మౌల్వి అబ్దుల్ హఖ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మౌల్వి అబ్దుల్ హఖ్

మౌల్వీ అబ్దుల్ హఖ్ (1870 ఏప్రిల్ 20 - 1961 ఆగస్టు 16) ఉర్దూ పండితుడు. భాషావేత్త. కొందరు ఆయన్నుబాబా-ఇ-ఉర్దూ (ఉర్దూ పితామహుడు) అని అంటారు. అబ్దుల్ హక్ ఉర్దూ భాషకు గట్టి సమర్ధకుడు. దానిని పాకిస్తాన్ జాతీయ భాషగా మార్చాలని డిమాండ్ చేసినవారిలో ముఖ్యుడు. [1]

జీవిత విశేషాలు[మార్చు]

అబ్దుల్ హక్ 1870 ఏప్రిల్ 20 న భారతదేశంలోని మీరట్ జిల్లాలోని (ఇప్పుడు హాపూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్) హాపూర్ నగరంలో జన్మించాడు. అతను ఉర్దూ, దెక్కనీ, పెర్షియన్, అరబిక్ భాషలపై అనుబంధాన్ని పెంచుకున్నాడు. అతను 1894 లో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి బిఎ పట్టా పొందాడు. భావి రాజకీయ నాయకులు / పండితులకు అతడు అక్కడ సమకాలికుడు. వారిలో షిబ్లి నోమాని, సయ్యద్ అహ్మద్ ఖాన్, రాస్ మసూద్, మొహ్సిన్-ఉల్-ముల్క్, సయ్యద్ మహమూద్, థామస్ వాకర్ ఆర్నాల్డ్, బాబు ముఖర్జీ ఉన్నారు.

గ్రాడ్యుయేషన్ తరువాత హక్, హైదరాబాద్ వెళ్లి ఉర్దూ నేర్చుకోవడం, బోధించడం, అనువాదాలు చెయ్యడం మొదలైన పనులకు అంకితమయ్యాడు. అతను సయ్యద్ అహ్మద్ ఖాన్ రాజకీయ, సాంఘిక అభిప్రాయాల వలన బాగా ప్రభావితమయ్యాడు. అతని కోరికలను అనుసరించి ఇంగ్లీషు, శాస్త్రీయ విషయాలను నేర్చుకున్నాడు. సయ్యద్ అహ్మద్ ఖాన్ మాదిరిగానే, హక్ కూడా ఉర్దూ భారత ముస్లింల జీవితం, గుర్తింపుపై ప్రధాన సాంస్కృతిక, రాజకీయ ప్రభావంగా చూశాడు. [2] 1903 లో అలిగఢ్‌లో అతను అంజుమన్ తరక్కీ-ఇ-ఉర్దూ స్థాపించాడు. ఆర్నాల్డ్ దాని మొదటి అధ్యక్షుడు, షిబ్లి నోమాని మొదటి కార్యదర్శి అయ్యారు.

హక్ బ్రిటిష్ రాజ్యంలో ఇండియన్ సివిల్ సర్వీసులో చేరారు. ఢిల్లీలో హోం శాఖలో ముఖ్య అనువాదకుడుగా పనిచేశాడు. అ తరువాత ఔరంగాబాద్ లో పాఠశాలలపై ప్రాంతీయ పర్యవేక్షకుడిగా నియమించారు. అదే సంవత్సరంలో, ముస్లిం సమాజంలో విద్య, మేధోవాదం యొక్క ప్రోత్సాహం కోసం 1886 లో సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన అఖిల భారత ముహమ్మడన్ విద్యా సదస్సు కార్యదర్శిగా నియమితులయ్యాడు. ఔరంగాబాదు లోని ఉస్మానియా కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యాడు. 1930 లో ఆ పదవి నుండి పదవీ విరమణ చేశాడు. [1]

విద్యా, రాజకీయ కార్యకలాపాలు[మార్చు]

1917 లో హైదరాబాద్ రాష్ట్ర నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించినపుడు హక్, విశ్వవిద్యాలయంలో బోధించడానికి, నిర్మాణంలో సహాయం చేయడానికీ హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్లాడు. ఆ విశ్వవిద్యాలయంలో సబ్జెక్టులన్నిటినీ ఉర్దూలోనే బోధించేవారు. హక్ ప్రభావంతో ఈ సంస్థ ఉర్దూ, పెర్షియన్ సాహిత్యానికి పోషకురాలిగా మారింది. ఉర్దూ విభాగం ఛైర్మన్‌గా, అధ్యాపకులుగా నియమితుడైన హక్, హైదరాబాద్ మేధో సమాజంలో సాహిత్య విమర్శకుడిగా, రచయితగా ఎదిగాడు. అతను ఉర్దూ కవితల రచనలతో పాటు భాషాశాస్త్రం, ఇస్లాం, చరిత్ర, రాజకీయాలు, తత్వశాస్త్రంపై గ్రంథాలను ప్రచురించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఏర్పాటు చేసిన ఉస్మానియా కాలేజీ ఆయన చేసిన కృషికి ఒక ఉదాహరణ.

అతని బంధువులు భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ లోని హాపూర్ లో ఇంకా నివసిస్తున్నారు. అతని మేనల్లుడు హమీద్ హసన్, అతని కుమారుడు అహ్మద్ ఆరిఫ్ తన కుటుంబంతో కలిసి హాపూర్ లో నివసిస్తున్నారు.

ముస్లిం మేధావుల సామాజిక-రాజకీయ సంస్థ అంజుమాన్-ఇ-హిమాయత్-ఇ-ఇస్లాంలో కూడా హక్ చురుకుగా పనిచేశాడు. ప్రారంభంలో మేధోపరమైన అంశాలపై దృష్టి సారించి, తరువాత 1930 లో, బ్రిటిష్ ఇండియాలో జాతీయ భాషగా హిందీని ప్రోత్సహించడానికి భారతీయ జాతీయవాదులు చేసిన ప్రచారానికి వ్యతిరేకంగా హక్ ఉర్దూ పండితులు, మేధావుల బృందానికి నాయకత్వం వహించాడు. హక్ మహాత్మా గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ లకు విమర్శకుడయ్యాడు.

పాకిస్తాన్‌లో[మార్చు]

1948 లో దేశ విభజన తరువాత హక్, పాకిస్తాన్‌కు వలస వెళ్ళాడు. అప్పుడు జరిగిన అల్లర్ల నేపథ్యంలో, అతని ఆస్తిలో ఎక్కువ భాగం, ముఖ్యంగా విలువైన మాన్యుస్క్రిప్ట్స్, పేపర్లు, పుస్తకాలు వగైరాలు పోయాయి. అతను పాకిస్తాన్‌కు తీసుకువెళ్ళిన కొన్ని వస్తువులను ఉర్దూ డిక్షనరీ బోర్డు లైబ్రరీలో ఉంచారు.[1]

తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్ ) లో బెంగాలీ భాషకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జరిగిన ప్రజా ఉద్యమాన్ని హక్‌ విమర్శించాడు. ఉర్దూ మాత్రమే ముస్లిం వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, జాతీయ జీవనంలో దాన్ని ప్రత్యేకంగా ప్రచారం చేయాలన్న తన నమ్మకాన్ని నొక్కి చెప్పాడు. మాజీ తూర్పు పాకిస్తాన్‌లో 1952 భాషా ఉద్యమ ఆందోళనలను ఖండిస్తూ, బెంగాలీని రెండవ అధికారిక భాషగా మార్చడానికి పాకిస్తాన్ రాజ్యాంగ సభ తీసుకున్న నిర్ణయంపై ఆయన అయిష్టత కనబరచాడు.   అంజుమన్ తోటి, సానుభూతిగల రాజకీయ పార్టీల తోటీ కలిసి,1954 ఏప్రిల్ 22 న లాహోర్, కరాచీలలో బహిరంగ ప్రదర్శనలు, ఊరేగింపులూ లేవదీసాడు. పాకిస్తాన్ యొక్క ఏకైక అధికారిక భాషగా ఉర్దూ ఉండాలని పట్టుబట్టడంపై ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది దేశంలోని వర్గాల మధ్య చీలికను పెద్దది చెయ్యడానికి ఉపయోగపడింది. తరువాత 1971 లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి దారితీసింది.

ఆరోగ్యం విఫలమైనప్పటికీ, హక్ అన్ని విద్యా కార్యకలాపాలకు ఉర్దూను మాధ్యమంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించాడు. అతను కరాచీలో ఉర్దూ కళాశాల ఏర్పాటుకు ముందుకు వచ్చాడు. [3] [4] విద్యా సంస్థలలోని అన్ని విషయాలకు బోధనా మాధ్యమంగా ఉర్దూను స్వీకరించడానికి, 1959 లో జాతీయ ఉర్దూ సమావేశాన్ని నిర్వహించడానికి కృషి చేసాడు.  

మరణం[మార్చు]

క్యాన్సర్తో బాధపడుతున్న హక్, సుదీర్ఘకాలం పాటు చేతన రహితంగా ఉండిపోయి, కరాచీలో 1961 ఆగస్టు 16 న మరణించాడు. [1]

రచనలు[మార్చు]

  • ఇంగ్లీషు-ఉర్దూ నిఘంటువు
  • చంద్ హమ్ అసర్ (కొందరు సమకాలీనులు)
  • మక్తూబాత్ (గ్రాంధికాలు)
  • ముఖాదిమాత్
  • తాఖీదాత్
  • ఖవాయిద్-ఎ-ఉర్దూ (ఉర్దూ వ్యాకరణం)
  • దీబాచ దాస్తాన్ రాణి కేట్కి (రాణి కేట్కీ జీవితచరితం)

సంతకం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 http://www.pakpost.gov.pk/philately/stamps2004/maulvi_abdul_haq.html Archived 8 మే 2008 at the Wayback Machine, Profile and commemorative postage stamp of Baba-e-Urdu: Maulvi Abdul Haq, Retrieved 2 February 2017
  2. S Krishna Bhatnagar (1969) History of the M.A.O. College, Aligarh. Asia Publishing House.
  3. It became a predecessor of Federal Urdu University of Arts, Science & Technology
  4. http://www.dawn.com/news/1278009, 'Homage paid to Baba-e-Urdu on his 55th death anniversary', Dawn newspaper, Published 17 August 2016, Retrieved 2 February 2017