Jump to content

2005 నవంబరు బీహార్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
(బీహార్ శాసనసభ ఎన్నికలు నవంబరు 2005 నుండి దారిమార్పు చెందింది)
2005 బీహార్ ఎన్నికల ఫలితాల పటం

ఎనిమిది నెలల వ్యవధిలో బీహార్ శాసనసభకు రెండోసారి ఎన్నికలు జరిగాయి. 2005 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి గాని, లేదా కూటమికి గాని స్పష్టమైన ఆధిక్యత రాకపోవడం వలన, త్రిశంకు సభ ఏర్పడింది. అనంతరం రాష్ట్రపతి పాలన విధించి, మళ్ళీ 2005 అక్టోబర్, నవంబర్ లలో ఎన్నికలు జరిపించారు.

ఎన్నికల సమయ సూచీ

[మార్చు]

ఎన్నికలను నాలుగు అంచెల్లో, నెలరోజుల సుదీర్ఘకాలం పాటు నిర్వహించారు. శాంతిభద్రతల పరిస్థితి, సమస్యాత్మక నియోజకవర్గాల సంఖ్య మొదలైనవాటిని దృష్టిలో ఉంచుకుని భారత ఎన్నికల కమిషను ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగంచెల వివరాలు:

అంచె ఎన్నికల తేదీ నియో. వర్గాల సంఖ్య
మొదటి 2005 అక్టోబర్ 18 61
రెండవ 2005 అక్టోబర్ 26 69
మూడవ 2005 నవంబర్ 13 72
నాలుగవ 2005 నవంబర్ 19 41

విశిష్టత

[మార్చు]
2005లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన నితిష్ కుమార్

ఈ ఎన్నీకలు చాలా విశిష్టమైనవి. ఇటీవలి బీహార్ చరిత్రలో ఇంత ప్రశాంతంగా, ఇంత నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు. సజావుగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల కమిషను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. కమిషను నియమించీన పరిశీలకులు నిష్పక్షపాతంగా, ఒత్తిడులకు లొంగకుండా, చిత్తశుద్ధితో వ్యవహరించి ఈ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు కమిషను కింది జాగ్రత్తలు తీసుకుంది.

  • వోటరు ఫోటో గుర్తింపు కార్డులను పూర్తిగా జారీ చేసింది.
  • అన్ని పోలింగు కేంద్రాల్లోనూ ఎలెక్ట్రానిక్ మిషన్లను వినియోగించింది.
  • నేరగాళ్ళను, అరెస్టు వారంట్లు జారీ అయిఉన్న వారిని గుర్తించి వారిపై నిఘా ఉంచింది. 52686 మంది అటువంటి వ్యక్తులతో కూడిన జాబితాను కమిషను తయారుచేసింది.
  • ప్రతీ నియోజకవర్గానికీ ఒక రిటర్నింగు అధికారిని నియమించారు. ఇదివరలో ఒక్కో అధికారి 3-4 నియోజకవర్గాల బాధ్యత నిర్వహించేవారు.
  • నియోజకవర్గానికో పరిశీలకుడు, జిల్లాకో ప్రచార ఖర్చు పరిశీలకుడిని నియమించారు.
  • ప్రభుత్వ, పోలీసు అధికారులను తమ తమ స్వంత జిల్లాల నుండి బదిలీ చేసింది.
  • బదిలీ అయిన వారు ఎట్టి పరిస్థితులలోను, లీవులో కూడా, పాత ప్రదేశంలో ఉండరాదని నిర్దేశించింది.
  • పోలింగు కేంద్రాల వద్ద వీడ్యో తీయించే ఏర్పాటు చేసింది.
  • రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా రిటైరైన కమిషను ఉద్యోగి, అనుభవజ్ఞుడు ఐన కె.జె.రావును నియమించింది. ఈయనకు జమ్మూ కాశ్మీరు, గుజరాత్ లలో పరిశీలకుడిగా పనిచేసిన అనుభవం ఉంది.

కమిషను చేసిన ఇటువంటి విస్తృతమైన ఏర్పాట్ల వలన ఈ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయి.

పార్టీలు, నాయకులు

[మార్చు]

పార్టీలు

నాయకులు

ఫలితాలు

[మార్చు]

అక్టోబర్ 22 న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. జనతాదళ్ యు నేతృత్వంలోని కూటమి 243 స్థానాల శాసనసభ్లో 143 స్థానాలు గెలుచుకుని సాధారణ ఆధిక్యత సాధించి, అధికారంలోకి వచ్చింది. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ కూటమి 68 స్థానాలు, లోక్‌జనశక్తి 10 స్థానాలు, ఇతరులు 22 స్థానాలు గెలుచుకున్నాయి.

అంశం వివరాలు
మొత్తం స్థానాలు 243
ఫలితాలు తెలిసినవి 243
ఎన్.డి.ఏ. కూటమి 143
*జనతాదళ్ యు 88
*భాజపా 55
యు.పి.ఏ. కూటమి 68
ఆర్.జె.డి. 54
కాంగ్రెసు 9
సి.పి.ఐ. 3
సి.పి.ఐ. (ఎం) 1
ఎన్.సి.పి. 1
ఎల్‌జె.పి. 10
బసపా 4
సపా 2
ఇతరులు 6
స్వతంత్రులు 10

ప్రతిస్పందనలు

[మార్చు]
  • నితీశ్ కుమార్
    • ఇది బీహార్ ప్రజలు సాధించిన విజయం. వారు మార్పు కోరుకున్నారు. మార్పునకు ఓటు వేశారు. రాష్ట్రంలోని ప్రతి కులంవారు, ప్రతి మతంవారు మార్పును, సుస్థిరతను కోరుకున్నారు. సత్పరిపాలనను కాంక్షించారు
    • దుష్పరిపాలనకు, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్న మా కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయనీకుండా అడ్డుకోవడంపై ప్రజలు ఆగ్రహించారు. ఈ తీర్పు వారి ఆగ్రహానికి అద్దం పట్టింది
    • లాలు నా కంటే సీనియర్. నా అన్నయ్య వంటి వారు. నాకు ఎవరిపైనా వ్యతిరేక భావం లేదు
    • భాజపాతో ఎలాంటి సమస్యా ఉండదు. కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా మేం కేంద్రంలో కలిసి పనిచేశాం. ఇప్పుడు అలాగే చేస్తాం
    • (గవర్నరుపై మేము ఇదివరలో చేసిన విమర్శలు) ఇప్పుడు పాత విషయాలు. ఆయనకు వ్యతిరేకంగా నేను ఒక్క మాట కూడా మాట్లాడను
    • పాశ్వాన్‌ గురించి ఆలోచించాలని నేను అనుకోవడం లేదు. క్రితం సారి ఆయనకు అవకాశం వచ్చింది. కానీ ఆయన దానిని పోగొట్టుకున్నారు
  • లాలూ ప్రసాద్ యాదవ్
    • నితీశ్ ‌కుమార్‌ను అభినందిస్తున్నాను. ఆయన నా తమ్ముడి వంటి వారు. అయితే భాజపాను మాత్రం నేను అభినందించలేను.
    • బీహార్ ప్రజలను ఎన్‌డీఏ బుట్టలో పడేసింది, బీహార్‌లో సమస్యలన్నింటికీ మా 15 ఏళ్ల పాలనే కారణమన్న అభిప్రాయాన్ని ప్రజల్లో వారు కలిగించారు.
    • బీహార్ ప్రజలు మాకు 15 ఏళ్లపాటు అధికారమిచ్చారు. మూడు నెలల్లో నేరాలను అరికట్టేస్తామని, కార్మికులు, విద్యార్థులు వలసపోకుండా చూస్తామని చెప్పిన నాయకులను వారిప్పుడు పరీక్షించబోతున్నారు. ప్రస్తుతం ఆర్జేడీ ఓటమిని వేడుకగా జరుపుకొంటున్న ప్రజలు తర్వాత తమ తప్పును గ్రహిస్తారు. ఎన్‌డీఏ తన హామీలను ఎంతమాత్రం నిలబెట్టుకోలేదు. అధికారం తిరిగి నా చేతికి వచ్చేదాకా ఎదురుచూస్తాను.

బయటి లింకులు

[మార్చు]