Jump to content

దశిక సూర్యప్రకాశరావు

వికీపీడియా నుండి
దశిక సూర్యప్రకాశ రావు
జననం(1898-04-10)1898 ఏప్రిల్ 10
వృత్తిరచయిత

దశిక సూర్యప్రకాశరావు స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన 1898, ఏప్రిల్ 10వ తేదీన కృష్ణాజిల్లా, నూజివీడులో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం ప్రాథమిక విద్య నుండి ఎఫ్.ఎ. వరకు తన మాతామహుని స్థానమైన రాజమండ్రిలో సాగింది. 1919-21ల మధ్య ఈయన విజయనగరం కళాశాలలో బి.ఎ.చదివాడు. 1926-1929 మధ్యకాలంలో ఇతడు ఆత్మకూరి గోవిందాచార్యుల సంపాదకత్వంలో వెలువడిన "సత్యాగ్రాహి" వారపత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశాడు. 1939నుండి 1942 వరకు నూజివీడులోని ఎస్.ఆర్.ఆర్. ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇతని సేవానిరతిని గుర్తించి ఇతడు దరఖాస్తు చేసుకోకుండానే టంగుటూరి ప్రకాశం పంతులు ఇతనికి నూజివీడు ఫిర్కా డెవలెప్‌మెంట్ ఆఫీసరు ఉద్యోగం ఇచ్చాడు. 1949 నుండి 1959 వరకు బెజవాడలో దక్షిణభారత హిందీ ప్రచారసభ శాఖలో హిందీ పండితుడిగా పనిచేశాడు. తరువాతి కాలంలో రాజమండ్రిలో అదే ఉద్యోగంలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. జాతీయవాది తేకుమళ్ల వెంకాజీరావు శిష్యుడైన దశిక సూర్యప్రకాశరావు 1922లో నూజివీడులో కల్లు దుకాణాలవద్ద పికెటింగ్‌లో పాల్గొన్నాడు. ఫలితంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో 3 నెలలు, కడలూరు జైలులో 6 నెలలు శిక్షను అనుభవించాడు. కడలూరు జైలులో కొండా వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి, బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం, తెన్నేటి సత్యనారాయణ, కళా వెంకటరావు, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి హేమాహేమీలతో కలిసి శిక్షను అనుభవించాడు. 1930లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని బళ్లారి జైలులో శిక్ష అనుభవించాడు. అక్కడ చక్రవర్తి రాజగోపాలాచారి, దండు నారాయణరాజు, నరసింహదేవర సత్యనారాయణ వంటి ప్రముఖులు ఇతని సహచరులుగా ఉన్నారు. 1932లో స్వరాజ్య కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొని రాజమండ్రి జైలులో 7 నెలలు జైలుశిక్ష అనుభవించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942లో అల్లీపూర్ జైలులో శిక్షను అనుభవించాడు. ఇతనికి భారతప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది[1].

రచనలు

[మార్చు]
  1. వినోబాజీ సన్నిధిలో
  2. నవీనవిద్య
  3. బాపూజీ మాతృప్రేమ
  4. బాబూ రాజేంద్రప్రసాద్ ఆత్మకథ
  5. గాంధీజీ యుగంలో పూచిన అడవిమల్లెలు
  6. భక్తమాల
  7. త్యాగధనులు
  8. గాంధివాణి
  9. గాంధి దర్శనమే పావనము
  10. లోకోత్తరుడు
  11. గాంధీజీ విద్యార్థి జీవితము
  12. తులసీ మానస సుధ
  13. వ్యాస రత్నావళి
  14. శ్రీ జమునాలాల్ దంపతులు
  15. కథాపారిజాతం మొదలైనవి.

మూలాలు

[మార్చు]
  1. సన్నిధానం, నరసింహశర్మ (3 June 1981). "స్వాతంత్ర్యసమరయోధుడు శ్రీ దశిక సూర్యప్రకాశరావు". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 68 సంచిక 62. Retrieved 11 February 2018.[permanent dead link]