మాలపిల్ల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మాలపిల్ల
(1938 తెలుగు సినిమా)
Mala Pilla.jpg
దర్శకత్వం గూడవల్లి రామబ్రహ్మం
కథ గుడిపాటి వెంకటచలం
తారాగణం గోవిందరాజులు సుబ్బారావు,
కాంచనమాల,
భానుమతి,
సుందరమ్మ,
పి.సూరిబాబు,
గాలి వెంకటేశ్వరరావు,
వెంకటసుబ్బయ్య,
రాఘవన్,
గంగారత్నం,
లక్ష్మీకాంతమ్మ,
టేకు అనసూయ,
పువ్వుల అనసూయ
సంగీతం బసవరాజు అప్పారావు
సంభాషణలు చలం, తాపీ ధర్మారావు
నిర్మాణ సంస్థ సారధి ఫిలిమ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అప్పటి సంఘసంస్కరణావాదం నేపథ్యంలో ప్రాచుర్యం పొందిన ఉన్నవ లక్ష్మీనారాయణ నవల ఆధారంగా రూపొందించిన సందేశాత్మక చిత్రం అని అందరూ అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇది గుడిపాటి వెంకటాచలం వ్రాసిన అముద్రిత కథ ఆధారంగా తెరకెక్కింది. తెలుగు సినిమా ఆరంభ దశలో వచ్చిన సాంఘికచిత్రాలలో ఒకటి. ఒక హరిజన యువతి ఒక బ్రాహ్మణ యువకుని ప్రేమించడం వలన ఉత్పన్నమయ్యే సంఘర్షణ ఈ చిత్రం ఇతివృత్తం. ఈ సినిమా మంచి ప్రజాదరణ సాధించింది.

దక్షిణాది రాష్ట్రాల్లో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమంతో బాటు గాంధీజీ హరిజనోద్ధరణ ఉద్యమం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో రామబ్రహ్మం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మాలపిల్ల చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో నిర్మించాడు. అసలు సిసలు సామాజిక ప్రయోజనం గల చిత్రంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల. జస్టిస్ పార్టీ వారి సమదర్శినితో బాటు ప్రజామిత్ర పత్రికకూ సంపాదకుడైన రామబ్రహ్మం పత్రికల కన్నా సినిమాయే శక్తివంతమైన ప్రచార సాధనమని గుర్తించి ఊపిరిపోసిన చిత్రమిది. ఆనాడు దేశాన్ని పట్టి ఊపేస్తున్న హరిజనోద్యమాన్ని రామబ్రహ్మం తన సినిమాకు ఇతివృత్తంగా తీసుకుని, గుడిపాటి వెంకటచలంతో కథారచన చేయించాడు. ఈ సినిమాకు తాపీ ధర్మారావు సంభాషణలు వ్రాశాడు. చలం, ధర్మారావు ఇద్దరూ ఆనాటి సమాజంలో చలామణి అవుతున్న అర్థం లేని ఆచారాలను అపహాస్యం చేసిన వారే. మాలపిల్ల చిత్రం లోని పాటలకు భావకవి బసవరాజు అప్పారావు కావ్యగౌరవం కల్పించాడు. ఇందరు ప్రముఖుల సృజనాత్మక భాగస్వామ్యంతో తయారైన మాలపిల్ల తెలుగు నాట అఖండ విజయం సాధించింది. జస్టిస్ పార్టీ నేతృత్వంలో 1920 వ దశాబ్దంలో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమం జోరుగా నడిచిన ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

మాలపిల్ల సినిమా పోస్టరు [1]

మాలపిల్ల చిత్రం కాంచనమాలను సూపర్ స్టార్ ను చేసింది. పౌరాణిక చిత్రాల జోరులో ప్రప్రథమంగా ఒక సమకాలీన సమస్యను ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రం అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లోని తెలుగు భాషాప్రాంతాల్లోనే గాక ఇతర భాషా ప్రాంతాల్లో కూడా పెద్ద హిట్. నాటి గాయని, నటి సుందరమ్మతో కలిసి ఆమె పాడిన నల్లవాడే గొల్లపిల్ల వాడే సూపర్ హిట్ అయింది. అప్పటికింకా భాషాదురభిమానం తలెత్తక పోవడంతో దక్షిణభారతమంతటా ఆ పాట జనం నాలుకలపై నర్తించింది.

ఆ నాటి సమాజంలో ఈ సినిమా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా తెలుగునాట కరపత్రాల పంపిణీ జరిగింది. అప్పట్లో బెజవాడలో జరిగిన ఒక 'నిరసన మహాసభ ' బ్రాహ్మణులు మాలపిల్లను చూడరాదని తీర్మానించింది. అయినా దొంగచాటుగా ఆ సినిమాను చూసి వచ్చిన యువబ్రాహ్మణులకు తల్లిదండ్రులు వీధిలోనే శుద్ధి స్నానం చేయించి గానీ ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. రామబ్రహ్మం కూడా "మాలపిల్ల ను చూడడానికి వచ్చే పిలక బ్రాహ్మణులకు టికెట్లు ఉచితం" అంటూ అగ్రహారాలలో కరపత్రాలు పంచాడు. ఆయన తీసిన తదుపరి చిత్రం రైతుబిడ్డ

హరిజనులకు మందిరప్రవేశానికి అనుగుణంగా చట్టం చేసిన తిరువాన్కూరు మహారాజా వారికి ఈ సినిమా అంకితం చేయబడింది.

పాటలు[మార్చు]

 1. మనుజుల విభజన మేలా - పి. సూరిబాబు - రచన: బసవరాజు అప్పారావు
 2. లేరా లేరా నిదుర మానరా - పి. సూరిబాబు బృందం - రచన: బసవరాజు అప్పారావు
 3. కొల్లాయి కట్టితేయేమి మా గాంధి మాలడై తిరిగితేయేమి - పి. సూరిబాబు - రచన: బసవరాజు అప్పారావు
 4. ఏలా ఈ బ్రతుకేలా - కాంచనమాల - రచన: బసవరాజు అప్పారావు
 5. నల్లవాడేనే గొల్లవాడేనే - కాంచనమాల, సుందరమ్మ - రచన: బసవరాజు అప్పారావు
 6. వడుకు వడుకు (రాట్నం పాట) - బృంద గీతం - రచన: బసవరాజు అప్పారావు
 7. జాతర సేతామురా దేవత - బృంద గీతం - రచన: బసవరాజు అప్పారావు
 8. వేణు మనోహర గానము - కాంచనమాల, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు - రచన: బసవరాజు అప్పారావు
 9. ఆమబ్బు ఈమబ్బు ఆకాశ - కాంచనమాల, ఎస్. రాజేశ్వర రావు - రచన: బసవరాజు అప్పారావు
 10. సావిరహే తవదీనా - గాలి వెంకటేశ్వరరావు - జయదేవ కవి
 11. మాలలు మాత్రం మనుజులు - పి. సూరిబాబు బృందం - రచన: తాపీ ధర్మారావు నాయుడు
 12. లేవు పేరునకెన్నియో మతము - పి. సూరిబాబు - - రచన: తాపీ ధర్మారావు నాయుడు
 13. కూలీలందరు ఏకము కావలె - ? - రచన: తాపీ ధర్మారావు నాయుడు
 14. జైజై మహాదేవా పాపపరిహారా - బృంద గీతం - రచన: తాపీ ధర్మారావు నాయుడు

వనరులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మాలపిల్ల&oldid=2002850" నుండి వెలికితీశారు