పెద్దపల్లి జిల్లాలోని జలపాతాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో పెద్దపల్లి జిల్లా ఒకటి. 2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఈ జిల్లా కొత్తగా ఏర్పడింది. ఈ జిల్లాలో పదికి పైగా జలపాతాలు ఉన్నాయి.[1][2] గోదావరి, మానేరు నదులు, చిన్నచిన్న వాగులతోపాటు కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతంతో ఈ జిల్లా నిండివుంది. వర్షాకాలంలో ఎత్తయిన కొండలు, గుట్టల నుంచి జలపాతాలు జాలువారుతుంటాయి. ఈ జలపాతాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది పర్యాటకులు వస్తుంటారు.


జలపాతాల వివరాలు

[మార్చు]
  1. గౌరీగుండాల జలపాతం: జిల్లా కేంద్రానికి 20 కి.మీ.ల దూరంలో సబ్బితం, గుండారం మధ్యలోని గుట్టపై ఈ జలపాతం ఉంటుంది. 70 నుంచి 90 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతున్న ఈ జలపాతం సమీపంలో పురాతనమైన శివలింగం, వినాయకుడు, సప్తమాత్రుకలు, మహిషాసుర మర్థిని దేవతా విగ్రహాలు ఉన్నాయి. దీనికి పక్కనే పెద్ద రాతికొండకు తొలిచిన నాలుగు చారిత్రక గుహలయాలు కూడా ఉన్నాయి.[3]
  2. రామునిగుండాల జలపాతం: ఇది అంతర్గాం మండలంలోని లింగాపూర్‌ గ్రామ సమీపంలో ఉంది. తన వనవాసం కాలంలో రాముడు ఇక్కడ కొంతకాలం ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రామునిగుండాల పేరుమీదనే రామగుండం వెలిసి, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. రెండు గుట్టల నడుమన 108 గుండాల గుండా ఒక చీలికవంటి ఆకారంతో నీళ్ళు ప్రవహించి చివరగా 40 మీటర్ల లోతులో ఉన్న మరో గుండంలోకి జారుతాయి. ఈ గుట్టపైన వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది.
  3. రామగిరి ఖిల్లా జలపాతాలు: రామగిరి మండలంలోని రామగిరిఖిల్లాపై సుమారు 8 జలపాతాలున్నాయి. ఈ ఖిల్లాలోని మొదటి దర్వాజలోకి వెళ్ళేముందే ఎడమ వైపున్న దారిలో ఒక జలపాతం ఉంది. ఇక్కడ సుమారు 70 మీటర్ల ఎత్తు నుంచి నీళ్ళు కిందకు జాలువారుతుంటాయి.
  4. పాండవుల లొంక జలపాతం: మహాభారత కాలంలో పాండవులు ఇక్కడి ప్రాంతంలో కొద్దిరోజులు నివసించడం వల్ల ఈ ప్రాంతానికి పాండవుల లొంక అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ వెళ్ళేదారిలో వెన్నంపల్లి, జాఫర్‌ఖాన్‌పేట్ గ్రామాల మధ్య ఈ పాండవుల లొంక జలపాతం ఉంది. ఈ ప్రాంంతంలోని అర్ధచంద్రాకారం గుట్టపైనుంచి నీళ్ళు సుమారు 70 మీటర్ల కిందకు పడుతాయి.
  5. బుగ్గ రామలింగేశ్వరస్వామి జలపాతం: గోదావరిఖనికి వెళ్ళేదారిలో బసంత్‌నగర్‌ ప్రాంతంలోని గుట్టపై ఈ జలపాతం ఉంది. 50 మీటర్ల లోతులోకి నీళ్ళు జారే ఈ జలపాతం సమీపంలో బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం ఉండడం వల్ల దీనికి బుగ్గ రామలింగేశ్వరస్వామి జలపాతమనే పేరు వచ్చింది.
  6. ముత్తారం ముక్తీశ్వరస్వామి జలపాతం: పెద్దపల్లికి 8 కిలోమీటర్ల దూరంలోని ముత్తారం గ్రామంలోని ముక్తీశ్వరస్వామి గుట్టమీద ఈ జలపాతం ఉంది. జలపాతం సమీపంలో కాకతీయుల కాలంనాటి అతి పురాతనమైన శివలింగమున్న ముక్తీశ్వరస్వామి దేవాలయం ఉండడం వల్ల దీనికి ముత్తారం ముక్తీశ్వర స్వామి జలపాతమనే పేరు వచ్చింది.
  7. గుర్రాంపల్లి పులిగుండం జలపాతం: గుర్రాంపల్లి గ్రామంలోని గుట్టపై జలపాతం ఉంది. స్థానికులచే పులిగుండంగా పిలువబడుతున్న ఈ జలపాతం, ఏటవాలుగా ఉన్న గుట్ట నుంచి 20 మీటర్ల లోతులో ఉన్న ఒక గుండంలోకి జాలువారుతుంది.
  8. సీతమ్మ జలపాతం: సీతంపల్లి గ్రామంలోని సీతమ్మగుట్టపైన ఈ సీతమ్మ జలపాతం ఉంది.
  9. గాడుదల గండి జలపాతం: మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ సమీపంలోని అడవిలో ఈ జలపాతం ఉంది.
  10. పాండవుల గుట్ట జలపాతం: ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి సమీపంలోని పాండవుల గుట్టపై ఈ జలపాతం ఉంది.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి జిల్లా (8 August 2021). "కనువిందు చేస్తున్న జలపాతాలు". andhrajyothy. కుందారపు సతీష్. Archived from the original on 8 August 2021. Retrieved 8 August 2021.
  2. నమస్తే తెలంగాణ (20 July 2018). "మన తెలంగాణ జలపాతాల వీణ!". Archived from the original on 7 September 2018. Retrieved 8 August 2021.
  3. నమస్తే తెలంగాణ. "తెలంగాణ నయాగరాలు". Archived from the original on 8 September 2018. Retrieved 8 August 2021.