పట్రాయని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పట్రాయని (Patrayani) తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.

ప్రముఖులు

[మార్చు]

పట్రాయని వంశవృక్షం

[మార్చు]

తెలుగువారి ఇంటిపేర్లలో అతి తక్కువగా వినిపించే ఇంటి పేరుగా పట్రాయని వారిని చెప్పవచ్చు.

దక్షిణ భారత దేశపు బ్రాహ్మలలో ఆరామ ద్రావిడ శాఖకి చెందిన ఇంటిపేరు పట్రాయనివారు. వీరి పూర్వీకులలో ఎవరో సైనిక విభాగంలోని ఒక విభాగానికి అధిపతిగా పట్రాయడు అనే పదవిలో ఉండేవారని, అందువల్ల అతని వంశానికి పట్రాయడు అనే పేరు వచ్చిందని పెద్దలు చెప్పారు. వ్యాకరణరీత్యా ఇంటిపేర్లు తెలుగుదనం సంతరించుకున్న నేపథ్యంలో పట్రాయడు పదం పట్రాయనిగా కనిపిస్తుంది. తెలిసినంతవరకు పట్రాయనివారి కుటుంబానికి చెందిన పూర్వీకులలో 1800-1850 కాలానికి చెందిన పట్రాయని వెంకట నరసింహ భుక్త పేరు వినిపిస్తుంది., శృంగవరపుకోట, విజయనగరం మధ్య చామలాపల్లి అనే అగ్రహారం ప్రతిగ్రహీత గా ఈ వంశంవారు అందుకున్నారు.

చామలాపల్లి 18 వృత్తుల అగ్రహారం. వృత్తి అంటే ఒక కుటుంబం జీవించడానికి కావలసిన భూ వసతి అని అర్థం. ఆనంద గజపతి వంశపు రాజులతో ఈ పట్రాయని వెంకట నరసింహ భుక్తకు అనుబంధం ఉండేదని తెలుస్తోంది. నరసింహ భుక్త కాలంలోనే ఆ అగ్రహారం, ఇతర ఆస్తులన్నీ హరించిపోయాయి. అతనికి ఆరుగురు కుమారులు. వారిలో పెద్దకుమారుడు పట్రాయని పాపయ్యశాస్త్రి. పాపయ్యశాస్త్రి సోదరులు అయిదుగురిలో ఇద్దరు తూర్పుగోదావరి జిల్లాల వైపు వెళ్లారని, వారి పేర్లు పెదనరసన్న, చిననరసన్న అని తెలుస్తోంది కాని మిగిలిన వివరాలు తెలియలేదు.

పాపయ్యశాస్త్రి భార్య అవధాన్ల వారి అమ్మాయి నరసమ్మ. పాపయ్య శాస్త్రి పౌరోహిత్యం చేసేవారని తోలుబొమ్మలాటలో ప్రావీణ్యం చూపేవారని తెలుస్తోంది. ఇతను 35 ఏళ్ళ చిన్న వయసులోనే మరణించాడు. ఇతనికి ఒక కుమారుడు - పట్రాయని నరసింహ శాస్త్రి.

పట్రాయని నరసింహశాస్త్రి

పట్రాయని నరసింహశాస్త్రి గుడివాడ అగ్రహారానికి చెందిన మధురాపంతుల కూర్మన్న అమ్మాయి సూరమ్మని వివాహం చేసుకున్నాడు. మధురాపంతుల పేరయ్యశాస్త్రి, నరసింహశాస్త్రికి పినమామ. పేరయ్యశాస్త్రి అప్పటికే పేరుపొందిన సంగీత విద్వాంసుడు.

పట్రాయని నరసింహశాస్త్రి వీరివద్ద శిష్యరికం చేసి సంగీతం నేర్చుకున్నాడు. దాక్షిణాత్య సంగీతం పట్ల అభిరుచితో సంగీత గ్రంధాన్ని నేర్చుకోవడం కోసం మద్రాసు నగరానికి వెళ్ళి, నంజుండయ్యర్ వద్ద శిష్యుడిగా ఉన్నాడు. బరంపురం, సాలూరు, విజయనగరం సంస్థానాలలో కచేరీలు చేస్తూ, సంగీతశిక్షణ ఇస్తూ ఉత్తరాంధ్రకు చెందిన ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా పేరు పొందాడు. నరసింహశాస్త్రి బరంపురంలో చాలాకాలం సంగీత శిక్షణలు చేసిన తరువాత బొబ్బిలి రాజా వారి ఆదరణపొంది సాలూరు లో స్థిరపడ్డాడు.

సాలూరు గ్రామ ప్రజలు నరసింహశాస్త్రిని ఎంతో ఆప్యాయంగా పెదగురువు అని సంబోధించేవారు. అతని కుమారుడు సీతారామశాస్త్రిని చినగురువు అని పిలిచేవారు. సాలూరు లో పెదగురువు శిక్షణలో ఎందరో సంగీత విద్వాంసులుగా పేరుపొందారు.

1920 ప్రాంతాలలోనే నరసింహశాస్త్రి, కుమారుడు సీతారామశాస్త్రి ఇద్దరూ సాలూరులో శ్రీ శారదా గాన పాఠశాల అనే సంగీత విద్యాలయం ప్రారంభించి విద్యార్థులకు ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చేవారు. పర్ణశాలగా ప్రారంభమయిన పాఠశాలను సీతారామశాస్త్రి పటిష్టమయిన కట్టడంగా రూపొందించాడు.

ఇప్పటికీ సాలూరులో పట్రాయని సీతారామశాస్త్రి సంగీత నృత్య కళాశాల పేరుతో నిర్వహింపబడుతున్న విద్యాలయంలో ఎందరో చిన్నారులు సంగీతం, నృత్యం మొదలైన రంగాలలో శిక్షణ పొంది వారి ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ పాఠశాలను నేడు జరజాపు ఈశ్వరరావు సహకారంతో జరజాపు రమేష్, సాలూరు రాజేశ్వరరావు మెమోరియల్ ట్రస్టులు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

పట్రాయని నరసింహ శాస్త్రిగారి కుమారుడు పట్రాయని సీతారామ శాస్త్రి. నరసింహశాస్త్రి పెదగురువు అనే పేరుతో, సీతారామశాస్త్రి చినగురువు అనే పేరుతో ఆంధ్రదేశంలో ప్రసిద్ధి పొందారు..

పట్రాయని సీతారామశాస్త్రి

పట్రాయని సీతారామశాస్త్రి అతి చిన్నవయసులోనే మాతృవియోగం పొంది తండ్రితో పాటు ఉత్తర దక్షిణ దేశ యాత్రలు చేస్తూనే సంగీతం నేర్చుకొని కర్ణాటక సంగీతంలోనే కాక హిందుస్తానీ సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. సంప్రదాయ సంగీత కచేరీలలో సంప్రదాయం కన్నా జనరంజకత్వానికి పెద్ద పీట వేసి స్వీయ సంగీత రచనలను ఆలపించి అత్యంత జనాకర్షణ పొందాడు. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో వోకల్ పండితుడిగా ఎందరో విద్యార్థులను విద్వాంసులుగా తీర్చిదిద్దాడు. సంగీత కళాశాలలో ఆయన వద్ద శిక్షణ పొందిన వారంతా ప్రభుత్వ కళాశాలలలో అధ్యాపకులుగా, సంగీత విద్వాంసులుగా, సినీ సంగీత శాఖలో ముఖ్యులుగా రూపొందారు. ప్రముఖ సినీ నేపధ్యగాయకులు ఘంటసాల వెంకటేశ్వరావు వంటి ప్రముఖులెందరో శాస్త్రిగారి వద్ద శిక్షణ పొందిన వారే. 1957 ప్రారంభంలో పదవీ విరమణ చేసిన శాస్త్రి మరి కొద్దికాలానికే మరణించాడు.

పట్రాయని సీతారామశాస్త్రికి ముగ్గురు కుమారులు. పట్రాయని సంగీతరావు, పట్రాయని నారాయణమూర్తి, పట్రాయని ప్రభాకరరావు. వీరు ముగ్గురూ తాత, తండ్రి యొక్క సంగీత సంప్రదాయాన్ని కొనసాగించారు.

పట్రాయని సంగీతరావు

పట్రాయని సంగీతరావు గాత్రంలో విద్వత్తును ప్రదర్శిస్తూ అతి చిన్న వయసులోనే కచేరీలు చేసాడు. సంగీత శిక్షకుడిగా ఉంటూ కాలక్రమంలో ఘంటసాల వెంకటేశ్వరరావుకి సహాయకుడిగా, స్వర సహచరుడిగా, ఆయన మరణానంతరం కూచిపూడి నాట్య అకాడెమీలో సంగీత దర్శకుడిగా 35 సంవత్సరాలు తన సేవలనందించాడు. వెంపటి చినసత్యం రూపొందించిన నృత్య నాటికలకు సంగీతరావు కూర్చిన సంగీతం జీవం పోసింది. దేశవిదేశాలలో కూచిపూడి నృత్యనాటకాలను ప్రదర్శించిన సందర్భంలో సంగీతరావు కూడా సత్యం వెంట ఉండి అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు. సంగీత భూషణ, తమిళనాడు ప్రభుత్వం కళాకారులకు గౌరవ పురస్కరంగా ఇచ్చే కలైమామణి, ఆంధ్రప్రభుత్వ ముఖ్యమంత్రి తో ఘనసత్కారం, మద్రాసు తెలుగు అకాడెమీ వారి స్వర్ణ పురస్కారం సంగీతరావు అందుకున్న అనేక సన్మానాలలో కొన్ని.

సంగీతరావుకి ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అందరూ తండ్రిదగ్గర సంగీత శిక్షణ తీసుకున్నా, వారిలో రెండవ అమ్మాయి పద్మావతి సంగీతంలో విశేష ప్రజ్ఞ కనబరచి తమిళనాడు యూనివర్సిటీలో సంగీతంలో ఎం.ఏ, ఎం.ఫిల్ డిగ్రీలు సాధించింది. చినసత్యం అమెరికా పర్యటనలో పద్మావతీ శ్రీనివాసం నృత్యనాటకానికి సంగీతరావుతో పాటు ప్రదర్శనలలో పాలుపంచుకుని గాత్ర సహకారం చేసింది. భర్త ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివాసం ఉంటూ హైదరాబాద్ ఆలిండియా రేడియో కార్యక్రమాలలో తరచుగా పాల్గొంటూ ఉంటుంది. ఇంటి దగ్గర అనేక మంది శిష్యులకు సంగీత పాఠాలు చెబుతుంది. వర్థమాన సినీ నేపథ్యగాయని, ఇటీవలి నంది అవార్డు గ్రహీత కుమారి గీతామాధురి, శ్రీమతి పద్మావతి దగ్గర చిన్నతనం నుండి సంగీతం నేర్చుకున్న శిష్యురాలే.

పట్రాయని నారాయణమూర్తి

సంగీతరావుతమ్ముడు పట్రాయని నారాయణమూర్తి వాసా వారివద్ద వీణ వాదనంలో శిక్షణ పొంది విశాఖపట్నంలో ఎందరికో వీణలో, గాత్రంలో శిక్షణ ఇచ్చాడు. విశాఖపట్నంలో నారాయణమూర్తి దగ్గర సంగీత శిక్షణ పొందిన వారు అధ్యాపకులుగా, సంగీత బోధకులుగా స్థిరపడి ఉన్నారు. సినిమా రంగంలో కూడా సంగీతరంగంలో పేరుతెచ్చుకున్న విద్యార్ధులున్నారు. ప్రముఖ వర్థమాన నేపథ్య గాయకుడు మల్లికార్జున్ నారాయణరావు శిష్యుడే.

నారాయణమూర్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జ్యోతిర్మయి - ప్రముఖ కథా రచయిత పంతుల రామ శాస్త్రి కోడలు. భర్త ఉద్యోగరీత్యా పాండిచ్చేరి లో కాపురం. జ్యోతిర్మయి పాండిచ్చేరిలో స్కూలు టీచర్ గా పనిచేస్తూనే తమిళనాడులో పలు ప్రాంతాలలో సంగీత కచేరీలు చేస్తూ పేరు పొందింది. రెండవ కుమార్తె కిరణ్మయి విశాఖపట్నం లో స్కూలులో సంగీత అధ్యాపకురాలిగా ఉద్యోగం చేస్తున్నది.

పట్రాయని ప్రభాకరరావు

పట్రాయని ప్రభాకరరావు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో సంగీతం అభ్యసించి డిప్లమా పొందాడు. విజయనగరంలో చాలామందికి సంగీత శిక్షణ ఇచ్చాడు. తండ్రి మరణానంతరం సాలూరు లోని సంగీత పాఠశాల ను నిర్వహించి ఆ చుట్టుపక్కల పలు ప్రాంతాలనుంచి వచ్చేవారికి సంగీత పాఠాలు చెప్పాడు.

ఈ విధంగా పట్రాయని వంశంలో మూడు తరాల వారు సంగీత విద్యా సరస్వతి ముద్దు బిడ్డలుగా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో సంగీతజ్యోతి దేదీప్యమానంగా వెలగడానికి కృషిచేసిన సంగీత విద్వాంసులుగా కనిపిస్తున్నారు

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పట్రాయని&oldid=1862022" నుండి వెలికితీశారు