కొర్లపాటి శ్రీరామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొర్లపాటి శ్రీరామమూర్తి
కొర్లపాటి శ్రీరామమూర్తి
జననంకొర్లపాటి శ్రీరామమూర్తి
అక్టోబర్ 17, 1929
మరణంజూలై 26, 2011
ఇతర పేర్లుకొర్లపాటి శ్రీరామమూర్తి
ప్రసిద్ధివిమర్శకుడు,
సాహితీ పరిశోధకుడు,
కవి,
నాటకకర్త,
దర్శకుడు,
ప్రయోక్త,
కథకుడు,
ఉత్తమ అధ్యాపకుడు
భార్య / భర్తవెంకట రమణమ్మ
తండ్రికొర్లపాటి మణ్యం
తల్లిరత్నమణి'

కొర్లపాటి శ్రీరామమూర్తి (అక్టోబర్ 17, 1929 - జూలై 26, 2011) విమర్శకుడు, సాహితీ పరిశోధకుడు, కవి, నాటకకర్త, దర్శకుడు, ప్రయోక్త, కథకుడు, ఉత్తమ అధ్యాపకుడు. బహువిధప్రతిభా సామర్థ్యాల్ని ప్రదర్శించిన విజ్ఞానఖని ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి. వేయి వసంతాలు మించి చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యం లో శోధించి, సాధించిన మహత్తర ఇతివృత్తాలతో ప్రచురించిన రచనల సంఖ్య స్వల్పమే. తనలోని సృజనశీలతను అధ్యయన దిశగా కొత్త దారులు పట్టించిన పరిశోధక మేధావి ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి[1].ఆయన వెలువరించిన పరిశోధన గ్రంథాలకు గౌరవసూచకంగా కేంద్ర సాహిత్య అకాడమీ 2009లో ప్రతిష్ఠాత్మక లక్ష రూపాయల నగదు బహుమతి అందించింది. ‘భాషా సమ్మాన్’ పురస్కారం ఆయన్ని వరించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట తాలూకా కొర్లపాటివారి పాలెం లో కొర్లపాటి మణ్యం, రత్నమణి దంపతులకు మూడో సంతానంగా 1929 అక్టోబర్ 17 న శ్రీరామమూర్తి జన్మించారు. స్కూల్ ఫైనల్ చదువుతుండగా అకస్మాత్తుగా తండ్రి మరణం. తన తోబుట్టువులు ఐదుగురిలో శ్రీరామ్ నడిపివాడు. అమ్మకు తోడుగా ఇంటిని చక్కదిద్దడానికి శ్రీరామ్ చదువును త్యాగం చేయాల్సి వచ్చింది. తాతల కాలం నుంచి పుణికిపుచ్చుకున్న జ్యోతిశ్శాస్త్ర విద్యకు తోడు పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యవసాయాన్ని చేసుకుంటూ వచ్చిన తండ్రి అకాల మరణంతో ఆ కుటుంబం బరువు, బాధ్యతలు యుక్తవయస్సులో ఉన్న శ్రీరామ్ భుజాలమీద పడ్డప్పుడు దిక్కు తోచలేదు. అప్పుడప్పుడూ నాన్నతో పొలానికెళ్లి వ్యవసాయం చూసుకోవడమే గానీ, గడ్డిపరకంత సాయం చేసి ఎరగడు. కానీ తప్పలేదు. పాలేర్లను, కూలీలను పెట్టి తాను వ్యవసాయం చూసుకుంటూ పొలం గట్ల మీద కూర్చొని పుస్తకాల్లో మునిగిపోయేవాడు. సాహిత్య గ్రంథాలు చదువుకుంటూ, రచనా వ్యాసంగం కొనసాగించేవారు. అలా మూడేళ్లు గడిచాక శ్రీరామ్ ఉన్నత చదువులకు అవకాశం దొరికింది. కాకినాడలోని పీఠికాపురాధీశ కళాశాలలో (నేటి పీఆర్ ప్రభుత్వ కళాశాల) ఇంటర్మీడియెట్, 1950-51లో భీమవరంలోని డబ్ల్యూజీబీ కళాశాలలో (నేటి డీఎన్‌ఆర్ కళాశాల) బీఏ చేశారు.

ఇంటర్ పూర్తవ్వగానే నల్లా సుబ్బారావు, అమ్మాయమ్మ దంపతుల ఐదో సంతానం వెంకట రమణమ్మతో పరిణయమైంది. భీమవరంలో బీఏ పూర్తయ్యాక 1953-1955 మధ్య కాలంలో భీమవరంలో, రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ట్యూటర్‌గా పనిచేశారు. ఏయూలో కాలు పెట్టకమునుపే పెద్దమనిషి, పట్టుదల, కాలసర్పం, నటన తదితర నాటకాలు రాశారు. అప్పట్లో ఏయూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే చారిత్రక నవలల పోటీల్లో 1955 జవనరి నెలలో కొర్లపాటి శ్రీరామ మూర్తి రచనకు బహుమతి లభించింది. అదే ఏడాది 1955 జూన్‌లో బీఏ ఆనర్స్ చదుకోసం విశాఖపట్నంలో కాలు మోపారు.

1957లో బీఏ ఆనర్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి చదువు పూర్తవ్వగానే ఏయూ ‘శ్రీనాథుడు-సాహిత్యం’ అనే అంశంపై పరిశోధక విద్యార్థిగా ఓ మెట్టు పెకైక్కారు. 1959 లో ఏయూ లెక్చరర్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించారు. 1963 లో తాను పరిశోధనకు ఎంపిక చేసుకున్న శ్రీనాథుడు కవితా సంపుటానికి మంచి గుర్తింపు లభించలేదు.

శ్రీరామమూర్తి ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ తెలుగుశాఖలో 1959 నుంచి 1966 వరకు లెక్చరర్‌గాను, 1966 నుంచి 1983 వరకు రీడర్‌గాను, 1983 నుంచి 1989 వరకు ప్రొఫెసర్‌గాను బాధ్యతలు నిర్వర్తించాడు. 1979-1982 మధ్య కాలంలో తెలుగు శాఖాధ్యక్షునిగా వ్యవహరించాడు. 1989లో ఆచార్యునిగా పదవీ విరమణ చేసినా, తర్వాత 1990 లో యు.జి.సి. ఎమెరిటిస్‌ ఫెలోగా నియమితులై పరిశోధనా కార్యక్రమాన్ని కొనసాగించాడు.

నిరంతర అధ్యయనం, పరిశోధన, వ్యాస, గ్రంథ రచనం శ్రీరామమూర్తి నిత్యకృత్యాలు. ఆకాశవాణిలో ఈయన చేసిన సాహిత్య ప్రసంగాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఈయన పరిశోధన వ్యాసాలు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాయి. ఈయన వ్రాసిన ఈశ్వరార్చన కళాశీలుడు అనే పరిశోధనాత్మక గ్రంథానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి డిలిట్‌ లభించింది.

మరణం

[మార్చు]

జూలై 26, 2011లో మరణించారు.

రచనలు

[మార్చు]
 1. చిత్రశాల - చారిత్రిక నవల (1957) [2]
 2. గుడిగోపురం, కథల సంపుటి (1957)
 3. వీణ, కథల సంపుటి (1961)
 4. ధర్మజ్యోతి చారిత్రకనాటకము (1967)
 5. శ్రీనాథుఁడు, పి.హెచ్‌.డి థీసిస్‌ (1971)
 6. ఈశ్వరార్చన కళాశీలుఁడు శ్రీనాథుడు డి.లిట్‌ థీసిస్‌ (1974)
 7. ప్రతిజ్ఞ, సంస్కృతనాటకానువాదము (1976)
 8. సువర్ణరేఖలు, కావ్యఖండికల సంపుటి (1976)
 9. కావ్యజ్యోత్స్న పరిశోధన వ్యాససంపుటి 1977)
 10. నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీన గ్రంథమూ!, పరిశోధన గ్రంథము (1983)
 11. పోతన సాహిత్యగోష్ఠి, సంకలన గ్రంథము (1984) [1]
 12. పాండవులమెట్ట, చారిత్రకనాటకము (1985)
 13. ప్రబంధ సారశిరోమణి, పరిష్కృతనాటకము (1985)
 14. పలనాటి వీరచరిత్ర, చారిత్రకనాటకము (1985)
 15. నాథయోగి మన వేమన, పరిశోధన గ్రంథము (1987)
 16. చరిత్రచర్చ, పరిశోధన వ్యాస సంపుటి (1989)
 17. సాహిత్య సంపద, పరిశోధన వ్యాస సంపుటి (1989)
 18. సాహిత్యసమస్యలు, పరిశోధన వ్యాస సంపుటి (1990)
 19. ప్రబంధరత్నాకరము, పరిష్కృత గ్రంథము (1991)
 20. తెలుగు సాహిత్య చరిత్ర, ప్రథమభాగము (1991)
 21. తెలుగు సాహిత్య చరిత్ర, ద్వితీయ భాగము (1992)
 22. తెలుగు సాహిత్య చరిత్ర, తృతీయ భాగము (1994)
 23. తెలుగు సాహిత్య చరిత్ర, చతుర్థ భాగము (1996)
 24. శ్రీ కృష్ణదేవరాయలు చారిత్రకనాటకము భువన విజయము, చారిత్రక నాటిక (1997)
 25. తెలుగు సాహిత్య చరిత్ర, పంచమ భాగము (1998)
 26. సాహిత్యమంజరి, పరిశోధన వ్యాస సంపుటి (2004)
 27. సమత, సాంఘిక నాటకము (2005)
 28. నటన, సాంఘికనాటకము (2005)

సూచికలు

[మార్చు]
 1. http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=18281&Categoryid=18&subcatid=0#sthash.21CPdnun.dpuf
 2. శ్రీరామమూర్తి, కొర్లపాటి. చిత్రశాల.

బయటి లింకులు

[మార్చు]