Jump to content

దేవీ పుత్రుడు

వికీపీడియా నుండి
దేవీ పుత్రుడు
దర్శకత్వంకోడి రామకృష్ణ
రచనజొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (సంభాషణలు)
కథసుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
నిర్మాతఎమ్మెస్ రాజు
తారాగణందగ్గుబాటి వెంకటేష్
అంజలా జవేరి
సౌందర్య
ఛాయాగ్రహణంఎస్. గోపాల రెడ్డి
కూర్పుతాతా సురేష్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
15 జనవరి 2001 (2001-01-15)
సినిమా నిడివి
162 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
బడ్జెట్15 కోట్లు

దేవీ పుత్రుడు 2001లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి ముఖ్య పాత్రల్లో నటించారు.[1] మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఫాంటసీ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ వ్యయంతో రూపొందించబడింది. కాని వాణిజ్య పరంగా పరాజయాన్ని చవిచూసింది. ద్వాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఈ సినిమా కథకు ఆధారం.

బాబూరావు ముంబైలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఒకసారి అతను నగల దుకాణంలో ఉండగా ఇద్దరు వ్యక్తులు విలువైన వజ్రాలు తీసుకుని హైదరాబాదు నుంచి ముంబై వస్తున్నారని తెలుసుకుని వారి నుంచి ఆ వజ్రాలు కాజేయాలని పథకం వేస్తుంటాడు. సత్య విదేశాల్లో చదువుకుంటూ హైదరాబాదులో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది. వస్తూనే తన అక్క కరుణ కోసం వాకబు చేస్తుంది. గుజరాత్ లోని ద్వారకలో సముద్రం అడుగున ఉన్న అలనాటి ద్వారక గురించిన ఆనవాళ్ళపై పరిశోధన చేయడానికి వెళ్ళిందని తెలుస్తుంది. కరుణ అక్కడే తన సహోద్యోగియైన బలరాంను ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. కానీ ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఆమె ఎన్ని ఉత్తరాలు రాసినా పట్టించుకోకుండా ఉంటారు. ఒక ఉత్తరంలో ఆమె తల్లి కాబోతున్నట్లు తెలియజేస్తుంది. అక్క అంటే వల్లమాలిన ప్రేమ కలిగిన సత్య ఎలాగైనా ఆమెను హైదరాబాదుకు తీసుకు రావాలని తాతయ్య పేరయ్య తో కలిసి బయలు దేరుతుంది. వజ్రాలతో ఉన్నది పేరయ్య, సత్యవతి అనుకుని వారిని తన ట్యాక్సీలో ఎక్కించుకుని బయలుదేరతాడు. వారి నుంచి ఎలాగైనా వజ్రాలు కొట్టేయాలని చూస్తాడు. కానీ అతని ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలించవు.

ద్వారక వెళ్ళేదారిలో అలసి అందరూ కారులోనే నిద్రపోతే ఒక అదృశ్య శక్తి వారిని ద్వారక సమీపానికి చేరుస్తుంది. అక్కడ నుంచి పేరయ్య, సత్య కలిసి కరుణ ఇంటికి వెళ్ళగా అది తాళం వేసి కనిపిస్తుంది. తిరిగి వస్తున్న వారిని అధికారులు అడ్డగించి కరుణ, బలరాం ఎక్కడ ఉన్నారో చెప్పమని నిర్బంధిస్తారు. బలరాం స్నేహితుడు గోపాల్ వారికి సర్దిచెప్పి బయటకు తీసుకువస్తాడు. కృష్ణకు ఒక చిన్న పాప కనిపించి సత్యను కలవమని చెబుతుంది. సత్య తన అక్క, బావ గురించి కృష్ణకు తెలిపి ఎలాగైనా వాళ్ళ ఆచూకీ కనుగొనమంటుంది. గోపాల్ బలరాం గురించి చెబుతాడు. బలరాం సముద్ర మధ్యంలో ప్రతి అమావాస్యకు చెలరేగే ఒక అలజడి (సుడిగుండం) గురించి పరిశోధించి దానికి కారణాన్ని కనుక్కోవాలనుకుంటాడు. ప్రభుత్వం అందుకు సహకరించకపోగా దాన్ని తానే స్వయంగా పరిశోధించి ఒక పెట్టెను వెలికితీస్తాడు. అద్భుతమైన శక్తులు గల ఆ పెట్టెని చేజిక్కించుకోవడం కోసం మరో అంతర్జాతీయ ముఠా బలరాం ని బెదిరిస్తుంది. బలరాం భద్రపరిచిన స్థలం కోసం వెళ్ళగా అక్కడున్న రక్షకభటులను దుండగులు హతమార్చి ఉంటారు. అందులో ఉన్నది దైవశక్తి అని బలరాంకి అర్థమై దానిని ఎలాగైనా సముద్రంలోకి చేర్చమని అధికారులకు విన్నవిస్తాడు. కానీ వారు దానిమీద శాస్త్రీయ పరిశోధనలు చేయాలనుకుంటారు. బలరాం దాన్ని ఒక్కడే సముద్రంలోకి చేర్చాలని ప్రయత్నించగా అతని భార్య కరుణను నిర్బంధించి అతన్ని ఆపుతారు. తన ప్రయత్నంలో ఒక లోయలోకి పడిన పెట్టెను అలాగే వదిలేసి ఆమె కోసం రౌడీల దగ్గరికి వెళ్ళిన బలరాంని కూడా చిత్రహింసలకు గురించి ఆ పెట్టె ఆనవాలు చెప్పమంటారు. చివరికి వారి దగ్గర్నుంచి భార్యను విడిపించుకుని పారిపోతూ కరుణకు నిజం చెప్పి లోయలో పడి మరణిస్తాడు. కరుణను నిర్బంధించి ఆ పెట్టెను గురించి తెలుసుకోవాలని విలన్లు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో ఆమె కడుపులో ఉన్న పాప మరణించి చివరికి ఆత్మ అవుతుంది. ఆ ఆత్మే పాపగా కృష్ణకు కనిపించి ఈ కథంతా వివరిస్తుంది. చివరికి బాబూరావు కరుణను విడిపించి, ఆ పెట్టె ఆచూకీ కనుగొని దాని కోసం పోరాడుతున్న వాళ్ళను ఓడించి దాన్ని సముద్రంలోకి చేర్చడంతో కథ ముగుస్తుంది. ఆ ఆత్మ అయిన పాప మళ్ళీ బాబూరావు, సత్యవతికి బిడ్డగా జన్మిస్తుంది.

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

ఆ చిత్రం 1999 సెప్టెంబర్ 23న ప్రారంభమైంది.[2] దేవి పుత్రుడు సినిమాను రూపొందించడంలో ఎదురైన సవాళ్ళ గురించి ఎం.ఎస్. రాజు Idlebrain.comకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. దేవి (1999) విజయం సాధించిన తర్వాత, రాజు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వెంకటేష్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నారు. కథపై ఎంతో మమకారం ఉన్న రాజు, ఈ సినిమాతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే తరువాత కాలంలో స్టీవెన్ స్పీల్‌బర్గ్ లేదా జార్జ్ లూకాస్ వంటి దర్శకులు మాత్రమే ఇలాంటి చిత్రాన్ని తీయగలరని ఆయన పేర్కొన్నాడు. అయినప్పటికీ, నిర్మాణ ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ, ఈ ప్రాజెక్టుకు మొదట్లో అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సమయం, కృషి, ఆర్థిక వనరులు అవసరమని ఆయన గ్రహించాడు. ఈ సవాళ్లను ముందుగానే పసిగట్టి, సినిమాను ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. దురదృష్టవశాత్తు, దేవి పుత్రుడు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. దీని ఫలితంగా రాజుకు ఆర్థికంగా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆయన తన కొనుగోలుదారులకు (బయ్యర్లకు) మరియు ఫైనాన్షియర్‌లకు నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది.[3]


పాటలు

[మార్చు]

ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలున్నాయి.[4]

  • దొంగ దొంగ వచ్చాడే , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు,గానం . శంకర్ మహదేవన్
  • ఒకటా రెండా మూడా యేసేరా కొబ్బరి కోలా , రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం. సుఖ్విందర్ సింగ్,స్వర్ణలత
  • తెల్ల తెల్లని చీర , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం. ఉదిత్ నారాయణ్ , సుజాత
  • రామా ఓ రామా, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.శంకర్ మహదేవన్
  • ఓ ప్రేమా , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ప్రసన్న
  • ఆకాశంలోని , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

మూలాలు

[మార్చు]
  1. "ఫిల్మీ బీట్ లో దేవీపుత్రుడు". filmibeat.com. Retrieved 17 March 2017.
  2. "Fourth Marvel by Kodi - Devi Putrudu". Telugu Cinema. Archived from the original on 4 October 1999. Retrieved 25 November 2024.
  3. Jeevi (6 December 2002). "Interview with MS Raju". Idlebrain.com. Archived from the original on 25 September 2018. Retrieved 14 October 2017.
  4. "naasongs.com లో దేవీపుత్రుడు పాటలు". naasongs.com. Archived from the original on 20 నవంబరు 2016. Retrieved 17 March 2017.