Jump to content

మల్లాడి సత్యలింగ నాయకర్

వికీపీడియా నుండి
(యమ్.యస్.యన్ నుండి దారిమార్పు చెందింది)
మల్లాడి సత్యలింగ నాయకర్

మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడకు చెందిన విద్యాదాత. స్వాతంత్ర్యం రాక పూర్వము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కాకినాడ పట్టణంలో యం.యస్.యన్.ఛారిటీస్ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపనకు మూల పురుషుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

మల్లాడి సత్య లింగ నాయకర్ కాకినాడ జిల్లా, కోరంగిలో జన్మించాడు. అతను అగ్నికులక్షత్రియ కులానికి చెందినవాడు, రఘుకుల గోత్రిజ్ఞుడు. 1868 లో అతను రంగూన్ వెళ్ళి, కార్మికుడిగా జీవితం మొదలుపెట్టి, స్వయంగా వ్యాపారవేత్తగా ఎదిగి, ఆ పై పడవలపై స్టీమర్లపై వ్యాపారం చేసి, సంపద ఆర్జించాడు. [1] 1912 సం.లో రంగూన్ (బర్మా) లోని జిల్లా కోర్టులో ఒక వీలునామాను రిజిష్టర్ చేయించాడు. ఆ వీలునామా ప్రకారం తాను సంపాదించిన ఆస్తిలో ఎనిమిది లక్షల రూపాయలను విద్యాలయములు, దేవాలయముల నిర్వహణకు, బీద విద్యార్థులు ఉన్నత విద్య, వృత్తి విద్యలు అభ్యసించుటకు, బీదవారికి తిండి పెట్టుట తదితర సేవా కార్యక్రమములకు కేటాయించిరి.

మల్లాడి సత్య లింగ నాయకర్ వీలునామా ప్రకారం దీవాన్ బహదూర్ డి.శేషగిరి రావు పంతులు ప్రధాన ధర్మ కర్త గా, మల్లాడి సత్య లింగ నాయకర్ యొక్క దత్త పుత్రుడయిన సుబ్రహ్మణ్యం నాయకర్, పినపోతు గోవింద రాజు, కొవ్వూరి ఆదియ్యరెడ్డిలు ధర్మ కర్తలుగా యం.యస్.యన్.ఛారిటీస్ అనబడు స్వఛంద సంస్థను ఏర్పాటు చేసిరి.

దిగువ బర్మా లోని ప్రధాన కోర్టు చే మార్చి నెల 4 వ తారీఖు,1915 సం.లో కాకినాడ పట్టణంలో యం.యస్.యన్.ఛారిటీస్ ధర్మ కర్తలకు వీలునామాలో పేర్కొన్నవిధముగా ఎనిమిది లక్షల రూపాయలు అందచేయబడినవి.వీలునామా ప్రకారం ఎనిమిది లక్షల రూపాయలలో అయిదు లక్షల రూపాయలు వ్యవసాయ భూములను శాశ్వత ప్రాతిపదికన కొనుగోలు చేయుటకు, రెండు లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేయుటకు, మిగిలిన ఒక లక్ష రూపాయలను విశాలమయిన ఆట స్థలముతో ఒక పాఠశాల భవనము, ఆధునిక వ్యాయామశాల, పాఠశాల భవనము ప్రక్కగా బీద వారికి భోజన సదుపాయము అందించే ఒక సత్రము, చొల్లంగి గ్రామములో దేవాలయములు నిర్మించుటకు ఉద్దేశించబడింది.ఎనిమిది లక్షల రూపాయలలో ఒక లక్ష రూపాయలు నిర్మాణములకు కేటయించగా మిగిలిన ఏడు లక్షల రూపాయలమీద వచ్చు ఆదాయమును పాఠశాల, సత్రము, దేవాలయముల నిర్వహణకు, ఉన్నత విద్యను అభ్యసించువారికి ఒక నిధి ఏర్పాటుకు ఖర్చు పెట్టుటకు ఉద్దేశించబడింది.

చొల్లంగి గ్రామములో ఒక స్నాన వాటిక, ఒక శివాలయము, శ్రీ రాములవారి, ఆంజనేయులవారి ఆలయములు, అర్చకులకు ఒక భవనము, యాత్రికులకు ఒక విశ్రాంతి గృహము దశలవారిగా నిర్మించబడినవి.

సంస్థలు

[మార్చు]

మల్లాడి సత్య లింగ నాయకర్ వీలునామా ప్రకారం ఈ క్రింద పేర్కొన్న సంస్థలు యం.యస్.యన్.ఛారిటీస్ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణములో స్థాపించబడి, నడుపబడుచున్నవి.

  • శ్రీ మల్లాడి సత్య లింగ నాయకర్ ఛారిటీస్ 1915 సం.లో పేదవారికి, పేద విద్యార్థులకు ఉచిత వసతి, ఉచిత ఆహారము అందించు సదుద్దేశ్యముతో స్థాపించబడింది.నేడు సుమారు 275 మంది పేద విద్యార్థులకు ప్రతి రోజు రెండు పూటల ఉచిత ఆహారము పెట్టుటకు యం.యస్.యన్.ఛారిటీస్ రూ.8,00,000/- ఖర్చు పెట్టుచున్నది.వీరిలో వైద్య విద్య, ఇంజనీరింగ్, న్యాయ శాస్త్ర, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, పాలిటెక్నిక్, ఐ.టి.ఐ, హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్, వేద పాఠశాల విద్యలు అభ్యసించు విద్యార్థులు కలరు.
  • 19వ తారీఖు అక్టోబరు నెల,1915 సం.లో అద్దె భవనమునందు ఒక సత్రమును ప్రారంభించిరి.24వ తారీఖు ఆగస్టు నెల,1916 సం.లో సుమారు 40 ఎకరాల స్థలమును ప్రభుత్వము వారు సేకరించి, {యం.యస్.యన్.ఛారిటీస్ ]] ధర్మ కర్తలకు అప్పజెప్పిరి. ప్రస్తుతము ఉన్న సత్రము భవనము 29వ తారీఖు ఆగస్టు నెల,1918 సం.లో ప్రారంభించబడింది.
  • 4వ తారీఖు అక్టోబరు నెల,1919 సం.లో పాఠశాల భవనము ప్రారంభించబడింది.
  • 1946 సం.లో ఉన్నత పాఠశాల స్థాపించబడింది.
  • 1946 సం.లో ఆంధ్రా పాలిటెక్నిక్ స్థాపన కొరకు యం.యస్.యన్.ఛారిటీస్ నిధుల నుండి రూ. 50,000 డిపాజిట్ చేసి, మూడు భవనములను నిర్మించిరి.
  • 1954 సం.లో వేద పాఠశాల స్థాపించబడింది.
  • 1969 సం.లో జూనియర్ కళాశాల స్థాపించబడింది.
  • 1971 సం.లో డిగ్రీ కళాశాల స్థాపించబడింది.
  • 1986 సం.లో కాకినాడ - పిఠాపురం రోడ్డు మీద అచ్ఛంపేట జంక్షను వద్ద యం.యస్.యన్.ఛారిటీస్కు చెందిన సుమారు పది కోట్ల రూపాయల విలువ గల 40 ఎకరాల భూమిని ఆంధ్రా విశ్వ విద్యాలయము పరిధిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ స్థాపనకు విరాళముగా ఇవ్వబడింది.అందువలన మల్లాడి సత్య లింగ నాయకర్ ఆంధ్రా విశ్వ విద్యాలయ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ అని నామకరణము చేయబడింది.

సహాయం పొందిన ప్రసిద్ధులు

[మార్చు]

యం.యస్.యన్.ఛారిటీస్ ద్వారా విదేశాలలో విద్యను అభ్యసించుటకు చాలామంది విద్యార్థులకు ధన సహాయము అందించబడింది. యం.యస్.యన్.ఛారిటీస్ ప్రారంభమయినప్పటి నుండి ఇప్పటివరకు సుమారు ఒక లక్షా ఇరవై వేల మంది విద్యార్థులు యం.యస్.యన్.ఛారిటీస్ ద్వారా నడుపబడుచున్న విద్యా సంస్థలలో ఒకటవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, ఆంధ్రా పాలిటెక్నిక్ నుండి విద్యను అభ్యసించారు.

  • ప్రముఖ శాస్త్రవేత్త డా.యల్లాప్రగడ సుబ్బారావు (ఈయన రూపొందించిన హెట్రజాన్ అను డ్రగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చే ఫైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడింది. సుబ్బారావు పర్యవేక్షణలో బెంజమిన్ డుగ్గర్ 1945లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అయిన ఆరియోమైసిన్ ను కనుగొనెను) కు యం.యస్.యన్.ఛారిటీస్ ద్వారా విదేశాలలో విద్యను అభ్యసించుటకు ధన సహాయము అందించబడింది.
  • లంక సుందరం
  • మాగంటి బాపినీడు
  • అవుటుపల్లి నారాయణరావు,
  • చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి,
  • వై.వి. కృష్ణారావు

మూలాలు

[మార్చు]
  1. మాగంటి, బాపినీడు (1943). ఆంధ్ర సర్వస్వము. మద్రాసు: విశాలాంధ్ర పబ్లిషర్సు. pp. 86, 87.
  • సత్యలింగ నాయకర్, మల్లాది, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వదియాలయం, హైదరాబాదు, 2005, పేజీ:909.

ఇతర లింకులు

[మార్చు]