నేతన్న బీమా పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేతన్న బీమా పథకం
ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
దేశంభారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణలోని నేత కార్మికులు
స్థాపన2022, ఆగస్టు 07
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

నేతన్న బీమా పథకం, తెలంగాణ రాష్ట్ర నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఏ కారణంతోనైనా నేత కార్మికుడు చనిపోతే, నామినీకి ఎల్ఐసీ నుంచి 10 రోజుల్లోగా 5 లక్షల బీమా పరిహారం అందించడానికి ఈ పథకం రూపొందించబడింది.[1] తెలంగాణ ప్రభుత్వం ఒక్కో నేత కార్మికుడి కోసం 5,426 రూపాయలను ప్రీమియంగా చెల్లించి, 5 లక్షల రూపాయలను బీమాగా అందిస్తోంది. నేత కార్మికుడికి 5 లక్షల బీమా కవరేజ్ అందించిన దేశంలోని తొలిరాష్ట్రం తెలంగాణ.

2022, ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించగా, ఆగస్టు 8 నుండి ఈ పథకం అమలు చేయబడింది.[2] ప్రారంభంలో 18-59 ఏళ్ళ వయస్సు వారికి ఈ పథకం వర్తింజేశారు,[3] అయితే 59 సంవత్సరాల వయోపరిమితిని 75 సంవత్సరాలకు పొడగించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించిన ప్రభుత్వం, నేత కార్మికుల బీమాకోసం నిర్దేశించిన వయోపరిమితిని 75 సంవత్సరాలకు పొడగించుతున్నట్లు 2023, ఆగస్టు 7న జరిగిన చేనేత దినోత్సవం వేడుకలలో ప్రకటించింది.[4][5]

రూపకల్పన

[మార్చు]

2021 జూలై 4న రాజన్న జిల్లాలోని సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, నేత కార్మికులకు ప్రభుత్వం తరపున బీమా ధీమా కల్పించాలన్న ఉద్దేశంతో రైతుబీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు.[6] 2022 తెలంగాణ బడ్జెటులో ఈ పథకానికి ప్రీమియం కింద 50 లక్షల రూపాయలు కేటాయించి,[7] ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటుచేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 55,072 మంది నేత కార్మికులకు బీమా కల్పించాలని, ఒక్కో నేత కార్మికుడికి జీఎస్టీ రూ. 828తో కలిపి మొత్తం రూ. 5,426 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని, ప్రతి సంవత్సరం 55,072 మంది నేత కార్మికుల ప్రీమియం రూ. 29.88 కోట్లను ఎల్‌ఐసీకి ప్రభుత్వమే చెల్లించాలని సబ్‌కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించింది.[8] ఈ పథకంకోసం 2022 మే 2న ప్రభుత్వం 29.88 కోట్ల రూపాయలు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ప్రారంభం

[మార్చు]

రాష్ట్రంలోని 80వేలకు పైగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు భరోసా నిస్తున్న ‘నేతన్న బీమా పథకాన్ని’ పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని 2022 ఆగస్టు 7న రాష్ట్ర చేనేత జౌళి శాఖలమంత్రి కల్వకుంట్ల తారకరామారావు వర్చువల్‌గా ప్రారంభించాడు. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. ఈ సందర్భంగా హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖ కార్యదర్శి, కమిషనర్‌ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌, ఎల్‌ఐసీ ప్రతినిధి శివ నాగప్రసాద్‌ నేతన్న బీమా పథకానికి సంబంధించిన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకొన్నారు. ఈ పథకానికి సంబంధించి ప్రీమియంగా 50 కోట్ల రూపాయల విలువైన చెక్కును ఎల్‌ఐసీ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్ చింతకింది మల్లేశం, చేనేత నాయకులు వెంకటేశ్వర్లు, మండల శ్రీరాములు, సాంబారి సమ్మారావు, బోల్ల శివశంకర్‌, కర్నాటి విద్యాసాగర్‌, యాదగిరి, ఎర్రమాద వెంకన్న నేత, సహా పలుసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.[9][10]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Telugu, TV9 (2021-07-31). "KCR Chenetha Bheema: రైతు బీమా తరహాలోనే చేనేత కార్మికులకు బీమా అందిస్తాం.. స్పష్టం చేసిన సీఎం కేసీఆర్‌". TV9 Telugu. Archived from the original on 2021-07-31. Retrieved 2022-05-02.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. telugu, NT News (2022-08-08). "చేనేతకు ఎల్లవేళలా బాసట". Namasthe Telangana. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-08.
  3. "బీమాతో ధీమా, ఆశలు రేకెత్తిస్తోన్న సీఎం కేసీఆర్‌ ప్రకటన". Sakshi. 2021-07-18. Archived from the original on 2021-07-20. Retrieved 2022-05-02.
  4. telugu, NT News (2023-08-08). "Minister KTR | చేనేత వద్దు.. అన్నీ రద్దు అనేలా వ్యవహరిస్తున్న కేంద్రం: మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-08-08. Retrieved 2023-08-08.
  5. "నేతన్నలకు ఆరోగ్య కార్డు". EENADU. 2023-08-07. Archived from the original on 2023-08-07. Retrieved 2023-08-08.
  6. Telugu, ntv (2021-07-05). "చేనేత బీమా పథకం : సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం". NTV. Archived from the original on 2022-05-02. Retrieved 2022-05-02.
  7. "Telangana Budget 2022: నేతన్నలకు బీమా భరోసా". EENADU. 2022-03-08. Archived from the original on 2022-03-08. Retrieved 2022-05-02.
  8. telugu, NT News (2022-04-30). "55,072 మందికి చేనేత బీమా!". Namasthe Telangana. Archived from the original on 2022-05-02. Retrieved 2022-05-02.
  9. telugu, NT News (2022-08-08). "నేతన్నకు బీమా ధీమా". Namasthe Telangana. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-08.
  10. "KTR: 'నేతన్నకు బీమా' దేశానికి ఆదర్శం". EENADU. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-08.