మహర్నవమి గడలు
ఈ వ్యాసాన్ని వికీపీడియా ఆకృతి మార్గదర్శకాలకు అనుగుణంగా సవరించాల్సి ఉంది.(నవంబరు 2023) |
తెలుగు నాట పూర్వం దసరానవరాత్రుల్లో వీథిబడి పంతుళ్ళు పిల్లలను ఇంటింటా తిప్పుతూ, పిల్లలచేత తాము నేర్పిన పాఠాలను, పద్యాలను వల్లెవేయించేవారు. ఆ సమయంలో గురుశిష్యులు కలిసి పట్టుకువెళ్ళే ఒక రకమైన గడలను మహర్నవమి గడలని పిలిచేవారు. ఈ గడలు పుచ్చుకుని ఉపాధ్యాయుడు పిల్లలను తమ బంధువుల ఇళ్ళకు తీసుకువెళతాడు. ఇదొక ప్రాచీన ఆచారంలోని భాగం.
నేపథ్యం
[మార్చు]పూర్వం పల్లెటూళ్ళల్లో దసరానవరాత్రుల సమయంలో వీథిబడులలోని పంతుళ్ళు ఇంటింటా పిల్లలను తిప్పుతూ తాము అంత వరకూ అభ్యసించిన విద్యను ప్రదర్శింపచేసి డబ్బును కానీ, బియ్యం పప్పులను కానీ దండుకునేవారు.
"పావలా అయితేను పట్టేది లేదు
అర్ధరూపాయైతే అంటేది లేదు
విచ్చురూపాయైతే పుచ్చుకుంటాము"
అని పాడుతూ, రూపాయి మాత్రమే దండుకుంటూ గడపగడపకూ వెళ్ళి తమ శిష్యుల విద్యను వాళ్ళ తలిదండ్రుల ఎదుట ప్రదర్శింపచేసేవారు గురువులు. ఈ సమయంలో గురుశిష్యులు కలసి పట్టుకుని వెళ్ళే ఒక రకమైన గడలను మహర్నవమి గడలని పిలిచేవారు. ఈ గడలను పట్టుకుని, కొత్తబట్టలు కట్టుకుని తిరిగేవారు. వ్యవసాయాధారిత కుటుంబాలలోని తలిదండ్రులకు విద్య లేనందున ఈ సమయంలో తమ పిల్లల చదువు ఎంత వరకూ వచ్చిందో తెలుసుకునే అవకాశం ఈ సందర్భం ద్వారా లభించేది. [1]
నిర్మాణం
[మార్చు]మంచి వెదుళ్ళు తెచ్చి సన్నని కోలలుగా చేసి, స్వస్తికలుగా నిర్మించి, తెలుపు నలుపు, పసుపు, ఎఱుపు , ఊదా, నీలిరంగుల దారాలు తెచ్చి, దానిని పటాలుగా కుడతారు. రెండు దెసలను, పైభాగమునను మిగిలిన కఱ్ఱల యందు మఱల చిన్ని చిన్ని పటాలు కడతారు. కొన్ని పటాలకొక్క ముఖమే ఉంటుంది. కొన్ని పటాలు ద్విముఖాలుగా ఉంటాయి. వాటికి చిలుకలను, బియ్యపు దారాలను పోసి కడతారట. బియ్యపు దారాలంటే తెల్లదారంతో మఱో రంగుదారాన్ని కలిపి పేనిన దారం. ఇప్పుడు ఒక గడను తీసికొని దాని చివర ఈ పటాన్ని బిగిస్తారు. తాటాకులతో బుట్టలుగా అల్లినదానినొకదాన్ని, శ్రీ చక్రంలా అల్లినదాన్నొకదాన్ని ఒకదాని తరువాత మఱొకదాన్ని పై గడకు గుచ్చుతారు. ఈ బుట్టలలో ఱాళ్ళు పోస్తారు.[2]
‘వేయిపడగలు’ నవలలో ఈ మహర్నవమి గడలు కట్టే విధానాన్ని ధర్మారావు పాత్ర ద్వారా చెప్పాడు విశ్వనాథ సత్యనారాయణ.
గజము పొడుగు చీల్చిన వాసపుబద్ధ తీసికొని క్రింద అడుగు వదిలి పెట్టి రెండడుగుల చిన్నబద్ద తెచ్చి నడుమున సరిగా సగం సగం అయ్యేట్లు కలిపి కట్టి దానిచుట్టూ దారమల్లుతారు. అల్లిన దారం చదరంగా పటానికి ముఖమేర్పడేటట్లు చేసి, ఎఱుపు నలుపు, పసుపు, ఆకుపచ్చ రంగు దారాలతో రెండు వేళ్ళ వెడల్పున ఒక్కొక్క రంగు వచ్చేట్లు అల్లుతారు. పటానికి రెండు ప్రక్కల మిగిలిన కఱ్ఱలకు మఱల అడ్డుపుల్లలను వేసి చిన్నచిన్న పటాలను అల్లుతారు. ఎఱుపు తెలుపు దారాలను కలిపి పెనవేసిన దానిని బియ్యపుదారమని అంటారు. చిన్న చిన్న కుచ్చులు చిలకలు దానికి వ్రేలాడదీసి పటానికి చుట్టూ కడతారు. [3]
సాహిత్య ప్రస్తావనలు
[మార్చు]విశ్వనాథ సత్యనారాయణచే రచింపబడ్డ 'వేయిపడగలు', 'శార్వరి నుండి శార్వరి దాక' నవలల్లో దీని ప్రస్తావన ఉన్నది.
"దసరాపండుగకు వీథిబడి యుపాధ్యాయులు మహర్నవమి గడలు పట్టించి, విద్యార్థులను బంధువుల యిండ్లకు తీసికొనిపోయి, అచట కానుకలడిగి తెచ్చుకొందురు." -- వేయిపడగలు, అధ్యాయం 17, పుటలు 534-535
“ఈ శ్రీ చక్రాకృతి మత్తాళీదళ విచిత్రనిర్మిత శుకాకృతులకు చివర్ల రంగురంగుల చిలుకల వ్రేలాడింతురు. వాని నడుమ నడుమ గడకు రంగుల గుడ్డలు చుట్టుదురు. దానిని మహర్నవమి గడలందురు.” -- శార్వరి నుండి శార్వరి దాక, పుట – 76 [4]
"వేఱొక గజము పొడవు గల వాసము తెచ్చి, దానికి తాటియాకులతో గుండ్రముగా గొన్నియు, గొసలు వచ్చునట్లు కొన్నియు గిలకలల్లి, గుండ్రపు గిలకలలో రాళ్ళు పోసి, యీ వాసమునకు దొడిగి, గిలకల మధ్య నున్న వాసమునకు రంగుగుడ్డ లల్లెదరు. ఆ పటము వాసమునకు బిగింతురు. దీనిని ‘మహానవమి గడ'యనెదరు.” -- వేయిపడగలు, పుట – 867 [5]
కె. కృష్ణమూర్తిచే రచింపబడ్డ "ప్రజా ఉద్యమంలో నేను" పుస్తకంలో ఇలా ప్రస్తావించబడింది.
"హైదరాబాద్ పోతే తప్ప మరెక్కడా ప్రభుత్వ పాఠశాల లేదు. ఇంటికాడ నేను మారం చేయడం మొదలు పెట్టాను. మా నాయన నా పోరు భరించలేక యాదగిరి పల్లెలో కొన్నాళ్లు ఆ తరువాత, నారాయణపురంలో మా పెదనాయనల వద్ద చదువుకునేందుకు పంపారు. అక్కడ వస్తాదు అనే పండితుని వద్ద నా విద్యాభ్యాసం తిరిగి కొనసాగింది. ఈయనది వరంగల్. ఈయన చెప్పే చదువుకు మంచి గుర్తింపు ఉంది. అందరూ ఈయనను మౌల్వీసాబ్ అని పిలిచేవారు. మహర్నవమి నాడు పిల్లలతో గడలు పట్టించి దేశముఖ్ ఇంటికి తీసుకెళ్లేవారు. వారు ఈ పిల్లల ప్రతిభ చూసి నూటపదహార్లు సమర్పించుకునేవారు. ఈయన వద్ద పార్శీ, ఉర్దూ మంచి స్థాయి వరకు చదివాను. కవిత్వం కూడా రాయగల స్టేజీకి వెళ్లాను. దీంతో మంచిగా చదువుతానని, విజ్ఞానవంతుడినని నాకు పేరొచ్చింది." -- ప్రజా ఉద్యమంలో నేను, పుట 12 [6]