లాల్ కృష్ణ అద్వానీ

వికీపీడియా నుండి
(ఎల్.కె.అద్వానీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లాల్ కృష్ణ ఆడ్వాణీ
లాల్ కృష్ణ అద్వానీ


పార్లమెంటు సభ్యుడు,
మాజీ ఉపప్రధాని
మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు
నియోజకవర్గం గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1927-11-08) 1927 నవంబరు 8 (వయసు 97)
కరాచి
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
కమల అద్వానీ
(m. 1965; died 2016)
సంతానం ప్రతిభా అద్వానీ (కూతురు)
జయంత్ అద్వానీ (కుమారుడు)
నివాసం ఢిల్లీ
పురస్కారాలు భారతరత్న
పద్మ విభూషణ్
జూన్ 6, 2008నాటికి

భారతదేశ రాజకీయల్లో "లోహ పురుషుడు" గా ప్రసిద్ధి గాంచిన లాల్ కృష్ణ ఆడ్వాణీ 1927, జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సం.ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యా. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందినాడు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవి పొందినాడు. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్ బిహారి వాజపేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు. 2009 ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఈయనను ప్రకటించారు. 15వ లోక్‌సభ ఎన్నికలలో గుజరాత్ లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి[1] విజయం సాధించాడు.

ఆయనకు 2024 ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది.[2] రాష్ట్రపతి భవన్‌లో మార్చి 30న జరిగిన అవార్డుల ప్రధానోత్సవానికి వయోభారం, అనారోగ్యం కారణంగా ఆయన హాజరుకాలేకపోవడంతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 31న స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లి ఈ అవార్డును అందజేసింది.[3]

ప్రారంభ జీవనం

[మార్చు]

1927 నవంబరు 8న సింధు ప్రాంతంలోని కరాచీ లోని ఒక సంపన్న వ్యాపారవేత్త కిషన్ చంద్ అద్వానీ, జియాని దేవి దంపతులకు జన్మించారు. కరాచీ, హైదరాబాద్ (పాకిస్థాన్) పట్టణాల్లో విద్యనభ్యసించి 15 సం.ల ప్రాయంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్)లో ప్రవేశించి ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలను పూర్తిగా ఒంటపట్టించుకొని ఇంజనీరింగ్ చదువును కూడా మానివేసి పూర్తిగా దేశ రాజకీయాలకే అంకితమయ్యాడు. దేశ విభజన అనంతరం 12 సెప్టెంబర్, 1947 నాడు భారత్ కు తరలివచ్చాడు. మహాత్మా గాంధీ హత్య అనంతరం అనేక మంది ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలతో పాటు అద్వానీ కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేశాడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సహకారంతో మంచి కార్యకర్తగా పేరుపొంది, రాజస్థాన్ జనసంఘ్ పార్టీ అధ్యక్షుడికి సలహాదారునిగా నియమించబడ్డాడు.

1960- 70 దశాబ్దం

[మార్చు]

1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జన సంఘ్ తరపున ఎన్నికై మరుసటి సంవత్సరమే ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడయ్యాడు. 1970లో రాజ్యసభకు ఎన్నికైన అద్వానీ జనసంఘ్ లో ప్రముఖ పాత్ర వహించి దేశ ప్రజలను ఆకర్షించాడు. 1975లో మీసా చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. ఎమర్జెన్సీ కాలంలో తన అనుభవాలను వివరిస్తూ అద్వానీ ది ప్రిజనర్స్ స్క్రాప్ బుక్ గ్రంథాన్ని రచించారు. 1976లో జైలు నుంచే రాజ్యసభకు ఎన్నికైనాడు. ఎమర్జెన్సీ అనంతరం జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనం కావడంతో అద్వానీ 1977లో జనతా పార్టీ తరపున పోటీ చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేశారు. ఆ విధంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పనిచేసిన మొట్టమొదటి కాంగ్రెసేతర వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. జనతా పార్టీ పతనంతో జనసంఘ్ పార్టీ వేరుపడి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించడంతో అద్వానీకి దేశ రాజకీయాలలో ముఖ్య పాత్ర వహించే అవకాశం కల్గింది.

1980 దశాబ్దం

[మార్చు]

కాని ప్రారంభంలో పార్టీ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. 1982లో పార్టీకి లభించిన లోక్‌సభ స్థానాల సంఖ్య రెండు మాత్రమే. 1986లో అద్వానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ స్థానాల సంక్యను 86 కు పెంచగలిగినాడు. అద్వానీ లోక్‌సభలోకి తొలి సారిగా ప్రవేశించినది కూడా 1989లోనే.

అయోధ్య రథయాత్ర

[మార్చు]

అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన సంఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990, సెప్టెంబర్ 25న [4] ప్రారంభించిన అయోధ్య రథయాత్ర బీహార్ సరిహద్దులో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్న రథయాత్ర ఆగిపోయిననూ అప్పటికే అద్వానీ విశేష ప్రజాదరణను పొందినాడు. ఆ తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించడం, ఆ తర్వాత 1991 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత అద్వానీదే. 1992 డిసెంబరు 6న అయోధ్యలో జరిగిన కరసేవ సంఘటనలో అద్వానీ అరెస్ట్ అయ్యాడు.

ఆ తర్వాత పరిణామాలు భారతీయ జనతా పార్టీని కానీ అద్వానీని కానీ అంతగా ప్రభావితం చేయలేదు. 2004 ఎన్నికలలో పరాజయం తర్వాత పార్టీ సీనియర్ నాయకులే అద్వానీపై విమర్శలు గుప్పించారు. ఉమాభారతి, మదన్ లాల్ ఖురానా లాంటి సీనియర్ నాయకులు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. పాకిస్తాన్ పర్యటన సందర్భంగా జిన్నా సమాధి వద్ద విజిటర్స్ బుక్ లో అద్వానీ రాసిన వ్యాఖ్యలు దేశంలో కలకలం రేపాయి.

పార్టీ అధ్యక్ష పదవిలో అద్వానీ

[మార్చు]

అద్వానీ మొట్టమొదటి సారిగా 1986లో అటల్ బిహారీ వాజపేయి నుంచి పార్టీ పగ్గాలు స్వీకరించి 1991 వరకు, రెండో పర్యాయము 1993 నుంచి 1998 వరకు పార్టీ అధిపతిగా పనిచేశారు. చివరగా మూడో పర్యాయము 2004 నుంచి 2005 వరకు పార్టీని నడిపించి ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్కు తన స్థానాన్ని అప్పగించాడు. తన అధ్యక్ష పదవీ కాలంలో పార్టీకి ఉచ్ఛస్థితిలోకి తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ ఉక్కు మనిషిగా పేరుగాంచాడు.

పార్లమెంటు సభ్యుడుగా

[మార్చు]

1970లో తొలిసారిగా రాజ్యసభ ద్వారా లోక్‌సభ లోకి ప్రవేశించారు. 1989 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1980 ప్రాంతంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా తనపాత్రను పోషించారు. 1989లో తొలిసారిగా లోక్‌సభ లోకి ప్రవేశించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనాడు.

కేంద్ర మంత్రిగా అద్వానీ

[మార్చు]

1977లో మురార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వంలో తొలిసారిగా కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. ఆ తర్వాత అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో 3 పర్యాయాలు కూడా కేంద్ర మంత్రిగా హోంశాఖను సమర్థవంతంగా నిర్వహించారు. 1998-2004 మధ్య ఉప ప్రధాని పదవి బాధ్యతలు కూడా చేపట్టారు.

నాదేశం నా జీవితం

[మార్చు]

2008లో "మై కంట్రీ, మై లైఫ్" పేరుతో స్వీయచరిత్రను విడుదల చేశాడు. 986 పేజీల పుస్తకంలో తన రాజకీత జీవితపు అంతరంగాన్ని విపులంగా వివరించాడు.[5]

ప్రధాని అభ్యర్థిగా అద్వానీ

[మార్చు]

2007, డిసెంబర్ 10 నాడు పార్టీ కేంద్ర కార్యవర్గం సమావేశమై అటల్ బిహారీ వాజపేయి వారసుడిగా అద్వానీ పేరును ఖరారు చేసింది. అనారోగ్య కారణాలపై నాయకత్వ బాధ్యతల నుంచి వైదొల్గాలని నిర్ణయించుకున్నందున, లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు రావచ్చన్న దృష్టితో అద్వానీ లాంటి వ్యక్తికి ఈ బాధ్యతలు కట్టబెట్టాలని వాజపేయి భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డుకు సందేశం పంపారు. అద్వానీ అభ్యర్థిత్వాన్ని బోర్డు కూడా ఆమోదించింది. పాకిస్తాన్ పర్యటనలో జిన్నాకు లౌకికవాదిగా పేర్కొని సంఘ్ పరివార్ చే ఆగ్రహానికి గురైన అద్వానీ ఆ తర్వాత అధ్యక్ష పదవికి కూడా వదులుకోవాల్సి వచ్చింది. కాని అదే సంఘ్ పరివార్ అద్వానీకి మద్దతు ప్రకటించింది. లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడే అద్వానీ తాను ప్రధాని పదవికి సహజ అభ్యర్థిగా చెప్పుకున్నారు[6]. దాంతో సహచరులు ఆయనపై తిరగబడ్డారు. మరళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా లాంటి నేతలు అద్వానీ ప్రకటనపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మురళీ మనోహర్ జోషినే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం విశేషం.

అవార్డులు, బిరుదులు

[మార్చు]
  • 1999లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.
  • 2024లో భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నాడు

అద్వానీ జీవితంలో కీలక ఘట్టాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-04-20. Retrieved 2009-03-29.
  2. "LK Advani: ఎల్‌.కే ఆడ్వాణీకి భారతరత్న | lk advani to be conferred bharat ratna says modi". web.archive.org. 2024-02-03. Archived from the original on 2024-02-03. Retrieved 2024-02-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Eenadu (31 March 2024). "ఎల్‌.కె. ఆడ్వాణీకి భారతరత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి". Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-08-22. Retrieved 2009-03-29.
  5. ఈనాడు దినపత్రిక . తేది మార్చి 26, 2008
  6. ఈనాడు దినపత్రిక లో వచ్చిన వార్త తేది 11 డిసెంబర్, 2007

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.