దాచూరి రామిరెడ్డి
దాచూరి రామిరెడ్డి (Dachuri Ramireddy) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజి శాసనమండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఫెడరేషన్ వ్యవస్ధాపకులో ఒకరు. అర్ధ శతాబ్దంపాటు ఉపాధ్యాయ ఉద్యమమే ఊపిరిగా పోరాటాలే జీవితంగా రామిరెడ్డి పనిచేశారు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల లో 1938 జనవరి 15న జన్మించారు.
ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వ్యవస్థాపకునిగా
[మార్చు]ఆయన నెల్లూరు జిల్లా రావూరి సమితి మద్దెలమడుగు గ్రామంలో 1958లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. ఆ నాటి నుండి ఉపాధ్యాయ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1959లో ఆనాటి రాపూరి సమితి ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ కార్యదర్శిగా ఉద్యమ జీవితం ప్రారంభించారు. 1960 నుండి 1968 వరకు నెల్లూరు జిల్లా కమిటి కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత ఆ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నేతగా ఉంటూనే 1970లో ప్రకాశం జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పరీక్షా విధానంలో నూతన ఒరవడి తెచ్చారు. ఉపాధ్యాయ ఉద్యమంలో వచ్చిన అవకాశవాద ధోరణులను ఎదిరించి చెన్నుపాటి లక్ష్మయ్య ఆశయాలతో ఉద్యమాన్ని నిర్మించాలనే ధ్యేయంతో అప్పారి వెంకటస్వామి, నాదెళ్ల సీతారామాచారి, సూర్యనారాయణరాజు లాంటి నేతలతో కలిసి 1974 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.[2]
ఉద్యమ కార్యకర్తగా
[మార్చు]యుటిఎఫ్ ఆవిర్భావం నుంచీ ఆయన రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తుండేవారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షునిగా 1981 నుండి 2000 ల మధ్య సేవలనందించారు. సమరశీల పోరాటాలు నడపటమేకాదు, ఒక్కరోజు సమ్మెతో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావును ఒప్పించి రీగ్రూపింగ్ స్కేల్స్ పై ఆధారపడిన ఆటోమాటిక్ అడ్వాన్‌మెంట్ స్కేల్ తేవటంలో ఆయన దూరదృష్టి నాయకత్వ లక్షణంతోపాటుగా సమయస్ఫూర్తి కనిపిస్తుంది.
ఆదర్శవంతంమైన జీవితం
[మార్చు]నిరాడంబరత, నిజాయితీ, ఆదర్శవంతం కలగలిసిన జీవనశైలి ఆయనది. 16 ఏళ్ల ఉద్యోగ సర్వీసును వదిలి యుటిఎఫ్‌లో పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు. 1982లో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యులు (ఎంఎల్‌సి) గా గెలుపొందారు. 2007లో మరలా ఎంఎల్‌సిగా విజయం సాధించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి సంఘాలు చేసే పోరాటాలను శాసన మండలి వేదికపై ప్రతిబింబించేవారు. శాసనమండలి సభ్యునిగా వచ్చిన అలెవెన్సులన్నీ సంఘానికి జమ చేసి, సంఘం ఇచ్చిన నామమాత్రపు అలవెన్సుతో సాధారణ జీవితం గడిపిన ఆదర్శమూర్తి ఆయన. కార్యకర్తల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో క్రమశిక్షణ విషయంలో అంతే కఠినంగా ఉండేవారు. ఎక్కడికి వెళ్లినా వచ్చినా కార్యకర్తల ఇళ్లలో ఉండేవారు. వారి కుటుంబ సభ్యులతో కలిసిపోయేవారు. తమకు స్వంత పిల్లలు లేకపోయినా కార్యకర్తల ఇళ్లలో పిల్లలు ఆయన్ని ఆత్మీయునిగా తాతయ్యగా, మామయ్యగా, భావించేవారు. పాఠశాల, సంఘ సమావేశం, మహాసభ ఏదైనా నిర్ణీత సమయానికి ముందే హాజరయ్యేవారు.[2]
మంచి ఉపాధ్యాయుడు
[మార్చు]ఉపాధ్యాయుడు పనిచేసే చోట నివాసం ఉండాలనే నియమాన్ని పాటించారాయన. స్ధానిక ప్రజలతో మమేకం కావాలి అని నిత్యం చెప్పటంతోపాటు ఆయన ఆచరించి చూపారు. ఆయన ఉద్యోగం చేసిన చోటే నివాసం ఉండేవారు. సాయంత్రం పూట వయోజనులకు పాఠాలు చెప్పేవారు. అవసరమైన సందర్భాలలో పేదలకు వైద్యం చేసి ఆదుకున్న మహామనిషి ఆయన. ప్రజల అవసరాలను గుర్తించి యుటిఎఫ్ కార్యకర్తలందరికీ నెల్లూరు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సహకారంతో కనీస వైద్యం, ఇంజక్షన్ చేయడంలో శిక్షణ ఇప్పించి గ్రామాల్లో చదువు చెప్పటంతోపాటు వైద్యంకూడా చేసి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిగా ఉండాలని నిరూపించారు[2].
1981-84 మధ్య ఉపాధ్యాయులు సాధించుకున్న రీగ్రూపింగు స్కేళ్లు, ప్రధానోపాధ్యాయుల స్కేళ్లు, బిఇడి అర్హత లేకుండా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు 15 సంవత్సరాల టైం స్కేలు, భాషా పండితుల 1983 అప్‌గ్రేడేషన్, ఎయిడెడ్ టీచర్ల డైరెక్టు పేమెంటు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఉద్యోగ రక్షణ, రిటైర్మెంట్ సౌకర్యాల వంటివన్నీ ఆయన నేతృత్వంలో జరిగిన ఉమ్మడి పోరాట విజయాలు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఉపాధ్యాయ సేవే పరమావధిగా జీవితాన్ని అంకితం చేశారు.[2]
శాసనమండలి సభ్యునిగా
[మార్చు]1982, 2007ల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2007లో పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరపున మండలిలో ప్లోర్ లీడర్‌గా పనిచేశారు. 16 ఏళ్ల ఉద్యోగ సర్వీ్‌సని వదిలి జీవితమంతా ఉపాధ్యాయ ఉద్యమానికి అంకితం చేశారు.[3]
మరణం
[మార్చు]అనారోగ్యంతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన 2016 మే 2న ఒంగోలులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ ఉపాధ్యాయ ఉద్యమ నేత రామిరెడ్డి అస్తమయం
- ↑ 2.0 2.1 2.2 2.3 "ఆదర్శనేత రామిరెడ్డి". పి బాబు రెడ్డి , యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రజాశక్తి. 2 May 2016. Retrieved 4 May 2016.
- ↑ యూటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు రామిరెడ్డి కన్నుమూత[permanent dead link]
- ↑ యూటిఎఫ్ నేత దాచూరి రామిరెడ్డి కన్నుమూత[permanent dead link]