నాగపురి రమేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగపురి రమేష్ జాతీయస్థాయిలో ప్రసిద్ధిచెందిన క్రీడా శిక్షకుడు. ఈయన మన తెలుగువారు. ఈయన శిక్షణలో పలువురు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. ఈయన కృషికి గుర్తింపుగా 2016లో భారత ప్రభుత్వము ఈయనను ద్రోణాచార్య పురస్కారముతో సత్కరించింది.[1]

నేపధ్యము[మార్చు]

వీరు పుట్టింది హన్మకొండలో. నాన్న మల్లయ్య, అమ్మ పుల్లమ్మ. వీరు నలుగురు అన్నదమ్ములు, ఒక అక్క. వీరి నాన్న విద్యుత్‌ శాఖలో అటెండర్‌గా పనిచేసేవారు.

విద్యాభ్యాసము[మార్చు]

పదోతరగతి వరకూ స్థానిక మచిలీబజార్‌ హైస్కూల్లో చదువుకున్నాడు. డిగ్రీ హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీలో చేశాడు.

క్రీడల పట్ల ఆసక్తి[మార్చు]

అప్పట్లో హన్మకొండలో సారంగపాణి, ప్రభాకర్‌... అనే ఇద్దరు సీనియర్‌ అథ్లెట్లు ఉండేవారు. పరుగు పందేలలో వారికి మంచి పేరుండేది. ఇద్దరూ వీళ్ళ వాడలోనే ఉండేవారు. రోజూ ఉదయాన్నే వారితోపాటూ రన్నింగ్‌కి వెళ్లడం అలవాటైంది. వాళ్ల పరిచయంతో హన్మకొండలోని 'జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం ' లో ప్రాక్టీసు చేసే అవకాశం వచ్చింది. అక్కడ వారితోపాటు ఆర్‌.ప్రదీప్‌కుమార్‌ లాంటి సీనియర్‌ అథ్లెట్స్‌ సమక్షంలో రన్నింగ్‌ ప్రాక్టీసు చేసేవాడు. స్టేడియంలో వై.రామకృష్ణ అనే క్వాలిఫైడ్‌ శిక్షకుడు ఉండేవారు. ఆయన వీరికి ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చేవారు. అసలు ప్రొఫెషనల్‌ శిక్షణ అంటే ఏంటో ఇతడికి అప్పుడే తెలిసింది. ఇతడు పెరిగిన వాతావరణం కాస్త రఫ్‌గా ఉండేది. స్కూల్‌, ఇంటర్మీడియెట్‌ సమయంలో భద్రకాళీ చెరువు, వెయ్యి స్తంభాల గుడి... వీటిచుట్టూ స్నేహితులతో షికార్లు చేసేవాడు. కానీ గ్రౌండ్‌కి వెళ్లడం ప్రారంభించాక ఇతని ఆలోచనలూ స్నేహాలూ మారాయి. క్రమశిక్షణ అలవడింది. గ్రౌండ్‌లో ప్రదీప్‌ గారి ప్రభావం ఇతడిపై చాలా ఉండేది. డిగ్రీ చదివే సమయంలో ఆయన జాతీయస్థాయి అథ్లెట్‌. ఆ స్ఫూర్తితో ఇతడూ జూనియర్‌ నేషనల్స్‌ పోటీలకు వెళ్లాడు. డిగ్రీలో ఆలిండియా యూనివర్సిటీ అథ్లెటిక్స్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో కాకతీయ యూనివర్సిటీ అథ్లెటిక్స్‌ జట్టుకి కెప్టెన్‌గానూ చేశాడు. డిగ్రీ ఫైనలియర్లో ఇతని మోకాలికి గాయమైంది. 21 రోజులపాటు మంచం మీదే విశ్రాంతి తీసుకున్నాడు. కోలుకున్నాక పూర్తిస్థాయి అథ్లెట్‌గా రాణించడం కష్టమనిపించింది. ఆ సమయంలో ఒక స్నేహితుడు తమిళనాడులోని కారైకుడిలో 'మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌' చేయమనీ, దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ పేపర్లో పడిందనీ చెప్పాడు. తనే దగ్గరుండి దరఖాస్తు చేయించాడు. సీటు వచ్చింది. కారైకుడికి తిరుచ్చిరాపల్లి నుంచి గంటన్నర ప్రయాణం. హన్మకొండలో ఇతడికి శిక్షణ ఇచ్చిన వై.రామకృష్ణ గారు తర్వాత తిరుచ్చిరాపల్లిలో శిక్షకుడిగా ఉండేవారు. ఆయనకు ఫోన్‌ చేసి విషయం చెబితే 'మంచి యూనివర్సిటీ చేరిపో ' అన్నారు. కారైకుడిలో చదువుతూ వారాంతాల్లో రామకృష్ణ గారి ఇంటికి వెళ్లేవాడు. ఇతడిని వాళ్ల కుటుంబ సభ్యుడిగానే చూసుకునేవారు. ఇతడికి తమిళం రాదు. అక్కడెవరికీ తెలుగు రాదు. ఒకటే దారి కనిపించింది. ఇంగ్లిష్‌ నేర్చుకోవడం. హిందూ పేపర్‌ బాగా చదువుతూ ఇంగ్లిష్‌పైన పట్టు సాధించాడు. అది తర్వాత ఇతడి భవిష్యత్తులో చాలా ఉపయోగపడింది. అప్పుడు ఇంటి దగ్గర కష్టమైనా ఏదోలా సర్దుబాటు చేసి ఇతడికి నెలనెలా డబ్బు పంపేవారు.[1]

కారైకుడిలో ఇతడు చదివింది 'అళగప్ప యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 'లో. దేశంలోనే పేరున్న కాలేజీ అది. అక్కడ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌పైన రీసెర్చర్లు కూడా ఉండేవారు. క్యాంపస్‌ వాతావరణం చాలా క్రమశిక్షణతో ఉండేది. వారాంతాల్లో, సెలవురోజుల్లో తిరుచ్చి వెళ్లినపుడు రామకృష్ణ గారి శిష్యుల్లో ఆయన్‌ అన్నారీతో పరిచయమైంది. ఆయన పదేళ్లపాటు హైజంప్‌లో జాతీయ విజేత, జాతీయ రికార్డు నెలకొల్పాడు కూడా. ఇంకా ఆయన శిష్యుల్లో చాలామంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఉండేవారు. వాళ్లని చూసి చాలా నేర్చుకునేవాడు. వారంతా గురువులకు ఇచ్చే గౌరవం చూసి ఇతనెంత బాధ్యతాయుతమైన వృత్తిని ఎంచుకున్నాడో అర్థమైంది. రోజూ శిక్షణ తర్వాత అంతా తమ అనుభవాలను పంచుకునేవారు. కారైకుడిలో పీజీ చేస్తూ మరోవైపు తిరుచ్చీలో క్రీడాకారుల ప్రాక్టీసుని పరిశీలించడంవల్ల ఆ రెండేళ్లలో చాలా విషయాలు నేర్చుకునే అవకాశం వచ్చింది. పీజీ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.[1]

భారత క్రీడా సమాక్ష శిక్షకుడిగా[మార్చు]

దరఖాస్తు లేకుండా ఉద్యోగం[మార్చు]

తర్వాత హన్మకొండ వచ్చి కాకతీయ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో పీఈటీగా చేరాడు. అక్కడ ముగ్గురు విద్యార్థులకు లాంగ్‌జంప్‌, హైజంప్‌, రన్నింగ్‌లలో శిక్షణ ఇచ్చాడు. వారు జూనియర్స్‌లో సౌత్‌జోన్లో, నేషనల్స్‌లో పతకాలు సాధించారు. ఆ సమయంలో ప్రేమ్‌కుమార్‌ అని వరంగల్‌లో ఫుట్‌బాల్‌ కోచ్‌ ఉండేవారు. 'మీరు పీజీ చేశారు. ఆపైన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఐఎస్‌) కి వెళ్తే ఇంకా బావుంటుంద ' ని చెప్పారు. దరఖాస్తు చేశాడు. బెంగళూరులో సీటు వచ్చింది. ‘డిప్లొమో ఇన్‌ కోచింగ్‌ అథ్లెటిక్స్‌’ కోర్సు అది. ఇతడు పనిచేస్తున్న స్కూల్‌ ప్రిన్సిపల్‌, ఛైర్మన్‌ అయిన శ్రీదేవి గారికి చెప్పాడు. ఏడాదికి ఫీజు రూ.3000. 'ఫీజు నేను కడతాను వెళ్లి చేరు ' అన్నారు. అలా 1991లో అక్కడికి వెళ్లాడు. అక్కడ బ్యాచ్‌ టాపర్‌గా నిలిచాడు. అక్కణ్నుంచి వచ్చి స్కూల్లో పనిచేస్తుండగా రెండు నెలల తర్వాత 'స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌) ' నుంచి కోచ్‌గా చేరమని పిలుపు వచ్చింది. 'ఎన్‌ఐఎస్‌ ' లో టాపర్‌కి దరఖాస్తు చేయకుండానే, ఇంటర్వ్యూ ఏమీ లేకుండానే కోచ్‌గా ఉద్యోగమిచ్చే పద్ధతి అప్పట్లో ఉండేది. ఇతడు చేరిన తర్వాత ఏడాది నుంచి ఆ పద్ధతి మారిపోయింది. అది నిజంగా ఇతడి అదృష్టమే అని భావించాడు . కర్ణాటకలోని చిక్‌మగ్‌ళూరు ‘శాయ్‌’ శిక్షణ కేంద్రంలో అథ్లెటిక్స్‌ కోచ్‌గా చేరమని ఆ ఉత్తరంలో ఉంది. వెంటనే శ్రీదేవి గారితో జాబ్‌ సంగతి చెప్పాడు. ‘మిమ్మల్ని ఇక్కడే ఉంచి మీ ఎదుగుదలని ఆపేశానన్న అపవాదు నాకు వద్దు’ అన్నారు. ఆమె భర్త వసంతరావుకూడా ‘ఇక్కడ ఉంటే ఈ స్కూల్‌కీ, మీ వాడకే పరిమితమైపోతావు. కోచ్‌గా దేశానికి నీ సేవలు చాలా అవసరం. వెంటనే వెళ్లి చేరిపో’ అన్నారు. అలా 1992లో శాయ్‌లో కోచ్‌గా చేరాడు. ఎలాంటి ప్రయత్నమూ చేయకుండానే దేవుడు ఉద్యోగమిచ్చాడు. అలాంటపుడు ఈ ఉద్యోగానికి ఎంతో న్యాయం చేయాలని మొదటిరోజు నుంచే అనుకున్నాడు. 1996 వరకూ చిక్‌మగ్‌ళూరులోనే పనిచేశాడు. అక్కడ అరుణ్‌ డిసౌజా (స్టీపుల్‌చేజ్‌లో అంతర్జాతీయ క్రీడాకారుడు, ఆరేళ్లు నేషనల్‌ ఛాంపియన్‌), లౌలినా లోబో, ప్రకాశ్‌... లాంటి అథ్లెట్‌లకు శిక్షణ ఇచ్చిన బృందంలో ఉన్నాడు.

సిడ్నీ ఒలింపిక్స్[మార్చు]

1996లో హైదరాబాదు‌కు సమీపంలోని హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌కి డిప్యుటేషన్‌పైన వచ్చాడు. 1996-99 మధ్య అక్కడ పనిచేశాడు. తర్వాత బెంగళూరులోని శాయ్‌కి బదిలీ అయింది. అప్పుడే ఇతడిని భారతీయ హాకీ జట్టుకి ఫిట్‌నెస్‌ కోచ్‌గా పంపారు. హాకీ జట్టు 2000 సిడ్నీ ఒలింపిక్స్‌కి సన్నద్ధమవుతున్న సమయమది. కొన్ని నెలల ముందు జట్టుతో చేరాడు. ఒలింపిక్స్‌ ప్రారంభానికి మూడు వారాల ముందే సిడ్నీలో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. ఓ పక్క శిక్షణ ఇస్తూ అక్కడ ఫిట్‌నెస్‌ క్లబ్‌లకు వెళ్తూ స్థానిక శిక్షకులతో చర్చిస్తూ చాలా విషయాలు తెలుసుకునేవాడు. ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాక జట్టు శిక్షణ తర్వాత ఓరోజు విశ్రాంతి తీసుకుంటుండగా హాకీ ఆటగాడు ముఖేష్‌ కుమార్‌ ఇతడి దగ్గరకు వచ్చి... ‘అన్నా మనం ఇంటి దగ్గర ఎలాగూ రెస్ట్‌ తీసుకుంటాం. ఇక్కడ మిగతా దేశాల వారి శిక్షణ పద్ధతుల్ని పరిశీలించు’ అని చెప్పాడు. ఆరోజు నుంచీ అక్కడున్న 21 రోజులూ ఒలింపిక్‌ క్రీడా గ్రామంలో జర్మన్‌, కొరియా లాంటి దేశాల కోచ్‌లను పరిచయం చేసుకొని వారి శిక్షణ పద్ధతుల్ని తెలుసుకునేవాడు. ఒలింపిక్స్‌ తర్వాత కొన్నాళ్లు భారతీయ మహిళా జట్టుకీ ఫిట్‌నెస్‌ కోచ్‌గా పనిచేశాడు.

గోపీచంద్‌ అకాడమీలో[మార్చు]

2014 డిసెంబరు నుంచి గోపీచంద్‌ అకాడమీకి అనుబంధంగా శాయ్‌ ఇతడిని నియమించింది. గోపీ సహకారంతో అక్కడ పి.వి.సింధూతో సహా చాలామంది ఆటగాళ్లకి శిక్షణ ఇచ్చాడు. సాధారణంగా కోచ్‌లు ఒక ఆటకే పరిమితమవుతారు. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కావడంవల్ల విభిన్న క్రీడాంశాల్లో కృషిచేసే అవకాశం ఇతడికి వచ్చింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "నా డైరీలో అవి లేవు". ఈనాడు. 2016-9-11. Archived from the original on 2016-09-13. Retrieved 2016-9-14. Check date values in: |accessdate= and |date= (help)

బయటి లంకెలు[మార్చు]