పిటాయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Longitudinal section of a ripe pitahaya

పిటాయ (Pitaya) అనేది కాక్టస్ కుటుంబంలో ఒక జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం హైలోసరస్ అండాటస్ (Hylocerus Undatus). పిటాయ కాసే కాయలను డ్రాగన్ కాయలు (Dragon Fruits) అని అంటారు. ఇది రాళ్ళపై లేదా మట్టిలో పెరిగే మొక్క. పిటాయ మెక్సికో, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో పెరుగుతాయి. డ్రాగన్ కాయల్లో ఎన్నో పోషక విలువలు వుండటంతో ఈ మధ్య వీటికి వాణిజ్యపరమైన డిమాండ్ పెరిగింది. ఇప్పుడు పిటాయాను ఇండొనేషియా, తైవాన్, వియత్నాం, థాయ్ లాండ్, పిలిప్పియన్స్, శ్రీలంక, మలేషియా, బంగ్లాదేశ్లో సాగు చేస్తున్నారు. ఈ మధ్యనే దక్షిణ భారతదేశంలో కూడా వీటిని కొంతమంది సాగు చేస్తున్నారు. పిటాయా సాగు ఒకినావా, హవాయ్, ఇశ్రాయేల్, పాలస్తీనా, ఆస్ట్రేలియా, చైనా, సైప్రస్ దేశాల్లో కూడా కనబడుతోంది. మార్కెట్ లో ఎక్కువ ధర పలికే డ్రాగన్ కాయ తినడానికి కొద్దిగా ముంజికాయ (Borassus flabellifer) రుచి వలె వుంటుంది. డ్రాగన్ కాయలు మెట్రో నగరాల్లో మాత్రమే లభ్యమవుతాయి.

సాగు[మార్చు]

పిటాయా మొక్కలను సాధారణంగా విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేయవచ్చు. సరిగా పండిన కాయలోంచి నల్లటి గింజలను సేకరించి, నీడలో ఒక రోజు పూర్తిగా ఆరబెట్టి వుంచుకోవాలి. ఆ తర్వాత కుండీల్లో మెత్తటి నర్సరీ మట్టితో నింపాలి. విత్తనాలను కుండీ మట్టిపై చల్లి, వాటిపై పల్చగా మట్టి పొరగా వేయాలి. నీళ్ళు నెమ్మదిగా పోసి నీడలో వారం రోజులు ఒక చోట పెట్టాలి. నాటిన వారం రోజులకే విత్తనాలు మొలకెత్తుతాయి. 1 లేదా 2 అడుగుల ఎత్తు ఎదిగిన మొక్కలను పొలంలో నాటవచ్చు.

పిటాయా సాగుకు తేలికగా నీరు ఇంకిపోయే నేలలు, సుమారు 20 డిగ్రీల నుండి 40 డిగ్రీల ఎండ వేడి, నీటి సదుపాయం అవసరం. ముందుగా పొలాన్ని శుభ్రంగా దున్ని కలుపు మొక్కలు లేకుండా చేసుకొని వారం రోజులు ఎండబెట్టాలి. ప్రతి ఐదు అడుగులకు ఒక ఫెన్సింగ్ స్తంభం (Fencing Pole) చొప్పున పొలం అంతా స్తంభాలను పాతాలి. ఆ తర్వాత ప్రతి సిమ్మెంటు స్తంభం అడుగు భాగం వద్ద 1 లేదా రెండు మొక్కలను నాటి వాటిని తీగతో గాని లేదా త్రాడుతో గాని స్తంభానికి కట్టాలి. మొక్క నాటిన 2 లేక 3 సంవత్సరాలకే పుష్పిస్తుంది. పిటాయా మొక్కలకు నేల పూర్తిగా ఆరినప్పుడు మాత్రమే నీటి తడి పెట్టాలి.

పిటాయా పువ్వులు ఆర్కిడ్ కాక్టస్ (Epiphylum Oxypetalum) వలె అర్ధరాత్రి విచ్చుకొని ఉదయానికి వాలిపోతాయి. పువ్వు రాలిన నెలకు కాయ పక్వానికి వస్తుంది. పక్వానికి వచ్చిన కాయను ముచ్చిక వద్ద చాకుతో కోయాలి. డ్రాగన్ కాయలు ఎక్కువగా నిల్వ వుండవు గనుక వాటిని కోసిన 24 గంటల లోపు మార్కెట్ కు తరలించాలి.

ఆదాయం[మార్చు]

సైజును బట్టి ఒక్కొక్క డ్రాగన్ కాయ 200 రూపాయల నుండి 250 రూపాయలవరకూ ధర పలుకుతుంది. ఎర్రటి గుజ్జు గల డ్రాగన్ కాయ మాత్రం 400 నుండి 450 రూపాయల వరకూ ధర పలుకుతుంది.

లభ్యం[మార్చు]

ఎక్కువ ఖరీదు పలికే డ్రాగన్ కాయలు సంపన్నులకే తప్ప మధ్య తరగతి వారికి అందుబాటులో వుండవు. గ్రామాల్లో సంపన్నులు అతి తక్కువగా వుంటారు, కనుక డ్రాగన్ కాయలను సంపన్నులు ఎక్కువగా వుండే నగరాల్లో మాత్రమే లభ్యమవుతాయి.

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పిటాయ&oldid=3275308" నుండి వెలికితీశారు