పెద్ద కొడుకు
పెద్ద కొడుకు (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ప్రకాశరావు |
---|---|
తారాగణం | శోభన్ బాబు , కాంచన |
నిర్మాణ సంస్థ | శ్రీకాంత్ & శ్రీకాంత్ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాతలు: శ్రీకాంత్ నహతా, శ్రీకాంత్ పటేల్
- దర్శకత్వం: కె.ఎస్.ప్రకాశరావు
- మాటలు: సముద్రాల జూనియర్
- పాటలు: సి.నారాయణరెడ్డి
- సంగీతం: పి.ఆదినారాయణరావు
- నేపథ్యగానం: ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, రామకృష్ణ, ఎస్.వరలక్ష్మి
- ఛాయాగ్రహణం: శ్రీకాంత్
- కళ:బి.చలం
- కూర్పు:ఎస్.పి.ఎన్.కృష్ణ
- నృత్యం: బి.జయరాం
- పోరాటాలు: పరమశివం
నటీనటులు
[మార్చు]- శోభన్ బాబు
- కాంచన
- నాగభూషణం
- చిత్తూరు నాగయ్య
- ఎస్.వరలక్ష్మి
- వివేకానంద్
- రమణారెడ్డి
- సాక్షి రంగారావు
- కె.వి.చలం
- పొట్టి ప్రసాద్
- ఏచూరి
- మాడా వెంకటేశ్వరరావు
- పుష్పలత
- జయ
- సలీమా
- చలపతిరావు
- అమర్ ప్రసాద్
- రత్నశ్రీ
- సూర్యనారాయణ
- కుమార్
- మోహన్
- జయవిజయ
- ఇందిర
కథాసంగ్రహం
[మార్చు]కామరాజు ధనవంతుడు, వ్యసనలోలుడు. శాంత అనే ఆమెను పెళ్ళి చేసుకుంటానంటూ ఆమెతో రహస్య కలాపాలు జరిపాడు. ఆమె గర్భవతి అయ్యింది. కామరాజు ఇది తెలుసుకుని తప్పుకున్నాడు. మోసపోయిన శాంత దిక్కులేనిదయ్యింది. బిడ్డను కని శాంత కన్నుమూసింది. లారీల యజమాని ధర్మారావు ఆ బిడ్డను శంకర్ అని పేరుపెట్టి సాకాడు. కామరాజు అన్నపూర్ణమ్మను పెళ్ళాడుతాడు. వారికి మోహన్ అనే కొడుకు పుడతాడు. శంకర్‌కు చదువు అబ్బలేదు. లారీడ్రైవర్ అవుతాడు. బఠానీలు అమ్ముకునే గౌరిని ప్రేమిస్తాడు. ధర్మారావు తమ్ముడు చనిపోతే అతని ఐదుగురు కొడుకులను, కూతురు లక్ష్మిని తన ఇంట్లోనే పెంచుతూ తమ్ముడు చేసిన బాకీలను కామరాజు వద్ద లారీలను తనఖాపెట్టి తీరుస్తాడు. కామరాజు కొడుకు మోహన్‌కు లక్ష్మితో పెళ్ళి జరిపించాలని నిశ్చయమౌతుంది. మోహన్ పై చదువులకు అమెరికా వెళతాడు. విదేశాల నుండి తిరిగివచ్చాక ఇద్దరికీ పెళ్ళి జరిపించాలని ఇరువైపుల వారూ అనుకుంటారు. కామరాజు తండ్రి బ్రతికున్నప్పుడు కొంతమంది పేదవాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి కొంత స్థలం దానంగా ఇస్తాడు. ఇప్పుడు ఆ భూమి తనదంటూ ఖాళీచేయమని వాళ్ళందరిమీదా కేసుపెట్టాడు కామరాజు. గత విషయాలన్నీ తెలిసిన ధర్మారావు న్యాయానికి కట్టుబడి కామరాజుకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబుతాడు. ఆ అక్కసుతో కామరాజు ధర్మారావు ఇవ్వవలసిన బాకీకింద అతని లారీలన్నీ కోర్టుద్వారా జప్తు చేసుకుంటాడు. ధర్మారావుకు ఉన్న ఆస్తి పోయింది. శంకర్‌కు పనిలేకుండా పోయింది. అనవసరంగా కామరాజుతో గొడవపెట్టుకుని తమకేమీ ఆధారం లేకుండా చేశాడని ధర్మారావు తమ్ముని కొడుకులు అతడిని దూషిస్తారు. ఉన్న ఇంటిని తమకు వదిలిపెట్టి వెళ్ళిపొమ్మంటారు. శంకర్ ధర్మారావుని, లక్ష్మిని గౌరి ఇంటికి తీసుకువస్తాడు. అన్నపూర్ణమ్మ గౌరి ఇంటికి వచ్చి తన భర్త కామరాజు చేసిన తప్పుకు క్షమించమని ధర్మారావును అర్థిస్తుంది. పని లేకుండా ఉన్న శంకర్‌ను తమ ఇంట డ్రైవర్‌గా ఉండమని కోరుతుంది. ధర్మారావు సమ్మతి మీద శంకర్ కామరాజు ఇంట డ్రైవర్‌గా చేరతాడు. కామరాజు దురాగతాలన్నీ చూస్తాడు. భార్య చూస్తూఉండగానే వ్యభిచారిణులను ఇంటికే తీసుకు వస్తుంటాడు కామరాజు. ఈ దృశ్యాలు చూసి అన్నపూర్ణమ్మ కంటనీరు పెట్టడం గమనించిన శంకర్ ఎలాగైనా ఈ పరిస్థితిని మార్చాలనుకుంటాడు. ఒకనాడు ఒక వన్నెలాడి కామరాజు ఇంట్లోకి రాబోతుంది. శంకర్ ఆమెను అడ్డగించి తూలనాలాడు. ఆమె ఫోన్‌లో కామరాజుకు జరిగిందంతా చెబుతుంది. కోపంతో కామరాజు శంకర్‌ను బెత్తంతో కొడతాడు. అడ్డుపడబోయిన అన్నపూర్ణమ్మను బయటకు వెళ్ళమంటాడు. దెబ్బలు తిన్న శంకర్‌ను అన్నపూర్ణమ్మ ఆదరించి మందు రాస్తుంది. ఆవిధంగా శంకర్ మాతృప్రేమను చవిచూస్తాడు. మోహన్ అమెరికానుండి వచ్చి తన తండ్రి ధర్మారావుకు చేసిన అన్యాయం గురించి తెలుసుకుంటాడు. కామరాజు మోహన్‌ను ఆ విషయం ఇక మరిచిపొమ్మని, లక్ష్మితో వివాహం జరగదని చెబుతాడు. మోహన్ నిస్పృహతో ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ శంకర్ అతని నచ్చచెప్పి పరిస్థితిని సర్దుబాటు చేసుకునే ఉపాయం చెబుతాడు. మరుసటి రోజు కామరాజు ఊరిలోని ధనవంతులందరికీ ఒక విందు ఏర్పాటు చేస్తాడు. మోహన్‌ని అందరికీ పరిచయం చేస్తాడు. ఇంతలో శంకర్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అంతా చీకటి. పెద్ద గందరగోళం. ఇంతలో శంకర్ రెండు దీపాలతో మేడ మీద నుండి వచ్చి కామరాజు ముందు నిలబడతాడు. కామరాజు అంధకారంలో ఉన్నాడనీ ప్రేమ, సత్యం అనే జ్యోతులతో అతని హృదయాన్ని వికసింపజేయాలని శంకర్ చెబుతాడు. మోహన్ తన పెళ్ళి నిర్ణయమైన విధమూ లక్ష్మి వాళ్ళని తన తండ్రి ఎలా మోసం చేసిందీ చెబుతాడు. ఇప్పుడు ధనాశతో వేరే పెళ్ళి సంబంధం కుదుర్చుకోవడానికి ఈ విందు ఏర్పాటు చేశాడనీ అంతా ఏకరువు పెడతాడు. అతిథుల ముందు కామరాజు అవమానపడతాడు. మోహన్‌ని ఇంటి నుండి వెళ్ళిపొమ్మంటాడు. శంకర్ కూడా వెళ్ళిపోతాడు. దీనికంతా ధర్మారావే కారణమనుకొని తాగినమైకంలో కామరాజు ధర్మారావున్న చోటికి వెళ్ళి అతడిని నానా దుర్భాషలాడి తలపై కొట్టి వెళ్ళిపోతాడు. బయటి నుండి వచ్చిన శంకర్ లక్ష్మిద్వారా విషయం తెలుసుకుని కోపంతో కామరాజుని చంపుతానని కత్తి తీసుకుంటాడు. ధర్మారావు అడ్డుపడినా వినడు. ఇక తప్పనిసరై ధర్మారావు శంకర్ తండ్రి కామరాజే అని అసలు విషయం చెబుతాడు. శంకర్ నిరుత్తరుడౌతాడు. శంకర్ తన తండ్రి పరివర్తనలో ఎలా తీసుకువస్తాడు? పెద్ద కొడుకై ఇంటిని ఎలా సరిదిద్దుతాడు? అనే విషయాలు పతాక సన్నివేశంలో తెలుస్తాయి.[1]
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలను సి.నారాయణరెడ్డి రచించగా, పి.ఆదినారాయణరావు స్వరపరిచాడు[1].
క్ర.సం | పాట | గాయకులు |
---|---|---|
1 | "బఠాణీలు బాబు బఠాణీలు కాలక్షేపం బఠాణీలు" | ఎస్.జానకి |
2 | "ఈనాడే దసరా పండగ ఈనాడే దసరా పండగ" | ఘంటసాల బృందం |
3 | "ఎవరు నీవు ఎవరు నేను ఎందుకు ఈ అనుబంధం " | రామకృష్ణ |
4 | "చెప్పలేనమ్మా ఆ చిన్నవాని చిలిపితనం వలచిన వాని చురుకుదనం " | పి.సుశీల, ఎస్.జానకి |
5 | "తమగొంతు నులిమేవారికే సిగలందు అందాలు చిందును పూలు " | ఎస్.వరలక్ష్మి |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 పెద్దకొడుకు పాటల పుస్తకం. p. 8. Retrieved 26 August 2020.