Jump to content

నండూరి రామకృష్ణమాచార్య

వికీపీడియా నుండి
(నండూరి రామకృష్ణమాచార్యులు నుండి దారిమార్పు చెందింది)
నండూరి రామకృష్ణమాచార్య
జననం21 ఏప్రిల్ 1921
గరపవరం, పశ్చిమ గోదావరి జిల్లా
మరణం2004
వృత్తిమహాకవి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సాహితీకారుడు
జీవిత భాగస్వామిసుభద్రమ్మ
తల్లిదండ్రులుశోభనాద్రి ఆచార్యులు, వెంగమాంబ.

నండూరి రామకృష్ణమాచార్య ( 1921 - 2004) సుప్రసిద్ధ కవి, విమర్శకులు.

వీరు పశ్చిమ గోదావరి జిల్లా గరపవరం గ్రామంలో 1921 ఏప్రిల్ 29 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు: శోభనాద్రి ఆచార్యులు, వెంగమాంబ. వీరు ఉరవకొండలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల విద్యను చదివారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వీరి గురువు. తర్వాత ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో ఎం.ఏ., చదివి మైసూరు విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పూర్తిచేశారు. అనంతరం భీమవరం, అనంతపురం, చిత్తూరు కళాశాలల్లో తెలుగు శాఖాధిపతిగా పనిచేశారు. పిమ్మట తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, చీరాల కళాశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పుస్తక విభాగంలో ప్రచురణ శాఖ సంపాదకునిగా కొంతకాలం పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం ఛైర్మన్ గా 1985-87 మధకాలంలో వ్యవహరించారు.

వ్యక్తిత్వం

[మార్చు]

స్వర్గీయ డా. నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య లోకంలో బహుళ ప్రసిద్ధి చెందిన మహాకవి. వీరు రచించిన ’శీర్ణ మేఖల’ ఖండ కావ్యం ఏభయ్యేళ్ళ క్రితం ఒక సంచలనాన్ని సృష్టించింది. అందులోని కర్ణ, సుయోధన మైత్రికి సంబంధించిన ఘట్టం వీరి స్వీయ కల్పితం. ఈనాటికీ అది ఒక అపురూపమైన సృజనగా నీరాజనాలందుకొంటూనే ఉంది. వీరు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ’అధికార భాషా సంఘం’ అధ్యక్షులుగా (1987- 1990) పనిచేసారు. వీరి రచనలలో ’తారా తోరణం’, ’ఆలోచనం’, ’ప్రగతి గీత’, ’కవితా ప్రభాస’, ’ముత్యాల గొడుగు’, ’కచ్ఛపీ కింకిణీకం’ వంటి కవితా సంపుటులు; ’శివాజీ’, ’ధర్మ చక్రం’, ’జ్యోత్స్నాభిసారిక’, ’గోదావరి’ వంటి నాటికలు; ’కావ్యాలోకం’ అనే లక్షణ గ్రంథం; ’కవిత్రయం’, ’పద్య శిల్పం’ వంటి విమర్శన గ్రంథాలు ప్రముఖమైనవి. ఇవి గాక ఆంగ్లంలో 'Maha Bharata', 'Gandhian Era' ప్రసిద్ధ రచనలు. ’కవిత్రయం’ గ్రంథానికి ’తెలుగు భాషా సమితి’ పురస్కారాన్ని ఆనాటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా అందుకొన్నారు. ' Gandhian Era ' గ్రంథానికి నాటి రాష్ట్రపతి డా. శంకరదయాళ్ శర్మ ’ముందు మాట’ను వ్రాసారు. మహాకవి ’కరుణశ్రీ’, వీరు ఆత్మీయ మిత్రులు. ’కరుణశ్రీ’ గ్రంథాలన్నిటికీ ’నండూరి’ వారే పీఠికలు వ్రాసారు. ’కేంద్ర సాహిత్య అకాడమి’ 1955 ప్రాంతంలో వీరితోబాటు ’జాషువ’, ’కరుణశ్రీ’ లను ’నవ్య సంప్రదాయ కవులు’గా గుర్తించింది. ఆచార్యుల వారు ’ఆంధ్ర పద్య కవితా సదస్సు’ రాష్ట్ర స్థాయి అధ్యక్షులుగా ఆమరణాంతం పద్య కవితాభివృద్ధికై విశేష కృషిని సలిపారు.

నండూరివారు భీమవరం కాలేజీలో తెలుగు డిపార్టుమెంటు హెడ్ గా వుండేవారు. అక్కడ చదివినవారు ఎందరో ఉన్నతస్థాయికి ఎదిగిన వారే. మైసూరు యూనివర్సిటి ప్రొఫెసర్ తంగిరాల సుబ్బారావు, ఆంధ్ర యూనివర్సిటీ, కొర్లపాటి శ్రీరామమూర్తి, ఉషశ్రీ, మొదలగు వీళ్లంతా నా శిష్యులు. లోకానికి వెలుగు నింపిన కాగడాలు. ఈ కాగడాలని వెలిగించిన కొవ్వొత్తిని నేను. అదే నా సంతృప్తి, గర్వమూనూ అనే వారు నండూరి వారు.

భీమవరంలో ఉన్న తన గృహానికి "కవితాప్రభాస " అని పేరు పెట్టుకుని, కావ్వ శిల్పమయ శబ్ద తపో ముఖశాలా అని, రసరాజధాని యని అతిధి దేవులకు, సహృదయులకే గాదు శత్రువులకి కూడా స్వాగతం అని, ద్వారబంధం మీద, తలుపుల మీద రెండు అందమైన పద్యాలు చెక్కించి తాను అ ఇంట్లో వున్న పదేళ్లు అనగా 1946 నుండి 1956 వరకు, కవితా చర్చలతో, ఆత్మీయులైన అతిధి, అభ్యాగతులతో. భోజనాలతో ఆ ఇంటిని అక్షరాలా అటు రస రాజధాని గాను ఇటు అన్నసత్రంగాను మార్చి తానెంతో మంచిపని చేశానని మురిసిపోయే సంస్కారి శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు.

ఆ ఇంట్లో, కాటూరి, పింగళి, విశ్వనాధ, జాషువా, అడవి బాపిరాజు, వేదుల సత్యనారాయణ శాస్త్రి, పాలగుమ్మి రుద్రరాజు, వంటి హేమా హేమీలు ఒకటి రెండు రోజులు మకాం వేసి, సాహిత్య సమాలోచనలు జరపడం, అలాగే ఆ పదేళ్లలో రోజుకి నాలుగైదుగురు చొప్పున అతిధులు, విద్యార్థులు భోజన చేయడం ఆనవాయితీ. అతని భార్య సుభద్రమ్మ దొడ్డ ఇల్లాలు. ఎప్పుడు పదిమందికి అదనంగా వండుకుని సిద్దంగా వుండేది. అతని చాదస్తం ఎంతదాక పోయిందంటే 1956 తర్వాత తనకి వేరేచోట ప్రభుత్వ ఉద్యోగం వచ్చి, ఆ ఇంటిని టి.సూర్యనారాయణ అనే కెమిస్ట్రీ లెక్చరర్ కి అమ్మేస్తూ తమ తలుపుల మీద చెక్కించిన ఆరెండు పద్యాలు అలాగే వుంచాలని కండిషన్ పెట్టాడు. ఇల్లే అమ్మేస్తున్నప్పుడు పద్యాల మీద మమకారం ఏమిటి పిచ్చి కాక పోతె.. ఈయనో పిచ్చి మారాజయితే కొన్న ఆసామి ఓ వెర్రి మాలోకం. అలాగే నని ఇవ్వాల్టివరకు అలాగే వుంచేశాడు.నేటికి కూడా ఎవరైనా భీమవరం వెళితే 'రామాలయం' అనే ప్రాంతంలో... ఆ ఇంటిని ... ఆఇంటి తలుపుల మీదున్న ఆ పద్యాల్ని చూడొచ్చు.

వీరు 2004 సంవత్సరంలో పరమపదించారు.

రచనలు

[మార్చు]
  • అమరజీవులు[1]
  • ప్రగతిగత
  • ఆంధ్ర సంస్కృతీ వికాసం
  • తిక్కన భారత దర్శనం
  • బుద్ధ చరిత్ర
  • దమ్మపదం
  • తిక్కన మహాయుగం
  • ప్రాచీన దక్షిణ భారత చరిత్ర
  • తారాతోరణం (ఖండకావ్యం)
  • ధర్మ చక్రం (నాటకం)
  • ఛత్రపతి శివాజీ (నాటకం) [2]
  • కవిత్రయం (విమర్శ)
  • రసప్రపంచం (అలంకార శాస్త్రం)

మానవత్వం(పద్యాలు)

ధర్మచక్రం నాటకం

[మార్చు]

మహాపద్మనందుణ్ణి, ఆయన కుమారులైన నందుల్ని సామదానభేద దండోపాయాలతో గద్దెదింపి చక్రవర్తియైన చంద్రగుప్త మౌర్యుని కొడుకు, బౌద్ధాన్ని ఆసియా అంతటా ప్రచారం చేసేందుకు విశేషమైన కృషి చేసిన అశోకుని తండ్రి - బింబిసారుడు. అటు సామాది ఉపాయాలతో తండ్రి అందించిన సామ్రాజ్యాన్ని నిలబెట్టడంలోనూ, ఇటు కొడుక్కి ధర్మనిరతిని అందించడంలోనూ వారధిగా నిలిచాడంటూ, ఆయన జీవితాన్ని, ప్రేమకథను ఈ నాటకంగా మలిచారు రచయిత.[3] దీనిని మచిలీపట్నంలోని త్రివేణి పబ్లిషర్సు వారు 1950 సంవత్సరం ముద్రించారు.

సత్కారాలు

[మార్చు]
  • 1955లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి చెందిన "తెలుగు భాషా సమితి" వారి అవార్డును నాటి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ గారి చేతులమీదుగా స్వీకరించారు.
  • 2000లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పద్యకవితా పురస్కారాన్ని అందుకొన్నారు.మూలాలు
  • రామకృష్ణమాచార్య, నండూరి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీ: 505.

మూలాలు

[మార్చు]
  1. నండూరి రామకృష్ణమాచార్య (1932). అమరజీవులు.
  2. నండూరి రామకృష్ణమాచార్య (1947-05-13). ఛత్రపతి శివాజీ. భీమవరం: కవితాప్రభాస. Retrieved 8 July 2015.
  3. భారత డిజిటల్ లైబ్రరీలో ధర్మచక్రం నాటకం పుస్తక ప్రతి.