటపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా". Hindustantimes Telugu. Archived from the original on 2023-08-15. Retrieved 2023-08-18.
  8. "ఆశీర్వదించండి!". Sakshi. 2023-08-16. Archived from the original on 2023-08-15. Retrieved 2023-08-18.