డయానా (కెమెరా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డయానా కెమెరా
డయానా కెమెరా
ఉత్పాదకుడుGreat Wall Plastic Factory, Lomographische AG
రకంటాయ్ కెమెరా
సెన్సార్ రకంఫిలిం
సెన్సార్ పరిమాణం40 ఎంఎం × 40 ఎంఎం
రికార్డింగ్ యానకం120 ఫిల్మ్, 135 ఫిల్మ్
షట్టర్ వడిN, B
ఎఫ్ - సంఖ్యలుf/11, f/13, f/19

డయానా (కెమెరా) (ఆంగ్లం: Diana (Camera)) హాంగ్‌కాంగ్ లోని కౌలూన్ ప్రదేశానికి చెందిన గ్రేట్ వాల్ ప్ల్యాస్టిక్ ఫ్యాక్టరీ (Great Wall Plastic Factory) చే 1950వ దశకంలో రూపొందించబడిన ఒక టాయ్ కెమెరా [1]. ఇది ప్లాస్టిక్ తో తయారు చేయబడింది. ఈ కెమెరాలో ప్రాథమికంగా 120ఎంఎం ఫిలిం వాడబడిననూ, ఆధునిక వెర్షన్ లతో లభ్యమయ్యే 35ఎంఎం ఫిలిం బ్యాక్ అనే విడిభాగంతో 35ఎంఎం ఫిలింను, ఇన్స్టంట్ ఫిలిం బ్యాక్ తో ఇన్స్టంట్ ఫిలిం ను కూడా వాడవచ్చును. డయనా కెమెరా కటకం సైతం ప్లాస్టిక్ తో చేయబడింది.

డయానా కెమెరా ప్రాథమికంగా చవక ధరలో లభ్యమయ్యే ఒక కానుకగా ఇవ్వబడేది. అయితే, ఈ కెమెరాతో తీయబడిన ఛాయాచిత్రాలలో మృదుత్వ పాళ్ళు ఎక్కువగా ఉండటం, అవి పిక్టోరియలిజం, ఇంప్రెషనిజం అనే కళా ఉద్యమాల ఫోటోలని/చిత్రాలని తలిపింపజేయటం వంటి లక్షణాలు, దీని ప్రత్యేకతలుగా గుర్తించబడ్డాయి.

డయానా కెమెరాతో తీయబడే ఛాయాచిత్రాలు కాంతి తప్పటం (లైట్ లీక్), ఫిలింని ముందుకు తిప్పటంలో ఇబ్బందులు ఎదురవటం, వంటి అనేక ఇతర లోపాలు ఉన్నాయి. అయితే తక్కువ నాణ్యత గల ఈ దీని ప్లాస్టిక్ కటకం వలన, ముద్రించినపుడు ఏర్పడే (కొంత మసకగా ఉండే ఛాయాచిత్రాలు, స్వాప్నిక దృశ్యాల వలె కనబడటం వంటి) కళాత్మక ప్రభావాలతో డయానా కెమెరా ఛాయాచిత్రకారుల మన్ననలని చూరగొన్నది. [2]

చెప్పుకోవటానికి చవక కెమెరా అయినా, డయానా కెమెరా, ఫోటోగ్రఫీ రంగం పై తనదైన ఒక ముద్ర వేసింది. డయానా కెమెరాను ఆరాధించే ఫోటోగ్రఫర్లు ఇప్పటికీ ఉండటం, లోమోగ్రఫీ సంస్థ దీనిని డయానా ఎఫ్+ గా పునర్నిర్మించటం, డయానా మిని (35 ఎం ఎం), డయానా బేబీ (110 ఎం ఎం), డయానా పిన్ హోల్ (సూదిబెజ్జం కెమెరా) వంటి అనేక ఇతర వేరియంట్ లను విడుదల చేయటమే దీనికి తార్కాణం.

చరిత్ర

[మార్చు]

1960వ దశకంలో హాంగ్‌కాంగ్ లోని కౌలూన్ ప్రదేశానికి చెందిన గ్రేట్ వాల్ ప్ల్యాస్టిక్ ఫ్యాక్టరీ (Great Wall Plastic Factory) చే ఒక చవకైన కెమెరాగా డయానా కెమెరాను రూపొందించటం జరిగింది. అధిక భాగం కెమెరాలు యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రాలకి ఎగుమతి అయ్యేవి.

డయానా కెమెరాలు నామమాత్రపు ధరలకి వాణిజ్య ప్రదర్శనశాలలో, సంతలలో, తిరునాళ్ళలలో, లాటరీలలో విక్రయించబడేవి. కొంతకాలం తపాలా ద్వారా కూడా విక్రయించబడినవి. తక్కువ ధర లోనే లభ్యమౌతూ మరింత నాణ్యమైన ఫోటోలను తీసే కొడాక్ ఇన్స్టామేటిక్ వంటి కెమెరాలు వినియోగదారులకి లభ్యమవటంతో డయానా మెల్లగా కనుమరుగైనది[3]. అప్పటి వరకూ డయానా వలెనే రూపొందించబడిన పలు ఇతర కెమెరాల ఉత్పత్తి కూడా 1970 కల్లా ఆగిపోయింది. హాంగ్ కాంగ్, తైవాన్ లలో ఇతర 35 ఎం ఎం టాయ్ కెమెరాలు రూపొందించబడుతున్ననూ, డయానా తయారీ, దాని క్రయవిక్రయాలు కాలగర్భంలో కలసిపోయాయి.

లక్షణాలు

[మార్చు]

డయానా కెమెరా అతి సరళమైన పద్ధతులతో నిర్మించబడ్డ ఒక టాయ్ కెమెరా. ఛాయాచిత్రకళలో టాయ్ కెమెరాల సాంకేతిక అవలక్షణాలు అసౌకర్యం కలిగించిననూ పలు ఛాయాచిత్రకారులు, ఛాయాచిత్రకళ బోధనాలయాలు ఈ లక్షణాలని అదే పనిగా ఉపయోగించి ఆసక్తిని కలిగించే కళాత్మక ప్రభావాలతో కూడిన ఛాయాచిత్రాలను సృష్తించారు.

నిర్మాణం

[మార్చు]

ప్లాస్టిక్ తో నిర్మించటం వలన చాలా తేలికగా ఉంటుంది. అయితే షట్టరు మీటను నొక్కినపుడు ఇంతే తేలికగా ఉండటం వలన కెమెరా కదలే అవకాశం కూడా ఉంది.

ఫిలిం అడ్వాన్సింగ్

[మార్చు]

పూర్తిగా మ్యానువల్. ఒక ఫ్రేం పై ఫోటో చిత్రీకరించిన తర్వాత, తర్వాతి ఫోటో తీయటానికి కెమెరాకు ఉన్న చక్రం తిప్పటంతో ఫిలిం ముందుకు కదులుతుంది. అయితే అప్పటి డయానా కు ఫ్రేం కౌంటర్ లేకపోవటంతో ఫోటోగ్రఫర్ బేరీజు వేసుకొని చక్రం తిప్పవలసిన అవసరం ఉండేది. ఒక వేళ ఫిలిం అడ్వాన్సింగ్ చేయకుంటే డయానా అదే ఫ్రేం పైనే రెండవ ఛాయాచిత్రాన్ని తీసేది. (ఆధునిక కెమెరాల వలె, షట్టరు మీట లాక్ అయ్యే సౌలభ్యం డయానా కెమెరా కు లేదు.) దీనితో అనూహ్య ద్విబహిర్గతం వచ్చేది.

వ్యూ ఫైండర్

[మార్చు]

వ్యూ ఫైండర్ లో కనబడే దృశ్యమే ఫోటోగా నమోదు అవ్వదు. వ్యూ ఫైండర్ కేవలం చూచాయగా ఫోటోను కూర్చటానికి మాత్రమే.

షట్టరు పని చేయు విధానం

[మార్చు]

ప్రాథమిక స్ప్రింగ్ ఆధారితం. షట్టరు పనితీరు వలన ప్రతిబింబాలు సరిగ్గా మధ్యకి రాకపోవటం కానీ (Off-centered), కావలసిన విధంగా బహిర్గతం కాకపోవటం కానీ జరుగుతుంది.

కటకాలు

[మార్చు]

దీని కటకాలు, వ్యూ ఫైండర్ లు, నిర్మాణము ఆటబొమ్మలని తయారు చేసే అతి చవకైన ప్లాస్టిక్ తో చేయబడినవి. ఉత్పత్తిలోని నాణ్యతాప్రమాణాలలో గల తేడాల వలన, ప్రాథమిక నిర్మాణం వలన కాంతి తప్పే గుణం (లైట్ లీక్) ఉంది. కటకం యొక్క అనాగరిక నిర్మాణం వలన ఛాయచిత్రపు అంచులలో చీకటిమయంగా (విగ్నెటింగ్) వస్తాయి. ఛాయాచిత్రం కేవలం వృత్తాకారంలో మాత్రమే కనబడుతుంది. అంతే కాక ఈ కటకం రంగులలో భేదాలని ఇట్టే గుర్తించలేదు. అందుకే డయానా కెమెరా వర్ణపు ఉల్లంఘనం వలన, ఛాయాచిత్రాలు మసకబారినట్టు అగుపించేలా చేస్తుంది.

డయానా కెమెరా నకళ్ళు (Diana Clones)

[మార్చు]
కాన్ఫోరామా అనే డయానా కెమెరా నకలు

డయానా కెమెరాలు చవక కావటం వలన అప్పట్లో వీటికి మంచి గిరాకీ ఉండేది. పైగా దీనిని రూపొందించటం కూడా చాలా సులువు. అందుకే, అసలైన డయానా కెమెరాలు కాకపోయిననూ, దాదాపుగా అలానే పని చేసే, మెరుగులు దిద్దబడిన నకళ్ళు దాదాపుగా 50 ఉండేవి. వీటికి వేర్వేరు పేర్లు ఉండేవి. వాటిలో కొన్ని:[4]

 • Anny
 • Banner
 • Colorama
 • Conforama
 • Debonair
 • Debutante
 • Future scientist
 • Sinomax
 • Windsor

డయానా ఎఫ్+

[మార్చు]
డయానా ఎఫ్+ కెమెరా, దాని విడిభాగాలతో ఒక లోమోగ్రఫర్

అప్పటి డయానా కెమెరాకే, మరిన్ని మెరుగులు దిద్ది లోమోగ్రఫిషె ఏజీ (Lomographische AG) డయానా+ని 2007 లో రూపొందించింది[5]. దీనికే ఫ్ల్యాష్ ని అనుసంధానించే సౌలభ్యం కలిగిస్తూ డయానా ఎఫ్+ని రూపొందించింది. ప్రస్తుతం లభిస్తున్న డయానా ఎఫ్+ కెమెరా వాస్తవానికి ఒక వ్యవస్థీకృత కెమెరా. దీనికి వివిధ రకాలైన కటకాలని, ఫ్ల్యాష్ లని, ఫిలిం బ్యాక్ లని (110 ఎం ఎం, 120 ఎం ఎం, 135 ఎం ఎం ఫిలింలు వాడటానికి వివిధ రకాల కెమెరా వెనుక భాగాలు) అమర్చవచ్చును. ఇంతేకాక లోమోగ్రఫిషే ఏజీ నికాన్ ఎఫ్ మౌంట్, కెనాన్ ఈఓఎస్, మైక్రో ఫోర్ థర్డ్ ల వంటి డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా లకి కావలసిన డయానా లెన్స్ అడాప్టర్ లని కూడా రూపొందిస్తుంది.

షట్టరు వేగం

[మార్చు]

డయానా ఎఫ్+ స్ప్రింగ్ షట్టరుతో పనిచేస్తుంది.

 • ఎన్ - ఎన్ అనగా నార్మల్. సాధారణ పరిస్థితులలో ఫోటోలు తీయటానికి. ఈ సెట్టింగులో దాదాపుగా 1/60 వేగంతో షట్టరు పనిచేస్తుంది. కావున ఇది పగటిపూట, నిశ్చల లేదా కదలిక తక్కువగా ఉన్న ఆబ్జెక్టులని చిత్రీకరించటానికి ఉపయోగపడుతుంది.
 • బి - బి అనగా బల్బ్. రాత్రి వేళల్లో, వెలుగు ఎక్కువ లేని పరిస్థితులలో ఫోటోలు తీయటానికి. ఈ సెట్టింగులో షట్టరు మీట నొక్కి పట్టినంతసేపూ షట్టరు తెరువబడే ఉంటుంది. కావలసినప్పుడు షట్టరు వదిలివేయచ్చును.

సూక్ష్మరంధ్రం

[మార్చు]
డయానా ఎఫ్+ కెమెరా యొక్క సూక్ష్మరంధ్రాల సెట్టింగు

డయానా ఎఫ్+కి మొత్తం నాలుగు రకాల సూక్ష్మరంధ్రాలు ఉన్నాయి.

 • క్లౌడీ (f/11) - పూర్తిగా మేఘాలు ఉన్నపుడు ఉపయోగించటానికి
 • పార్షియల్ క్లౌడీ (f/16) - పాక్షికంగా మేఘాలు ఉన్నప్పుడు ఉపయోగించటానికి
 • సన్నీ (f/22) - పగటి పూట వెలుగులో ఉపయోగించటానికి
 • పిన్ హోల్ (f/150) - సూదిబెజ్జం కెమెరా వలె చిత్రీకరించటానికి

కలర్ జెల్ ఫిల్టర్లు

[మార్చు]

దాదాపు 12 రంగుల ఫిల్టర్లు లభ్యం. వీటిని ఒక్కొక్కటిగా ఫ్ల్యాష్ లో ఇనుమడించి కాంతి యొక్క రంగుని మార్చవచ్చును.

ఫ్ల్యాష్, హాట్ షూ

[మార్చు]

విడదీయగల ఫ్ల్యాష్ ఉంది. ఒకే సి ఆర్ బ్యాటరీ పై ఇది పనిచేస్తుంది. కెమెరాతో అనుసంధానిస్తే షట్టర్ విడుదల చేయగనే ఫ్ల్యాష్ వెలుగుతుంది. లేదంటే విడిగా కూడా ఫ్ల్యాష్ ని మీట ద్వారా వెలిగించవచ్చును. టూ పిన్ ప్లగ్ ఉండటం వలన ఫ్ల్యాష్ ని నేరుగా కెమెరాకి అనుసంధానించవచ్చును. లేదంటే టూ పిన్ ప్లగ్ ని హాట్ షూకి అనుసందానించి హాట్ షూని కెమెరాకి అనుసంధానించవచ్చును. ఇతర కెమెరాల యొక్క ఫ్ల్యాష్ లని కూడా డయానా కెమెరాకి అనుసంధానించవచ్చును.

కటకాలు

[మార్చు]
 • స్ప్లిట్జర్: ఫిలిం ఆసాంతం బహిర్గతం అవకుండా ఒక ప్రక్క మాత్రమే బహిర్గతం అయ్యేలా చేసేందుకు స్ప్లిట్జర్ లభ్యం
 • 110 ఎంఎం టెలిఫోటో: దూరంగా ఉండే ఆబ్జెక్టులని దగ్గరగా కనిపించేట్లుగా చేయటానికి. నాభ్యంతరం ఎక్కువగా, క్షేత్ర అగాథం తక్కువగా ఉండటంతో ఈ కటకం ద్వారా రంగులు చక్కగా అగుపించటమే కాక, ఫోటోలకి మృదుత్వం, అస్పష్టతలు సుందరంగా కనబడటం, విగ్నెటింగ్ కలుగుతాయి.
 • 55 ఎంఎం వైడ్ యాంగిల్, క్లోజ్ అప్ కటకం: తక్కువ క్షేత్ర అగాథంతో మృదువైన నేపథ్యాలతో, ప్రత్యేకించి అతి సమీప ఛాయాచిత్రకళకి ఉపయోగపడుతుంది.
 • 38 ఎంఎం సూపర్ వైడ్ యాంగిల్: 120 డిగ్రీల దృష్టి కోణంతో వీధి ఛాయాచిత్రకళకి, ప్రత్యేకించి నగరాలలో ఎత్తైన భవనాలని చిత్రీకరించటానికి ఉపయోగపడుతుంది.
 • 20 ఎంఎం ఫిష్ ఐ - 20 ఎంఎం నాభ్యంతరంతో 180 డిగ్రీల దృష్టి కోణాన్ని వృత్తాకారంలో చిత్రీకరిస్తుంది.

వ్యూ ఫైండర్

[మార్చు]

టెలిఫోటో, వైడ్ యాంగిల్, సూపర్ వైడ్ యాంగిల్ కటకాలని ఉపయోగించినపుడు ఛాయాచిత్రం ఎలా ఏర్పడుతుందో తెలియటానికి సాధారణ వ్యూ ఫైండర్, ఫిష్ ఐ కటకాన్ని ఉపయోగించునపుడు, ఛాయాచిత్రం ఎలా ఏర్పడుతుందో తెలియటానికి ఫిష్ ఐ వ్యూ ఫైండర్ విడివిడిగా లభ్యం.

120 ఎంఎం ఫిలిం బ్యాక్

[మార్చు]
డయానా ఎఫ్+ యొక్క 120ఎంఎం ఫిలిం బ్యాక్

120 ఎంఎం ఫిలింతో ఫోటోలు తీయటానికి ఉపయోగపడుతుంది.

 • 46.5 X 46.5: ఎండ్ లెస్ ప్యానోరామా కోసం
 • 42 X 42: కొద్దిగా చిన్నదైన చిత్రాల కోసం (దీని వలన విగ్నెటింగ్ రాకపోవచ్చును. విగ్నెటింగ్ రావాలంటే ఏ ఫ్రేమూ వాడకూడదు)

35 ఎంఎం ఫిలిం బ్యాక్

[మార్చు]

35 ఎంఎం ఫిలిం వాడే సమయంలో, 120 ఎంఎం బ్యాక్ ని తొలగించి దానికై ప్రత్యేకమైన బ్యాక్ (కెమెరా వెనుక భాగం) ను చేర్చాలి. దీనితో బాటుగా ఈ క్రింది ఫ్రేములు వాడవచ్చును.

 • 33 X 48 ఎంఎం: స్ప్రాకెట్ హోల్స్ (ఫిలింకి ఇరువైపులా ఉండే రంధ్రాలు) కనబడుతూ ఉండవలసిన ప్యానోరామిక్ ఫోటోల కొరకు
 • 24 X 48 ఎంఎం : స్ప్రాకెట్ హోల్స్ కనబడకుండా ఉండవలసిన ప్యానోరామిక్ ఫోటోల కొరకు
 • 33 X 34 ఎంఎం: స్ప్రాకెట్ హోల్స్ కనబడుతూ ఉండవలసిన స్క్వేర్ (చతురస్రాకార) ఫోటోల కొరకు
 • 24 X 36 ఎంఎం: సాధారణ ల్యాండ్ స్కేప్ ఫోటోల కొరకు

కేబుల్ రిలీజ్, కేబుల్ కాలర్

[మార్చు]

షట్టరుని విడుదల చేసినప్పుడు కెమెరా కదలకుండా ఉండటం కోసం ఒక కేబుల్, కేబుల్ కాలర్ లభ్యం. కేబుల్ కి ఒక చివర ఉన్న మీట నొక్కటం వలన అది ముందుకు వెళ్ళి కేబుల్ కాలర్ కి ఉన్న ఒక లీవర్ ని నొక్కటంతో అది షట్టర్ విడుదల మీటన్ నొక్కుతుంది. స్వంత ఛాయాచిత్రాలని (సెల్ఫీ) లని తీసుకోవటం కొరకు కూడా దీనిని ఉపయోగించవచ్చును.

హాట్ షూ

[మార్చు]

ఇతర ఫ్ల్యాష్ లు అనుసంధానించుకోవటానికి హాట్ షూ లభ్యం.

లాభాలు

[మార్చు]
 • అనలాగ్ ఫోటోగ్రఫీ గురించి డయానా కెమెరా ద్వారా చాలా తెలుసుకొనవచ్చునని లోమోగ్రఫీకి చెందిన ఒక ఉద్యోగి చెప్పుకొచారు.
 • పురాతన శైలిలో కనబడే కెమెరా ప్రత్యేకంగా ఉంటుంది
 • నాణ్యమైన ఫోటో కోసం పరితపించవలసిన అవసరం లేకపోవటం
 • ఈ కాలం డయానా (ఎఫ్ +) కు పలు యాక్సెరీస్ సౌలభ్యం కలదు
 • డయానా కెమెరా ప్రత్యామ్నాయ ఛాయాచిత్రకళ ను పరిచయం చేస్తుంది

నష్టాలు

[మార్చు]

డయానా ఎఫ్+తో తీయబడిన కొన్ని చిత్రాలు

[మార్చు]

120 ఫిలిం ఛాయాచిత్రాలు

[మార్చు]

35 ఎం ఎం ఫిలిం ఛాయాచిత్రాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ లో డయానా కెమెరా చరిత్ర
 2. "డయానా కెమెరాలో సాంకేతిక ఇబ్బందులే దాని కళాత్మక లక్షణాలుగా గుర్తించిన ఫోటోగ్రఫర్లు". Archived from the original on 2008-09-15. Retrieved 2008-09-15.
 3. కొడాక్ ఇన్స్టామేటిక్ కెమెరాల రాక తో మరుగున పడ్డ డయానా కెమెరాల తయారీ
 4. లోమోగ్రఫీ వెబ్ సైటులో డయనా కెమెరా నకళ్ళ జాబితా
 5. 2007 నుండి డయానా కెమెరాను తయారు చేస్తోన్న లోమోగ్రఫీ సంస్థ[permanent dead link]