ముకెబర్ల జంగాల బిట్రో నిట్రో
“ | హైరోసైరో-- బిట్రో నిట్రో జగితగ -- బిట్రొ నిట్రో |
” |
- అనే మకుటంగా గల బిట్రో నిట్రో పదం కంచు జాగంట పై హృదయాహ్లాదంగా వినిపింప బడుతుంది. ఈ పదాలను పాడే వారు ముకెబర్ల జంగాలు. ఈ ముకెబర్ల జంగా లనే తెగ వారు, కాకతీయ రాజ్య పరిపాలన కాలంలో వారి ఆస్థానంలో వంది మాగదులుగా వున్న శైవులు, ఈ జంగాలు తెలంగాణా లోనూ అటు శ్రీకాకుళం జిల్లా లోనూ చెదురుందురుగా వున్నారని వినికిడి. ముకెబర్ల జంగాలు బిట్రేశ్వరుడు నిట్టేశ్వరీ దేవి అనే దేవుళ్ళను ఈ నాటికీ పూజించు కుంటూ వుంటారట. పైన వుదహరించిన దేవుళ్ళ గుళ్ళు ఆంధ్ర దేశంలో తాను తిరిగినంత వరకూ ఎక్కడా కనబడ లేదని, పరిశోధకు లైన మల్లేల నారాయణ గారు ఆంధ్రప్రభలో తెలియ చేశారు.
బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి
[మార్చు]బిట్రేశ్వరు డంటే ఈశ్వరుడని, నిట్రేశ్వరి అంటె పార్వతి అని చెపుతారు. ముకెబర్ల జంగాలు, కాని శివ పార్వతులకు శైవ పురాణాల్లోగానీ, ఇతర ఇతిహాస గ్రంథాల్లోగానీ ఎక్కడా బిట్రేశ్వర, విట్టేశ్వరి పేర్లు వున్న ఉదాహరణలు లేవు. వారు శైవులవడం వల్లా వారి ఇలవేల్పు శివ పార్వతులను స్తుతిస్తూ ఎంతో పసందైన పాటలను పాడుతారు. వారు పాట ప్రారంభించ బోయే ముందు నాందీ ప్రస్తావనగా ఇష్ట దేవతల్ని ఈ విధంగా ప్రార్థన చేస్తారు.
ప్రార్థన, పదం
[మార్చు]ఓ హర హర బిట్రో నిట్రో
అమ్మ బిట్రో నిట్రోల్లూ బిరబిర వత్తారు
తోడుండు నంతమ్మ నే సెప్పి చాల్లూ.
అని ప్రారంభించి ముకిరెంక దారువు వేస్తూ కంజే గంటల మీద పొడుగైన లావు పాటి పుల్లతో మోగించు తారు. ఇలా మోగించే పుల్ల పేరు నికోరు పుల్లంటారు. ఇష్టదేవతల ప్రార్థనను ఈ విధంగా ప్రారంభిస్తారు.
కాలర్ల లచ్చి దేవి- బజే బజే
కూకర్ల ముచ్చు దేవి - శివో శివో
మోకర్ల బిచ్చా దేవి - హరో హరోం
కాకుల లెచ్చు దేవి - పాండ్రో పాండ్రో
బాకామూల్గు నేలలోకి - మాకు జగావత్తారు
మమ్ము ముంచి పోతారు.
ఆడ పిల్లలు అత్తవారింతికి త్వరగా వెళ్ళనట్టయితే, పక్క ఇంటి అమ్మలక్కలు ఆ అమ్మాయి దరి జేరి ఈ విధంగా పాడుతారు.
తొలి జంఅ మేలకే పో, పోవమ్మా
మలి గంగ మేలకే రా రా ||బిట్రో - నిట్రో||
నెలచిరువు రాకా రారావమ్మా
కోలాకుర్లు రాకే పోపో ||బిట్రో - నిట్రో||
మాలాగ నగుచూ రా రావమ్మా
తో తొందరగానే పోపోపో. ||బిట్రో - నిట్రో||
ఈ పాటనే రాయల సీమలోని పశువుల కాపరులు ఈ విధంగా పాడుతారు.
పశువుల కాపరుల పాటలు
[మార్చు]ఓ, ఓలేటి జంగామయ్యా- బిట్రయుడు - నిట్రేశ్వరి
కాల్లు గ్బాలు తేండలోన కాపలాగా యాయుచుండే
వులవ దఆంటు ఉదరపైన ఊగుతూ
వుండి నావో ఏమో మొంది గానే జెప్పా?
ఓ, ఒడ్డి కాసు మెంకట్రమణ, బిట్రయుడు - నిట్రేశ్వరి
దొడ్డి గోలి దొల్లు కుంటు వీవు ఎడ్డినాలు జేస్తుంటే
పడ్డ రామి తెర్వు గానె గడగగా నే జెప్పా?
ఓ అహోబిల నరసింహ - బిట్రయుడ - నిట్రేశ్వరి
గుహల లోనికి గుల్ల దోలీ- గుండ్లు పైన నిలచేసి
అహిల యహిల మని యంటూ - దరువుతో మూదరేయు
గిహిలకాద నుంచి వేమో - కేరూతునే జప్పా?
ఓ కోట్ల కొండయ మామ - బిట్రాయుడు - నిట్రేశ్వరి.
కొలిమి కుంట్ల కులికన్నకూ పుటారో ||బిట్రో- నిట్రో||
మతిపోనీ దుత్తాయి తో మా ముగ్గురు
సాల్ సాల్ మనేదాకా
[మార్చు]- సాల్ సాల్ మనే దాకా మని గాండ్రు ..||బిట్రో||
- సంకలోని పిల్ల తోటి - సాల్ మనే దాకా ..||బిట్రో||
- కొల్లు బారెడైన దాక - కంది రీగ లాంటీ వాల్లు ..||బిట్రో||
- ఎదిగి దాని ఎత్తే లోగ ఏటేటా ఇరు జతలు ..||బిట్రో||
- పెమ్మికుంట నాగరాజుకూ పుట్టారో ..||బిట్రో||
- గుమ్ము ముమ్మ వలను లేది డూడ లాంటి మోటు వాల్లు ..||బిట్రో||
- సాలూకూరి కంబరాయికి పుట్టారో ..||బిట్రో||
ఎవరైనా అమ్మలక్కలు పోట్లాడు కుంటూ, ఆ తగాదా ఏ విధంగానూ పరిష్కారం కానట్లయితే ఈ దేవుళ్ళను మధ్య వర్తులుగా నిర్ణయించుకుని ఇరు పక్షల వారూ రాజీ పడే వారట. ఆ సందర్భంలో పాడే పాట ఇది. బిట్రో నిట్రో అన్న దేవతల మీద కథ మనకు వివరంగా తెలియక పోయినా సంక్షిప్తంగా ఈ క్రింద వుదహరిస్తాను.
కథ
[మార్చు]బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి దేవిని వెంట బెట్టుకుని శైవ మతంలోని శివ భక్తుల్ని పరీక్షించ డానికి భూలోకానికి వెళ్ళారట. అప్పుడు ఒక శైవుడు, తన భార్యను చీకటి తప్పు గావించిందన్న నెపంతో బాగా కొట్టి ఇంటి నుంచి వెల్లగొట్టాడట. ఆమె వెంటనే తను చేసిన తప్పేమిటో తగిన నిదర్శనాలతో భర్త ఎదుట నిరూపించాలని, తద్వారా భర్త యొక్క మొప్పు పొందాలని దీర్ఘమైన పట్టుదలతో తల గొరిగించుకుని విభూతి రేఖలు, రుద్రాక్ష మూలికలు మెడనిండా ధరించి తెల్లని చీర గట్టి రామేశ్వరము నకు పరుగెత్తి పోయిందట. అక్కడుండే ఆళ్వారులు, లింగాయతులు, ముప్పాళ్ళ గోగుళ్ళు ఆమెను చూచి అస్యహించుకుని ఎగతాళి చేశారట. వెంటనే ఆమె రామేశ్వర దేవాలయంలో వున్న నంది వాహనానికి ఎదుట నిలబడి తన రెండు పాదాల పైన ఒక మట్టి కుండలో బియ్యం పోసి ఈశ్వరునికి నైవేద్యం వండటం ఆరంభించిందట. వెను వెంటనే అక్కడ ఆమె భర్త యైన శ్రీ కంఠునికి తల తిరిగే రోగం ప్రారంభ మవగా తన భార్య యైన ముకాక్షిని వెదుక్కుంటూ రామేశ్వరానికి ప్రయాణం చేసాడట. ఈ లోగా ముక్తాక్షికి బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి కన్నులేదుట సాక్షాత్కరించి తిరిగి యధావిధిగా నీ భర్తను త్రోవలోకి తీసుకుని పసుపు కుంకుమలతో ముత్తైదువుగా వుండి చిర కాలం బ్రత్రకి పోదువు గాక అని వరమిచ్చి పంపించారట. అప్పు డామె నిజ గ్రామమైన చోళ పల్లికి వస్తుండగా మార్గ మధ్యలో భర్తను కలుసుకోగా, ఆయనకు తల తిప్పే రోగ మటు మాయ మైనదట. అంతట శ్రీకంఠుడు బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళి సుఖంగా కాపురం సాగించారట. తెలుగు దేశంలో ఓరు గంటి కాకతీయుల కాలంలో వీర శైవమతం జోరుగా విజృభిస్తున్న రోజుల్లో ఇలాంటి కట్టు కథలు ఎన్నో ఉద్భవించాయి. అలాంటి కోవకు చెందినదై యుండ వచ్చు ఈ కథ. ఎవరికైనా బిడ్డలు లేక పోతే ఈ దేవతలను కొలిచేటట్లైతే సంతానం కలిగేదట.
మూలాలు
[మార్చు]తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.