నికాహ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఓ ముస్లిం వధువు 'నికాహ్ నామా లో సంతకం చేస్తూ.

నికాహ్ లేదా నిఖా అనేది ముస్లిం లలో జరిగే పెళ్ళి తంతు. ఇస్లాం ప్రకారం పెళ్ళి అనేది భార్యాభర్తలుగా ఉండాలని ఒక అమ్మాయికీ - ఒక అబ్బాయికీ మధ్య జరిగే ఒప్పందం. నికాహ్ సమయంలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇద్దరి ఒప్పికతో చట్టబద్ధంగా కొందరు సాక్షులతో కూడిన ఒక వకీలు (ఇతన్నే కాజీ అంటారు) ప్రమాణపత్రాలపై దస్తఖత్ (దస్త్=చేయి, ఖత్= వ్రాత; = చేవ్రాలు) లు తీసుకొని వివాహాన్ని ధ్రువీకరిస్తాడు. ఈ ప్రమాణపత్రాన్నే నికాహ్‍నామా అంటారు. ఈ ధ్రువీకరణను నికాహ్ అంటారు. నికాహ్‍నామాలో వధూ వరులతో పాటూ పెళ్ళికి హాజరైనవారిలో కొందరు సాక్షి సంతకం చేస్తారు. ఇంకా ఇందులో వధూవరుల తల్లితండ్రులు కూడా దస్ఖతు చేస్తారు. ఇందులోనే పెళ్ళికి ఒప్పుకొన్న మహర్ రుసుము వివరాలు పొందుపరుస్తారు. నికాహ్ తర్వాత వధువు తండ్రి పెళ్ళికి హాజరైన వారందరరికి, వరుడి కుటుంబానికి విందు ఇస్తాడు. దీనిని దావత్ గా వ్యవహరిస్తారు. ఈ సమయంలోనే భార్యా భర్తల అధికారాలు ఇంకా బాధ్యతలను, అలానే దాంపత్య జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పెళ్ళి కూతురూ-పెళ్ళికొడుకుకి విన్నవిస్తారు. ఇదంతా బాహ్యంగా జరగాలి. విడాకులు ఇద్దరిలో ఎవరయినా అడగవచ్చు. స్వలింగ వివాహాలు ఇస్లాం ప్రకారం నిషిద్ధం.

చరిత్ర[మార్చు]

నికాహ్‍ను సున్నత్గా మొహమ్మద్ ప్రవక్త ఆదేశించారు. అరబ్బీ పదమయిన నికాహ్ (نكاح‎) పెళ్ళి అనే వ్యవహారంలోనే వాడబడుతున్నది. కొందరు భాషావేత్తల ప్రకారం నికాహ్ పదానికి గూడార్థంలో సంపర్కం అనే అర్ధం కూడా ఉంది.

విశేషాలు[మార్చు]

ఇస్లాం ప్రకారం వివాహానికి వధూవరులిద్దరి అనుమతి కావాలి. దీనినే అరబ్బీలో కుబూల్ అంటారు. ఇస్లాం కుర్'ఆన్ ద్వారా కొన్ని నిబంధనలను తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం కొన్ని వరసలు వివాహానికి నిషిద్ధం. ఒక అబ్బాయి తన తల్లినీ, వరసకు తల్లినీ (పెద్దమ్మ/పిన్నమ్మ), (వరసకు) కూతురునీ, మేనత్తనూ, మేన కోడలినీ, అత్తనూ, కోడలినీ, వివాహితలనూ, మరదలినీ పెళ్ళి చేసుకోరాదు. అలానే ఒక మొహమ్మదీయ అమ్మాయికి ఆమె తండ్రి, వరసకు తండ్రి, కొడుకు, వరసకు కొడుకు, మేన మామ, మేనల్లుడు, మామయ్య, అల్లుడూ నిషిద్ధం. ముస్లింలు ముస్లింలలోనే పెళ్ళాడాలి. ఇక్కడ ఒక చిన్న సవరణ కూడా కల్పించబడింది. ముస్లింలు అహలె-కితాబ్ అనగా దైవగ్రంధాలు అవతరింపబడిన మతస్తులలోనూ వివాహమాడవచ్చు. మాట మాత్రం చేత మెహర్ ఇంకా అన్ని నిబంధనలు కుదిరాక నికాహ్ ఖాయం అయినట్టే. కానీ ఈ రోజుల్లో ఒక ప్రమాణ పత్రం అనేది రాసుకోవటం పరిపాటి అయింది. ఈ తంతు అంతా కొన్ని గంటలలో అయిపోతుంది.

ఇంకనూ[మార్చు]

ఇస్లాం నికాహ్ లేదా వివాహాన్ని ధర్మబద్ధం చేసి ప్రోత్సహించింది. నికాహ్ చేసుకోవడం దైవప్రవక్త సత్సంప్రదాయం, సున్నత్. బ్రహ్మచర్యాన్నీ, వై రాగ్యాన్నీ ఇస్లాం వ్యతిరేకించింది. వివాహం మనిషి ఆలోచనలను సమతూకంలోఉంచి అతని శారీరక నడవడికను క్రమబద్దీకరిస్తుంది. వ్యభిచారం హరామ్ లేదా నిషిద్ధం. వివాహం అతి తక్కువ ఖర్చుతో చాలా నిరాడంబరంగా వుండాలని ఇస్లాం బోధిస్తుంది. కానీ ముస్లింలలో ఒక జాడ్యమేమనగా నికాహ్ రోజు ఇచ్చే విందు, వధువు తండ్రి ఇస్తాడు, ఇందులో అయ్యే ఖర్చు వర్ణనాతీతం, దుబారా ఎక్కువ. ముస్లింలపై హిందూ సాంప్రదాయాల ప్రభావం ఎక్కువ. ఈ రోజుల్లో ముస్లిం కుటుంబాలలో వధూవరులను చూచే 'పెళ్ళిళ్ళపేరయ్యలు' చాలామంది మౌల్వీలు, మౌలానాలు, ముల్లాలే. వధూవరుల పెళ్ళిళ్ళ విషయాల్లో వీరే కులాలను వర్గాలను ప్రోత్సహిస్తుంటారు. ఉదాహరణ: షేక్ లకు షేక్ లలోనే, సయ్యద్ లను సయ్యద్ లలోనే, పఠాన్ లకు పఠాన్ లలోనే, సున్నీలకు సున్నీలలోనే, షియాలకు షియాలలోనే, ధోబీలకు ధోబీలలోనే, మెహ్తర్ లకు మెహ్తర్ లలోనే వెతుకుతూంటారు, వీళ్ళంతా నూర్ బాషా, దూదేకుల సాయిబుల్నిపెళ్ళిచేసుకోరు సరిగదా లదాఫ్, పింజారీ అనే పేరులతో అవమానిస్తూ ఉంటారు. కానీ ఉపన్యాసం సమయం వచ్చిందంటే, అల్లాహ్ ముందు అందరూ సమానమే అని ఘోషిస్తారు. ఈ రెండు నాల్కల ధోరణి స్వర్గప్రాప్తి కలిగిస్తుందా? ఆచరించేది మనమే అయినపుడు దాని నింద నిష్టూరాలు ఇతరుల మీద మోపడం అల్లాహ్ దృష్టిలో శిక్షార్హం.


"https://te.wikipedia.org/w/index.php?title=నికాహ్&oldid=2881704" నుండి వెలికితీశారు