Jump to content

జాతీయ రహదారి 58 (పాత సంఖ్య)

వికీపీడియా నుండి
Indian National Highway 58
58
National Highway 58
ముదురు మీలం రంగులో చూపిన జాతీయ రహదారి 58 తో భారత రోడ్డు మ్యాపు
మార్గ సమాచారం
పొడవు538 కి.మీ. (334 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
దక్షిణం చివరఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్
ఉత్తరం చివరబద్రీనాథ్ కు ఉత్తరాన ఉన్న మానా కనుమ, ఉత్తరాఖండ్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఉత్తర ప్రదేశ్: 165 కి.మీ. (103 మై.)
ఉత్తరాఖండ్: 373 కి.మీ. (232 మై.)
ప్రాథమిక గమ్యస్థానాలుఘజియాబాద్ - మీరట్ - ముజఫర్‌నగర్ - రూర్కీ - హరిద్వార్ - రిషికేశ్ - జోషిమఠ్ - బద్రీనాథ్ - మానా కనుమ
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 57A ఎన్‌హెచ్ 59

జాతీయ రహదారి 58 (ఎన్‌హెచ్ 58) భారతదేశంలో జాతీయ రహదారుల సంఖ్యలను మార్చక ముందు జాతీయ రహదారిగా ఉండేది. ఇది న్యూఢిల్లీ సమీపంలో, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ను బదరీనాథ్, ఇండో-టిబెట్ సరిహద్దు సమీపంలో ఉత్తరాఖండ్‌లోని మానా కనుమతో కలిపేది. ఈ హైవే బదరీనాథ్ ఆలయానికి ఉత్తరాన మానా గ్రామం నుండి బయలుదేరి, బదరీనాథ్, జోషిమఠ్, చమోలి, విష్ణుప్రయాగ, నందప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, శ్రీనగర్, దేవప్రయాగ, రిషికేశ్, హరిద్వార్, రూర్కీ, ముజఫర్‌నగర్, మీరట్ మోడీనగర్‌ల గుండా ఢిల్లీకి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘజియాబాద్ వద్ద ముగుస్తుంది.

ఎన్‌హెచ్ 58 మొత్తం పొడవైన 538 కి.మీ. లలో 165 కి.మీ. ఉత్తరప్రదేశ్‌లో, 373 కి.మీ. ఉత్తరాఖండ్‌లోను సాగుతుంది.[1]

ఈ హైవేని ఢిల్లీ నుండి రిషికేశ్ వరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది. రిషికేశ్ నుండి ఉత్తరం కొన వరకు భారత సైన్యానికి చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిర్మించింది. ఈ హైవే మీరట్ నగరాన్ని బైపాస్‌ చేస్తుంది. ముజఫర్‌నగర్, రూర్కీలో బైపాస్‌లు నిర్మించారు.[2]

ఎన్‌హెచ్ 58లోని వివిధ భాగాలకు ఇప్పుడు కొత్త సంఖ్యలను ఇచ్చారు. దాంతో ఇప్పుడు ఎన్‌హెచ్ 58 ఉనికిలోనే లేదు. అయితే, ఇప్పటికీ చాలా మంది ఢిల్లీ-మీరట్-హరిద్వార్ హైవేను ఎన్‌హెచ్ 58 అనే వ్యవహరిస్తారు.

ఎన్‌హెచ్ 58 ని వివిధ ఎన్‌హెచ్ లుగా విభజించారు

[మార్చు]

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలోని అన్ని జాతీయ రహదారులను పునర్నిర్మించడంతో, ఎన్‌హెచ్ 58 లోని వివిధ విభాగాలకు కొత్త ఎన్‌హెచ్ సంఖ్యలను ఇచ్చారు. ఇవి:

  • ఎన్‌హెచ్ 7 ఇండో-టిబెట్ సరిహద్దు వద్ద మానా కనుమ నుండి రిషికేశ్ వరకు.
  • ఎన్‌హెచ్ 34 రిషికేశ్ నుండి హరిద్వార్ వరకు.
  • ఎన్‌హెచ్ 334A హరిద్వార్ నుండి ముజఫర్‌నగర్ జిల్లాలోని ఉత్తరాఖండ్-ఉత్తరప్రదేశ్ సరిహద్దు లోని లక్సర్, పుర్కాజి పట్టణం వరకు.
  • జాతీయ రహదారి 334 (భారతదేశం) పుర్కాజి నుండి మీరట్ వరకు.
  • జాతీయ రహదారి 34 (భారతదేశం) మీరట్ నుండి మోడీనగర్, ఢిల్లీకి కొద్ది దూరంలోని ఘజియాబాద్ వరకు.

హైవే హరిద్వార్ నుండి మీరట్ వెళ్లే మార్గంలో పట్టణాలు, నగరాలను బైపాస్ చేస్తూ పోతుంది.

ఎన్‌హెచ్ 58 (పాత సంఖ్య) ప్రాముఖ్యత

[మార్చు]

మతపరమైన

[మార్చు]

ఇది జాతీయ రాజధాని న్యూ ఢిల్లీని మతపరమైన యాత్రా కేంద్రాలతో, ఉత్తరాఖండ్ మైదానాల్లోని హరిద్వార్, రిషికేష్‌లతో, ఆపై ఉత్తరాఖండ్‌ కొండలపై ఉన్న పట్టణాలు, దేవాలయాలతో కలుపుతున్నందున ఇది హిందూ యాత్రికులకు ముఖ్యమైన మార్గంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉత్తరాఖండ్‌లోని అతి ముఖ్యమైన తీర్థయాత్రలను ఛోటా చార్ ధామ్ (నాలుగు తీర్థయాత్ర కేంద్రాలు) అని పిలుస్తారు. ఇందులో యమునోత్రి (యమునా నది ఉద్భవించే ప్రదేశం), గంగోత్రి (గంగా నది ఉద్భవించే ప్రదేశం), కేదార్‌నాథ్ ఆలయం, బదరీనాథ్ ఆలయాలు ఉన్నాయి. యాత్రికులు ఏడాది పొడవునా మైదాన ప్రాంతంలో ఉన్న హరిద్వార్, రిషికేశ్‌లను సందర్శిస్తారు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా ఉంటారు. కొండలపై నున్న స్థలాలకు యాత్రలు ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో మంచు కరగడంతో మొదలై, జూన్ చివరిలో రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యే వరకు కొనసాగుతాయి. యాత్రికులు, పర్యాటకులతో నిండిన బస్సులు, వాహనాలు వేసవి నెలల్లో ఈ హైవేపైకి వస్తుంటాయి.

తీర్థయాత్ర సమయంలో లేదా ముఖ్యమైన పండుగల సమయంలో ఈ రహదారి అంతా యాత్రికులు, పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. [3] యాత్రికులు గంగా నది లోని పవిత్ర జలాన్ని తీసుకుని, కాలినడకన వారి ఇళ్లకు తీసుకువెళ్ళే క్రమంలో, కాలినడకన నడిచే ఒక పక్షం రోజుల్లో హైవేలోని ఒక లేన్‌ను ఈ యాత్రికుల కోసం ప్రత్యేకిస్తారు. సంవత్సరంలో ఆ రెండు వారాలు, వాహనాలు దాదాపు ఒక లేన్‌ను మాత్రమే ఉపయోగిస్తాయి.

2021 జనవరి నుండి మార్చి వరకు హరిద్వార్‌లో జరిగే కుంభమేళాకు హాజరయ్యే లక్షలాది మంది యాత్రికులు ఈ రహదారిని విస్తృతంగా ఉపయోగిస్తారు. గత కుంభమేళాకు 5 కోట్లకు పైగా భక్తులు హాజరయ్యారు. [4]

వ్యూహాత్మక, సైనిక

[మార్చు]

ఈ హైవే టిబెట్ సరిహద్దును కలుపుతుంది. మైదాన ప్రాంతం ముగిసి, పర్వతాలు మొదలయ్యే రిషికేశ్ నుండి ఉత్తర కొన వరకు ఉన్న రహదారిని భారత సైన్యానికి చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిర్మించింది. ఇంతకుముందు ఇది చమోలి వరకు మాత్రమే ఉండేది. గత కొన్ని సంవత్సరాలలో దీన్ని క్రమంగా జోషిమత్, బద్రీనాథ్ ల వరకు, చివరకు టిబెట్ సరిహద్దు సమీపంలోని మనా పాస్ వరకు విస్తరించారు. గర్వాల్‌లో నివసిస్తున్న పౌరులతో పాటు సైన్యం కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వేసవిలో చార్ ధామ్ యాత్ర అంతా ఈ మార్గం గుండానే జరుగుతుంది.

అభివృద్ధి

[మార్చు]

2013 డిసెంబరు నాటికి, టోల్ ప్రాతిపదికన మీరట్ నుండి ముజఫర్‌నగర్ వరకు 4-లేన్‌ల రహదారిగా మార్చారు. ఖతౌలీ, ముజఫర్‌నగర్‌లలో బైపాస్‌లు నిర్మించారు. ముజఫర్‌నగర్ నుండి హరిద్వార్ వరకు ఉన్న భాగాన్ని కూడా 2013 ఫిబ్రవరి నాటికి ఇదే విధంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో మంజూరు చేసారు. అయితే భూసేకరణ, చెట్ల నరికివేత, గుత్తేదారు అలసత్వం వంటి సమస్యల కారణంగా ఇది ఆలస్యమైంది. [5] అలాగే, మోహన్ నగర్ వద్ద ఒక ఫ్లైఓవర్, మోడినగర్ వద్ద 4710 మీటర్ల పొడవైన వయాడక్టు, మురాద్ నగర్ వద్ద 1710 మీటర్ల పొడవైన వయాడక్టులను ప్రతిపాదించారు. [6]

  • ఫిబ్రవరి 2020: రూర్కీ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పునఃప్రారంభించబడ్డాయి, ఇది నవంబర్ 2020 నాటికి పూర్తవుతుందని అంచనా. [7] [8]
  • ఫిబ్రవరి 2021: రూర్కీ బైపాస్ ట్రాఫిక్ కోసం తెరవబడింది. [9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "National Highways and their lengths". National Highways Authority of India. Archived from the original on 10 February 2010. Retrieved 2009-02-12.
  2. "NHAI cancels contract for Dehradun highway, serves notice for Haridwar stretch | India News - Times of India". The Times of India.
  3. "Major traffic jams on Somwati Amavasya: 20 lakh devotees take dip in Haridwar and Rishikesh". The Tribune. 23 June 2009.
  4. Jha, Monica (23 June 2020). "Eyes in the sky. Indian authorities had to manage 250 million festivalgoers. So they built a high-tech surveillance ministate". Rest of World. Retrieved 23 June 2020.
  5. "Press Release - Development of Meerut-Muzaffarnagar-Haridwar Stretch". Press Information Bureau, Government of India. 17 December 2013. Retrieved 6 January 2014.
  6. "Press Release - Construction of Flyovers on National Highway-58". Press Information Bureau, Government of India. 9 December 2013. Retrieved 6 January 2014.
  7. "अतिक्रमण हटाकर शुरू कराया हाईवे बाईपास निर्माण कार्य".
  8. "NH-58 project to be completed a month before deadline, says NHAI official | Dehradun News - Times of India". The Times of India.
  9. "उत्तराखंड से दिल्ली की दूरी हो गई कुछ कम..आखिरकार खुल ही गया 12 Km लंबा बाईपास".