రాష్ట్రపతి పాలన
భారత దేశంలో ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వాన్ని సస్పెండు చేసి లేదా రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. భారత రాజ్యాంగం లోని 356 వ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం, రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినపుడు, దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నరు ఇచ్చిన నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా, రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నరు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ బాధ్యతల్లో భాగంగా గవర్నరు తనకు సహాయపడేందుకు అధికారులను నియమించుకోవచ్చు.
మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ద్వారా పరిపాలన సాగిస్తుంది. ఈ మంత్రులు శాసనసభకు జవాబుదారీగా ఉంటారు. మంత్రులకు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తాడు. గవర్నరు రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి మాత్రమే. వాస్తవానికి ముఖ్యమంత్రే రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధికారి. అయితే, రాష్ట్రపతి పాలనలో ఉండగా, మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు. ముఖ్యమంత్రి ఉండరు. శాసనసభ సమావేశాలను వాయిదా (ప్రోరోగ్) వేస్తారు లేదా రద్దు చేస్తారు. రద్దు చేస్తే కొత్త ఎన్నికలు అనివార్యమౌతాయి.
జమ్మూ కాశ్మీరులో గవర్నరు పాలన అనే పద్ధ్తి కూడా ఉంది. అక్కడి ప్రభుత్వం విఫలమైనపుడు, జమ్మూ కాశ్మీరు రాజ్యాంగం లోని 92 వ విభాగం కింద గవర్నరు పాలన విధిస్తారు. రాష్ట్రపతి అనుమతితో గవర్నరు ఈ పాలన విధిస్తారు. ఆరు నెలల తరువాత కూడా గవర్నరు పాలనను ఎత్తివేసే వీలు కుదరకపోతే, అపుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలనకు, గవర్నరు పాలనకూ పెద్ద తేడా లేదు.
1994 లో ఎస్సార్ బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీమ్ కోర్టు, ఇచ్ఛవచ్చిన రీతిలో రాష్ట్రపతి పాలన విధింపుకు అడ్డుకట్ట వేసింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణా రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పటివరకూ ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు.
Note:-ఆంధ్ర ప్రదేశ్ లో మొదటిసారి 1973 జనవరి 18 నుంచి 1973 డిసెంబరు 10 వరకు రాష్ట్రపతి పాలన విధించారు.
కొన్ని నియమాలు
[మార్చు]- రాష్ట్రపతి పాలన విధించినపుడు రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు లేదా తాత్కలికంగా సుప్త చేతన స్థితిలో ఉంచవచ్చు.
- రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభలో తగినంత ఆధిక్యత ఏ పార్టీకి గాని, కూటమికి గాని లేకపోయినపుడు కూడా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాజ్యాంగం ప్రకారం శాసనసభ సమావేశాల ముగింపుకు, తదుపరి సమావేశాల మొదలుకూ మధ్య 6 నెలలకు మించి అంతరం ఉండరాదు.
- రాష్ట్రపతి పాలన 6 నెలలకు మించి విధించరాదు. అయితే 6 నెలల వ్యవధి తరువాత మరో 6 నెలల కాలానికి పొడిగించవచ్చు. ఈ విధంగా ఎన్నిసార్లైనా పొడిగించవచ్చు.
- రాష్ట్రపతి పాలనలో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన ఏ అధికారాన్ని రద్దు చేసే అధికారం మాత్రం రాష్ట్రపతికి లేదు.
- రాష్ట్రపతి పాలన విధింపును పార్లమెంటు నిర్ధారించాలి.
విమర్శ
[మార్చు]ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు, పౌర ఆందోళనలు జరిగినపుడు రాష్ట్రప్రభుత్వం అదుపు చెయ్యలేకపోతే, దేశ ఐక్యతను, సమగ్రతనూ కాపాడేందుకు 356 అధికరణం కేంద్ర ప్రభుత్వానికి అనేక అధికారాల నిచ్చింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న వివిధ పార్టీలు తరచూ ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చాయి.[1] ఈ అధికారాలను ఉపయోగించి, తమ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తొలగించాయి.[2] అందుచేత దీన్ని సమాఖ్య వ్యవస్థకు ముప్పుగా అనేకులు పరిగణించారు. 1950 లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాక, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేందుకు కేంద్రం ఈ అధికరణాన్ని అనేక మార్లు ఉపయోగించింది.[3]
1954 లో ఉత్తర ప్రదేశ్‌లో మొదటిసారిగా ఈ అధికరణాన్ని ప్రయోగించారు. 1970, 1980 లలో, దీన్ని ఉపయోగించడం మామూలై పోయింది.[4] ఇందిరా గాంధీ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రభుత్వం ఇందుకు బాధ్యులు. 1966, 1977 మధ్య ఇందిరా గాంధీ 39 సార్లు ఈ అధికరణాన్ని ప్రయోగించగా, జనతా పార్టీ తన రెండున్నరేళ్ళ పాలనలో 9 సార్లు ప్రయోగించింది.
ఎస్సార్ బొమ్మై కేసులో సుప్రీమ్ కోర్టు 1994 లో ఇచ్చిన తీర్పులో రాష్ట్రపతి పాలన విధింపుపై నియంత్రణలు విధించిన తర్వాత మాత్రమే ఇది తగ్గింది. 2000 తర్వాత రాష్ట్రపతి పాలన విధింపు బాగా తగ్గిపోయింది. భారత సమాఖ్య వ్యవస్థపై జరిగే చర్చలో 356 అధికరణం ఎప్పుడూ ఒక ముఖ్య అంశమే.[5] కేంద్ర రాష్ట్ర సంబంధాలపై 1983 లో సర్కారియా కమిషను ఇచ్చిన నివేదికలో 356 అధికరణాన్ని "తక్కువగా, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే, రాజ్యంగ వ్యవస్థలను పునస్థాపించేందుకు అవసరమైన అన్ని వికల్పాలనూ ప్రయత్నించాక, చిట్టచివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ప్రయోగించాల"ని పేర్కొంది.[6]
రాష్ట్రపతి పాలన విధింపుల జాబితా
[మార్చు]వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు విధించారో కింది పట్టికలో చూడవచ్చు.
క్ర.సం | రాష్ట్రం | విధించిన రోజు | తొలగించిన రోజు | వ్యవధి | వివరాలు |
---|---|---|---|---|---|
1 | ఆంధ్రప్రదేశ్ [1] | 1973 జనవరి 18 | 1973 డిసెంబరు 10 | 326 days | జై ఆంధ్ర ఉద్యమం కారణంగా శాంతిభద్రతలు కుప్పకూలడంతో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి ఉఖ్యమంత్రి - పి.వి. నరసింహారావు |
2 | ఆంధ్రప్రదేశ్ [2] | 2014 ఫిబ్రవరి 28 | 2014 జూన్ 8 | 100 days | రాష్ట్రాన్ని రెండు విభజించాలన్న కేంద్ర నిర్ణయంతో విభేదించిన కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎమ్మ్ల్యేలు రాజీనామా చేసారు.[7] తెలంగాణ నుండి రాష్త్రపతి పలనను 2014 జూన్ 2 న ఎత్తివేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో జూన్ 8 న ఎత్తివేసారు.[8] విధించిన రెండు నెలల్లోపు పార్లమెంటు సమ్మతి తీసుకోకుండా రాష్త్రపతి పాలన కొనసాగించి, చట్టాన్ని అతిక్రమించారు.[9][10] |
3 | ఆంధ్ర రాష్ట్రం [1] | 1954 నవంబరు 15 | 1955 మార్చి 29 | 134 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
4 | అరుణాచల్ ప్రదేశ్ [1] | 1979 నవంబరు 3 | 1980 జనవరి 18 | 76 days | కేంద్రంలో జనతాపార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో జరిగిన పార్టీ మార్పిళ్ళ కారణంగా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది. |
5 | అరుణాచల్ ప్రదేశ్ [2] | 2016 జనవరి 25 | 2016 ఫిబ్రవరి 19 | 26 days | 21 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు 11 మంది భాజపా ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులతో చేయి కలపడంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.[11] కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. దీన్ని అధికార దుర్వినియోగంగా భావించిన సుప్రీమ్ కోర్టు, కాంగ్రెసు ప్రభుత్వాన్ని పునస్థాపించింది. గవర్నరు శసనవ్యవస్థలోను, శాసనసభ స్పీకరు కార్యకలాపాల్లోనీ జోక్యం చేసుకున్నారని కోర్టు ఈ చారిత్రాత్మక తీర్పులో తప్పు పట్టింది.[12] |
6 | అస్సాం [1] | 1979 డిసెంబరు 12 | 1980 డిసెంబరు 5 | 359 days | విదేశీయులు చట్టవిరుద్ధంగా అస్సాంలో ఉంటున్నారని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమం యునైటెద్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం చేతుల్లో హింసాత్మకంగా మారడంతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. |
7 | అస్సాం [2] | 1981 జూన్ 30 | 1982 జనవరి 13 | 197 days | చట్తవిరుద్ధంగా రాష్ట్రంలో ఉంటున్న విదేశీయులకు వ్యతిరేకంగా జరిగిన అస్సాం ఉద్యమం కారణంగా వలస వచ్చిన మైనారిటీలకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ (ఐ) కు చెందిన అన్వరా తైమూర్ ప్రభుత్వం పడిపోయింది. |
8 | అస్సాం [3] | 1982 మార్చి 19 | 1983 ఫిబ్రవరి 27 | 345 days | అస్సాం ఉద్యమం కారణంగా కాంగ్రెస్ (ఐ) కు చెందిన కేశబ్ గోగోయి ప్రభుత్వం పడిపోయింది. |
9 | అస్సాం [4] | 1990 నవంబరు 28 | 1991 జూన్ 30 | 214 days | అసోం గణపరిషత్ కు చెందిన ప్రఫుల్ల మహంత ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ కేంద్రం ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఉల్ఫా కార్యకలాపాల కారణంగా జాతీయ సమగ్రతలు భంగం కలుగుతోందని కేంద్రం ఈ చర్య తీసుకుంది. రాష్ట్రపతి పాలనలో ఉండగా ఉల్ఫా తీవ్రవాదులను ఏరివేసేందుకు కేంద్రం ఆపరేషన్ బజరంగ్ ను జరిపింది |
10 | బీహార్ [1] | 1968 జూన్ 29 | 1969 ఫిబ్రవరి 26 | 242 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
11 | బీహార్ [2] | 1969 జూలై 4 | 1970 ఫిబ్రవరి 16 | 227 days | కాంగ్రెసు పార్టీలో విభజనతో జరిగిన పార్టీ మార్పిళ్ళ కారణంగా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది.. |
12 | బీహార్ [3] | 1972 జనవరి 9 | 1972 మార్చి 19 | 70 days | పార్టీ మార్పిళ్ళ కారణంగా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది.. |
13 | బీహార్ [4] | 1977 ఏప్రిల్ 30 | 1977 జూన్ 24 | 55 days | జగన్నాథ్ మిశ్రా ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది. |
14 | బీహార్ [5] | 1980 ఫిబ్రవరి 17 | 1980 జూన్ 8 | 112 days | రాం సుందర్ దాస్ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది. |
15 | బీహార్ [6] | 1995 మార్చి 28 | 1995 ఏప్రిల్ 5 | 8 days | శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చే లోగా రాష్ట్ర తాత్కాలిక బడ్జెట్టును పార్లమెంటులో పాస్ చేసేందుకు గాను, కేంద్రం వారం రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించింది. |
16 | బీహార్ [7] | 1999 ఫిబ్రవరి 12 | 1999 మార్చి 9 | 25 days | నారాయణపూర్‌లో 11 మంది దళితుల హత్యతో శాంతి భద్రతలు క్షీణించాయి. వాజపేయి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేనందున 26 రోజుల్లోనే రాష్ట్రపతి పాలనను ఎత్తేసింది. |
17 | బీహార్ [8] | 2005 మార్చి 7 | 2005 నవంబరు 24 | 262 days | ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఎవరికీ రాలేదు. అందుచేత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. చారిత్రాత్మకమైన తీర్పులో సుప్రీమ్ కోర్టు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శాసనసభకు అవ్వకాశం ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని, దురాలోచనతో కూడిన చర్య అనీ వ్యాఖ్యానించింది.[13] |
18 | ఢిల్లీ [1] | 2014 ఫిబ్రవరి 14 | 2015 ఫిబ్రవరి 11 | 362 days | జన లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టలేక పోయినందుకు గాను, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ రాజీనామా చేసాడు. |
19 | గోవా [1] | 1966 డిసెంబరు 2 | 1967 ఏప్రిల్ 5 | 124 days | |
20 | గోవా [2] | 1979 ఏప్రిల్ 27 | 1980 జనవరి 16 | 264 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
21 | గోవా [3] | 1990 డిసెంబరు 14 | 1991 జనవరి 25 | 42 days | |
22 | గోవా [4] | 1999 ఫిబ్రవరి 9 | 1999 జూన్ 9 | 120 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
23 | గోవా [5] | 2005 మార్చి 4 | 2005 జూన్ 7 | 95 days | |
24 | గుజరాత్ [1] | 1971 మే 12 | 1972 మార్చి 17 | 310 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
25 | గుజరాత్ [2] | 1974 ఫిబ్రవరి 9 | 1975 జూన్ 18 | 1 year, 129 days | |
26 | గుజరాత్ [3] | 1976 మార్చి 12 | 1976 డిసెంబరు 24 | 287 days | |
27 | గుజరాత్ [4] | 1980 ఫిబ్రవరి 17 | 1980 జూన్ 8 | 112 days | |
28 | గుజరాత్ [5] | 1996 సెప్టెంబరు 19 | 1996 అక్టోబరు 23 | 34 days | |
29 | హర్యానా [1] | 1967 నవంబరు 2 | 1968 మే 22 | 202 days | |
30 | హర్యానా [2] | 1977 ఏప్రిల్ 30 | 1977 జూన్ 21 | 52 days | |
31 | హర్యానా [3] | 1991 ఏప్రిల్ 6 | 1991 జూలై 23 | 108 days | |
32 | హిమాచల్ ప్రదేశ్ [1] | 1977 ఏప్రిల్ 30 | 1977 జూన్ 22 | 53 days | |
33 | హిమాచల్ ప్రదేశ్ [2] | 1992 డిసెంబరు 15 | 1993 డిసెంబరు 3 | 353 days | |
34 | జమ్మూ కాశ్మీరు [1] | 1977 మార్చి 26 | 1977 జూలై 9 | 105 days | |
35 | జమ్మూ కాశ్మీరు [2] | 1986 మార్చి 6 | 1986 నవంబరు 7 | 246 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
36 | జమ్మూ కాశ్మీరు [3] | 1990 జనవరి 19 | 1996 అక్టోబరు 9 | 6 years, 264 days | |
37 | జమ్మూ కాశ్మీరు [4] | 2002 అక్టోబరు 18 | 2002 నవంబరు 2 | 15 days | |
38 | జమ్మూ కాశ్మీరు [5] | 2008 జూలై 11 | 2009 జనవరి 5 | 178 days | |
39 | జమ్మూ కాశ్మీరు [6] | 2015 జనవరి 9 | 2015 మార్చి 1 | 51 days | |
40 | జమ్మూ కాశ్మీరు [7] | 2016 జనవరి 8 | 2016 ఏప్రిల్ 4 | 87 days | |
41 | జమ్మూ కాశ్మీరు [8] | 2018 జూన్ 19 | కొనసాగుతోంది | ||
42 | జార్ఖండ్ [1] | 2009 జనవరి 19 | 2009 డిసెంబరు 29 | 344 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
43 | జార్ఖండ్ [2] | 2010 జూన్ 1 | 2010 సెప్టెంబరు 11 | 102 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
44 | జార్ఖండ్ [3] | 2013 జనవరి 18 | 2013 జూలై 12 | 175 days | |
45 | కర్ణాటక [1] | 1971 మార్చి 19 | 1972 మార్చి 20 | 1 year, 1 day | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
46 | కర్ణాటక [2] | 1977 డిసెంబరు 31 | 1978 ఫిబ్రవరి 28 | 59 days | |
47 | కర్ణాటక [3] | 1989 ఏప్రిల్ 21 | 1989 నవంబరు 30 | 223 days | |
48 | కర్ణాటక [4] | 1990 అక్టోబరు 10 | 1990 అక్టోబరు 17 | 7 days | |
49 | కర్ణాటక [5] | 2007 అక్టోబరు 9 | 2007 నవంబరు 11 | 33 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
50 | కర్ణాటక [6] | 2007 నవంబరు 20 | 2008 మే 27 | 189 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
51 | కేరళ [1] | 1959 జూలై 31 | 1960 ఫిబ్రవరి 22 | 206 days | ఇఎమ్‌ఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది. |
52 | కేరళ [2] | 1964 సెప్టెంబరు 10 | 1967 మార్చి 6 | 2 years, 177 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాలేదు. |
53 | కేరళ [3] | 1970 August 1 | 1970 అక్టోబరు 4 | 64 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
54 | కేరళ [4] | 1979 డిసెంబరు 1 | 1980 జనవరి 25 | 55 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
55 | మధ్య ప్రదేశ్ [1] | 1977 ఏప్రిల్ 29 | 1977 జూన్ 25 | 57 days | శ్యామ చరణ్ శుక్లా ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది. |
56 | మధ్య ప్రదేశ్ [2] | 1980 ఫిబ్రవరి 18 | 1980 జూన్ 8 | 111 days | సుందర్ లాల్ పట్వా ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది. |
57 | మధ్య ప్రదేశ్ [3] | 1992 డిసెంబరు 15 | 1993 డిసెంబరు 7 | 357 days | ఉత్తర ప్రదేశ్‌లో బాబ్రీ మసీదు విధ్వంసం నేపథ్యంలో ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది. |
58 | మహారాష్ట్ర [1] | 1980 ఫిబ్రవరి 17 | 1980 జూన్ 8 | 112 days | శరద్ పవార్ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది. |
59 | మహారాష్ట్ర [2] | 2014 సెప్టెంబరు 28 | 2014 అక్టోబరు 31 | 33 days | ఎన్‌సిపి, తదితరుల ప్రభుత్వం నుండి కాంగ్రెస్ బయటికి రావడంతో, ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది. |
60 | మణిపూర్ [1] | 1967 జనవరి 12 | 1967 మార్చి 19 | 66 days | |
61 | మణిపూర్ [2] | 1967 అక్టోబరు 25 | 1968 ఫిబ్రవరి 18 | 116 days | |
62 | మణిపూర్ [3] | 1969 అక్టోబరు 17 | 1972 మార్చి 22 | 2 years, 157 days | |
63 | మణిపూర్ [4] | 1973 మార్చి 28 | 1974 మార్చి 3 | 340 days | |
64 | మణిపూర్ [5] | 1977 మే 16 | 1977 జూన్ 28 | 43 days | |
65 | మణిపూర్ [6] | 1979 నవంబరు 14 | 1980 జనవరి 13 | 60 days | |
66 | మణిపూర్ [7] | 1981 ఫిబ్రవరి 28 | 1981 జూన్ 18 | 110 days | |
67 | మణిపూర్ [8] | 1992 జనవరి 7 | 1992 ఏప్రిల్ 7 | 91 days | |
68 | మణిపూర్ [9] | 1993 డిసెంబరు 31 | 1994 డిసెంబరు 13 | 347 days | |
69 | మణిపూర్ [10] | 2001 జూన్ 2 | 2002 మార్చి 6 | 277 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
70 | మేఘాలయ [1] | 1991 అక్టోబరు 11 | 1992 ఫిబ్రవరి 5 | 117 days | |
71 | మేఘాలయ [2] | 2009 మార్చి 18 | 2009 మే 12 | 55 days | |
72 | మిజోరమ్ [1] | 1977 మే 11 | 1978 జూన్ 1 | 1 year, 21 days | |
73 | మిజోరమ్ [2] | 1978 నవంబరు 10 | 1979 మే 8 | 179 days | |
74 | మిజోరమ్ [3] | 1988 సెప్టెంబరు 7 | 1989 జనవరి 24 | 139 days | |
75 | నాగాల్యాండ్ [1] | 1975 మార్చి 20 | 1977 నవంబరు 25 | 2 years, 250 days | |
76 | నాగాల్యాండ్ [2] | 1988 August 7 | 1989 జనవరి 25 | 171 days | |
77 | నాగాల్యాండ్ [3] | 1992 ఏప్రిల్ 2 | 1993 ఫిబ్రవరి 22 | 326 days | |
78 | నాగాల్యాండ్ [4] | 2008 జనవరి 3 | 2008 మార్చి 12 | 69 days | |
79 | ఒరిస్సా [1] | 1961 ఫిబ్రవరి 25 | 1961 జూన్ 23 | 118 days | |
80 | ఒరిస్సా [2] | 1971 జనవరి 11 | 1971 ఏప్రిల్ 3 | 82 days | |
81 | ఒరిస్సా [3] | 1973 మార్చి 3 | 1974 మార్చి 6 | 1 year, 3 days | |
82 | ఒరిస్సా [4] | 1976 డిసెంబరు 16 | 1976 డిసెంబరు 29 | 13 days | |
83 | ఒరిస్సా [5] | 1977 ఏప్రిల్ 30 | 1977 జూన్ 26 | 57 days | |
84 | ఒరిస్సా [6] | 1980 ఫిబ్రవరి 17 | 1980 జూన్ 9 | 113 days | |
85 | పాటియాలా, తూర్పు పంజాబ్ రాష్ట్రాల యూనియన్ [1] | 1953 మార్చి 5 | 1954 మార్చి 8 | 1 year, 3 days | |
86 | పుదుచ్చేరి [1] | 1968 సెప్టెంబరు 18 | 1969 మార్చి 17 | 180 days | |
87 | పుదుచ్చేరి [2] | 1974 జనవరి 3 | 1974 మార్చి 6 | 62 days | |
88 | పుదుచ్చేరి [3] | 1974 మార్చి 28 | 1977 జూలై 2 | 3 years, 96 days | |
89 | పుదుచ్చేరి [4] | 1978 నవంబరు 12 | 1980 జనవరి 16 | 1 year, 65 days | |
90 | పుదుచ్చేరి [5] | 1983 జూన్ 24 | 1985 మార్చి 16 | 1 year, 265 days | |
91 | పుదుచ్చేరి [6] | 1991 మార్చి 4 | 1991 జూలై 3 | 121 days | |
92 | పంజాబ్ [1] | 1951 జూన్ 20 | 1952 ఏప్రిల్ 17 | 302 days | |
93 | పంజాబ్ [2] | 1966 జూలై 5 | 1966 నవంబరు 1 | 119 days | |
94 | పంజాబ్ [3] | 1968 August 23 | 1969 ఫిబ్రవరి 17 | 178 days | |
95 | పంజాబ్ [4] | 1971 జూన్ 14 | 1972 మార్చి 17 | 277 days | |
96 | పంజాబ్ [5] | 1977 ఏప్రిల్ 30 | 1977 జూన్ 20 | 51 days | |
97 | పంజాబ్ [6] | 1980 ఫిబ్రవరి 17 | 1980 జూన్ 6 | 110 days | |
98 | పంజాబ్ [7] | 1983 అక్టోబరు 10 | 1985 సెప్టెంబరు 29 | 1 year, 354 days | |
99 | పంజాబ్ [8] | 1987 జూన్ 11 | 1992 ఫిబ్రవరి 25 | 4 years, 259 days | |
100 | రాజస్థాన్ [1] | 1967 మార్చి 13 | 1967 ఏప్రిల్ 26 | 44 days | |
101 | రాజస్థాన్ [2] | 1977 ఏప్రిల్ 29 | 1977 జూన్ 22 | 54 days | |
102 | రాజస్థాన్ [3] | 1980 ఫిబ్రవరి 16 | 1980 జూన్ 6 | 111 days | |
103 | రాజస్థాన్ [4] | 1992 డిసెంబరు 15 | 1993 డిసెంబరు 4 | 354 days | |
104 | సిక్కిం [1] | 1978 August 18 | 1979 అక్టోబరు 18 | 1 year, 61 days | |
105 | సిక్కిం [2] | 1984 మే 25 | 1985 మార్చి 8 | 287 days | |
106 | తమిళనాడు [1] | 1976 జనవరి 31 | 1977 జూన్ 30 | 1 year, 150 days | |
107 | తమిళనాడు [2] | 1980 ఫిబ్రవరి 17 | 1980 జూన్ 6 | 110 days | |
108 | తమిళనాడు [3] | 1988 జనవరి 30 | 1989 జనవరి 27 | 363 days | |
109 | తమిళనాడు [4] | 1991 జనవరి 30 | 1991 జూన్ 24 | 145 days | |
110 | తిరువాన్కూరు-కొచ్చిన్ [1] | 1956 మార్చి 23 | 1957 ఏప్రిల్ 5 | 1 year, 13 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
111 | త్రిపుర [1] | 1971 నవంబరు 1 | 1972 మార్చి 20 | 140 days | |
112 | త్రిపుర [2] | 1977 నవంబరు 5 | 1978 జనవరి 5 | 61 days | |
113 | త్రిపుర [3] | 1993 మార్చి 11 | 1993 ఏప్రిల్ 10 | 30 days | |
114 | ఉత్తర ప్రదేశ్ [1] | 1968 ఫిబ్రవరి 25 | 1969 ఫిబ్రవరి 26 | 1 year, 1 day | |
115 | ఉత్తర ప్రదేశ్ [2] | 1970 అక్టోబరు 1 | 1970 అక్టోబరు 18 | 17 days | |
116 | ఉత్తర ప్రదేశ్ [3] | 1973 జూన్ 13 | 1973 నవంబరు 8 | 148 days | |
117 | ఉత్తర ప్రదేశ్ [4] | 1975 నవంబరు 30 | 1976 జనవరి 21 | 52 days | |
118 | ఉత్తర ప్రదేశ్ [5] | 1977 ఏప్రిల్ 30 | 1977 జూన్ 23 | 54 days | ఎన్.డి.తివారి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ కేంద్రం దాన్ని బర్తరఫ్ చేసింది. |
119 | ఉత్తర ప్రదేశ్ [6] | 1980 ఫిబ్రవరి 17 | 1980 జూన్ 9 | 113 days | బనారసీ దాస్ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ కేంద్రం దాన్ని బర్తరఫ్ చేసింది. |
120 | ఉత్తర ప్రదేశ్ [7] | 1992 డిసెంబరు 6 | 1993 డిసెంబరు 4 | 363 days | బాబ్రీ మసీదు విధ్వంసం నేపథ్యంలో ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేసింది. |
121 | ఉత్తర ప్రదేశ్ [8] | 1995 అక్టోబరు 18 | 1997 మార్చి 21 | 1 year, 154 days | ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది |
122 | ఉత్తర ప్రదేశ్ [9] | 2002 మార్చి 8 | 2002 మే 3 | 56 days | |
123 | ఉత్తరాఖండ్ [1] | 2016 మార్చి 27 | 2016 ఏప్రిల్ 21 | 25 days | |
124 | ఉత్తరాఖండ్ [2] | 2016 ఏప్రిల్ 22 | 2016 మే 11 | 19 days | |
125 | వింధ్య ప్రదేశ్ [1] | 1949 ఏప్రిల్ 8 | 1952 మార్చి 13 | 2 years, 340 days | |
126 | పశ్చిమ బెంగాల్ [1] | 1962 జూలై 1 | 1962 జూలై 8 | 7 days | |
127 | పశ్చిమ బెంగాల్ [2] | 1968 ఫిబ్రవరి 20 | 1969 ఫిబ్రవరి 25 | 1 year, 5 days | |
128 | పశ్చిమ బెంగాల్ [3] | 1970 మార్చి 19 | 1971 ఏప్రిల్ 2 | 1 year, 14 days | బంగ్లా కాంగ్రెస్, సీపీఎం ల కూటమి విడిపోయింది |
129 | పశ్చిమ బెంగాల్ [4] | 1971 జూన్ 28 | 1972 మార్చి 19 | 265 days | బంగ్లా కాంగ్రెస్, సీపీఎం ల కూటమి విడిపోయింది |
మూలాలు, వనరులు
[మార్చు]- ↑ "Perceptions' on 'misuse of article 356". Archived from the original on 2018-12-15. Retrieved 2019-03-17.
- ↑ "Limitations of Article 356". The Hindu. Archived from the original on 2003-09-19. Retrieved 2019-03-17.
- ↑ Ahmadi J., S.R. Bommai v. Union of India, (1994) 3 SCC 1, 296–297, ¶ 434 cited in http://www.ejcl.org/81/art81-4.html Archived 2019-05-02 at the Wayback Machine
- ↑ "Sarkaria Commission Report – CHAPTER VI : Emergency Provisions" (PDF). Archived from the original (PDF) on 20 ఆగస్టు 2014. Retrieved 28 September 2014.
- ↑ "National Commission to Review the Working of the Article 356 of the constitution". 2001. Archived from the original on 9 మే 2015. Retrieved 29 July 2015.
- ↑ "Sarkaria Commission Report – CHAPTER VI: Emergency Provisions" (PDF). Archived from the original (PDF) on 20 ఆగస్టు 2014. Retrieved 28 September 2014.
- ↑ "President's Rule imposed in Andhra Pradesh under Article 356 of Constitution". IANS. news.biharprabha.com. Retrieved 28 February 2014.
- ↑ "Andhra Pradesh mired in President rule imbroglio". Retrieved 21 September 2014.
- ↑ "Re-proclamation of President rule in Andhra Pradesh" (PDF). 2014. Retrieved 17 August 2014.
- ↑ "Andhra Pradesh mired in President rule imbroglio". The Times Of India. Retrieved 21 September 2014.
- ↑ "It's against Constitution: Politicians react to Prez rule in Arunachal". Hindustan Times. Retrieved 25 January 2016.
- ↑ "After Arunachal Pradesh debacle, PM Modi must abolish post of governor". Retrieved 15 July 2016.
- ↑ "Rameshwar Prasad And Ors vs Union Of India And Anr on 24 January, 2006". Retrieved 2 July 2015.