నిజాం వెంకటేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజాం వెంకటేశం
జననం
నిజాం వెంకటేశం

(1948-11-14)1948 నవంబరు 14
మరణంహైదరాబాదు
వృత్తిఎలెక్ట్రికల్ ఇంజనీర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కథా రచయిత, కవి, అనువాదకుడు
పిల్లలుముగ్గురు పిల్లలు
తల్లిదండ్రులు
  • విశ్వనాథం (తండ్రి)
  • సత్యమ్మ (తల్లి)

నిజాం వెంకటేశం, (1948, నవంబరు 14 - 2022, సెప్టెంబరు 18) తెలంగాణకు చెందిన కవి, అనువాదకుడు, ప్రచురణకర్త. వ‌ర్థ‌మాన క‌వుల‌ను ఎంత‌గానో ప్రోత్స‌హించిన వెంకటేశం, ప‌లు ర‌చ‌న‌ల‌కు అనువాదం కూడా చేశాడు.[1]

జననం, విద్య[మార్చు]

వెంకటేశం 1948, నవంబరు 14వ తేదీన విశ్వనాథం - సత్యమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో జన్మించాడు. ఇద్దరు సంతానంలో వెంకటేశం పెద్దవాడు. ఇతనికి ఒక చెల్లెలు ఉంది. వీరికి సిరిసిల్ల పట్టణంలో జనరల్, కిరాణా షాపు ఉండేది. మూడున్నర సంవత్సరాలకే ఇంటిపక్కనున్న పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించాడు. సంవత్సరంన్నరకాలంలోనే మూడు తరగతులు చదవడం పూర్తిచేశాడు. సాహితీవేత్తల పరిచయంతో సాహిత్యంపై ఆసక్తి కలిగింది. హైస్కూలో చదువులోనే అన్ని మాధ్యమాలలో ఫస్ట్ మార్కులతో పాసవ్వడంతోపాటు అన్నీ కవిత్వ, వక్తృత్వ పోటీల్లో చురుకుగా పాల్గొనేవాడు. డాక్టర్ కోర్సు చేయడానికి తమ ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో పాలిటెక్నీక్ కోర్సులో ఎలెక్ట్రికల్ ఇంజనీర్ డిప్లమా చేసి, చెన్నైలో ఏఎంఐఈ చదివాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

వెంకటేశంకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఉద్యోగం[మార్చు]

1968లో జగిత్యాలలోని ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటులో ఎన్ఏంఆర్ (తాత్కాకాలిక ఉద్యోగి) గా నెలకు 96/- రూపాయలు వేతనంతో చేరాడు. ఆ తరువాత పర్మినెంట్ పోస్టింగ్ వచ్చింది. అందులో 29 సంవత్సరాలపాటు పనిచేసి అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ హోదాలో 1997 సంవత్సరంలో స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకుని హైదరాబాదులోని పద్మరావు నగర్ లో స్థిరపడ్డాడు.

ఎలెక్ట్రికల్ రంగంలో వెంకటేశం అనుభవాన్ని గుర్తించిన ఎలక్ట్రిక్ కంపెనీల ఆహ్వానం మేరకు తెలంగాణ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో పనిచేశాడు. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లో 320 కోట్ల ప్రాజెక్టులో ప్రముఖ పాత్ర పోషించాడు. ఇందులో 22 నెలల్లో 30 వేల ఎలెక్ట్రికల్ పోల్స్ వేసి, 40 వేల కనెక్షన్లు ఇప్పించాడు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రశంసలు పొందడంతోపాటు 'బిజిలీ కే సాబ్' అని గుర్తింపు తెచ్చుకున్నాడు.

సాహిత్యరంగం[మార్చు]

చెన్నైలో చదివుతున్నప్పుడు విశ్వవిద్యాలయంలో కవిత్వపోటీలో పాల్గొని రెండవ బహుమతిగా 10 పుస్తకాలను అందుకున్నాడు. అలా సాహిత్యంపై ఏర్పడిన ప్రేమతో మహాత్ముల జీవిత చరిత్రలు, వివిధ రకాల పుస్తకాలు చదివాడు. అలిశెట్టి ప్ర‌భాక‌ర్, సుద్ధాల అశోక్ తేజ వంటి సాహితీవేత్త‌లను ప్రోత్స‌హించాడు. లాయ‌ర్ విద్యాసాగ‌ర్ రెడ్డి రాసిన ప‌లు పుస్త‌కాల‌ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోని అనువాదం చేశాడు. ప్ర‌ముఖ ప్ర‌కృతి వ్య‌వ‌సాయదారుడు సుభాష్ పాలేక‌ర్ వ్య‌వ‌సాయంలో అనుస‌రించే ప‌ద్ద‌తుల‌పై కూడా పుస్తకం రాశాడు. 80వ దశకంలో ‘దిక్సూచి’ అనే కవితా పత్రికను ప్రారంభించి ఎంతోమంది కొత్త, పాత కవులకు వేదికగా నిలిచాడు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో కవితా సంకలనాలను, పుస్తకాలను అనువదించాడు. అల్లం రాజయ్య కథల సంకలనం ‘భూమి’ని ముద్రించాడు. పువురి కథలు, కవిత్వాన్ని సంపుటాలుగా తీసుకొచ్చాడు.[2][3] తన ఇంట్లో 1000 పుస్తకాలతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటుచేయడంతోపాటు, తార్నాక ప్రాంతంలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని 3.50 లక్షల ఖర్చుపెట్టి ఉచిత గ్రంథాలయాన్ని నడిపాడు.

మరణం[మార్చు]

వెంకటేశం సికింద్రాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2022, సెప్టెంబరు 18న గుండెపోటుతో మరణించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. "ప్రముఖ కవి నిజాం వెంకటేశం హఠాన్మరణం". EENADU. 2022-09-19. Archived from the original on 2022-09-19. Retrieved 2022-09-19.
  2. Velugu, V6 (2022-09-19). "ప్రముఖ కవి నిజాం వెంకటేశం ఇకలేరు". V6 Velugu. Archived from the original on 2022-09-19. Retrieved 2022-09-19.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "సాహితీ ప్రియుడు నిజాం వెంకటేశం కన్నుమూత". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-09-19. Archived from the original on 2022-09-19. Retrieved 2022-09-19.
  4. telugu, NT News (2022-09-19). "సాహితీవేత్త నిజాం వెంకటేశం మృతి". Namasthe Telangana. Archived from the original on 2022-09-19. Retrieved 2022-09-19.