మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి
జననంమేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి
1885, అక్టోబరు
ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం,పోలేపల్లి గ్రామం
మరణం1960, మే 22
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిసంస్కృతాంధ్ర పండితుడు
మతంహిందూ
భార్య / భర్తచిన్నమ్మ
తండ్రికోటయ్య
తల్లిఅన్నపూర్ణమ్మ

మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి.[1][2]

జీవితసంగ్రహం

[మార్చు]

శాస్త్రిగారు 1885లో నెల్లూరుజిల్లా దర్శితాలూకా (ప్రస్తుతం ప్రకాశంజిల్లా దొనకొండమండలంలో ఉన్న) పోలేపల్లి గ్రామంలో అన్నపూర్ణమ్మ,కోటయ్య దంపతులకు జన్మించాడు. ఋగ్వేది. ఆశ్వలాయన సూత్రము, కామకాయన విశ్వామిత్రస గోత్రజుడు. వైదిక బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. ఇతడు మొదట తిరుపతి, గుంటూరు జిల్లా కొల్లూరు మొదలైన చోట్ల కావ్యాలు నేర్చుకుని, ఆ తరువాత గోదావరి జిల్లా కాకరపఱ్ఱు గ్రామంలో ఉన్న వేదుల సత్యనారాయణశాస్త్రి వద్ద కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు చదువుకున్నాడు. మంత్రశాస్త్రము, జ్యోతిష్యశాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు. తన జీవితకాలంలో ఎక్కువభాగము కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోను, అనంతపురం, కడప జిల్లాలలోనూ నివసించినందువల్ల ఇతడిని రాయలసీమవాసిగా గుర్తిస్తున్నారు. ఇతడు మూడువందలకు పైగా శిష్యులకు ఆధ్యాత్మిక విద్యను నేర్పాడు. నిరతాన్నదానము చేసేవాడు. ఇతడు గద్యాలకు వెళ్లి అక్కడి మహారాజాతో చండీయాగము చేయించాడు. దైవోపాసనతో సంతానము లేనివారికి సంతానము కలిగేటట్లు చేశాడు. తన మంత్ర శక్తులతో గ్రామాలలో మశూచి మొదలైన బాధలనుండి విముక్తి గావించాడు. శీతలాయంత్ర ప్రతిష్ఠాపన, అష్టదిగ్బంధనాలు చేసి గ్రామాలను కాపాడుతూ, అకాల మరణాలు సంభవించకుండా, శిశువృద్ధి కలిగేటట్లు, పాడిపంటలతో తులతూగేట్లు చేశాడు.

ఇతడి శిష్యులలో గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ ప్రముఖులు. జీవితకాలమంతా సాహిత్యసేవలో గడిపిన ఇతడు 1960, మే 22న మరణించాడు.

రచనలు

[మార్చు]
  1. యథార్థ విచారము
  2. విచారదర్పణము
  3. అద్వైతాధ్యాత్మిక తత్త్వము
  4. శ్రీరామస్తవన క్షేత్రమాల
  5. సీతాస్తోత్రము
  6. విభీషణ శరణాగరి
  7. విశ్వామిత్రచరిత్ర
  8. జీవితచరిత్ర (అసంపూర్ణము. 1947 వరకు మాత్రమే వ్రాశాడు. దీనిని అతని శిష్యుడు మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ పూర్తి చేశాడు)

మూలాలు

[మార్చు]
  1. రాయలసీమ రచయితల చరిత్ర రెండవ సంపుటి-కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
  2. కర్నూలుజిల్లా రచయితల చరిత్ర - కె.ఎన్.ఎస్.రాజు, కర్నూలు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం,కర్నూలు