పింజర (మరాఠీ సినిమా)
పింజర | |
---|---|
దర్శకత్వం | వి. శాంతారాం |
రచన | శంకర్ బాబాజీ పాటిల్ |
నిర్మాత | వి. శాంతారాం |
తారాగణం | శ్రీరాం లాగూ సంధ్య నీలూ ఫూలే |
ఛాయాగ్రహణం | శివాజీ సావంత్ |
సంగీతం | రాం కదమ్ జగదీష్ ఖేబుకర్ (పాటలు) |
నిర్మాణ సంస్థ | రాజ్‌కమల్ కళామందిర్ |
విడుదల తేదీ | 31 మార్చి 1972 |
సినిమా నిడివి | 175 ని. |
దేశం | భారతదేశం |
భాష | మరాఠీ/హిందీ |
పింజర ప్రసిద్ధ దర్శక నిర్మాత వి.శాంతారాంచే 1972లో నిర్మించబడిన మరాఠీ సినిమా. ఈ సినిమాకు 20వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ మరాఠీ చిత్రంగా పురస్కారం లభించింది. ఈ సినిమాను అదే పేరుతో హిందీ భాషలో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు జర్మన్ సినిమా ది బ్లూ ఏంజెల్ (Der Blaue Engel, 1930) మాతృక.
కథ
[మార్చు]శ్రీధర్ మంచి ఆదర్శాలుగల వ్యక్తి; సంస్కర్త. గుణవంతవాడి అనే పల్లెలో వుంటూ, ఆ పల్లె అభివృద్ధికి చాలా శ్రమించాడు. తన గ్రామం ఆదర్శగ్రామం కావాలని, ఎన్నెన్నో పథకాలు వేసి, నూతన విధానాలు రూపొందించాడు. అతని కృషి ఫలించింది. ఆ గ్రామానికి మంచి ఖ్యాతి లభించింది. అన్ని జిల్లాల్లోనూ ఆదర్శగ్రామంగా పేర్కొంటూ ప్రభుత్వం ఆ గ్రామానికి బహుమతి ఇచ్చింది.
ఒకరోజు చంద్రకళ అనే నర్తకి తన బృందంతో ఆ గ్రామానికి వచ్చి నాట్యప్రదర్శనలు ఇవ్వబోయింది. కాని, తమ గురువు శ్రీధర్ ఆదర్శాలకు అది భిన్నమని, గ్రామీణులు, ఆమెను ప్రదర్శనలు ఇవ్వనివ్వలేదు. చంద్రకళ ముందు ఆశ్చర్యపోయినా, తరువాత గ్రామం శివార్లలో ప్రదర్శనలు ఇవ్వడం ఆరంభించింది. అయితే, ఆ పల్లెవాసులు దొంగతనంగా తమ గురూజీకి తెలియకుండా వచ్చి ఆ ప్రదర్శన్లు చూడసాగారు. ఈ సంగతి తెలుసుకున్న శ్రీధర్ గ్రామ పెద్దను తీసుకుని చంద్రకళ దగ్గరకు వెళ్ళి ప్రదర్శనలు నిలిపి, వెళ్ళిపొమ్మని కోరాడు.
బలవంతంగా చంద్రకళ ఆ ప్రదేశాన్ని విడిచి పెట్టవలసి వచ్చింది. కాని, ఆమె తన ఓటమిని అంగీకరించలేదు. ఏనాటికైనా శ్రీధర్‌ను తను రప్పించుకుని, తనతోపాటు రంగం మీద ఆడించాలని పంతం పట్టింది. నాట్యబృందం వారు అక్కడి నుండి కదిలి, నదిని దాటి ఆ ఒడ్డున ప్రదర్శనలు ఇవ్వడం ఆరంభించారు. అవి గ్రామీణులను ఆకర్షించసాగాయి. గురూజీ ప్రయత్నాలు నిష్ఫలమైనాయి. ఆ గ్రామీణులు ఆ ప్రదర్శనాలు చూడ్డానికి ఎగబడసాగారు.
గత్యంతరం లేక గురూజీ అక్కడికి కూడా వెళ్ళి, చంద్రకళను, తన గ్రామవాసులనూ మందలించాడు. వారి మధ్య జరిగిన ఘర్షణలో చంద్రకళ కింద పడిపోవడం, ఆమెకు దెబ్బలు తగలడం జరిగాయి. గురూజీ తాను వైద్యుడు కూడా కావడం వల్ల అంతా మరిచిపోయి ఆ పరిస్థితిలో ఆమెకు చికిత్స చెయ్యడానికి తలపడ్డాడు.
నాటి నుంచి గురూజీ ప్రతిరోజూ చంద్రకళ దగ్గరకు గ్రామీణులకు తెలియకుండా వస్తూ మందులు ఇవ్వసాగాడు. దీనివల్ల అతనికి ఎన్నో సమస్యలు ఎదురైనాయి. అయినా సరే, అతను చంద్రకళ దగ్గరకు రావడం మానలేదు. క్రమక్రమేణా అతన్ని చంద్రకళ ఆకర్షించింది. అతను ఆమెను చూడకుండా వుండలేని క్షణాలు వచ్చాయి. ఒకసారి పల్లెలో జరుగుతున్న ఒక ముఖ్యమైన సమావేశానికి అతను హాజరు కాకుండా, చంద్రకళ సమక్షంలో వుండగా గ్రామ పెద్ద మరికొందరితో సహా అతని కోసం వచ్చాడు. చంద్రకళ శ్రీధర్‌ను దాచేసి, లేడని చెప్పి పంపేసింది.
గ్రామీణులు తిరిగి రాగా, శ్రీధర్ తన ఇంటనే ఉన్నాడు. అది చూసి వాళ్ళంతా నివ్వెరపోయి తాము అనవసరంగా శ్రీధర్‌ను నిందించామని బాధపడి, అతను చంద్రకళ దగ్గర ఉన్నట్టుగా చెప్పిన గ్రామపెద్ద కొడుకు బాజీరావును పట్టుకుని చావబాదారు.
శ్రీధర్ కొన్ని రోజులు కనిపించకపోయే సరికి, చంద్రకళకు తోచలేదు. అతన్ని చూడ్డానికి గాను ఒక రాత్రి ఆమె బయలుదేరింది. అదే రాత్రి గ్రామపెద్ద కొడుకు బాజీరావు ఆ గ్రామంలోని ఒక అమ్మాయిని బలవంతం చెయ్యబోయాడు. అంతలో ఆమె భర్త రావడం గమనించి పారిపోయాడు. అదే సమయంలో గురూజీ చంద్రకళను తన ఇంట చూశాడు. ఇద్దరూ ఒకర్నొకరు ప్రేమించుకున్నట్టుగా అర్థమైంది. తొలిసారిగా ఇద్దరూ ఒకర్నొకరు కౌగిలించుకుని తన్మయులైనారు. వాళ్ళిద్దర్నీ అలా చూసిన బాజీరావు, శ్రీధర్ మీద దండెత్తి ఊరందర్నీ పిలిచి, ఆ దారుణాన్ని చూపిస్తానని బెదిరించాడు. కాని అంతలోనే అతను బలవంతం చేయబోయిన అమ్మాయి భర్త చేతిలో పడి దుర్మరణం పొందాడు.
ఈ హత్య కళ్ళారా చూసిన గురూజీకి ఏం చేయాలో పాలుపోలేదు. వూరి వాళ్ళు అక్కడికి వచ్చి ఆ స్థితిలో ఉన్న తమ ఇద్దర్నీ చూస్తే తాను ఎలాంటి చర్యకు గురి అవుతాడో ఊహించుకున్నాడు. బండ దెబ్బ తిన్న బాజీరావు ముఖం ఆనవాలు పట్టడానికి వీలులేకుండా అయి అపోయింది. చంద్రకళ ఒక సలహా ఇచ్చింది. బాజీరావుకు శ్రీధర్ దుస్తులు తొడిగి, తామిద్దరూ పారిపోతే శవాన్ని చూసిన పల్లెవాసుకు శ్రీధరే చచ్చిపోయాడనుకుంటారని, ఇంక ఎన్నడూ అతనికోసం వెదకరనీ! అలాగే చేసి, గురూజీ మారు వేషంతో చంద్రకళతో కలిసి పారిపోయాడు. వూరి వారంతా అది శ్రీధర్ మృతదేహమేనని నమ్మారు. కనబడకుండా పోయిన బాజీరావే ఆ హత్య చేసివుంటాడని నిశ్చయించుకున్నారు.
పోలీసులు హత్య విషయమై పరిశోధన మొదలు పెట్టారు. చంద్రకళ బృందం దూరంగా వెళ్ళిపోయింది. శ్రీధర్ తాను పోలీసుల కంటబడతానేమోనని భయపడసాగాడు. కాని చంద్రకళ మీది ప్రేమ అతన్ని ఎక్కడికీ కదలనివ్వలేదు. చంద్రకళ సోదరి మాత్రం ఎప్పుడో చంద్రకళ బృందాన్ని విడిచిపెట్టి శ్రీధర్‌తో వెళ్ళిపోతుందని కలవరపడసాగింది. అందువల్ల ఆమె శ్రీధర్‌ను ఎదిరిస్తూనే రాసాగింది.
గురూజీకి నెమ్మదిగా తాగుడు, పొగతాగుడూ అలవాటయ్యాయి. ఆ బృందంలో అతను కొరగానివాడుగా పరిగణింపబడ్డాడు. ఒక సారి అతను బృందంలో పాల్గొని కంజీరా వాయించవలసి వచ్చింది. అది అతనికి కుదరక పాలిపోదలచుకున్నాడు. కాని చంద్రకళ కూడా అతనితోనే వెళ్ళడానికి నిర్ణయించుకుంది. ఈ అనర్థాలన్నీ అతన్నుంచే వస్తున్నాయని, బృందం వారంతా కలిసి శ్రీధర్‌ను చావగొట్టారు. చంద్రకళ అడ్డుపడింది. ఇద్దరూ కలిసి వెళ్ళిపోదామనుకుంటూ వుండగా, శ్రీధర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ కంట పడ్డాడు. గురూజీని అతనే చంపాడని అభియోగం. చంద్రకళ నిజం చెప్పడానికి ప్రయత్నించింది. గురూజీ అందుకు అంగీకరించలేదు. తను చేసిన తప్పిదానికి తాను శిక్ష అనుభవించవలసిందేనని తీర్మానించుకున్నాడు. తానే గురూజీని హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అతన్ని కాపాడాలని విశ్వప్రయత్నం చేసిన చంద్రకళకు మాటపడిపోయింది. ఉన్న నిజాన్ని ఆమె చెప్పలేకపోయింది. గురూజీకి మరణశిక్ష విధింపబడిందని విని, ఆ వార్తకు తట్టుకోలేక చంద్రకళ ప్రాణాలు విడిచిపెట్టింది.[1]
నటీనటులు
[మార్చు]- శ్రీరాం లాగూ
- సంధ్య
- నీలూ ఫూలే
- వత్సల దేశ్‌ముఖ్
- మాయా జాదవ్
- సరళా యోలేకర్
- ఉషా నాయక్
- బాలచంద్ర కులకర్ణి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు, నిర్మాత: వి.శాంతారాం
- కథ: శంకర్ బాబాజీ పాటిల్
- సంగీతం: రాం కదమ్, జగదీష్ ఖేబుకర్ (పాటలు)
- నేపథ్య గాయకులు: లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, సుధీర్ ఫడ్కే
- ఛాయాగ్రహణం: శివాజీ సావంత్
పురస్కారాలు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
1972 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ మరాఠీ సినిమా | వి.శాంతారాం | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు (1 March 1974). "పింజర". విజయచిత్ర. 8 (9): 18–19.