భూపతి నారాయణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భూపతి నారాయణమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత. తెలుగు ప్రజాసమితి స్థాపకుడు. చెముడు ఉన్నప్పటికీ అనేక సంవత్సరాలు తూ.గో జిల్లా మలికిపురం గ్రామ సర్పంచ్గా పనిచేశారు ఎన్నో పుస్తకాలు రాశారు. నారాయణమూర్తి 1921, సెప్టెంబరు 21న రాజోలు మండలంలోని మలికిపురంలో మల్లమ్మ, భూపతి వీరాస్వామి దంపతులకు జన్మించాడు. ఐదుగురు సంతానంలో పెద్దవాడు నారాయణమూర్తి. ప్రాథమిక పాఠశాలలో చదివే రోజుల్లో ఒక అగ్రకులానికి చెందిన బాలున్ని తాకినందుకు తీవ్రంగా చెంపదెబ్బలు తినటం వలన, శాశ్వతంగా చెవిటివాడైపోయాడు. చెముడు వల్ల విద్యాభ్యాసం ఆగిపోయింది.[1]

చిన్నతనంలో కాంగ్రేసు నాయకులతో పాటు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్లాడు. ఆ తరువాత బర్మాలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు వంటవాడిగా పనిచేశాడు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపాన్ బర్మాపై బాంబుల దాడి చేయటంతో అక్కడి ఉన్న అందరు తెలుగువారిలాగే కాలినడకన బర్మా నుండి తిరిగి మలికిపురం చేరుకున్నాడు. ఆ సుదీర్ఘ ప్రయాణంలో చాలామంది జబ్బుచేసి మరణించారు. అయితే నారాయణమూర్తి అదృష్టం కొద్ది క్షేమంగా స్వస్థలం చేరుకున్నాడు.

మోరి గ్రామానికి చెందిన కమలమ్మను పెళ్ళి చేసుకున్నాడు. భార్య నిరక్షరాస్యురాలని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఆమెకు చదువు చెప్పి ప్రోత్సహించాడు. భర్త ప్రోత్సాహంతో కమలమ్మ కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని మహిళా కార్యక్రమాలకు నాయకత్వం వహించింది.

అంత క్రితం మార్క్సిస్టులుగా ఉండి, దళితవాదులుగా మారిన కొంతమంది అంబేద్కరిజాన్ని ప్రధానంగా భావిస్తూనే, మార్క్సిస్టు దృక్పథాన్ని కూడా కలుపుకోవాలని వాదించిన వారిలో భూపతి నారాయణమూర్తి ఒకడు. ఈయన మార్క్సిస్టు మూలసూత్రాల్నీ, అంబేద్కరు భావధారనీ విపులంగా చర్చించి, రెంటి సమ్మేళనం కావాలని “దళితవిముక్తి” అనే సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు.[2] ఈయన 1982లో పుణ్యభూమి కళ్లు తెరిచింది అనే దళితవాద సినిమాను కూడా నిర్మించాడు.

ఈ భూపతికి అలుపేలేదు[మార్చు]

ఆయన చదివింది ఏడో తరగతి. రాసింది 40 పుస్తకాలు.93 ఏళ్ల వయసొచ్చినా ఇప్పటికీ యువకుడిగా సైకిల్‌పై జోరుగా తిరుగుతుంటారు. సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొంది దళితకవిగా, అభ్యుదయవాదిగా, ఉపన్యాసకుడిగా భూపతి నారాయణమూర్తి పేరొందారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఘనతనూ దక్కించుకున్నారు.అంబేద్కరిజం, మార్క్సిజం భావజాలంతో పదుల సంఖ్యలో పుస్తకాలు రాసి.. ప్రజలకు పంచి పెడుతున్నారు.ఇతను రాసిన డొక్కా సీతమ్మ కథనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పన్నెండో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టింది.ఢిల్లీలోని అంబేద్కర్‌ఫెలోషిప్‌ను సాధించిన ఘనత ఆయనది. తెలుగు మన మాతృభాష. అందులోనే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కొనసాగాలని ఇప్పుడో చర్చ నడుస్తున్నది కాని.. ఆ రోజుల్లోనే ఆ దిశగా ఆలోచించి.. ఒక పుస్తకాన్ని కూడా రాశారు భూపతి. ‘‘ఆ పుస్తకాన్ని ఇరవై ఏళ్ల కిందట రాశాను. తెలుగుజాతి పురుగతి సాధించాలంటే మన పాలన మనమాతృభాషలోనే ఉండాలన్నది ఆయన లక్ష్యం.యాభైకి పైగా పుస్తకాలు ప్రచురించారు.‘శృంగారానికి సంకెళ్లు’ అంటూ విభిన్న తరహా రచనలు అందించారు. అనేక పత్రికల్లో 500 పైబడి వ్యాసాలు రాశారు.గతంలో మలికిపురం సర్పంచ్‌గా కూడా పనిచేశారీయన. ‘‘రైతు కూలీ ఉద్యమంలో రెండుసార్లు జైలుకెళ్లారు.1953, 1957లలో రెండుసార్లు సర్పంచ్‌గాను, బూరుగుపూడి అసెంబ్లీ నియోజకవర్గ కమ్యూనిస్టు అభ్యర్థిగాను, రాజోలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం భూపతి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయన సతీమణి స్వర్గీయ కమల కూడా స్ర్తీవాద ఉద్యమకార్యకర్త కావడం విశేషం.- కత్తిమండ ప్రతాప్‌, సఖినేటిపల్లి (ఆంధ్రజ్యోతి 17.8.2014)

రచనలు[మార్చు]

 • తెలుగుజాతి-తెలుగుజాతీయత
 • పాలనా బోధనా జన జీవన రంగాలలో తెలుగు
 • క్రైస్తవులపై కాషాయం దాడి
 • బ్రాహ్మణ భావజాలంపై క్షత్రియుల తిరుగుబాటు
 • కులతత్వాన్ని మూఢత్వాన్ని పెంచుతున్న విగ్రహారాధన
 • కులవ్యవస్థ-కమ్యూనిస్టులు
 • దళితులపై దమనకాండ
 • రిజర్వేషన్లు పుట్టుపూర్వోత్తరాలు
 • రిజర్వేషన్లు రాజ్యాంగం
 • దళితుల అసలుజాతి నాగులు
 • మార్క్సిష్టు అవగాహనతోనే దళితుల విముక్తి
 • ప్రాణాంతకమైన తుఫానుల నుండి ప్రజలకు రక్షణ లేదా?
 • దోపిడి పాలనతో గ్రామీణ మండల వ్యవస్థ
 • శిథిలావస్థలోనున్న గన్నవరం అక్విడక్టు
 • తెలుగు ప్రజా సమితి ప్రణాళిక
 • మధ్యపానమా?మానవత్వమా?
 • శ్మశానంగా మారుతున్న కోనసీమ
 • అమరుడు కందిబట్ల నాగభూషణం
 • దోపిడి వర్గాల పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నిరసించండి
 • మండలం కమిషన్ నివేదిక -పూర్వాపరాలు
 • హైందవ సమాజంలో శృంగారానికి సంకెళ్ళు
 • సైన్స్ అంటే ఏమిటి?
 • జ్ఞానం ఎలా వస్తుంది?
 • ఆది బౌద్ధాన్ని నాశనం చేసిన బ్రాహ్మణీయ మహాయానం
 • బహుజనుల స్థితిగతులు-విముక్తి-ప్రణాళిక
 • దళిత బహుజనుల చైతన్యతత్వం - సామాజిక-ఆర్ధిక- రాజకీయ సిద్ధాంత వ్యాసాలు2013

మూలాలు[మార్చు]