Jump to content

పువ్వుల లక్ష్మీకాంతం

వికీపీడియా నుండి
(పువ్వుల లక్ష్మీకాంతమ్మ నుండి దారిమార్పు చెందింది)

పువ్వుల లక్ష్మీకాంతమ్మ (మ. 2008 ఆగష్టు 3) తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి, రంగస్థల నటి. మాలపిల్లలో కథానాయకిగా ప్రసిద్ధి చెందారు. జీవితాంతం అవివాహిత గానే ఉన్న లక్ష్మీకాంతమ్మ దాదాపు 200 చిత్రాల్లో నటించారు.

బాల్యం

[మార్చు]

లక్ష్మీకాంతమ్మ, పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడులో నారాయణమ్మ, సింహాచలం దంపతులకు జన్మించారు. ఆ ఊరిలోగల వేణుగోపాలస్వామి ఆలయ ఉత్సవాల్లో వీరి కుటుంబ సభ్యులు నృత్య ప్రదర్శనలివ్వడం ఆనవాయితీగా వస్తుండేది. ప్రతి కార్యక్రమానికి ఈమె తండ్రి పువ్వుల సింహాచలం మృదంగం వాయించేవారు. నాయనమ్మ మాణిక్యం, మేనత్త సరస్వతి స్ఫూర్తితో నాట్యం నేర్చుకుని ప్రదర్శనలిస్తుండేది. కందికట్టు మాణిక్యం, జనాబ్‌యూసఫ్‌, చదలవాడ సామ్రాజ్యం వంటి గురువుల దగ్గర సంప్రదాయ నృత్య విధానాలే గాకుండా ఆధ్యాత్మిక రామాయణ కీర్తనల అభినయం వంటి ప్రక్రియలు నేర్చుకున్నారు. వాలుమొగ్గ భంగిమలో నోటితో రూపాయిబిళ్ళ, పంటితో సూదితీయగల ఆమె నాట్యకౌశల్యం గురించి పలు ప్రాంతాల్లో చెప్పుకునేవారు. విజయనగరం, బందరు, గుంటూరు, గుంతకల్లు, రాజమండ్రి వంటి నగరాల్లో ఈమె ప్రదర్శనకు గుర్తింపు, ప్రేక్షకుల ఆదరణ పుష్కలంగా ఉండేది.[1]

రంగస్థలంపై

[మార్చు]

1933 నుంచి రంగస్థల నటిగా మారిన లక్ష్మీకాంతమ్మ పాటలు, పద్యాలు స్వయంగా పాడుకుంటూ సక్కుబాయి, రంగూన్‌రౌడీ, వరవిక్రయం, తెలుగుతల్లి, హరిశ్చంద్ర, చింతామణి, గయోపాఖ్యానం, త్యాగరాజు, సావిత్రి, తులాభారం, రామదాసు, సారంగధర, కమ్మరిమొల్ల, శాంతినివాసం, మల్లమ్మ వంటి నాటకాలలో విభిన్న పాత్రలు పోషించి ఎంతో పేరుగడించారు. దొమ్మేటి సూర్యనారాయణ, బందా కనకలింగేశ్వరరావు, బళ్ళారి రాఘవ, పసల సూర్యచంద్రరావు, స్థానం నరసింహారావు, పి.సూరిబాబు, కన్నాంబ, రాజేశ్వరి వంటి మేటి నటులతో కలిసి నాటి రంగస్థల ప్రియులను అలరించారు. లక్ష్మీకాంతమ్మ తానే స్వయంగా శ్రీలక్ష్మీ కళాసమితి అనే నాటక సంస్థను స్థాపించి శ్రీకృష్ణతులాభారం, సక్కుబాయి, ఇదా ప్రపంచం, చంద్రగుప్త, విప్రనారాయణ, హరిశ్చంద్ర లాంటి నాటకాలు అనేక ప్రాంతాల్లో ప్రదర్శించారు.

సినీ రంగంలో

[మార్చు]

లక్ష్మీకాంతమ్మకు వేమూరి గగ్గయ్య ద్వారా 1936లో చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో 'సతీతులసి' సినిమాలో నటించే అవకాశం లభించింది. తర్వాత సారథీ ఫిలింస్‌ వారి మాలపిల్ల, కొచ్చర్లకోట రంగారావు దర్శకత్వంలో 'హరవిలాసం' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. 1937లో పూర్ణా కామరాజు నిర్మించిన 'దశావతారం' సినిమాలో ఈమె భూదేవి, రేణుకాదేవి, కైకేయి, గోపికగా నాలుగు పాత్రలలో నటించి రికార్డు సృష్టించింది. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో మద్రాసు విడిచిపెట్టి ఏలూరు తిరిగి వచ్చి, మళ్ళీ రంగస్థల నటిగా అనేక నాటకాలలో నటించింది.

1958లో హాస్యనటుడు రమణారెడ్డి లక్ష్మీకాంతమ్మను మద్రాసు రప్పించి నిర్మాత, దర్శకుడు కె.బి.తిలక్‌కు పరిచయం చేసి, అత్తా ఒకింటి కోడలే సినిమాలో హేమలత అత్తపాత్రకు రికమెండ్‌ చేశాడు. వయసుమళ్ళిన ప్రధాన పాత్రను ఈమె చేయగలదా? అని తిలక్‌ మొదట సందేహించాడు. ఫస్ట్‌షాట్‌ తర్వాత ఆమె నటనకు అబ్బురపడి తన ప్రతి సినిమాలో అవకాశమిస్తానని మాట ఇచ్చి ఉయ్యాల జంపాల, ఈడుజోడు చిత్రాలలో కూడా నటింపజేశాడు. సినీ నటిగా లక్ష్మీకాంతమ్మ, మాఇంటి మహాలక్ష్మి, దొంగల్లో దొర, అదృష్టజాతకుడు, సమాజంలో స్త్రీ, భక్తపోతన, ఉమ్మడి కుటుంబం, మనుషులు- మట్టిబొమ్మలు, బాలరాజు కథ లాంటి 200 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించింది.

మూగమనసులు సినిమా ప్రారంభ సన్నివేశాలలో అక్కినేని, జమున పాత్రల మధ్య కామెడీ సృష్టించిన అవ్వపాత్రను ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోరు. జ్వాలాద్వీపరహస్యం చిత్రంలో మంత్రగత్తెపాత్ర, అత్తాఒకింటి కోడలే చిత్రంలో హేమలత అత్తగా బుద్ధిచెప్పేపాత్ర ఈమెకు నటిగా ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

మరణం

[మార్చు]

వయసుమీదపడి 93వ సంవత్సరం ప్రవేశించినా తన అనుభవాలతో ఔత్సాహిక నటీనటులను ప్రోత్సహిస్తూ కృష్ణా జిల్లా, కైకలూరులో వృద్ధాప్య పింఛను, నటరాజ రామకృష్ణ లాంటి దాతల ఆర్థిక సహాయంతో కాలం గడుపుతూ ఆగష్టు 3, 2008లో మృతి చెందింది.

మూలాలు

[మార్చు]
  1. "అలనాటి మేటి నటి పువ్వుల లక్ష్మీకాంతమ్మ - విశాలాంధ్ర జూన్ 18, 2011". Archived from the original on 2016-03-04. Retrieved 2013-08-04.