రమణ మహర్షి
రమణ మహర్షి | |
---|---|
జననం | వెంకటరామన్ అయ్యర్ 1879 డిసెంబరు 30 తిరుచుళి, విరుధు నగర్ |
నిర్యాణము | 1950 ఏప్రిల్ 14 శ్రీ రమణాశ్రమం, తిరువణ్ణామలై, తమిళనాడు | (వయసు 70)
జాతీయత | భారతీయుడు |
గురువు | అరుణాచల |
తత్వం | అద్వైతం |
సాహిత్య రచనలు | నేను ఎవరు? ("నాన్ యారు?") అక్షర మణిమాల |
ప్రభావితులైన వారు
|
రమణ మహర్షి (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), ఒక భారతీయ ఋషి, జీవన్ముక్తుడు. ఈయన అసలు పేరు వేంకటరామన్ అయ్యర్. భగవాన్ రమణ మహర్షి పేరుతో ప్రాచుర్యం పొందాడు.
ఈయన తమిళనాడులోని తిరుచ్చుళిలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1895 లో ఆయన తమిళ శైవ భక్తులైన 63 నాయనార్లు పట్ల భక్తి భావం, అరుణాచలం వైపు వెళ్ళాలనే కోరిక జనించింది. 1896 లో ఆయనకు మరణ భయం కలిగింది. ఆ అనుభవం వల్ల తనలో తాను తరచి చూసుకోవడం మొదలు పెట్టాడు. తనలో ఏదో ప్రవాహ శక్తి, ఆవేశం ఉన్నట్లు కనుగొన్నాడు. అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగింది. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు.[1] బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిననూ మోక్షజ్ఞానం పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు.[2]
ఆయనను ఒక అవతారంగా భావించి వచ్చే భక్తులు ఆయన దర్శనం కోసం విరివిగా వచ్చేవారు. తర్వాతి సంవత్సరాల్లో ఆయన చుట్టూ ఒక ఆశ్రమం ఏర్పడింది. ఈ ఆశ్రమంలో భక్తులు ఆయన చుట్టూరా మౌనంగా కూర్చోవడం, అప్పుడప్పుడు ప్రశ్నలు అడగడం ద్వారా ఆయన నుంచి ఉపదేశం పొందుతూ ఉండేవారు. 1930 వ దశకంలో ఆయన బోధనలు పాశ్చాత్య దేశాల్లో కూడా వ్యాపించడం మొదలైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా జ్ఞానిగా గుర్తింపు లభించింది.
రమణ మహర్షి భగవంతుని తెలుసుకోవడానికి పలు రకాల సాధనలను, మార్గాలను ఆమోదించాడు.[3] కానీ అజ్ఞానాన్ని తొలగించేందుకు, ఆత్మ చింతన కొరకు స్వీయ విచారణ వాటిలో ముఖ్యమైందని తరచు చెప్పేవాడు. ఆయన బోధనలలో ప్రధానమైంది మౌనం లేదా మౌనముద్ర. ఈయన చాలా తక్కువగా ప్రసంగించేవాడు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు.[4] ఇతని బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.[5] ఎవరైనా ఉపదేశించమని కోరితే, స్వీయ శోధన ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం సులభ సాధ్యమని బోధించేవాడు. అతని అనుభవం అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవాడు.[6]
జీవిత చరిత్ర
[మార్చు]తొలినాళ్ళు (1879-1895)
[మార్చు]రమణ మహర్షి చిన్నప్పటి పేరు వెంకటరామన్ అయ్యర్. ఈయన తమిళనాడు లోని విరుధానగర్ జిల్లా, అరుప్పుకోట్టై సమీపంలోని తిరుచ్చుళిలో 1879 డిసెంబరు 30వ తేదీ అళగమ్మాళ్, సుందరం అయ్యర్ దంపతులకు ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మొత్తం నలుగురు పిల్లల్లో ఈయన రెండవ వాడు. ఇతనికి ఇద్దరు సోదరులు (నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరం అయ్యర్ పరాశర గోత్రానికి చెందిన వాడు. ఆయన అక్కడ ప్లీడరుగా పనిచేసేవాడు.[7]
సుందరం అయ్యర్ కుటుంబంలోనే ఆయన సోదరుడు ఒకరు, తండ్రి సోదరుడు ఒకరు సన్యాసాన్ని స్వీకరించారు..[8] వీరి కుటుంబం స్మార్త బ్రాహ్మణులు. వీరు తమ గృహంలో శివుడిని, విష్ణువును, గణపతిని, అమ్మవారినీ ఆరాధిస్తూ ఉండేవారు.[9][10] వెంకటరామన్ కు ఏడు సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది.[11] ఆయన ఏకసంథాగ్రాహి. మంచి జ్ఞాపకశక్తి ఉండేది. తమిళ పద్యాలు బాగా గుర్తు పెట్టుకుని చెప్పేవాడు.[11] నరసింహ అనే రచయిత ప్రకారం రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఇతను నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఇతన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా తెలిసేదికాదు.[12][13] ఆయనకు 12 సంవత్సరాల వయసులో ఉండగానే ధ్యానంలో గాఢమైన స్థితికి చేరుకున్న సందర్భాలున్నాయి. 1920వ దశకంలో తమిళంలో వచ్చిన ఆయన జీవిత చరిత్ర రమణ విజయంలో మదురైలో ఆయనకు మరణానికి చేరువైనట్లు కలిగిన కొన్ని అనుభవాలు గురించి ఇలా ఉంది.
గతజన్మలో నేను చేసిన అసంపూర్ణ అభ్యాసం నన్ను అంటిపెట్టుకునే ఉన్నది. నేను నా దేహాన్ని మరిచిపోయి నా దృష్టినంతా లోపల కేంద్రీకరిస్తాను. ఒక్కోసారి నేను ఒకదగ్గర కూర్చుని ఉంటాను. కానీ నాకు స్పృహ వచ్చి లేచేసరికి మరెక్కడో మూలన పడుకుని ఉంటాను.[note 1]
వెంకటరామన్ 11 ఏళ్ళ వయసులో ఉన్నపుడు చదువు కోసం తండ్రి ఆయనను దిండిగల్ లో ఉంటున్న వాళ్ళ చిన్నాన్న సుబ్బయ్యర్ దగ్గరికి పంపించాడు. అక్కడ ఆంగ్ల పాఠశాలలో చదివితే ఇండియన్ సివిల్ సర్వీసులో చేరడం సులభమవుతుందని ఆయన ఆలోచన. తిరుచ్చుళిలోని పాఠశాలలో కేవలం తమిళంలోనే విద్యాబోధన చేసేవారు.[11] రమణులు మూడు సంవత్సరాలు అక్కడే చదివాడు.[14] 1891 లో సుబ్బయ్యర్ కు మదురైకి బదిలీ అయింది. ఆయనతో పాటు వెంకటరామన్, ఆయన అన్న నాగస్వామి కూడా తరలి వెళ్ళారు. దిండిగల్ లో ఉన్నపుడు వెంకటరామన్ ఒక సంవత్సరం పాటు హిందూ పాఠశాలలో చదివాడు.[14] అక్కడ ఆంగ్లంలోనే బోధించేవారు.[11]
1892 ఫిబ్రవరి 18న వెంకటరామన్ తండ్రి సుందరం అయ్యారు హఠాత్తుగా మరణించాడు.[15] ఆయన మరణం తర్వాత కుటుంబం విడిపోయింది. వెంకటరామన్, నాగస్వామి మాత్రం మదురైలోని సుబ్బయ్యర్ దగ్గరే ఉండిపోయారు.[8]
కౌమార దశ - ఆత్మ సాక్షాత్కారం (1895 - 1896)
[మార్చు]వెంకటరామన్ మొదట్లో స్కాట్ మిడిల్ స్కూలు, ఆతర్వాత అమెరికన్ మిషన్ హైస్కూల్లో చదివాడు. అక్కడ ఆయనకు క్రైస్తవమతంతో పరిచయం ఏర్పడింది.[16] 1895 నవంబరులో 15 వ శతాబ్దానికి చెందిన వీరశైవ కవి చామరస రచించిన ప్రభులింగలీలె అనే కన్నడ పద్యకావ్యానికి తమిళ రూపం చదివాడు. దాన్నిబట్టి అరుణాచలం అనే పవిత్ర ప్రదేశం నిజంగా ఉన్నదని తెలుసుకున్నాడు. ఆ కావ్యంలో ఉన్న 12 వ శతాబ్దానికి చెందిన కవి, తత్వవేత్త అల్లమ ప్రభును గురించి కూడా తెలుసుకున్నాడు. డాక్టర్ ప్రసన్న సంతెకాడూర్ రాసిన 'ఎత్తన అల్లమప్రభు ఎత్తన రమణ' అనే పుస్తకంలో అల్లమ ప్రభు రమణమహర్షిపై చూపిన ప్రభావాన్ని గురించి వివరించాడు.[17] ఆయనకు చిన్న వయసునుంచే తనలో జరిగే ఆధ్యాత్మిక మార్పులు ఏదో ఒక రూపంలో తెలుస్తూనే ఉన్నాయి. ఆత్మ సాక్షాత్కారం గురించి పూర్తిగా ఎరుక రాగానే ఆ అనుభవం ఆయన్ను పూర్తిగా ముంచెత్తింది.[17] ఆ సమయంలోనే ఆయన సెక్కిళర్ రాసిన పెరియ పురాణం చదివాడు. అందులో 63 మంది నాయనార్ల జీవిత చరిత్రలు ఉన్నాయి. అది ఆయన జీవితంపై విశేష ప్రభావాన్ని చూపింది.[18][web 1][note 2][7][note 3] అంతేకాక భగవంతుడిలో లీనమవడం సాధ్యమేనని నిరూపించింది.[17] ఓస్‌బోర్న్ ప్రకారం ఆయన మదుర మీనాక్షి దేవాలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొనేది.[21] కానీ రమణులు మాత్రం అప్పటికి ఎనిమిది నెలల తర్వాత తనకు నిజంగా ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత మతం, ఆధ్యాత్మికతలపై పూర్తి ఆసక్తి కలిగిందని చెప్పుకున్నాడు.[web 1]
రచయిత నరసింహ ప్రకారం 1896 జూలైలో[18][note 4] ఆయనకు 16 ఏళ్ళ వయసులో మరణం గురించి విపరీతమైన భయం వేసింది. ఆయనలో ఏదో తెలీని ఆవేశం, శక్తి ప్రవేశించినట్లయింది.[web 2][22] ఆయన శరీరం స్థాణువులా అయిపోయేది అప్పుడే ఆయన ఆత్మ పరిశీలనకు ఉపక్రమించాడు. "అసలు మరణించేది ఏది?" అనే ప్రశ్నకు మరణం తన శరీరానికే అని తెలుసుకున్నాడు. కానీ ఎప్పటికీ తనలో ఉండే శక్తియే ఆత్మ అని గ్రహించాడు. దాన్నే ప్రతి ఒక్కరిలో ఉండే ఈశ్వర తత్వంగా ఆయన పేర్కొన్నాడు.[web 2][note 5][note 6] ఈ సంఘటన జరిగిన తర్వాత బడి చదువుల మీద, స్నేహితులు, బంధువుల పట్ల ఆసక్తి సన్నగిల్లింది. దేవుడు అకస్మాత్తుగా వచ్చి తన ఎదుట వాలుతాడని తలుస్తూ బడిలో పరధ్యానంగా కూర్చునేవాడు. ఎవరితో కలవకుండా ఒంటరిగా కూర్చోని తనలో ఉన్న శక్తి మీదే దృష్టి కేంద్రీకరిస్తూ ఉండేవాడు. ప్రతిరోజూ మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి నటరాజ స్వామినీ, 63 మంది నాయనార్ల విగ్రహాలనూ చూస్తూ వారు చూపిన భక్తిభావాలు తనకు కూడా కలగజేయమనీ, వారిమీద చూపిన అనుగ్రహం తన మీద కూడా చూపమని భగవంతుని వేడుకుంటూ ఉండేవాడు. తన కుటుంబ సభ్యులు సన్యాసం స్వీకరించడానికి ఇష్టపడరని తెలుసుకుని సోదరునితో తాను ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నానని చెప్పి 1896 ఆగస్టు 29 నాడు రైలెక్కి 1896 సెప్టెంబరు 1 న తిరువణ్ణామలైకి చేరుకున్నాడు. జీవితాంతం అక్కడే ఉన్నాడు.
తిరువణ్ణామలై దేవాలయాలు (1896-1899)
[మార్చు]అరుణాచలేశ్వర దేవాలయం (1896-1897)
[మార్చు]తిరువణ్ణామలై చేరుకున్న వేంకటరామన్ మొదటగా అరుణాచలేశ్వర దేవాలయాన్ని సందర్శించాడు.[28] మొదటి కొన్ని వారాలు అక్కడ ఉన్న వేయి లింగాల మంటపంలో బస చేశాడు. తర్వాత గుడిలోనే వేరే చోట్లకు మారాడు. చివరకు ఎవరికీ కనపడని పాతాళ లింగం దగ్గరకు చేరుకుని కొన్ని రోజుల పాటు గాఢమైన సమాధి స్థితిలో మునిగి పోయాడు. ఆ స్థితిలో ఆయనకు అక్కడ ఉన్న క్రిమి కీటకాలు శరీరాన్ని కుడుతున్నా తెలియలేదు. చివరికి ఆలయంలో ఉండే శేషాద్రి స్వామి ఆయన్ను గమనించి కాపాడటానికి ప్రయత్నించాడు.[29] ఒక ఆరు వారాల పాటు సుదీర్ఘ సమాధిలో ఉండిపోయిన రమణులను బయటకు తెచ్చి శరీరాన్ని శుభ్రం చేశారు. తర్వాతి రెండు నెలలపాటు సుబ్రహ్మణ్య ఆలయంలో ఉన్నాడు. అప్పుడు కూడా ఆయనకు దేహం మీద, పరిసరాల మీద ఏ మాత్రం స్పృహ లేదు. ఆయన ఆకలితో అలమటించకూడదని ఆహారం కూడా నోటికి దగ్గరకు తీసుకెళ్ళి తినిపించే వారు.
గురుమూర్తం దేవాలయం (1897-1898)
[మార్చు]1897 ఫిబ్రవరి నాటికి ఆయన తిరువణ్ణామలై చేరుకుని ఆరు నెలలు దాటిన తర్వాత అక్కడికి ఒక మైలు దూరంలో ఉన్న గురుమూర్తం దేవాలయానికి చేరుకున్నాడు.[30] ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే పళనిస్వామి అనే వ్యక్తి ఆయనను చూడటానికి వెళ్ళాడు.[31] ఆయనకు రమణులను చూడగానే అంతులేని సంతృప్తి, శాంతం కలిగింది. ఆ సమయం నుంచి ఆయన జీవితాంతం రమణులకు సేవ చేస్తూనే ఉన్నాడు. ఆయనకు భౌతిక రక్షణ కల్పించడమే కాక, చుట్టుపక్కలకు వెళ్ళి భిక్ష స్వీకరించి తనకు రమణులకు ఆహారం వండిపెట్టేవాడు. ఆయనకు కావలిసినవన్నీ దగ్గరుండి చూసుకునేవాడు.[32] 1898 మే నెలలో ఆయన అక్కడికి సమీపంలో ఉన్న మామిడి తోటలోకి మారాడు.[33]
ఈ కాలంలో రమణులు తన శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఓస్‌బోర్న్ రాశాడు.[32] ఆయన్ను అస్తమానం కుడుతూ ఉండే చీమల్ని కూడా పట్టించుకునేవాడు కాదు.[30] ఆయన ఏకాంతాన్ని ఇష్టపడుతున్నా సరే ఆయన ప్రశాంతమైన మౌనం, ఆధ్యాత్మిక సాధనలు నెమ్మదిగా సందర్శకులను ఆకర్షించాయి. ఆయన కోసం కానుకలు తీసుకొచ్చేవారు, ప్రార్థనలు చేసేవారు. ఆయన చుట్టూ వెదురుతో ఒక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశారు.[30]
గురుమూర్తం ఆలయంలో ఉండగానే ఆయన కుటుంబానికి ఆయన అక్కడున్నట్లు తెలిసింది. మొదట ఆయన మేనమామ నెల్లియ్యప్ప అయ్యర్ వచ్చి తన ఆధ్యాత్మిక సాధనలకు ఆటంకం కలిగించమనీ, ఇంటికి తిరిగి రమ్మని వేడుకున్నాడు. రమణులు మాత్రం మౌనంగా ఉండిపోయారు. నెల్లియప్ప చేసేదేమీ లేక తిరుగు ప్రయాణమయ్యాడు.[19]
1898 సెప్టెంబరులో ఆయన అరుణాచలానికి తూర్పు దిక్కుగా ఉన్న పావలక్కున్రు లోని శివుడి దేవాలయానికి వెళ్ళాడు. అక్కడకు తన మాతృమూర్తి వచ్చి బ్రతిమిలాడినా తిరిగి వెళ్లడానికి ఒప్పుకోలేదు.[34]
అరుణాచలం (1899 - 1922)
[మార్చు]1899 ఫిబ్రవరిలో కొండ కింద నుంచి అరుణాచలం కొండమీద జీవించడానికి వెళ్ళాడు.[35] అక్కడ సద్గురు గుహలో కొన్నాళ్ళున్నాడు. తర్వాత నమశ్శివాయ గుహలో కొన్నాళ్ళున్నాడు. తర్వాత 17 ఏళ్ళపాటు విరూపాక్ష గుహలో నివాసం ఉన్నాడు. ఎండాకాలం మామిడి తోటకు సమీపంలోని గుహలో గడిపేవాడు. ఒకసారి ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు మాత్రం పచ్చయమ్మన్ గుడిలో ఉన్నాడు.[36]
1902 లో శివప్రకాశం పిళ్ళై అనే ప్రభుత్వ అధికారి ఒకరు అక్షరాలు రాసే పలక ఒకటి చేతిలో పట్టుకుని 'ఎవరైనా తమ నిజమైన ఉనికిని గుర్తించడం ఎలా?' అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆ యువస్వామిని కలవడానికి వెళ్ళాడు. ఆయన్ను 14 ప్రశ్నలు అడిగాడు. అందుకు ఆయన ఇచ్చిన సమాధానాల సారమే ఆయన మొదటి సారిగా బోధించిన ఆత్మ విచారణ. ఈ బోధనే ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందినది. ఇవే విషయాలను నాన్ యారు (నేను ఎవరు?) అనే పుస్తకంగా ప్రచురించారు.[37]
ఆయనను చూడటానికి చాలామంది సందర్శకులు వచ్చేవారు. వారిలో కొంతమంది ఆయన భక్తులయ్యారు. కావ్యకంఠ గణపతి మునిగా పేరు గాంచిన తెలుగు వేద పండితుడు అయ్యలసోమయాజుల గణపతి శాస్త్రి ఆయనను దర్శించాడు.[note 7] ఆయనకు శ్రుతులు, శాస్త్రాలు, తంత్రం, యోగ శాస్త్రం, ఆగమ శాస్త్రం లాంటి ఎన్నో విషయాలు తెలిసినా తనలోని భగవంతుని దర్శించడం[38] కోసం 1907 లో రమణులను చూడటానికి వచ్చాడు. ఆత్మ విచారణలో ఆయన నుండి ఉపదేశాన్ని అందుకున్న గణపతి ముని ఆయనను భగవాన్ రమణ మహర్షిగా పిలిచాడు. అప్పటి నుంచి ఆయనకు అదే పేరు సార్థకం అయింది.[39] గణపతి శాస్త్రి తన శిష్యులకు కూడా ఈ ఉపదేశాన్ని అందించాడు, కానీ తాను పూర్తిగా భగవంతుని దర్శించలేకపోయానని అంటూండే వాడు. రమణమహర్షి మాత్రం ఆయన పట్ల ఎంతో ప్రీతిగా ఉండటమే కాక ఆయన జీవితాన్ని చాలా ప్రభావితం చేశాడు.[38]
1911 లో భారతదేశంలో పోలీసు అధికారిగా పనిచేస్తున్న ఫ్రాంక్ హంఫ్రీస్ రమణ మహర్షిని చూడటానికి వచ్చిన మొదటి పాశ్చాత్యులలో ఒకడు. ఆయన రమణ మహర్షి గురించి ఆంగ్లంలో రాసిన కొన్ని వ్యాసాలు 1913 లో ది ఇంటర్నేషనల్ సైకిక్ గెజిట్ అనే పత్రికలో ప్రచురితం అయ్యాయి.[40][note 8]
నరసింహ రాసిన 'సెల్ఫ్ రియలైజేషన్' అనే పుస్తక అనుబంధంలో ఇలా రాశాడు. 1912 రమణ మహర్షి తన శిష్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి మూర్ఛలాగా (Epileptic fits) వచ్చేది. ఆ సమయంలో ఆయనకు రెండు సార్లు తెల్లటి కాంతితో కళ్ళు బయర్లు కమ్మేవి. మూడో సారి చూపు పూర్తిగా కనిపించేది కాదు. తల తిరుగుతున్నట్లు అనిపించేది. గుండె ఆగిపోయినట్లు, శ్వాస నిలిచిపోయినట్లు చర్మం నీలంగా మారిపోయినట్లు మరణించే వ్యక్తుల లక్షణాలు కనిపించేవి. ఈ స్థితి సుమారు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉండేది. ఆ తర్వాత శరీరం ఒకరకమైన కుదుపుకు లోనై మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేది.[41] ఇదంతా కొత్తగా అనిపించిన వారికి తర్వాత రమణులు అది నిజంగానే మూర్ఛ అనీ, తన ప్రమేయం లేకుండానే దానంతట అదే వస్తుందనీ తెలిపాడు.[42] ఓస్‌బోర్న్ మాత్రం అలా జరిగిన తర్వాత ఆయన పూర్తిగా బాహ్యప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించేదని చెప్పాడు.[43]
1916 లో రమణ మహర్షి తల్లి అలగమ్మాళ్, తమ్ముడు నాగసుందరం ఆయనతో కలిసి తిరువణ్ణామలైలో జీవించడానికి వచ్చేశారు. ఆయన తర్వాత స్కందాశ్రమానికి వెళితే వారిరువురూ ఆయన్ను అనుసరించారు. స్కందాశ్రమంలో రమణలు 1922 దాకా ఉన్నాడు. తర్వాత రమణ మహర్షి తల్లికి సన్యాస దీక్షనిచ్చి వ్యక్తిగతంగా ఆమెకు ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చాడు. అదే సమయంలో ఆమె ఆశ్రమం వంటగది పని పర్యవేక్షించేది. తర్వాత తమ్ముడు నాగసుందరం కూడా సన్యాస దీక్ష తీసుకుని నిరంజనానంద అనే పేరు మార్చుకున్నాడు. ఆయనను చిన్నస్వామి అని కూడా పిలిచేవారు.
ఈ సమయంలోనే రమణులు అరుణాచలేశ్వరునిపై ఐదు గీతాలు రచించాడు. అందులో మొదటిది అక్షర మణిమాల.[translation 1] ఒక భక్తుడు తాను భిక్షకు వెళ్ళినపుడు వీధుల్లో పాడుకుంటూ వెళ్ళడానికి ఒక పాటను ఇవ్వమనగా ఆయన తమిళంలో స్వరపరిచాడు. 1920 నుంచి తల్లి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. ఆమె 1922 మే 19 న తనయుడు పక్కన కూర్చుని ఉండగానే మరణించింది.
శ్రీ రమణాశ్రమం (1922 - 1950)
[మార్చు]రమణాశ్రమం ప్రారంభం (1922- 1930)
[మార్చు]రమణ మహర్షి 1922 నుంచి 1950లో ఆయన మరణించేదాకా ఆయన తల్లి సమాధి చుట్టూ ఏర్పడ్డ రమణాశ్రమంలో ఉన్నాడు. ఆయన తరచూ స్కందాశ్రమం నుంచి తల్లి సమాధి వరకూ నడుస్తూ ఉండేవాడు. 1922 డిసెంబరు నుంచి ఆయన స్కందాశ్రమానికి వెళ్లకుండా కొండకిందనే ఉండిపోయాడు. దాని చుట్టూనే ఈ ఆశ్రమం ఏర్పడింది. మొదట్లో సమాధి, దాని పక్కనే ఒక గుడిసె మాత్రం ఉండేవి. 1924 లో ఒకటి సమాధికి ఎదురుగా, ఇంకొకటి ఉత్తరంగా రెండు గుడిసెలు నిర్మించారు.ఇప్పుడు పాతహాలుగా పిలవబడే నిర్మాణాన్ని 1928లో నిర్మించారు. రమణ మహర్షి 1949 వరకు అందులోనే నివసించాడు.
నెమ్మదిగా రమణాశ్రమంలో ఒక గ్రంథాలయం, వైద్యశాల, పోస్టాఫీసు, ఇంకా చాలా సౌకర్యాలు ఏర్పడ్డాయి. రమణులు భవన నిర్మాణంలో తన సహజసిద్ధమైన నైపుణ్యాని చూపించేవారు. వీటి గురించి అన్నామలై స్వామి తన జ్ఞాపకాలలో వివరించాడు. 1938 వరకు అన్నామలై స్వామి రమణుల నుంచి నేరుగా ఆదేశాలు తీసుకుంటూ నిర్మాణాలను పర్యవేక్షించాడు.
రమణులు చాలా సాధారణమైన సన్యాసి జీవితాన్ని గడిపేవాడు. ఆయన గురించి విస్తృతంగా రాసిన డేవిడ్ గాడ్‌మ్యాన్ ప్రకారం అందరూ అనుకున్నట్లు ఆయన ఎక్కువ సమయంలో మౌనంగా కూర్చుని గడిపాడన్నది అవాస్తవం. ఆయన తల్లి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్రమం అభివృద్ధి చెందడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతినేంత వరకూ ఆశ్రమంలో వంట కార్యక్రమాలు, విస్తరాకులు కుట్టడం లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవాడు.
పాశ్చాత్యుల అన్వేషణ
[మార్చు]1931 లో నరసింహ రాసిన 'సెల్ఫ్ రియలైజేషన్ - ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ రమణ' మహర్షి అనే గ్రంథం తొలిసారిగా ప్రచురితమైంది. ఆయన గురించి అప్పటికే భారతదేశంలో బాగా తెలిసింది. అప్పటికే పాల్ బ్రంటన్ అనే ఆంగ్లేయుడు భారతదేశంలో సంచరిస్తూ ఆయనను 1931 జనవరిలో కలిసాడు. తర్వాత ఆయన అనుభవాలను రహస్య భారత దేశంలో నా అన్వేషణ (A search in secret India) అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో ఆయన కంచి పరమాచార్య రమణ మహర్షిని కలవమని ఎలా ప్రేరేపించిందీ, తాను కలిసిన తర్వాత ఆయన మీద రమణులు ఎలా చెరగని ముద్ర వేసినదీ చెప్పాడు. రమణ మహర్షి ప్రాబల్యం ఎలా పెరిగిందీ చెప్పాడు. ఆలయానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా గుంపులు గుంపులుగా కొండపైకి వెళ్ళి ఆయనను దర్శనం చేసుకుని వచ్చేవారు. పాల్ బ్రంటన్ ఆయనను భారతదేశపు చివరి అత్యుత్తమ ఆధ్యాత్మికుల్లో ఒకరిగా చెబుతూ తన ఆత్మీయతను వెల్లడించాడు.
ఆయన చాలా సాదా మనిషి నిరాడంబరంగా ఉంటాడు కాబట్టి నేను ఆయన్ను బాగా ఇష్టపడ్డాను. ఆయన చుట్టూ ఉన్న ఆవరణలో విశ్వసనీయమైన గొప్పతనం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఆయన తన ప్రజల రహస్య ప్రేమ స్వభావాన్ని ఆకట్టుకోవడానికి క్షుద్ర శక్తులు , మఠాధిపతుల గురించి ఎటువంటి వాదనలు చేయడు; తన జీవితకాలంలో ఆయనను మహా ప్రవక్త లాగా చేసే ప్రతి ప్రయత్నాన్ని గట్టిగా ప్రతిఘటించాడు.
బ్రంటన్ రమణాశ్రమంలో ఉండగానే ఆయనకు విశ్వ చైతన్య భావన కలిగింది. ఆయన రచించిన పుస్తకం అత్యధిక ప్రతులు అమ్ముడైంది. పాశ్చాత్యుల్లో చాలా మందికి రమణ మహర్షిని పరిచయం చేసింది. దీని తర్వాత పరమహంస యోగానంద, సోమర్‌సెట్ మామ్, మెర్సిడీస్ అకోస్టా, ఆర్థర్ ఓస్‌బోర్న్ రమణ మహర్షిని సందర్శించడానికి వచ్చారు. సోమర్‌సెట్ మాం 1944 లో తాను రాసిన 'ది రేజర్స్ ఎడ్జ్' అనే నవలలో రమణ మహర్షి స్ఫూర్తితో ఒక ఆధ్యాత్మిక గురువు పాత్రను రూపొందించాడు. ఓస్‌బోర్న్ 1964 లో రమణాశ్రమం ప్రచురించిన 'మౌంటెయిన్ పాత్' అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు.
ఆఖరి సంవత్సరాలు (1940 - 1950)
[మార్చు]1948 నవంబరులో ఆయన చేతిమీద ఒక చెడ్డ కురుపు లేచింది. 1949 ఫిబ్రవరిలో దాన్ని ఆశ్రమంలో ఉన్న ఒక వైద్యుడు శస్త్రచికిత్స చేసి తొలగించారు. మళ్ళీ కొద్ది రోజులకు అది తిరగబెట్టింది. 1949 లో మరో ప్రఖ్యాత వైద్యుడు వచ్చి రేడియం సహాయంతో ఇంకోసారి జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి తొలగించాడు. ఆ వైద్యుడు చెయ్యి భుజం వరకు పూర్తిగా తీసేస్తే ఆయన జీవించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు కానీ రమణ మహర్షి అందుకు అంగీకరించలేదు. 1949 ఆగస్టులో మూడోసారి, మళ్ళీ డిసెంబరులో నాలుగోసారి శస్త్రచికిత్స చేశారు. అయితే వాటితో ఆయన మరింత బలహీనం అయిపోయాడు. వేరే రకాల వైద్య విధానాలు కూడా ప్రయత్నించారు కానీ అవి ఏమీ ఫలించలేదు. ఆయన భక్తులు, అనుచరులు ఆయన మీద ఆశ వదులుకున్నారు. ఆయన అనుచరుల కోసమైనా తనను తాను నయం చేసుకోమని కొందరు కోరగా అందుకు ఆయన "నా శరీరం మీద మీకు ఎందుకింత మమకారం, దాన్ని పోనివ్వండి." "నేనెక్కడికి వెళతాను, ఇక్కడే ఉంటాను" అని జవాబిచ్చేవాడు. 1950 ఏప్రిల్ వచ్చేసరికి ఆయన పూర్తిగా బలహీనం అయిపోయాడు. హాలు దాకా కూడా వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ఆయనను దర్శించే వేళలు కూడా తగ్గించారు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్న గది దగ్గర చాలామంది సందర్శకులు ఆయనను ఆఖరు సారి చూద్దామని బారులు తీరేవారు. చివరికి ఆయన 1950 ఏప్రిల్ 14న తన శరీరం విడిచిపెట్టాడు. అదే సమయంలో ఒక వెలుగుతున్న తార ఆయన భక్తులకు దర్శనమిచ్చింది.
భక్తి
[మార్చు]రమణ మహర్షిని ఆయన జీవించి ఉన్నప్పుడూ, ఇప్పడూ చాలామంది అత్యుత్తమ జ్ఞానిగా పరిగణిస్తారు. ఆయన చాలామంది భక్తులను ఆకర్షించాడు. వారిలో కొందరు ఆయనను సాక్షాత్తూ శివుని అవతారంగా భావిస్తారు.
దర్శనం, ప్రసాదం
[మార్చు]చాలామంది భక్తులు కేవలం ఆయన దర్శనం కోసమే వచ్చేవారు. ఆయన దర్శనమాత్రం చేతనే తాము పునీతులు కావచ్చని వారి భావన. ఓస్‌బోర్న్ ప్రకారం రమణులు తనను సందర్శించడానికి వచ్చిన వాళ్ళకు దర్శనం ఇవ్వడం ఒక విధిగా పెట్టుకున్నాడు. తన దగ్గరకు వచ్చేవాళ్ళందరికీ తాను అందుబాటులో ఉండాలని ఆయన తరచుగా అంటుండేవాడు. చివరికి ఆయన జీవిత చరమాంకంలో కూడా వ్యాధి ఆయనను బాధిస్తున్నా ఆయన దర్శనం కోసం వచ్చిన వాళ్ళను చూడటానికి పరితపించేవాడు.
ఆయన తాకిన, వాడిన వస్తువులు భక్తులు పరమ పవిత్రమైన ప్రసాదంగా భావించేవారు. కొంతమంది ఆయన పాదాలను తాకాలని ప్రయత్నించేవారు. ఒకానొక భక్తుడు తాను రమణుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి పాదాలను తాకుతానని చెప్పగా అందుకు ఆయన ఇలా అన్నాడు.
భగవంతుని నిజమైన పాదాలు భక్తుని హృదయంలో మాత్రమే ఉంటాయి. ఈ పాదాలను నిరంతరం పట్టుకోవడమే నిజమైన ఆనందం. మీరు నా భౌతిక పాదాలను పట్టుకుంటే నిరాశ చెందుతారు, ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ భౌతిక శరీరం అదృశ్యమవుతుంది. తనలో ఉన్న గురువు పాదాలను పూజించడమే గొప్ప పూజ.
అవతారం
[మార్చు]కొంతమంది భక్తులు ఆయనను దక్షిణామూర్తి అవతారంగా భావించేవారు. మరికొంతమంది 63 నాయనార్లలో ఒకడైన జ్ఞాన సంబంధర్ అవతారంగా భావించేవారు. ఇంకొంతమంది ఆయనను 8వ శతాబ్దంలో జీవించాడని భావిస్తున్న మీమాంస పండితుడు కుమరిల భట్టు అవతారంగా అనుకునేవారు.
భారతీయ భక్తులు
[మార్చు]- కావ్యకంఠ గణపతి ముని (1878 - 1936): సంస్కృత పండితుడు, కవి, భారత స్వాతంత్ర్యోద్యమ కారుడు. రమణ మహర్షి తొలి భక్తులలో ఈయన ఒకడు. "రమణ మహర్షి" అని పేరు పెట్టింది ఈయనే.
- యోగి రామయ్య, శ్రీ రమణ మహర్షి అగ్రగణ్య శిష్యులలో ఇతను ఒకడు. శ్రీ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమ కార్యక్రమాలలో భక్తులు వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. కొందరు ఆశ్రమ నిర్వహణా కార్యక్రమాలు, కొందరు భక్తుల, యాత్రికుల సేవకు, మరికొందరు భగవాన్ రమణుల పరిచర్యకు, కొందరు మేధావులు భగవాన్ రమణులు సూచించిన విచార మార్గంలో స్థిరంగా నిలిచి సాధన చేసారు. అటువంటివారిలో శ్రీ యోగి రామయ్య ఒకరు [1] ఇంగ్లీష్ ప్రధాన భాషగా ఉన్న ప్రపంచానికి శ్రీరమణ మహర్షిని పరిచయం చేసిన పుస్తకం "రహస్య భారతదేశంలో ఒక అన్వేషణ" (A Search in Secret India by Paul Brunton") అనే ఈ పుస్తక రచయత పాల్ బ్రంటన్ తాను ఎంతో ప్రశాంతతను శ్రీరామయోగి సాన్నిధ్యంలో అనుభవించినట్లు వ్రాసాడు.
- గుడిపాటి వెంకట చలం (1894 - 1976): పేరొందిన తెలుగు రచయిత. చరమాంకంలో రమణాశ్రమంలో గడిపి అక్కడే మరణించాడు.
- H. W. L. పూనియా: 1940 దశకంలో రమణ మహర్షిని సందర్శించి ఆత్మ విచార సాధనను నేర్చుకుని, ఇతరులకు బోధించాడు.
- స్వామి రాందాస్: తీర్థ యాత్రలు చేస్తూ 1922 లో రమణ మహర్షి దగ్గరకు వచ్చాడు. ఆయన దర్శనం తర్వాత 21 రోజుల పాటు అరుణాచల పర్వతాలపై ఒక గుహలో ధ్యానం చేశాడు. అంతా రామ మయమనే అనుభూతి పొందాడు.
- ఒ. పి. రామస్వామి రెడ్డియార్: భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. 1947 నుంచి 1949 మధ్యలో మద్రాసు ప్రెసిడెన్సీకి ప్రీమియర్ గా పనిచేశాడు.
- మనవాసి రామస్వామి అయ్యర్: రమణ మహర్షి మీద శరణాగతి అనే పేరుతో ప్రజాదరణ పొందిన పాటలు రాశాడు.
పాశ్చాత్య భక్తులు
[మార్చు]- పాల్ బ్రంటన్: ఇంగ్లీష్ ప్రధాన భాషగా ఉన్న ప్రపంచానికి శ్రీరమణ మహర్షిని పరిచయం చేసిన పుస్తకం "రహస్య భారతదేశంలో ఒక అన్వేషణ" (A Search in Secret India by Paul Brunton") అనే ఈ పుస్తక రచయత పాల్ బ్రంటన్. ఈయన రచనల వల్ల రమణి మహర్షిని గురించి చాలామంది పాశ్చాత్యులకు తెలిసింది
- ఆర్థర్ ఓస్‌బోర్న్: ఆశ్రమం నుంచి వెలువడే 'ది మౌంటెయిన్ పాత్' అనే పత్రికకు ఈయన మొదటి సంపాదకుడు
- మౌని సాధు: ఆధ్యాత్మిక, మార్మిక విషయాల మీద పలు రచనలు చేసిన ఆస్ట్రేలియన్ భక్తుడు
- డేవిడ్ గాడ్‌మ్యాన్: ఆశ్రమంలో లైబ్రేరియన్ గా ఉండేవాడు. రమణ మహర్షి జీవితం గురించి, ఆయన భక్తుల్లో అంతగా ప్రచారం పొందని వారి గురించి రాశాడు.
ఆధ్యాత్మిక బోధన
[మార్చు]రమణ మహర్షి తనను చూడటానికి వచ్చిన వారికి దర్శనమిచ్చి వారితో మౌనంగా కూర్చునేవాడు. అదే ఆయన అనుసరించిన ముఖ్యమైన ఉపదేశ విధానం. కానీ కొంతమంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చేవాడు. ఈ విధంగా సంకలనం చేయబడ్డ ప్రశ్నోత్తరాలను చాలా మంది భక్తులు ప్రచురించారు. కొన్నింటిని స్వయంగా రమణులే సరిచూశారు. రమణ మహర్షి స్వయంగా రాసినవి, లేదా ఆయన చెబుతుంటే వేరేవారు రాసినవి కూడా కొన్ని పుస్తకాలుగా ప్రచురించబడ్డాయి.
ఆయన స్వయంగా శివుడిని ఆరాధిస్తూ, అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, తనతో బాటు భక్తులకు మార్గం చూపించేవాడు. అరుణాచలేశ్వరుడిపై స్తోత్రాలు కూడా రాశాడు.
ఆత్మ
[మార్చు]రమణ మహర్షి తన నిజస్వరూపమైన ఆత్మను ఒక రకమైన శక్తి, ప్రవాహంగా భావించాడు. అది ఆయనకు ఒకసారి తనకు విపరీతమైన ప్రాణభయం కలిగినప్పటి నుంచి స్థిరపడిన అనుభూతి అని చెప్పాడు.
ఈ శక్తిని ఆయన పలు రకాల పేర్లతో పిలిచేవాడు. ఆయన ఎక్కువగా వాడిన పదం సచ్చిదానంద. దేవుడు, బ్రహ్మం, శివుడు, హృదయం (భౌతికమైన గుండె లేదా ఒక బిందువు కాదు) అనే పదాలు కూడా వాడేవాడు.
నిశ్శబ్దం
[మార్చు]తన దగ్గరకు వచ్చేవారిలో అజ్ఞానాన్ని తొలగించి, ఆత్మ ఎరుకలో ఉంచడానికి రమణ మహర్షి ఎక్కువగా వారితో మౌనంగా కూర్చునేవాడు. అవసరం అయితే తప్ప మాట్లాడేవాడు కాదు. ఈ పద్ధతి హిందూ సాంప్రదాయంలో దక్షిణామూర్తి బోధించే మార్గాన్ని పోలి ఉంటుంది. ఒక రోజు సాయంత్రం ఆయన భక్తులు కొంతమంది శంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్త్రోత్రాన్ని వివరించి చెప్పమన్నారు. అందుకు ఆయన ఏ మాత్రం చలించక మౌనంగా ఉండిపోయారు.
ఆయన నిశ్శబ్దమే నిజమైన ఉపదేశం అని చెప్పేవాడు. పరిణతి చెందిన సాధకులకే ఆ ఉపదేశాన్ని అందుకోవడం సాధ్యమవుతుంది. ఇతరులు అందులోనుంది ఉపయోగం పొందలేరు. అందుకనే వాళ్ళకు సత్యం అర్థం అయ్యేలా చెప్పడానికి మాటలు అవసరమయ్యాయి.కానీ సత్యం మాటలతో అర్థమయ్యేది కాదు. అంతకు మించింది. దానికి వివరణ అవసరం లేదు. మాటలతో కేవలం దానిని సూచించవచ్చు. కానీ తెలుసుకోవడం ఎలా?
ఆత్మ విచారం
[మార్చు]ఆత్మ విచారం లేదా జ్ఞాన విచారము అంటే నిరంతరం నేను అనే భావన గురించే ఆలోచిస్తూ ఉండటం. రమణ మహర్షిని యోగ, వేదాంత గ్రంథాల గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ఆత్మానుభూతి కోసం ఈ మార్గమే ఉత్తమమైనది, అత్యంత ప్రభావవంతమైనదని పలు మార్లు చెబుతుండేవాడు. వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు, అద్వైత వేదాంతాలనే కాకుండా, అనేక మత సారాంశాల మార్గాలను తన బోధనలలో బోధించేవాడు.[6]
- ఏ స్థితిలో ఐతే ప్రశాంతమైన మనసు నిలకడగా ఉన్న అనుభూతిని కలిగి ఉంటుందో, అదే సమాధి. ఆ నిలకడగా ప్రశాంతంగా ఉన్న మనసే దేవుడి నిజరూపాన్ని దర్శించగల్గుతుంది.
- అదే సహజమైన సమాధి. ఇక్కడ బాహ్యప్రపంచంలో పనిచేస్తున్నా కూడా మనసు నిలకడగా, ప్రశాంతంగా ఉంటుంది. అంతరాంతరాలలో నిన్ను ఏదో సత్యం కదిలిస్తున్నట్టు అనిపిస్తుంది. నీకు ఏ బాధ, కోరిక, ఆవేదన ఉండవు. ఏది నీది కాదని తెలుసుకుంటావు. ఎవరైతే ఈ సమస్తాన్ని తానై నడిపిస్తున్నారో ఆ సత్యాన్ని తెలుసుకున్న నువ్వు వారితో ఎప్పుడూ అంతర్లీనమయ్యే ఉంటావు
- ఈ సమాధి మాత్రమే శాశ్వతమైన ప్రశాంతం. ఈ సమాధి స్థితిలో అంత్య దశలో పరమానందాన్ని పొందుతావు. భక్తిలో పరమానందం ముందుగా వస్తుంది. ఇది అశ్రుధారలాగా, రోమాలు నిక్కబొడుచుకుని, గొంతు తడబడుతూ బయటకు ప్రజ్వలిస్తుంది. అహం నశించాక, ఈ సమాధి స్థితి చేరుకున్నాక ముందు చెప్పిన లక్షణాలు అవే నశిస్తాయి.
భక్తి
[మార్చు]ఆయన జ్ఞాన సముపార్జన కోసం ఆత్మ విచారాన్నే శీఘ్రమైన పద్ధతిగా సూచించినప్పటికీ తాను నమ్మకున్న దైవం పట్ల భక్తి, ఆత్మ నివేదన ద్వారా కూడా జ్ఞానాన్ని పొందవచ్చనీ, అవి కూడా చివరికి ఆత్మ విచారమనే భావనలో కలుస్తాయని చెప్పాడు.
పునర్జన్మ
[మార్చు]డేవిడ్ గాడ్‌మ్యాన్ ప్రకారం పునర్జన్మ అనేది మానవ స్వరూపమే నిజమైనది అనే అసత్య కల్పన మీద ఆధారపడిన భావన అని రమణ మహర్షి అనేవారు. పునర్జన్మ నిజమే అయినప్పటికీ అది కేవలం తన ఆత్మస్వరూపం తెలుసుకోలేని వారికే ఉపయోగపడుతుంది అని చెప్పారు. కానీ ఒకసారి ఆ భావన తొలగిపోయిన తర్వాత పునర్జన్మ అనే భావనకు విలువలేదు. మనిషి తన దేహచింతన గురించి ఆలోచించడం మానేసినప్పుడు ఇక అది మరణించడం, జన్మించడం అనేది ఉండదు కదా. ఆత్మకు చావు, పుట్టుక లేదు.
నేపథ్యం
[మార్చు]కార్ల్ జంగ్ అనే మానసిక శాస్త్రజ్ఞుడు రమణ మహర్షి తత్వాన్ని ప్రత్యేకమైనదిగా కాక తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భారతీయ చింతనలో భాగమే అని భావించాడు.[44] రమణ మహర్షి బోధనల్లో తరచుగా అద్వైత వేదాంతానికి సంబంధించిన భావనలు కనిపించినా ఆయన ఆధ్యాత్మిక జీవనం ఎక్కువగా శివతత్వంతో ముడిపడి ఉంది. తమిళ ఆధ్యాత్మిక గీతాలతో కూడిన తిరుమురై, వేదాలు, శైవాగమాలు, మేకాండ లేదా సిద్ధాంత శాస్త్రాలు తమిళ శైవ సిద్ధాంతంలో ప్రముఖమైనవి.[45] ఆయనకు ఆత్మజ్ఞానం కలుగక మునుపు ఆయన 63 నాయనార్ల జీవిత చరిత్రలతో కూడిన పెరియ పురాణం చదివాడు. తర్వాత ఈ కథలనే భక్తులకు అప్పుడప్పుడు వివరించేవాడు.[46]
రమణ మహర్షిని కొందరు దక్షిణామూర్తి అవతారంగా భావించేవారు. ఎందుకంటే ఈ రూపంలోనే శివుడు గురువుగా జ్ఞానబోధ చేస్తాడు.[47][48]
వారసత్వం
[మార్చు]చాలామంది తాము రమణమహర్షిచే ప్రభావితులయ్యామని చెప్పుకున్నా ఆయన మాత్రం తాను ఎవ్వరికీ గురువు కాదనీ, తనకు ఎవ్వరూ శిష్యులు లేరనీ, తనకు వారసులు కూడా ఎవరూ లేరని చెప్పుకున్నాడు. చాలామంది ఆయనను చూడటానికి వచ్చి ఆయన సన్నిధిలో తమకు ఆధ్యాత్మిక చైతన్యం కలిగిందని చెప్పుకున్నారు కానీ రమణ మహర్షి మాత్రం వారి గురించి ఏమీ చెప్పలేదు. తన తల్లి మరణానంతరం మాత్రం ఆమె మోక్షాన్ని పొందింది అని చెప్పాడు.
తన తదనంతరం రమణాశ్రమాన్ని నిర్వహించేందుకు 1938లో తన సోదరుడు నిరంజనానందకు, అతని వారసులకూ చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తూ విల్లు రాశాడు. 2013 నాటికి ఈ ఆశ్రమాన్ని నిరంజనానంద మనవడైన వి. ఎస్. రామన్ నిర్వహిస్తున్నాడు. ఇది న్యాయబద్ధమైన ప్రజల ఆధ్యాత్మిక సంస్థగా గుర్తింపు పొందింది. ఇది రమణ మహర్షి బోధించిన విలువలను కొనసాగించేందుకు కట్టుబడి ఉంది. ఈ ఆశ్రమం సేవలు వినియోగించుకునేందుకు అందరికీ అందుబాటులో ఉండే ఆధ్యాత్మిక సంస్థ.[49][web 4]
1930వ దశకంలో పాల్ బ్రంటన్ రాసిన ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అన్న పుస్తకంతో రమణ మహర్షి బోధనలు పాశ్చాత్యులకు పరిచయం అయ్యాయి.[50][note 9] ఆర్థర్ ఓస్‌బోర్న్ స్ఫూర్తితో భగవత్ సింగ్ రమణుల బోధనలను అమెరికాలో వ్యాప్తి చెయ్యడం మొదలుపెట్టాడు.[50] హెచ్. డబ్ల్యు.పూంజా శిష్యులు తీసుకు వచ్చిన నియో అద్వైత ఉద్యమంతో[59] ఆయన బోధనలు ఇంకా బాగా వ్యాప్తి చెందడం మొదలుపెట్టాయి. ఈ బోధనలు రమణ మహర్షి బోధనలను మొదటి నుంచీ విశ్లేషణ చేసి స్వీయానుభవానికే పెద్ద పీట వేశారు. స్వీయ విచారణకు కావలసిన సంసిద్ధత గురించి పట్టించుకోనందువల్ల అది కొంత విమర్శలు కూడా మూటగట్టుకుంది.[60][note 10] అయినా సరే నియో అద్వైత అనేది పాశ్చాత్యుల ఆధ్యాత్మిక జీవనశైలిలో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది.[61]
రచనలు
[మార్చు]రమణ మహర్షి తనదైన ఆధ్యాత్మిక సాంప్రదాయం సృష్టించడం కోసం ఎన్నడూ బోధనలు చెయ్యడం, పుస్తకాలు రాయడం చేయలేదు. ఆయన పేరు మిద చలామణీ అవుతున్న రచనలు చాలా వరకు ఆయన భక్తులు ఆయన్ను అడిగి మరీ తెలుసుకున్న విషయాల సమాకలనమే. ఆయన స్వంతంగా రాసినవి కొన్ని స్థోత్రాలు. ఆయన రచనలు కొన్ని
- గంభీరం శేషయ్య ప్రచురించిన విచార సంగ్రహం. 1901 లో సంకలనం చేసిన ప్రశ్నోత్తరాలు
- శివప్రకాశం పిళ్ళై రచించిన నాన్ యారు? (నేను ఎవరు?). 1902 లో సంకలనం చేసిన ప్రశ్నోత్తరాలు
- మురుగనార్ అనే భక్తుడి కోరిక మీద ఆధ్యాత్మ సాధనకు కావలసిన బోధను సులువైన భాషలో ముప్ఫై శ్లోకాలలో ఉపదేశసారము అని రమణ మహర్షి రాసారు. ఆ తరువాత వారే వాటిని తెలుగు, సంస్కృతం, మలయాళంలోకి అనువదించారు.[62] ఈ ఉపదేశసారమునకు 1928లో కావ్యకంఠ గణపతి ముని సంస్కృతంలో భాష్యము రాసారు.[63][64]
- రమణ మహర్షి స్వయంగా రాసిన రచనల్లో బహుశా ఆఖరిది ఉల్లడు నార్పుడు (ఉన్నది నలుబది) అని నలభై శ్లోకాలు తమిళంలో రాసారు.[65] వీటిని కావ్యకంఠ గణపతి ముని సంస్కృతంలోకి సద్దర్శనము అనే పేరిట శ్లోక రూపంలో అనువదించారు.[66] దీనికి కపాలి శాస్త్రి సంస్కృతంలో వ్యాఖ్య రాసారు.
- అరుణాచలేశ్వరునిపై రచించిన ఐదు స్తోత్రాలు
- అక్షర మణమాలై: 1914 లో ఒక భక్తుడు తాము వీధుల్లో భిక్ష కోసం వెళుతున్నప్పుడు పాడుకొనేందుకు వీలుగా ఏదైనా ఇవ్వమని కోరగా రమణులు రాసిన 108 పద్యాల స్తోత్రం ఇది.
- నవమణి మాలై : నవరత్నాల మాల అనబడే తొమ్మిది శ్లోకాలు
- అరుణాచల పటికం: అరుణాచలేశ్వరుని కీర్తిస్తూ రాసిన పదకొండు శ్లోకాలు
- అరుణాచల అష్టకం: ఎనిమిది శ్లోకాల అరుణాచల స్తోత్రం
- అరుణాచల పంచరత్న: ఐదు శ్లోకాల అరుణాచల స్త్రోత్రం
భద్రపరిచిన సంభాషణలు
[మార్చు]రమణ మహర్షి తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో ఇచ్చిన ఉపన్యాసాలను కొన్ని రాసిపెట్టి తర్వాతి కాలంలో ప్రచురించారు. వీటిలో కొన్ని అప్పటికప్పుడు ఆంగ్లంలోకి తర్జుమా చేసి రాసినవి కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని
- నటనానంద ప్రచురించిన ఉపదేశ మంజరి, ఇవి రమణులకు భక్తులకు మధ్య జరిగిన సంభాషణలకు లిఖిత రూపం. 1939లో ప్రచురించారు.
- మునగాల వెంకట్రామయ్య ప్రచురించిన టాక్స్ విత్ శ్రీ రమణ మహర్షి, ఇవి 1935-39 సంవత్సరాల మధ్యలో రాసిపెట్టబడిన సంభాషణలు.[67][68] ఈ పుస్తకాన్ని రామచంద్ర కౌండిన్య శ్రీ రమణ భాషణములు అనే పేరిట తెలుగులోకి అనువదించారు.[69]
జ్ఞాపకాలు
[మార్చు]- ఫ్రాంక్ హంఫ్రీస్, భారతదేశంలో పనిచేసిన బ్రిటిషు పోలీస్ అధికారి. ఈయన 1911లో రమణ మహర్షిని సందర్శించి ఆయన గురించి కొన్ని వ్యాసాలు రాశాడు. అవి 1913 లో ది ఇంటర్నేషనల్ సైకిక్ గెజిట్ అనే పత్రికలో ప్రచురితం అయ్యాయి.
- పాల్ బ్రంటన్ (1935), రాసిన 'ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా' (రహస్య భారతదేశంలో నా అన్వేషణ) అనేక మంది పాశ్చాత్యులకు రమణ మహర్షిని పరిచయం చేసింది.
- ఎస్. ఎస్. కొహెన్ రాసిన గురు రమణ అనే పుస్తకం మొదటి సారిగా రమణాశ్రమం వారు 1956లో ప్రచురించారు.
- మేజర్ ఎ. డబ్ల్యు చాడ్విక్ రాసిన A Sadhus Reminiscences of Sri Ramana అనే పుస్తకాన్ని రమణాశ్రమం వారు 1961 లో ప్రచురించారు.
- సూరి నాగమ్మ లేఖలు శ్రీ రమణాశ్రమం వారు 1973 లో ప్రచురించారు.
చిత్రమాలిక
[మార్చు]-
Sri Ramana Maharshi - Lying - G. G Welling - 1948.jpg పడుకుని ఉన్న రమణ మహర్షి
-
Ramana-Maharshi-follower.jpg అనుచరులతో రమణ మహర్షి
-
Ramana-Maharshi-1949.jpg 1949లో రమణ మహర్షి
-
Yogi Ramiah with bhagavan.png రమణమహర్షితో యోగిరామయ్య
-
YogiRamaiahWithBhagavan1934.png రమణ ఆశ్రమంలో రమణమహర్షితో యోగిరామయ్య 1934
గమనికలు
[మార్చు]- ↑ The phrase "incomplete practice from a past birth clinging to me" includes the Tamil term vittakurai which the Tamil Lexicon defines as "Karma resulting from acts performed in a previous birth, and which are considered to be the cause of progress in the current birth". The implication is that some spiritual practice performed in a previous life carried forward and drew the young Venkararaman into states of absorption in which he was unaware of either his body or his surroundings.
- ↑ According to Sadu Om, self-enquiry can also be seen as 'Self-attention' or 'Self-abiding'.[19]
- ↑ Sudden conversion, following after epipletic seizures, is also described in the Geschwind syndrome: "... the transformation of the personality brought about by TLE, in that for some it seemed to magnify or give rise to a preoccupation with religious or philosophical matters".[20]
- ↑ According to David Godman, the date 17 July 1896 is based on astrology. Whether Venkataraman's awakening truly occurred on 17 July 1896, or a date close to the 17th is unknown. However, it is known that Venkataraman's awakening did take place at some point in the middle of July 1896.
- ↑ In an interview with Narasimha, Ramana Maharshi stated: "Once I reached that conclusion (as I said, on the first day of the six weeks, the day of my awakening into my new life) the fear of death dropped off. It had no place in my thoughts. ‘I’, being a subtle current, it had no death to fear. So, further development or activity was issuing from the new life and not from any fear. I had no idea at that time of the identity of that current with the personal God, or Iswara as I used to call him. As for Brahman, the impersonal absolute, I had no idea then. I had not even heard the name then. I had not read the Bhagavad Gita or any other religious works except the Periyapuranam and in Bible class the four Gospels and the Psalms from the Bible. I had seen a copy of Vivekananda’s Chicago lecture, but I had not read it. I could not even pronounce his name correctly. I pronounced it ‘Vyvekananda’, giving the ‘i’ the ‘y’ sound. I had no notions of religious philosophy except the current notions of God, that He is an infinitely powerful person, present everywhere, though worshipped in special places in the images representing Him. This I knew in addition to a few other similar ideas which I picked up from the Bible and the Periyapuranam. Later, when I was in the Arunachala Temple, I learned of the identity of myself with Brahman, which I had heard in the Ribhu Gita as underlying all. I was only feeling that everything was being done by the current and not by me, a feeling I had had ever since I wrote my parting note and left home. I had ceased to regard the current as my narrow ‘I’. This current, or avesam, now felt as if it was my Self, not a superimposition.
While, on the one hand, the awakening gave me a continuous idea or feeling that my Self was a current or force in which I was perpetually absorbed whatever I did, on the other hand the possession led me frequently to the Meenakshi Sundaresa Temple [in Madurai]. Formerly I would visit it occasionally with friends, but at that time [it] produced no noticeable emotional effect, much less a change in my habits. But after the awakening I would go there almost every evening, and in that obsession I would go and stand there for a long time alone before Siva, Nataraja, Meenakshi and the sixty-three saints. I would sob and shed tears, and would tremble with emotion. I would not generally pray for anything in particular, although I often wished and prayed that…"[23] - ↑ According to G.K. Pillai, this death-experience was an epileptic seizure, which may have been self-induced by holding the breath.[24]
Sudden fear, sensations of heat, the awareness of a presence, and body rigidity, are all symptoms that may manifest either prior or during a seizure:
* "A sudden sense of unprovoked fear"[web 3]
* "A rising sensation in the abdomen"[web 3]
* "Some patients have troubles finding appropriate words, or give very simplified descriptions (e.g. feeling of warmth rising in the body, “rising in the head, like bubbles in the head”"[25]
* "Patients in the HYG more often reported actual experiences of some external being and an awareness of that being. This was described as either an evil or a great spiritual presence, and was associated with feelings of death and dying and an overwhelming feeling of fear. Such phenomenology is akin to the verbal reports from many patients with postictal psychoses. There is not just an awareness of the presence, but also an identification of this other essence. There is also the contrast between, on one hand, almost ecstasy (a miraculous event) and the experience of the presence of a great figure and, on the other hand, the more ominous feelings of fear, death, and punishment."[26]
* "In a tonic seizure, the body, arms, or legs may be suddenly stiff or tense."[27] - ↑ Literally, "One who has poetry in his throat."
- ↑ See Frank H. Humphreys, Glimpses of the Life and Teachings of Bhagavan Sri Ramana Maharshi for Humphreys writings on Ramana Maharshi.
- ↑ Brunton had been a member of the Theosophical Society, which searched for ancient wisdom in the east, and the Society was a major force in the exposure of the west to Asian spirituality.[51][52] One of its salient features was the belief in "Masters of Wisdom".[53] The Theosophical Society also spread western ideas in the east, aiding a modernisation of eastern traditions, and contributing to a growing nationalism in the Asian colonies.[54] The Theosophical Society had a major influence on Buddhist modernism[54] and Hindu reform movements,[51] and the spread of those modernised versions in the west.[54] The Theosophical Society and the Arya Samaj were united from 1878 to 1882, as the Theosophical Society of the Arya Samaj.[55] Along with H. S. Olcott and Anagarika Dharmapala, Blavatsky was instrumental in the Western transmission and revival of Theravada Buddhism.[56][57][58]
- ↑ See also Timothy Conway, Neo-Advaita or Pseudo-Advaita and Real Advaita-Nonduality
మూలాలు
[మార్చు]- ↑ "Ramana Maharshi and the Path of Self-Knowledge". Archived from the original on 2008-12-14. Retrieved 2009-02-03.
- ↑ Bhagavan Sri Ramana Maharshi the Atiasrami, p.1
- ↑ Godman 1985.
- ↑ "Talks with Sri Ramana Maharshi". Archived from the original on 2012-12-27. Retrieved 2009-02-03.
- ↑ "Be As You Are Introduction". Archived from the original on 2015-03-03. Retrieved 2009-02-03.
- ↑ 6.0 6.1 "Sri Ramana's approval of other practices". Archived from the original on 2009-03-10. Retrieved 2009-02-03.
- ↑ 7.0 7.1 Osborne 2002.
- ↑ 8.0 8.1 Osborne 2002, p. 3.
- ↑ Bhikshu 2004, p. ch2.
- ↑ Williamson 2010, p. 11.
- ↑ 11.0 11.1 11.2 11.3 Bhikshu 2004, p. ch3.
- ↑ Narasimha 1993, p. 21.
- ↑ Osborne 2002, p. 4.
- ↑ 14.0 14.1 Zimmer 1948, p. 14.
- ↑ Bhikshu 2004.
- ↑ Bhikshu 2004, p. ch4.
- ↑ 17.0 17.1 17.2 Osborne 2002, p. 5.
- ↑ 18.0 18.1 Natarajan 2006.
- ↑ 19.0 19.1 Sadhu Om 2005.
- ↑ Teresa Sheppard, Temporal Lobe Epilepsy and the Paranormal Archived 2021-12-08 at the Wayback Machine
- ↑ Osborne 2002, p. 6.
- ↑ Godman 1985, p. 4.
- ↑ "Arunachala and Ramana Maharshi: Bhagavan's death experience". 7 May 2008.
- ↑ G.K. Pillai (2015), Monks are from Meditating Monkeys: Unravelling the Algorithm of True Spiritual Awakening
- ↑ Markus Gschwind and Fabienne Picard (2014)
- ↑ "Michael Trimble, Anthony Freeman (2006), An investigation of religiosity and the Gastaut–Geschwind syndrome in patients with temporal lobe epilepsy, Epilepsy & Behavior 9 (2006) 407–414
- ↑ Epilepsy Foundation, Tonic Seizures
- ↑ Osborne 2002, p. 30.
- ↑ Sri Ramanasramam 1981.
- ↑ 30.0 30.1 30.2 Osborne 2002, p. 35.
- ↑ Osborne 2002, p. 31.
- ↑ 32.0 32.1 Osborne 2002, p. 36.
- ↑ Osborne 2002, p. 37.
- ↑ Sri Ramanasramam 1981, p. 34.
- ↑ Ebert 2006, p. 71.
- ↑ Natarajan 2006, p. 27-29.
- ↑ Ramana Maharshi 1982.
- ↑ 38.0 38.1 Bhikshu 2004, ch.22.
- ↑ Sadhu Om 2005, p. 15.
- ↑ Osborne 2002, p. 106, 111.
- ↑ Narasimha 1993, p. 268-269.
- ↑ Narasimha 1993, p. 269.
- ↑ Osborne 2002, p. 60-62.
- ↑ Wehr 2003.
- ↑ Arulsamy 1987, p. 1.
- ↑ Narasimha 1993, p. 17.
- ↑ Frawley 1996, p. 92-93.
- ↑ Paranjape 2009, p. 57-58.
- ↑ Osborne2002, p. ch.12.
- ↑ 50.0 50.1 Lucas 2011, p. 99.
- ↑ 51.0 51.1 Sinari 2000.
- ↑ Lavoie 2012.
- ↑ Gilchrist 1996, p. 32.
- ↑ 54.0 54.1 54.2 McMahan 2008.
- ↑ Johnson 1994, p. 107.
- ↑ McMahan 2008, p. 98.
- ↑ Gombrich 1996, p. 185-188.
- ↑ Fields 1992, p. 83-118.
- ↑ Lucas 2011, p. 94.
- ↑ Lucas 2014.
- ↑ Lucas 2011, p. 109.
- ↑ "Upadesa Saram (4 Languages)". bookstore.sriramanamaharshi.org (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-04-16. Retrieved 2022-04-16.
- ↑ "Collected Works of Vasishtha Kavyakantha Ganapati Muni - Volume 7" (PDF).
- ↑ "UpadeshasaraBhashyam". sanskritdocuments.org. Retrieved 2022-04-16.
- ↑ "Ulladu Narpadu Commentary(Tamil)". bookstore.sriramanamaharshi.org (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-01-29. Retrieved 2022-04-16.
- ↑ "Sad Vidya(Telugu)". bookstore.sriramanamaharshi.org (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-04-16. Retrieved 2022-04-16.
- ↑ talks_with_sri_ramana_maharshi_complete (in English).
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Talks with Sri Ramana Maharshi (PAPER BACK)". bookstore.sriramanamaharshi.org (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-04-16. Retrieved 2022-04-16.
- ↑ "Sri Ramana Bashanamulu(Telugu)". bookstore.sriramanamaharshi.org (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-04-16. Retrieved 2022-04-16.
వెబ్ మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- The official Bhagavan Sri Ramana Maharshi website
- David Godman - Author - contains many articles and translated works of or about Ramana Maharshi
- Bhagavan-Ramana.org Site (Comprehensive, extensively sourced information on Ramana Maharshi) Archived 2014-05-17 at the Wayback Machine
- Kheper article, information on Sri Ramana Maharshi Archived 2009-02-16 at the Wayback Machine
- The Ramana Maharshi Centre for Learning(RMCL) - established to create greater awareness of the timeless heritage and culture of India, with particular focus on the life and teachings of Bhagavan Sri Ramana Maharshi
- రమణ మహర్షి వ్రాసిన ఉన్నది నలుబది సద్విద్య గ్రంథపు అనువాదం
- సూరి నాగమ్మ లేఖలు[permanent dead link]
ఉల్లేఖన లోపం: "translation" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="translation"/>
ట్యాగు కనబడలేదు
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- CS1 maint: unrecognized language
- Commons category link is on Wikidata
- All articles with dead external links
- AC with 15 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1879 జననాలు
- 1950 మరణాలు
- అద్వైతం
- ఆధ్యాత్మిక గురువులు
- మూలాల లోపాలున్న పేజీలు
- Pages with reference errors that trigger visual diffs