Jump to content

నేను (సినిమా)

వికీపీడియా నుండి
నేను
దర్శకత్వంఇ. సత్తిబాబు
రచనసెల్వరాఘవన్
నిర్మాతముళ్ళపూడి బ్రహ్మానందం
తారాగణంఅల్లరి నరేష్
వేద
అభిషేక్
ఛాయాగ్రహణంరాంప్రసాద్
సంగీతంవిద్యాసాగర్
పంపిణీదార్లుశ్రీ రాజ్యలక్ష్మీ కంబైన్స్
విడుదల తేదీ
ఏప్రిల్ 15, 2004 (2004-04-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

నేను ఇ. సత్తిబాబు దర్శకత్వంలో 2004 లో విడుదలైన సినిమా. ఇందులో అల్లరి నరేష్, వేద, అభిషేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది తమిళంలో ధనుష్, సోనియా అగర్వాల్ నాయకా, నాయికలుగా మంచి విజయం సాధించిన కాదల్ కొండేన్ సినిమాకు పునర్నిర్మాణం.[1]

వినోద్ (అల్లరి నరేష్) ఒక అనాథ. అతన్ని ఓ చర్చి ఫాదర్ (పరుచూరి వెంకటేశ్వర రావు) పెంచి పెద్ద చేస్తాడు. అతను ఓ అంతర్ముఖుడు కానీ మంచి తెలివైన వాడు. అతనికిష్టం లేకపోయినా ఫాదర్ బలవంతం మీద వైజాగ్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చేరతాడు. అక్కడ అందరికంటే ఇతను భిన్నంగా ఉంటాడు. అతని తరగతిలో అందరూ వేరుగా చూసినా దివ్య (వేద) అనే అమ్మాయి మాత్రం అతనంటే జాలి చూపిస్తుంటుంది. వినోద్ నెమ్మదిగా ఆమెతో స్నేహం చేస్తాడు. నెమ్మదిగా ఆమె పట్ల అతని స్నేహం ప్రేమగా మారుతుంది కానీ ఆమె మాత్రం అతన్ని స్నేహితుడుగానే భావిస్తుంటుంది. కానీ అతను మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. అలా ఉండగా ఆమె తమ క్లాసులో అభి (అభిషేక్) ను ప్రేమిస్తున్న విషయం తెలుసుకుంటాడు.

దివ్య తండ్రికి అభితో ఆమె ప్రేమను గురించి తెలిసి ఆమెను తీవ్రంగా హెచ్చరింది. ఇంట్లోనే బంధిస్తాడు. కానే వినోద్ వేసుకోవడానికి పాత బట్టలకోసమని వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆయన జాలిపడి ఇంట్లోకి పంపించగానే దివ్యను తీసుకుని పారిపోతాడు. దివ్యకు మాత్రం ఆమెను అడవిలో అభి దగ్గరకు తీసుకుళుతున్నానని చెబుతాడు. వినోద్ ఆ అడవిలోనే ఆమెను తనను ప్రేమించుకునేలా చేయడానికి ఓ రహస్య ప్రదేశం సిద్ధం చేసుకుని ఉంటాడు. ఆమె ఎన్నిసార్లు అడిగినా అభి ఇంకా వస్తాడని మాటలు చెబుతూ ఆమెను తనతోనే ఉంచుకుంటాడు. అలా ఒక రోజు తన బాధాకరమైన గతాన్ని దివ్యతో చెబుతాడు. తాను చిన్నప్పుడే ఎలా అనాథ అయిందీ, తనను ఓ బానిసగా ఎలా పనిచేయించుకున్నదీ చెబుతాడు. ఒకరోజు ఆ వెట్టిచాకిరీ గురించి అతను తిరగబడితే అతన్ని చితకబాది అక్కడే బంధిస్తారు. అతని స్నేహితురాలి మీద అత్యాచారం చేసి చంపేస్తారు. అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుని చర్చి ఫాదర్ దగ్గర చేరతాడు.

దివ్య అతని గతాన్ని విని చలించిపోతుంది. అదే సమయానికి అభి పోలీసుల్ని తీసుకుని అక్కడికి వస్తాడు. వినోద్ ఆహారం సంపాదించుకుని రావడానికి బయటికి వెళ్ళగా అభి, పోలీసులు ఆమెను కలిసి వినోద్ నిజానికి ఓ మానసిక రోగి అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె మాత్రం అతను ఇన్ని రోజులు తనతో ఉన్నా మంచివాడిలానే ప్రవర్తించాడని వాళ్ళు చెప్పిన విషయాన్ని కొట్టిపడేస్తుంది. పోలీసులు అక్కడికి వచ్చారని తెలియగానే వినోద్ వారి మీద మూకుమ్ముడి హింసాకాండ మొదలుపెడతాడు. ఒక పోలీసు కానిస్టేబుల్ ను కాల్చి చంపడంతో దాక్కున్న వారందరూ బయటికి వచ్చేస్తారు. పోలీసు ఇన్స్పెక్టరు, అభి నుంచి దివ్యను తప్పించి మళ్ళీ తనుండే స్థావరానికి తీసుకొచ్చేస్తాడు.

దివ్యకు అతని హింసా ప్రవృత్తి అర్థం అవుతుంది. కానీ వినోద్ మాత్రం ఆమె తనతో ఉంటే చాలని వేడుకుంటూ ఉంటాడు. కానీ దివ్య అతన్ని కేవలం స్నేహితుడిగా భావించి అతన్ని జీవిత భాగస్వామిగా అంగీకరించదు. అప్పుడే అభికి తెలివొచ్చి వినోద్ మీద దాడి చేసి దివ్యను రక్షిస్తాడు. వాళ్ళిద్దరి మద్య పోరాటం మొదలవుతుంది. పోరాటంలో ముగ్గురూ కలిసి ఓ కొండ శిఖరానికి వేళ్ళాడుతూ ఉంటారు. దివ్య ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుంటే వినోద్, అభిలు ఆమె చెరొక చేతిని పట్టుకుని వేళ్ళాడుతూ ఉంటారు. ఆమె బతకాలంటే తన స్నేహితుడు, ప్రేమికుల్లో ఎవరో ఒకరిని వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అభి ఎంత ప్రాధేయపడినా దివ్యకు మాత్రం వినోద్ ను వదిలేయాలంటే మనసు ఒప్పదు. చివరికి వినోద్ నవ్వుతూ తానే ఆమె చేతిని వదిలేసి లోయలో పడి మరణించడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ఎందుకు ఎందుకు, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.కార్తీక్
  • నా కంటి పాప , రచన: వేటూరి సుందర రామమూర్తి , గానం.శ్రీవర్దిని
  • పన్నెండు దాటి , రచన:భువనచంద్ర , గానం.టిప్పు
  • చూస్తూ చూస్తూనే, రచన: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి, గానం. కార్తీక్
  • దేవతలా నిన్ను చూస్తున్నా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. హరీష్ రాఘవేంద్ర
  • దిక్కులనే దాటింది , రచన: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి, గానం. కార్తీక్.

మూలాలు

[మార్చు]
  1. జీవి. "ఐడిల్ బ్రెయిన్ లో నేను సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 17 November 2016.