మన దేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన దేశం
(1949 తెలుగు సినిమా)

చందమామ పత్రికలో మనదేశం ప్రకటన
దర్శకత్వం ఎల్.వి.ప్రసాద్
నిర్మాణం కృష్ణవేణి
, ఆమె భర్త మీర్జాపురం రాజా
కథ సముద్రాల రాఘవాచార్య
శరత్ బెంగాలీ నవల ఆధారంగా
తారాగణం కృష్ణవేణి,
నాగయ్య,
నారాయణరావు,
ఎన్.టి.రామారావు,
రేలంగి,
బాలసరస్వతి,
వంగర,
రామనాథశాస్త్రి,
కాంచన్,
సి.హేమలత,
పువ్వుల లక్ష్మీకాంతమ్మ
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
జిక్కి,
ఎమ్.ఎస్. రామారావు,
పి.లీల
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం ఎం.ఎ.రెహమాన్
నిర్మాణ సంస్థ ఎం.ఆర్.ఏ ప్రొడక్షన్స్
విడుదల తేదీ నవంబర్ 24, 1949
నిడివి 172 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మన దేశం, 1949లో విడుదలైన ఒక సాంఘిక తెలుగు సినిమా. ఈ చిత్రం లో ఎన్.టి. రామారావు బ్రిటిష్ పోలీస్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. దీనికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. భారత స్వాతంత్ర్య సంగ్రామం ఈ చిత్ర కథకు నేపథ్యం.

విశేషాలు[మార్చు]

  • ఈ చిత్రం ద్వారా పరిచయమైన ఎన్.టి. రామారావు తరువాత తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధులయ్యారు. అలాగే ఈ చిత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని పి. లీల కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగం నేపథ్యగానంలో ప్రవేశించింది. ఇందులో రామారావు పోలీసు వేషం వేశాడు.
  • సినిమా కథనంలో బుర్ర కథ, ఒగ్గు కథ, వీధి నాటకాలు, బొమ్మలాటలు వంటి సాంస్కృతిక కళారూపాలను కదనానికి వినియోగించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను వాడారు.
  • సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను, స్వాతంత్రం సిద్దించిన తరువాత దిగజారిన విలువలను చూపించారు.
  • ఇది బెంగాలీ కథ ఆధారంగా వెలువడిన మొదటి తెలుగు సినిమా. తరువత దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమా కథలుగా వెలువడి విజయవంతమయ్యాయి.
  • స్వాతంత్ర్యం రాకముందు ప్రారంభించినప్పటికి కొన్ని కారణాలవల్ల స్వాతంత్ర్యానంతరం పూర్తిచేసి విడుదల చేయడం జరిగింది.
  • ఈ చిత్రంలో పోలీసు ఇన్స్పెక్టరు పాత్ర పోషించిన ఎన్.టి.ఆర్.కు రూ.2000 పారితోషికం ఇచ్చారు.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

కథ[మార్చు]

రామనాథం అగ్రహారంలో సంపన్నుడైన గృహస్తుడు. అతని భార్య జానకి. కొడుకు నెహ్రూ. రామనాథం సవతి తల్లి యశోద. ఆమె కొడుకు మధు. యశోద రామనాథాన్ని కన్నకొడుకుగా చూసుకుంటూ ఉంది. ఇంట్లో పెత్తనమంతా ఆమెదే. మధు రాజకీయాలలో పాల్గొనడం యశోదకు ఇష్టం లేదు. తల్లికి కొడుకుకూ ఈ విషయంలో రగడ జరుగుతూనే ఉంటుంది. కానీ వదిన జానకి మధును బుజ్జగిస్తూ బుద్ధులు చెబుతూ ఉంటుంది.

చుట్టపు చూపుగా జానకి పినతండ్రి, ఆయన కూతురు శోభ అగ్రహారం వస్తారు. శోభకు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నచూపు. మధుతో ఈ విషయంలో ఘర్షణ పడుతుంది. తన తండ్రికి అంటరాని వాడిగా చూశారనీ, చావిడిలో భోజనం పెట్టారనీ శోభ అలుగుతుంది. తండ్రితో కూడా వెంటనే పట్నం ప్రయాణమౌతుంది. రామనాథం కూడా వారితో బయలుదేరుతాడు. మద్రాసులో శోభ రామనాథం పరమ ఛాందసుడు కాడని తెలుసుకుని తన తప్పు దిద్దుకుంటుంది. యశోద కూడా శోభ నిష్కారణంగా అలిగి వెళ్ళింది అనే కించతో నెహ్రూ, మధులను తీసుకుని మద్రాసుకు వెళుతుంది. శోభ, మధుల పరస్పరాను రాగం వారి మాటల్లో గోచరమౌతుంది.

కాంగ్రెస్ సమావేశానికి మధు అధ్యక్షత వహిస్తాడు. పోలీసులు ఆ సభను భగ్నం చేస్తారు. మధుకు దెబ్బలు తగులుతాయి. ఆగష్టు విప్లవంలో దెబ్బలు తగిలిన స్థితిలోనే మధు అరెస్ట్ అవుతాడు. దేశ స్వాతంత్ర్యం కోసం యువకులుపడే కష్టాలను ప్రత్యక్షంగా చూసిన శోభకు కనువిప్పు కలిగి తనూ రంగంలోనికి దూకుతుంది. తెగువగా సాహసాలు చేస్తుంది. పోలీసుల చేతికి చిక్కకుండా మెలుగుతుంది. రామనాథం కుటుంబం తిరిగి అగ్రహారం చేరుతారు. పోలీసులు శోభ కోసం రామనాథం ఇంటిని సోదా చేసి రామనాథాన్ని విద్రోహిగా అరెస్టు చేస్తారు. ఈ అన్యాయాన్ని చూస్తూ ఆవేశంతో యశోద కూడా అరెస్టు అవుతుంది.

పోలీసుల అత్యాచారాలు, లంచగొండి తనం పెరిగిపోతాయి. నెహ్రూ వంటి పిల్లలు కూడా పోలీసు లాఠీలకు గురవుతారు. ఆస్తులన్నీ కరిగిపోతాయి. జానకి ఎంత నిబ్బరంగా ఉన్నా ఈ యాతనతో చితికి పోయింది. రామనాథం, యశోద విడుదలై వచ్చే సరికి జానకి అపాయ స్థితిలో ఉంది. వదినను చూడడానికి మధు పెరోల్ మీద బయటికి వస్తాడు. వదినను విడిచిపోలేక గడువు ముగిసినప్పటికీ మధు ఖైదు కాకపోవడంతో పోలీసులు అతన్ని బలవంతంగా లాక్కొని పోతారు. ఆ సమయంలో జానకి మరణిస్తుంది. యశోద నిర్వేదంతో తీర్థయాత్రలకు వెళుతుంది.

కాంగ్రెస్ అధికార స్వీకారం, రాజకీయాలలో మార్పులు, డిటెన్యూల విడుదల, మధు పిచ్చివాడై తిరిగిరావడం జరుగుతాయి. శోభకూడా తిరిగి వస్తుంది. మధుకు స్వస్థత చేకూర్చడానికి శోభ, రామనాథం శాయశక్తులా ప్రయత్నించి విఫలమౌతారు. తీర్థయాత్రలనుండి తిరిగి వచ్చిన యశోద కొడుకు దుస్థితిని చూసి రామనాథాన్ని నిందిస్తుంది. రామనాథం మారుమాటాడక, కొడుకు నెహ్రూను చంకనెత్తుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఇంతలో తుఫాను రావడంతో మధు పరిస్థితిని జ్ఞప్తికి తెచ్చుకుని రామనాథం ఇంటికి తిరిగి వస్తాడు. మతి తప్పి మేడమీది నుండి క్రిందకు పడిపోయే మధును రక్షించుకుంటాడు. ఈ సంఘటనతో మధుకు తిరిగి పూర్వ జ్ఞానం వస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవంలో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా పాల్గొన్నారు.[1]

పాటలు[మార్చు]

  1. ఏషా మధ్యేకాంచితంనో: రాజ్యం భోగ సుఖానిచ (శ్లోకం) - ఘంటసాల
  2. ఏమిటో సంబంధం ఎందుకో ఈ అనుబంధం - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి - రచన: సముద్రాల
  3. కళ్ళ నిన్ను చూచినానే పిల్లా ఒళ్ళు ఝల్లుమన్నదే - ఘంటసాల, జిక్కి - రచన: సముద్రాల
  4. చెలో చెలో చెలో చెలో రాజా చెలో చెలో చెలో - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి - రచన: సముద్రాల
  5. జయహే జయహే - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
  6. జడియకురా ధీరా సాత్వికరణ విజయము నీదేరా - నాగయ్య - రచన: సముద్రాల
  7. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయతి (శ్లోకం) - ఘంటసాల - రచన: సముద్రాల
  8. జయ జననీ పరమపావనీ జయ జయ భారతజనని- ఘంటసాల, కృష్ణవేణి - రచన: సముద్రాల
  9. దారులు కాచే రాజుసేనలు దాసి (బుర్రకథ) - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
  10. నిర్వేదమేలా కన్నీరదేల భరతజాతికపూర్వపర్వము ఈవేళ - నాగయ్య - రచన: సముద్రాల
  11. భారత యువకా కదలరా భారతయువతా - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
  12. మరువలేనురా నిను నేను మరువలేనురా ఓ పంచదారవంటి - జిక్కి - రచన: సముద్రాల
  13. మావా నందయ మావా అందుకో నన్నందుకో నా అందాలే - జిక్కి - రచన: సముద్రాల
  14. మాటా మర్మము నేర్చినవారు మనసు - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
  15. వెడలిపో తెల్లదొరా మాదేశపు ఎల్ల దాటీ వెడలిపో - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
  16. వైష్ణవ జనతో తేనే కహియే పీడపరాయీ (గుజరాతీ) - ఘంటసాల - రచన: నరసింహ మెహతా

మూలాలు[మార్చు]

  1. సముద్రాల రాఘవాచార్య (1949). మన దేశం పాటల పుస్తకం (1 ed.). p. 20. Retrieved 6 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మన_దేశం&oldid=3678040" నుండి వెలికితీశారు