పణి తీరాద వీడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పణి తీరాద వీడు
దర్శకత్వం కె.ఎస్.సేతురామన్
రచనపారపురతు
స్క్రీన్ ప్లేపారపురతు
తారాగణంప్రేమ్‌ నజీర్
నందితా బోస్
చంబరతి శోభన
జోస్ ప్రకాష్
ఛాయాగ్రహణంమెల్లీ ఇరానీ
కూర్పుటి.ఆర్.శ్రీనివాసులు
సంగీతంఎం.ఎస్.విశ్వనాథన్
నిర్మాణ
సంస్థ
చిత్రకళాకేంద్రం
పంపిణీదార్లుచిత్రకళాకేంద్రం
విడుదల తేదీ
1973 జనవరి 19 (1973-01-19)
దేశంభారతదేశం
భాషమలయాళం

పణి తీరాద వీడు (పూర్తి కాని యిల్లు, మలయాళం:പണിതീരാത്ത വീട്) 1972లో నిర్మితమైన చిత్రాలలో ఉత్తమ చిత్రంగా ప్రాంతీయ బహుమతి పొందిన మలయాళ సినిమా. ఈ సినిమాను మలయాళ రచయిత పారపురతు వ్రాసిన పణి తీరాద వీడు అనే నవల ఆధారంగా చిత్రీకరించారు.

కథ[మార్చు]

ఉద్యోగాన్వేషణలో కేరళ రాష్ట్రంలోని తన స్వగ్రామాన్ని వదిలిపెట్టిన జోస్ జాకబ్ అందమైన హిల్‌స్టేషన్ 'ఉదక మండలం'లోని ఆర్మీ ఆఫీసులో సివిలియన్ గుమాస్తాగా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగాడు. సగటు మనుషులలాగే అతనికీ ఎన్నో సమస్యలు...

గ్రామంలో జాకబ్ తల్లి మరియమ్మ ఎప్పుడూ ఏదో జబ్బుతో అవస్థపడుతూ వుంటుంది. తండ్రి తాగుబోతు. వయసుకు వచ్చిన చెల్లెలు కున్హిమోల్‌కు పెళ్ళి చేయాలన్నది జాకబ్‌కు మరో పెద్ద సమస్య.

వీటన్నిటితో సతమతమవుతున్న అతని సున్నితమైన హృదయానికి కాస్త ప్రశాంతతను చేకూర్చేవి ఉదకమండలంలోని ఆ సుందరదృశ్యాలే. అక్కడే ఒక వ్యక్తి జాకబ్‌కు పరిచయమయ్యాడు. అతని పేరు మొయిద్దీన్ కాకా. చేపలు పట్టడమే జీవనాధారంగా గల ఆ వృద్ధునికి జాకబ్ పట్ల అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం కారణంగానే తంకు తెలిసిన ఒక కోటీశ్వరుని మేనేజరు తనకయ్య ద్వారా జాకబ్‌కు ఒక అద్దె ఇల్లు ఇప్పించగలిగాడు. జాకబ్ నివాసం ఆ కోటీశ్వరుని బంగళా తాలూకు అవుట్ హౌస్‌కు మారింది. అక్కడే అతనికి ఆ కోటీశ్వరుని తోటమాలి కుంజికన్నన్, అతని భార్య రోసి, వాళ్ళ పెంపుడు కూతురు లీల పరిచయమయ్యారు. కల్లాకపటం ఎరుగని ముగ్ధ, నవయవ్వన ప్రాంగణంలోనికి అప్పుడే అడుగుపెడుతున్న లీల జాకబ్‌లో ఒక సోదరుణ్ణి వూహించుకుంది. లీలను చూస్తూ తన చెల్లెలు కున్హిమోల్‌ కళ్లెదుట ఉన్నట్లుగానే భావించసాగాడు జాకబ్.

తన కోరికలు తీర్చుకోవడానికి ఎటువంటి అత్యాచారాలు చేయడానికైనా వెనుదీయని ధనిక వర్గానికి ప్రతినిధి వంటి వాడు ఆ కోటీశ్వరుడు. మగువ, మధ్యపానాల మధ్య మునిగితేలే అతని విషపు చూపుల్లో లీల చిక్కుకుంది. అన్నెం పున్నెం ఎరుగని ఆ చిన్నారిని ఎలాగైనా తన వశం చేసుకోవాలని ఆలోచించసాగాడు. అతని ధోరణి అప్పటికే కొంత గ్రహించినా ఏమీ చేయలేక తన కోపాన్ని తానే దిగమ్రింగుకున్నాడు జాకబ్.

ఒకరోజు జాకబ్ అనుకోకుండా ఒక అందమైన అమ్మాయిని ప్రాణాపాయం నుండి కాపాడగలిగాడు. అదే వూళ్ళో ఒక కాన్వెంట్‌లో టీచర్‌గా పనిచేస్తున్న ఆ యువతి పేరు రాకేల్. ఆ సంఘటన తరువాత ఇద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది.

రాకేల్ వివాహం కాకుండానే ఒక ధనవంతుడైన యువకునిచే వంచింపబడ్డ ఒక అభాగిని. తన ఆరేళ్ళ బిడ్డ రోష్ని తండ్రి ఎక్కడున్నాడని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితి ఆమెది. రాకేల్‌ను చూసినప్పుడల్లా జాకబ్‌లో ఒక అందమైన ఊహ ఏర్పడుతుండేది. ఆ ఊహను పునాదిగా చేసుకుని ఒక సుందరసౌధాన్ని మనసులోనే నిర్మించుకున్నాడు జాకబ్.

లీలను అనుభవించాలకున్న ఆ కోటీశ్వరుడు ఇక జాప్యాన్ని సహించలేక ఆ అమ్మాయిని మద్రాసు నగరానికి తీసుకుపోవాలని అక్కడ తనకిక ఏ అడ్డూ వుండదని నిర్ణయించుకున్నాడు. డబ్బుతో చేయవలసిన ఏర్పాట్లన్నీ చేసి ఒక రోజు బలవంతంగా ఆమెను కార్లో తీసుకుపోవడానికి సిద్ధమయ్యాడు. పులి నోట్లోపడ్డ లేగదూడలా లీల నిస్సహాయంగా కేకలు పెట్టింది. ఏడ్చింది.

అంతవరకూ ఆ అన్యాయాలను చూస్తూ మౌనంగా ఉండిపోయిన జాకబ్‌కు ఆ క్షణంలో ఆవేశం అగ్నిలా రగిలింది. లీలను తీసుకుపోతున్న కారును ఆపాలని ముందుకు దూకాడు. కానీ మేనేజరు తనకయ్య అడ్డుపడడంతో పరిస్థితి చెయ్యిదాటి పోయింది. కోపం పట్టలేక జాకబ్ అతని చెంప ఛెళ్ళు మనిపించాడు. "నువ్వు ఈ అన్యాయాన్ని ఆపగలిగి వుండేవాడివే. కానీ ఆపలేదు. నీ లాంటి మధ్య తరగతి మనుషులు ద్రోహం చేస్తూండబట్టే లీల వంటి అమాయక యువతులు రాక్షసులకు బలైపోతున్నారు" అని ఆక్రోశించాడు. తనకయ్య తనలోని ఆవేదనను అణచుకుంటూ "లీలపట్ల నీకు ఎలాంటి సానుభూతి వుందో - అలాంటి సానుభూతి నాకూ వుంది. కానీ నా పిల్లలు, నా కుటుంబం బ్రతకడానికి నేను ఇలాంటి వెధవపనులు చెయ్యక తప్పడం లేదు" అన్నాడు. 'ఒక లీలను రక్షిస్తే తన వాళ్ళ బ్రతుకులు రోడ్డెక్కకుండా ఎవరు కాపాడతారు?' అన్న ప్రశ్న అతని సమాధానంలో ధ్వనించింది. జాకబ్ నిరుత్తరుడయ్యాడు.

సమస్యలు మరింత తీవ్రంగా అతన్ని వెంటాడసాగాయి. గ్రామంలో అతని తండ్రిని ఎవరో కొట్టి చంపేసినట్లుగా వార్త వచ్చింది. తనను ఎంతగానో అభిమానించే మొయినుద్దీన్ కాకా దుర్భర దారిద్ర్యంతో ఆత్మహత్య చేసుకోవడం అతన్ని మరింత క్రుంగదీసింది. రాకేల్ తనను అన్నగా భావించినట్లు చెప్పడంతో అతని సుందర స్వప్నాలు, ఆశా సౌధాలు పూర్తిగా ఛిన్నాభిన్నమైపోయాయి. సరిగ్గా ఆ సమయంలోనే దేశ సరిహద్దుల వద్ద యుద్దం ప్రారంభమైంది.

దేశ రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేయాలన్న నిర్ణయానికి వచ్చి సైనికుడిగా యుద్ధరంగానికి బయలుదేరాడు జాకబ్. అతనెక్కిన రైలు కదులుతూండగా రాకేల్ పూవులూ, పళ్ళూ తీసుకుని స్టేషన్‌కు వచ్చింది. మనసారా వీడ్కోలు చెప్పాలనుకుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. జాకబ్‌ను తనను దూరం చేస్తున్న రైలు ముందుకు దూసుకు పోతుంటే ఆమె కళ్ళు చమర్చాయి.[1]

నటీనటులు[మార్చు]

  • ప్రేమ్ నజీర్ - జోస్ జాకబ్
  • నందితాబోస్ - రాకేల్
  • చంబరతి శోభన - లీల
  • జోస్ ప్రకాష్
  • ప్రేమ్‌ ప్రకాష్
  • శ్యామ్‌
  • అబ్బాస్
  • ఆడూర్ భవాని
  • ఆడూర్ పంకజం
  • అలుమ్ముదన్
  • సుమతి
  • బహద్దూర్ - మొయినుద్దీన్ కాకా
  • ఇ. మాధవన్
  • జూనియర్ షీలా
  • ఎన్.గోవింద కుట్టి - తనకయ్య
  • పి.ఒ.థామస్
  • ఫిలోమినా - జాకబ్ తల్లి
  • ఎస్.పి. పిళ్ళై - జాకబ్ తండ్రి
  • సరస్వతి
  • వి.గోవిందకుట్టి
  • వీరన్
  • ప్రేమ
  • రవీంద్రన్

సాంకేతికవర్గం[మార్చు]

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
1972 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ మలయాళ సినిమా కె.యస్.ఆర్.మూర్తి గెలుపు

మూలాలు[మార్చు]

  1. "పణి తీరాద వీడు". విజయచిత్ర. 8 (8): 20–21. 1 February 1974.

బయటిలింకులు[మార్చు]


భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు