జాతీయ చేనేత దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ చేనేత దినోత్సవం
జాతీయ చేనేత దినోత్సవం
చేనేత
జరుపుకొనేవారుభారతదేశం
ప్రారంభం2015
జరుపుకొనే రోజుఆగస్టు 7
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

జాతీయ చేనేత దినోత్సవం (ఆంగ్లం: National Handloom Day) ఆగస్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు.[1] భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటుచేయడం జరిగింది.

మగ్గంపై చీరను నేస్తున్న చేనేత కళాకారుడు (మోత్కూర్, యాదాద్రి జిల్లా, తెలంగాణ)

ప్రారంభం

2015, ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 2012-14 సంవత్సరాల్లో చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన 72మందికి అవార్డులు (వీరిలో 16 మందికి సంత్ కబీర్ పురస్కారాలు) ప్రదానం జరిగింది.[2]

చరిత్ర

భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. భారత స్వాతంత్ర్యోద్యమంలో చేనేత అహింసాయుత ఉద్యమానికి నాంది పలికిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాపోలు ఆనంద భాస్కర్ 2005లో చేనేత దినోత్సవానికి సంబంధించిన పరిశోధన చేసి చారిత్రిక ఆనవాళ్లను శోధించాడు, చేనేత దినోత్సవానికి సరైన తేదీ కోసం అధ్యయనం చేశాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చింది. మొదటిసారిగా 1905లో బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కలకత్తాలోని టౌన్‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతోపాటూ దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు.[3] అలా విదేశి వస్తు బహిష్కరణలో కీలకపాత్ర వహించిన ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా చేయాలని ఆనంద భాస్కర్ ప్రతిపాదించాడు.[4][5] ఈ దినోత్సవానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించాలని తడ్క యాదగిరి, ఎర్రమాద వెంకన్న నేతతోపాటు మరికొందరిని ప్రోత్సహించాడు.[6][7]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2006వ సంవత్సరం నుండి స్థానిక చేనేత సంఘ నాయకులతో కలిసి వివిధ కార్యక్రమాలను నిర్వహించిన ఆనంద భాస్కర్, ఆగస్టు 7వ తేదీకి ఉన్న చారిత్రిక ప్రాధాన్యతను అందరికి తెలియజేసి, 2006 నుండి చేనేత దినోత్సవ కార్యక్రమం క్రమంతప్పకుండా జరిగే విధంగా రూపకల్పన చేశాడు.

అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి శ్రీ శంకర్ సింగ్ వాఘేలా, ఎల్.కె.అద్వానీ లతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆనంద భాస్కర్ ప్రయత్నాన్ని అభినందిస్తూ సందేశాలు పంపారు. 2008, ఆగస్టు 7న హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన చేనేత దినోత్సవ వేడుకలకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డి పాల్గొన్నాడు.

2012, ఏప్రిల్ 2న ఆనంద భాస్కర్ కు రాజ్యసభ సభ్యునిగా అవకాశం రావడంతో చేనేత దినోత్సవ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 2012, ఏప్రిల్ 6న రవీంద్రభారతిలో ఎర్రమాద వెంకన్న నేత సారథ్యంలో చేనేత దినోత్సవ చరిత్ర, ఆవశ్యకతను వివరిస్తూ స్వదేశీయం సంగీత నృత్య రూపకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి అప్పటి రాజ్యసభ సభ్యులు రాపోల్ ఆనంద భాస్కర్, చిరంజీవి ముఖ్య అతిధులుగా హజరయ్యారు. ఆ తరువాత చేనేత దినోత్సవానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన అన్ని జాతీయ కార్యక్రమాలకు ఆనంద భాస్కర్ నాయకత్వం వహించాడు. వివిధ రాష్ట్రాలలోని జాతీయ నాయకులను కలిసి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని కల్పించాడు.

2012, ఆగస్టు 7న ఆనంద భాస్కర్ ఆద్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా చేనేత దినోత్సవం జరుపబడింది. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారులను, రాజకీయ దిగ్గజాలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఎర్రకోట నుండి రాజ్ ఘాట్ వరకు చేనేత వాక్ నిర్వహించి జాతీయ స్థాయిలో ఈ దినోత్సవంపై ఆసక్తిని కలిగించాడు. 2014లో అదే రాజ్ ఘాట్ లో చేనేత దినోత్సవ ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి కేంద్ర జౌళీ శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రధానితో చర్చించి చేనేత దినోత్సవాన్ని అధికారికం చేస్తామని మాటిచ్చాడు.

2014 నుండి 2015 వరకు ప్రభుత్వాధికారులపై ఒత్తిడి పెంచిన ఆనంద భాస్కర్, 2015 మార్చి 3న రాజ్యసభలో ఆగస్టు 7ని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించాడు.[8][9] అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి, అందులో రాపోలు ఆనంద భాస్కర్ ని సభ్యునిగా చేర్చి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరింది. చేనేత దినోత్సవానికి సంబంధించిన డాక్యుమెంటేషన్, రికార్డులు, పూర్వ చరిత్ర, సంబంధిత చేనేత జౌళిశాఖామంత్రి అప్పటి కేంద్ర వస్త్ర, జౌళి శాఖామంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ కి అందించాడు. ఆనంద భాస్కర్ సమర్పించిన పత్రాలు రికార్డులను పరిశీలించిన శాఖ అధికారులు, తమ నివేదికను ప్రధానమంత్రికి సమర్పించారు.

ఆనంద భాస్కర్ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రాంత ప్రభుత్వాల అంగీకారంతో 2015, జూలై 29న భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారిక గెజిట్ విడుదల చేసింది.[10] 2015, ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో అధికారికంగా ప్రారంభించారు.[11] ఈ అధికారిక జాతీయ పండుగకు కేంద్ర మంత్రులు, తమిళనాడు రాష్ట్ర మంత్రులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చేనేత కళాకారులు పాల్గొన్నారు. ఆనాటి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నాయి.

తెలంగాణలో

ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరుపబడుతోంది. ఈ సందర్భంగా 10 రోజులపాటు జాతీయ ఎగ్జిబిషన్‌ కూడా నిర్వహించబడుతుంది. 2018 నుండి ఈ దినోత్సవం రోజున తెలంగాణకు చెందిన నేత కళాకారులకు ప్రభుత్వం తరపున కొండా లక్ష్మణ్‌బాపూజీ పురస్కారాలు (అవార్డుతోపాటు 25వేల న‌గ‌దు పుర‌స్కారం) అందజేస్తారు.[12] 2023 వరకు 162మంది కళాకారులకు ఈ పురస్కారాలు అందజేయబడ్డాయి.

 • 2022: ప్రమాదవశాత్తు చేనేత కార్మికుడు మరణించినా, సహజమరణం పొందినా 5 లక్షల రూపాయల పరిహారం అందేలా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నేతన్న బీమా పథకంను 2022 ఆగస్టు 7న రాష్ట్ర చేనేత జౌళి శాఖలమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించాడు. చేనేత మిత్ర, పావలావడ్డీ, నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ లబ్ధిదారులకు చెక్కులనూ, 28మంది చేనేత కార్మికులు, వృత్తి నిపుణులకు కొండా లక్ష్మణ్‌బాపూజీ అవార్డులను అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్ చింతకింది మల్లేశం, చేనేత నాయకులు వెంకటేశ్వర్లు, మండల శ్రీరాములు, సాంబారి సమ్మారావు, బోల్ల శివశంకర్‌, కర్నాటి విద్యాసాగర్‌, యాదగిరి, ఎర్రమాద వెంకన్న నేత, సహా పలుసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.[13][14]
 • 2023: ఉప్పల్‌ శిల్పారామం ప్రాంతంలో రూ.50 కోట్ల వ్యయంతో 2,576 చదరపు గజాల విస్తీర్ణంలో చేనేత భవనం (చేనేత కన్వెన్షన్‌ సెంటర్‌), రూ.15 కోట్లతో 500 చదరపు గజాల స్థలంలో చేనేత-హస్తకళల మ్యూజియం నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశాడు. అనంతరం మన్నెగూడలోని బీఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొని రాష్ట్రంలోని చేనేత కార్మికులు కొత్త తరహా మగ్గాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించడంకోసం రూపొందించబడిన తెలంగాణ చేనేత మగ్గం పథకాన్ని ప్రారంభించాడు.[15] నేతన్న బీమా పథకం వయో పరిమతిని 59 నుండి 75 వయస్సుకు పెంచుతున్నట్లు, చేనేత మిత్ర పథకం ద్వారా అందించే 50 శాతం సబ్సిడీకీ బదులుగా మగ్గానికి నెలకు రూ.3వేలు అందజేయనున్నట్లు, కార్మికులు దహన సంస్కారాల కోసం అందించే ఆర్థక సహాయాన్ని రూ.12,500 నుండి రూ.25వేలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25వేల వరకు వైద్య సేవలు అందించనున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా చేనేత మిత్ర, పావలావడ్డీ, నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ లబ్ధిదారులకు చెక్కులనూ, 36మంది చేనేత కార్మికులు, వృత్తి నిపుణులకు కొండా లక్ష్మణ్‌బాపూజీ అవార్డులను అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్సీ రమణ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చింతా ప్రభాకర్, పవర్ లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌ గూడూరి ప్రవీణ్ లతోపాటు పలు చేనేత సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[16]

ఇతర వివరాలు

 1. చేనేతరంగంలో విశిష్ట కృషిచేసిన చేనేత కార్మికులను గౌరవిస్తూ 2012నుంచి ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్‌ అవార్డులను జాతీయస్థాయిలో అందిస్తున్నారు.
 2. 2018లో యాదాద్రి - భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారులు కుట్టులేని జాతీయ జెండాను రూపొందించారు. 24 ఆకులతో కూడిన అశోక చక్రం సహా జాతీయ పతాకమంతా ఎలాంటి కుట్టులేకుండా మగ్గంపై తయారుచేశారు.[17]

ఇవీ చూడండి

మూలాలు

 1. "PM Modi to launch National Handloom Day on August 7 in Chennai". The Economic Times. 2015-07-31. ISSN 0013-0389. Archived from the original on 2015-08-03. Retrieved 2023-08-06.
 2. సాక్షి (13 August 2015). "ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం". Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.
 3. "Modi's Kashi to celebrate first National Handloom Day on August 7". The Times of India. 2015-08-04. ISSN 0971-8257. Archived from the original on 2015-11-14. Retrieved 2023-08-06.
 4. "ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం". telugu.getlokalapp.com. 2020-08-07. Retrieved 2023-08-06.
 5. admin (2020-08-07). "చేనేత అభివృద్ధే లక్ష్యంగా పోరాడిన వ్యక్తి రాపోలు ఆనంద్ భాస్కర్". RBM Creative Media (in ఇంగ్లీష్). Archived from the original on 2023-08-06. Retrieved 2023-08-06.
 6. ఆంధ్రజ్యోతి (6 August 2015). "చేనేతకూ వచ్చింది ఒక రోజు..." Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.
 7. ఆంధ్రజ్యోతి (7 August 2017). "చేనేత రంగానిది సుధీర్ఘ చరిత్ర..." Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.
 8. RAPOLU, ANANDA BHASKAR (2016-04-28). "Demand for declaring August 7 as National Handloom Weavers' Day". RajyaSabha Debate (in English): 2 (475-476). Archived from the original on 2023-08-06 – via rsdebate.nic.in.{{cite journal}}: CS1 maint: unrecognized language (link)
 9. Sucheta, Priyadarsini. "National Handloom Day 2015" (PDF). magazines.odisha.gov.in. Archived from the original (PDF) on 2023-08-06. Retrieved 2023-08-06.
 10. "PM Modi declares August 7 National Handloom Day to mark Swadeshi movement". 2015-08-07. Archived from the original on 2015-08-08. Retrieved 2023-08-06.
 11. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్-జనవాక్యం (6 August 2018). "వస్త్రం అస్త్రమైన రోజు". www.andhrajyothy.com. యర్రమాద వెంకన్న నేత. Archived from the original on 19 September 2019. Retrieved 19 September 2019.
 12. telugu, NT News (2021-08-07). "తెలంగాణ నేత‌న్న‌ల‌కు దేశంలోనే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2021-08-07. Retrieved 2022-08-08.
 13. telugu, NT News (2022-08-08). "నేతన్నకు బీమా ధీమా". Namasthe Telangana. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-08.
 14. "KTR: 'నేతన్నకు బీమా' దేశానికి ఆదర్శం". EENADU. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-08.
 15. "నేతన్నలకు ఆరోగ్య కార్డు". EENADU. 2023-08-07. Archived from the original on 2023-08-07. Retrieved 2023-08-07.
 16. telugu, NT News (2023-08-08). "Minister KTR | చేనేత వద్దు.. అన్నీ రద్దు అనేలా వ్యవహరిస్తున్న కేంద్రం: మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-08-08. Retrieved 2023-08-08.
 17. ఆంధ్రజ్యోతి (4 August 2018). "కుట్టు లేని త్రివర్ణ పతాకం". Archived from the original on 7 August 2018. Retrieved 7 August 2018.