తల్లావజ్ఝుల సుందరం
తల్లావజ్ఝుల సుందరం | |
---|---|
జననం | తల్లావజ్ఝుల సుందరం 1950 అక్టోబరు 29 |
మరణం | 2022 మార్చి 21 | (వయసు 71)
వృత్తి | రంగస్థల నటుడు, దర్శకుడు |
జీవిత భాగస్వామి | శిరీష |
పిల్లలు | ఒక కుమారుడు, ఒక కుమార్తె |
తల్లిదండ్రులు |
|
తల్లావజ్ఝుల సుందరం (1950, అక్టోబరు 29 - 2022, మార్చి 21) రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత.[1]
జననం - విద్యాభ్యాసం[మార్చు]
సుందరం 1950, అక్టోబరు 29న మహాలక్ష్మి, కృతివాస తీర్థులకు ఒంగోలు పట్టణంలో జన్మించాడు.[2] బియస్సీ పూర్తిచేసిన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళళ శాఖలో పి.జి డిప్లొమా కోర్సుచేశాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
సుందరంకు శిరీషతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
రంగస్థల ప్రస్థానం[మార్చు]
1957లో బాల నటుడుగా రంగస్థల ప్రవేశంచేసి ఇప్పటివరకు దాదాపు రెండువందల నాటికలలో నటించడమేకాకుండా దర్శకుడిగా, ప్రయోక్తగా వ్యవహరించాడు. గార్దభాండం, అమీబా, కొక్కొరోకో, గోగ్రహణం, జంబుద్వీపం, చీకటింట్లో నల్లపిల్లి, పోస్టరు వంటి నాటికలూ, ఈహామృగం వంటి నాటకాన్ని నూతన ప్రయోగాలతో ప్రదర్శించి ప్రయోగాత్మక దర్శకుడిగా పేరు పొందాడు. దొంగలబండి, ప్రసన్నకు ప్రేమతో వంటి హాస్య నాటకాలు, జనమేజయం, మాధవి వంటి పౌరాణిక, ఇతిహాసిక నాటకాలూ, చలువ గుర్రం (చంద్రశేఖర్ కంబార్) వంటి వ్యంగ నాటకాలూ, హళ్ళికి-హళ్ళి, కేటు-డూప్లికేట్, సైలెన్స్ ప్లీజ్ వంటి హాస్య నాటికలకు దర్శకత్వం వహించాడు. పెద్దబాలశిక్ష, ఈ బస్సు మనదిరో, వెలుగొచ్చింది, ఎయిడ్స్ అవగాహన వంటి వీథి నాటికలకు కూడా దర్శకత్వం వహించాడు.
అవార్డులు - పురస్కారాలు[మార్చు]
గోగ్రహణం నాటకాన్ని 1985లో ఎర్నాకులంలో జరిగిన సౌత్ జోన్ థియేటర్ ఫెస్టవల్ లో ప్రయోగాత్మకంగా ప్రయోగించాడు. మద్రాస్ కళాసాగర్ నాలుగు సంవత్సరాలకొకసారి ఇచ్చే థియేటర్ టెర్నియల్ అవార్డు, 1985లో ఇదే సంస్థ ఉత్తమ దర్శకుడి అవార్డు, 1992లో హైదరాబాదు లయన్స్ క్లబ్ ఉత్తమ రంగస్థల దర్శకుడి అవార్డు, 1994లో పినిసెట్టి శ్రీరామమూర్తి స్మారక గోల్డ్ మెడల్, తెలుగువిశ్వవిద్యాలయం 1993లో ధర్మనిధి పురస్కారం వంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రజానాట్య మండలి, చైతన్య భారతి, వంశీ కళా కేంద్రం, యువ కళావాహిని, సుమధుర కళానికేతన్ వంటి పలు సంస్థలు అవార్డులిచ్చి ఘనంగా సత్కరించాయి. 1999లో వర్చస్వికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు.
1979 నుంచి దూరదర్శన్ లో దాదాపు 200 నాటకాలు, నాటికల్లో నటించాడు. వర్చస్వి, మూడు ముళ్ళాట, అభిషేకన్ టివీ సీరియళ్ళకి దర్శకత్వం వహించాడు. శ్రీ మురళి కళా నిలయం తరపున ఎందరో నటుల్ని, రచయితల్ని తెలుగు నాటకరంగానికి అందించారు.
సినిమాలు[మార్చు]
- అందాల ఓ చిలకా (2001)
మరణం[మార్చు]
సుందరం 2022, మార్చి 21న హైదరాబాదు చిక్కడపల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు.[3]
మూలాలు[మార్చు]
- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.647.
- ↑ Telugu, TV9 (2022-03-22). "Sundaram Master: నవలాలోకంలో నిశీధి.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సుందరం మాస్టారు". TV9 Telugu. Archived from the original on 2022-03-22. Retrieved 2022-03-22.
- ↑ "హాస్య నాటికల ఆద్యుడు సుందరం మాస్టారు కన్నుమూత". EENADU. 2022-03-21. Archived from the original on 2022-03-21. Retrieved 2022-03-22.