చేనేత లక్ష్మి పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేనేత లక్ష్మి పథకం
Chenetha Lakshmi Inauguration by KTR.jpg
చేనేత లక్ష్మి పథకం ప్రారంభించిన మంత్రి కెటీఆర్
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
స్థాపనఆగష్టు 7, 2016
వెబ్ సైటుచేనేత లక్ష్మి పథక అధికారిక జాలగూడు
నిర్వాహకులుతెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం, తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఈ చేనేత లక్ష్మి పథకం. చేనేత లక్ష్మి పథకంలో వస్ర్తాలను తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం షోరూంలలో కొనుగోలు చేయవచ్చు. ఈ పథకం కింద ప్రతి నెలా రూ.1000 చొప్పున 9 నెలలు చెల్లిస్తే.. తదుపరి రూ. 14400 విలువ వస్ర్తాలను అందిస్తారు. ఒకవేళ నెలకు రూ. 1000 వంతున నాలుగు నెలలు రూ. 4000 చెల్లిస్తే, తదుపరి రూ. 5400 విలువైన వస్ర్తాలు అందిస్తారు.

ప్రారంభం[మార్చు]

చేనేత పనిని గమనిస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్

2016, ఆగస్టు 7న తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళి, ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా చేనేత లక్ష్మి పథకం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో చేనేత ఉత్పత్తుల ధరలు తెలియజేసే పుస్తకం కూడా ఆవిష్కరించబడింది.[1]

వారసత్వ సంపదగా సంక్రమించిన చేనేత వృత్తిని, సంస్కృతిని కాపాడే నేతన్నలు పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్ చీరలు, నారాయణ పేట, సిద్ధిపేట లోని గొల్ల భామ చీరలు నేస్తారు. అమెరికాలోని వైట్ హౌస్ లో పోచంపల్లి, ఇక్కత్ వస్త్రాలను ఉపయోగిస్తున్నాకానీ, భారదేశంలో దేశంలో చేనేత వస్తాలకు గుర్తింపు లభించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సహకార సంఘాలకు అవసరమైన మూల ధనాన్ని పావలా వడ్డీ రూపంలో అందజేయడమేకాకుండా, 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు రూ. 1000 చొప్పున ఆసరా పింఛన్లు మంజూరు చేస్తుంది.

ఆన్‌ లైన్‌ లో చేనేత లక్ష్మి[మార్చు]

చేనేత వస్ర్తాల విక్రయాలు పెరిగే విధంగా చేనేత లక్ష్మి పథకాన్ని ఆన్‌ లైన్‌ లోనూ అందుబాటులోకి తీసుకరావాలని తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం అధికారులు నిర్ణయించారు. టెస్కో అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ సభ్యత్వం తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో సభ్యత్వం తీసుకోవడంతోపాటు ఆన్‌ లైన్‌ లోనే ప్రతి నెల చెల్లించే అవకాశం కలిపించారు.[2]

ఫలితాలు[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న టెస్కో షోరూంలతోపాటు ప్రతి జిల్లా కలెక్టరేట్‌లోనూ ఒక్కో స్టాల్ ను టెస్కో ప్రారంభించింది. దీంతో డిసెంబరు 26 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.48.48లక్షల అమ్మకాలు జరిగాయి.[2]

వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు[మార్చు]

తెలంగాణలోని చేనేతరంగాన్ని ఆదుకోవడంకోసం ప్రజాప్రతినిధులు వారంలో ఒకరోజు చేనేత వస్ర్తాలను ధరించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

మూలాలు[మార్చు]

  1. న్యూస్ మార్కెట్. "చేనేత వస్త్ర వైభవానికై 'చేనేత లక్ష్మి' పథకం ప్రారంభం". newsmakertv.in. Archived from the original on 11 జూలై 2017. Retrieved 4 January 2017.
  2. 2.0 2.1 నమస్తే తెలంగాణ. "ఆన్‌లైన్‌లో చేనేత లక్ష్మి". Retrieved 4 January 2017.